హాస్పిటల్ లాబీ బాల్కనీ నుండి ఆకాశంలోకి తదేకంగా చూస్తున్నాడు అభిరాం. సాయంసంధ్య… సూర్యుడు అస్తమిస్తున్నాడు… ఇటు ఐ.సి.యూ.లో తన తండ్రి విశ్వనాథం… ఆకాశంలో చీకట్లు ముసురుకుంటున్నాయి. అభిరాం మెదడు నిండా ఆలోచనలు ముసురుకుంటున్నాయి…
***
విశ్వనాథం, అన్నపూర్ణలకి ఏకైక సంతానం అభిరాం. గారాబంగా పెంచినా స్వతహాగా బుధ్ధిమంతుడు కావటం వలన చదువులో రాణించాడు. ఎమ్మెస్ చేసి అమెరికాలో ఆరెంకల జీతం సంపాదిస్తున్నాడు. విశ్వనాథం రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఇంట్లోనే అన్నపూర్ణతో కాలక్షేపం చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు, వాడికి పెళ్ళి చేసి, కోడలు మనవలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటే చూడాలనేది ఆ దంపతుల కోరిక. కొడుకు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం. అభిరాం రోజూ తల్లితండ్రులకు ఫోన్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోడానికి.
***
ఎవరో పిలిచినట్లనిపించి, ఉలిక్కిపడి, ఆలోచనల ముసురునుండి బయటకొచ్చి తల తిప్పి చూసాడు. డాక్టర్ నిలుచుని ఉన్నాడు. ముఖంలో భావాలు కనిపించకపోయినా, ఏదో కీడు శంకించింది అభిరాం మనసు. డాక్టరు దగ్గరగా వచ్చి, అభిరాం భుజం పై చేయి వేసి, మెల్లగా తట్టి, ఓ నిట్టూర్పు విడిచి, ‘పదండి’ అని, ఐ.సి.యు. వైపు తీసుకెళ్ళాడు.
***
రోజూలాగే రాత్రి 10 గంటలవ్వగానే విశ్వనాథం ఫోను మ్రోగింది.
“ఏరా అబ్బీ ఎలా ఉన్నావ్”
“బానే ఉన్నా నాన్నా”
“మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుందిరా”
“బెంగ ఎందుకు నాన్నా, నేను బాగానే ఉన్నాను కదా”
“అది అమ్మరా… అమ్మ… అంత దూరంలో కొడుకు ఉంటే తల్లిదండ్రులకు కాక ఇంకెవరికి ఉంటుందిరా బెంగ”
“ఊరుకో నాన్నా… నేను మొన్ననే వచ్చి వెళ్ళాను కదా”
ఈలోపు అన్నపూర్ణ వచ్చి, భర్త చేతిలోని ఫోను తీసుకొని…
“నాన్నా ఎలా ఉన్నావురా, వేళకి తిండి తింటున్నావా….ఆ పిజ్జాలు బర్గర్లు తినకురా…తండ్రీ…”
“ఏంటమ్మా నువ్వు, నాకవి నచ్చవు కదా, నువ్విచ్చిన కందిపొడి, ఆవకాయ వేసుకొనీ చక్కా తింటున్నాను”
“ఏంటోరా, నా చేతితో ముద్ద కలిపి నీకు తినిపిస్తేగానీ నా మనసు కుదుటుగా ఉండదు… పెళ్ళి చేసుకోరా అంటే అదిగో ఇదిగో అని దాటేస్తున్నావు”
“ఆ పెళ్ళిగోల ఇప్పుడెందుకమ్మా, కొన్నాళ్ళు నన్ను ఇలా హాయగా ఉండనీ”
ఇంతలో విశ్వనాథం ఫోను తీసుకొని..
“సరేరా అభి, అమ్మ మాటలకేం గానీ, నీ ఆరోగ్యం జాగ్రత్త”
“నా ఆరోగ్యం సంగతలా ఉంచండి, మీరు అమ్మా వేళకి మందులేసుకుంటున్నారా… అమ్మకి అసలే ఆయాసం, మీకు బి.పి, దానికి తోడు ఆ షుగరొకటి”
“మందులు వేస్కుంటున్నాం లేరా”
“సరే ఉంటా నాన్నా”
విశ్వనాథం సరే అని ఫోను పెట్టేసాడు.
