మీరెప్పుడైనా ఈ పుష్పాల గురించి విన్నారా? రోజూ వింటుంటారు కానీ పేరు తెలీకపోవచ్చు అంతే.
సినిమా చెట్లకు పూసిన పూలే ఈ అమృత పుష్పాలు.
ఈ పుష్పాలు చెవులకు తేనె విందులు చేస్తాయి
శ్రోతల మది రంజింపచేసి జీవితానందాన్ని పెంచుతాయి
గురువులై, తల్లులై,తండ్రులై మంచి మాటలు చెబుతూ ఉంటాయి
కొండొకచో మిత్రులై, హృదయాల్ని రంజింపచేస్తాయి
మన మనసు కోరుకుంటే ప్రేయసులై,ప్రియులై మదిని పరవశింపచేస్తాయి
గుప్పెడు పాటల్ని జేబులో వేసుకుని నరకానికి నవ్వుతూ వెళ్లిపోవచ్చు
నచ్చిన పాట వింటూ మైమరచిపోయి పై లోకానికి సైతం పక పక లాడుతూ పయనమవ్వొచ్చు
అసలు పాటల అనుభవం ఎలా ఉంటుందో చెప్పమని నన్నెవరైనా అడిగితే ఇలా చెబుతాను.
పాట పూలతేరు పై కులాసా ఆకాశయానం
పాట పచ్చని చేల వారంటా పల్లకీ ప్రయాణం
పాట ప్రశాంత నది పై పండువెన్నెల విహారం
పాట పదే పదే పాడుతుంటే ఆరోగ్యదాయకం
నిజం చెప్పాలంటే
పాటలు జీవితాల్ని వెలిగించే సిరుల పంటలు
నేనున్నానంటూ బతుకుపై భరోసా ఇచ్చే దేవదూతలు
పాటల పువ్వులు ఆస్వాదించిన వారి మదినిండా అమృతంపుసొనలు వొలికిస్తాయి
ఆనందాన్ని రెట్టింపు, దుఃఖాన్ని సగం చేసే పాటలు మనకి తోడూ నీడా.
అవి మన భావాల్ని పంచుకునే చెలులు/చెలికాళ్ళు.
మన మనో సందర్భానికి తగిన పాట వింటుంటే అది మన కోసమే ఏ మహానుభావుడో రాసాడు సుమా అనుకుంటాం. మన మనసు భాష మనకే అర్థం కానపుడు మన స్థితికి అటూ ఇటూగా ఉన్న పాటొకటి చెవిలో వేసుకుంటే మన మూగ మనసు భావాల్ని ప్రైవేట్ మాస్టారిలా వివరంగా చెప్పేస్తుందది. అప్పుడు గుండెల్లోతెలీని ప్రశాంతత నెలకొంటుంది.
నిత్యం లేచి పాటలతల్లికి దణ్ణం పెట్టుకోవాలి.
రెండు పాట పువ్వుల్నిచెవుల్లో పెట్టుకోవాలి.
ఎవరో రాసిన అర్థవంతమైన, నిరాడంబరమైన ఒక గీతం ఇంకెవరో సంగీతం అద్ది సర్వాంగ సుందరంగా తయారు చెయ్యగా మనముందు ముద్దుగుమ్మలా నిలబడుతుంది పాటగా. అలా తుంపి ఇలా చెవిలో వేసుకోవడమే ఆలస్యం. మన సొంతం అది.
పాటలు పాడే వారికన్నా అవి వినే రసహృదయం ఉన్న వారిదే అదృష్టం. పాడే వాళ్లకు బోలెడంత శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటాయి. శ్రోతలకు అవేమీ ఉండవు. ఉల్లాసం,ఆనందం తాదాత్మ్యం తప్ప.
సినిమా చెట్లకు పూసిన ఈ పాటల పూలు ఏ రెడ్ ఎఫ్.ఎం.లోనో, ఇతర రంగుల ఎఫ్.ఎం. లోనో, వివిధ భారతిలోనో, కాలనీ స్పీకర్ లోనో, టీవీ లోనో వినబడి కనబడి ఆహ్లాదపరుస్తాయి. ఆ సినిమాని మనకి గుర్తు చేస్తాయి. మనం నడిచొచ్చిన జీవిత కాలాల్లో మిగిలిన ఎన్నెన్నో జ్ఞాపకాలున్నాయి. ఆ రోజుల్లో తరచూ మనం చూసిన సినిమాల్లో ఉన్నఅనేక పాటల భావాల్లో ఆ నాటి మన అనుభూతులు నిక్షిప్తమై శిలాజాల్లా శాశ్వతంగా నిలిచి మన మనసు గుర్తు పట్టే భాషలో ఉంటాయి. అందుకే ఆ పాట వినబడగానే అవన్నీ గుర్తొచ్చి ఎక్కడికో వెళ్ళిపోతాం.
కొన్నిప్రత్యేకమైన పాటలు మరీ మధురంగా ఉంటాయెందుకో! కాస్త తేనె తాగి పాడతారేమో గాయనీ గాయకులు. కొన్ని దుఃఖపు పాటలు షుగర్ లేని చేదు కాఫీ తాగి పడతారనుకుంటాను. అసలేమీ తాగకుండా ఆకలితో వేదాంతప్పాటలు పాడతారేమో, గొంతులో కరకర మంటూ అంత వైరాగ్యం వినబడుతుంది.
ఒకే సింగర్ గొంతు వేర్వేరు సినిమాల్లో రకరకాల పాత్రల కష్టసుఖాల్లో లీనమైనప్పుడు అనేక విధాలుగా వినబడడం భగవంతుని మాయ కాక మరేమిటి ?