***
అదే రోజు రాత్రి ఒంటిగంట (ఇండియా కాలమానప్రకారం) అయ్యింది. అభిరాంకి విశ్వనాథం నుండి ఫోన్ వచ్చింది. కంగారుపడుతూ అభిరాం ఫోన్ ఎత్తాడు.
“నాన్నా ఏమయ్యింది, ఇందాకే కదా మాట్లాడాను, మళ్ళా ఫోనెందుకు చేసారు”
విశ్వనాథం గొంతు పెగలడం లేదు.
“నాన్నా ఏమయ్యింది”
“అభి… అమ్మ… అమ్మ…”
“అమ్మకేమయ్యింది నాన్నా” గట్టిగా అరిచినంత పనిచేసాడు అభిరాం.
“ఉన్నట్టుండి పడిపోయిందిరా… మాటా మంతీ లేదు”
“నాన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు నాన్నా”
***
పదిహేను రోజుల తర్వాత, ఇంటికొచ్చిన బంధువులు మిత్రులు అందరూ వెళ్ళిపోయారు, అన్నపూర్ణ దశదినకర్మ జరిగిన తరువాత. ఇంట్లో అభిరాం, విశ్వనాథం మాత్రమే ఉన్నారు. తండ్రిని చూస్తే అభిరాంకి కడుపు తరుక్కపోతుంది. అతను ఇంకా అన్నపూర్ణ జీవించి ఉందనే భ్రమలో ఉన్నాడు. వాలు కుర్చీలో కూర్చొని “అన్నపూర్ణా నీళ్ళు తీసుకురా” అంటూ ఒకసారి, “అన్నపూర్ణా పాలవాడి బిల్లు ఎంతయ్యింది” అంటూ ఒకసారి, ఇలా చనిపోయిన భార్యను సంభోదిస్తూ మాట్లాడుతున్నాడు. అభిరాంకి గుండె చెరువైపోయింది. ప్రాణానికి ప్రాణమైన తల్లి హఠాత్తుగా చనిపోవడం, అంతకు మించి తండ్రి ఇలా పిచ్చివాడిలా మారిపోవడం, అభిరాం జీర్ణించుకోలేక పోతున్నాడు. తండ్రిని తనతో అమెరికా తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కానీ విశ్వనాథం ససేమిరా రానన్నాడు. “మీ అమ్మ ఇక్కడుంటే నేనెలా అమెరికా వస్తాను, నేను మీ అమ్మ దగ్గరకే వెళ్ళిపోతాను” అన్న తండ్రిని చూసి స్థాణువైపోయాడు అభిరాం.
***
డాక్టరు అభిరాం భుజంపై చేయి వేసి మాట్లాడుతున్నాడు. “అమితంగా ప్రేమించిన భార్య హఠాత్తుగా చనిపోవటం వలన షాక్… దాని వలన ఒక రకమైన మసనసిక హలూసినేషన్లోకి విశ్వనాధం వెళ్ళిపోయారు. తన భార్య తన దగ్గరే ఉందని, వాళ్ళిద్దరిని ఎవరూ వేరుచేయలేరనే భావంలో ఉన్నారు. ఆల్రెడీ బి.పి. షుగరు ఉండటం వలన ఈ షాక్ ప్రభావం వలన మాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది…” డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు.
***
హాస్పిటల్ లాబీ బాల్కనీ లోంచి, ఆకాశంలోకి చూస్తున్నాడు అభిరాం.
“ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మనిషి దూరం అయితే తను కూడా ప్రాణం వదలడం, నిజమైన ప్రేమకి తార్కాణం, ముంతాజ్ చనిపోతే షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు గానీ ప్రాణం వదులుకోలేదు… విశ్వనాథం గారిది అమర ప్రేమ”
వెనక నుండి డాక్టరు మాటలు మెల్లగా వినిపించాయి అభిరాంకి.
ఆకాశంలో రవి అస్తమించాడు… చీకటి ముసురుకొంది. అభిరాం కంటి నుండి అశ్రువులు జాలువారుతున్నాయి.

భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
4 Comments
Ramalakshmi chengalva
sankar prasad garu, sanchika lo mee amma naanna katha chala bagundi. bharya poyina ventane bhartha kuda maraninchatam , vaari anyonya dampatyam gurinchina mee kathanam bagundi.abhinandanalu.
Shanked Prasad
ధన్యవాదాలు రామలక్ష్మిగారు
Kandi Ravi
Nice. Congrats.
Shanker Prasad
Thanks Ravi