“గువ్వలా ఎగిరిపోవాలీ…” పాట వింటుంటే మనసు విహంగం అయ్యి తీరవలిసిందే!
“ఖోయా ఖోయా చాంద్…. ఖులా ఆస్మాన్….” అనగానే ఏదో తెలీని హాయొచ్చి మనల్ని తాకుతుంది.
నేను వీలయితే ‘పాటల డాక్టర్’ అని చెప్పుకుని ఉచిత ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకుంటాను. ‘అన్నిమానసిక జబ్బులకూ ఔషధం ఇక్కడ దొరకును’ అని ఓ బోర్డు పెట్టించుకుని ఓ షట్టర్లో కూర్చుంటాను. వచ్చిన వాళ్ళ బాధంతా ఓపిగ్గా విని అది తీర్చే పాటని పిస్క్రిప్షన్ మీద రాసిస్తాను. యూట్యూబ్‌లో దొరికేవే రాస్తాను. ఓ నెలాగాక వాళ్ళ అనారోగ్యం తగ్గకపోతే మళ్ళీ రమ్మంటాను. అప్పుడు పాట మారుస్తాను. ఈ సందట్లో వాళ్ళకి విసుగొచ్చినా పర్వాలేదు. వాళ్ళు పడుతున్నబాధ మరిచిపోతారు. ఎలా ఉంది? నా ఐడియా బావుంది కదా.
ఒకోసారి ముఖ్యమైన పని మీద ఏ ఐఏఎస్ ఆఫీసర్నో, మరో మినిస్టర్నో కలవడానికి ఎప్పోయింట్మెంట్ తీసుకుని కూర్చుంటాం. ఒకటే టెన్షన్‌గా ఉంటుంది. ధైర్యం రాదు. అప్పుడు ఇతరులు మన అలజడిని గమనించకుండా గంభీరంగా కూర్చోవాలంటే మనసులో “హే…. నీలె గగన్ కె తలే.. ధర్తీ కా ప్యార్ ఫలే” లాంటి ఒక పాట పాడుకుంటూ మన కంగారును తగ్గించుకోవచ్చు.
అమృతం తాగుతుంటే ఎంత తియ్యగా ఉంటుందో మనకనుభవం లేకపోవచ్చు కనీసం ఊహించడానికైనా నమూనాగా పాట ఉంది. పాటను కళ్ళుమూసుకుని వింటూ ఉంటే.. మనోఫలకం పై పాట సంగీతం వెనక ఉండే ప్రకృతి చిత్రం గీస్తూ ఉంటే గాయకుల గొంతు మానవుల మనోభావాల్ని రంగులతో చిత్రిస్తూ ఉంటుంది. ఎన్ని సార్లు ఎంతమంది విన్నా ఆ పాటలు అమరత్వం సిద్ధించిన దేవతల్లా అలాగే ఉంటాయి చెక్కు చెదరకుండా. వయసు పెరగదు. మాధుర్యం తగ్గదు.
సినిమా హిట్ అయినా ఫట్ అయినా సినిమా చెట్లకు పూసిన ఈ పాటల అమృతత్వానికి ఢోకా లేదు. అవి పుట్టడంతోనే చిరంజీవులు. కొన్ని పిచ్చిపాటల వంకర టింకర గుడ్డిపూలు అక్కడక్కడా ఉండొచ్చు. అవి వాటి దారిన అవి వాడి పోయి రాలి పోతాయి. లలిత సంగీతం పాటలు, గజళ్ళు, భావ గీతాలు గొప్పవి ఉండొచ్చు. లేవని కాదు కానీ సినిమా పాటల అమరత్వం ముందు అవి ఆగలేవు.
ఈ అనంతానంత విశ్వంలో అంతులేని విషాదాలలో ఇంకా ఇతరేతర దుఃఖ విన్యాసాల్లో ఊరట పాటలే. భగవంతుని ఆశీర్వాదాలు ఈ పుష్పాలే. పాటలంటే పడని వాళ్ళ మీద మనం జాలిపడడం కన్నా ఏమీ చెయ్యలేం. థియేటర్లో పాట రాగానే బైటికి వెళ్ళేవాళ్ళని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది.
నా మట్టుకు నాకు పాటలు ప్రాణ మిత్రులు. కష్టాలు చెప్పుకునే ప్రియాతి ప్రియ నేస్తాలు. ఓదార్చే దోస్తులు
నా ఆనందాన్ని పంచుకునే నెచ్చెలులు.
నా భావాల్ని పంచుకోవడానికి కొన్ని పాటలు హమేషా నా కోసం రెడీగా ఉంటాయి.
హృదయం గాయపడి ఒంటరిగా నిలబడినప్పుడు “ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం” అంటూ వీపు నిమిరి అక్కున చేర్చుకునే మిత్రిణి ఒక పాట.
ఒంటరిగా ఓ తోటలో నడిచి పోతుంటే ప్రకృతిని చూస్తూ పులకరించినపుడు “సుహానా సఫర్ ఔర్ ఎ మౌసమ్ హసీ” పాట మన పెదాల నుండి రాకుండా ఉండదు.
కారులో కూర్చుని మన ఊరికి పోతుంటే “గువ్వలా ఎగిరి పోవాలీ…. ఆ తల్లి గూటికే చేరుకోవాలీ” పాట గుర్తు రావడం ఎంత బావుంటుందో! రెక్కలు మొలిచినట్టుగా కదా !
ఏ పంద్రాగస్టు నాడో, ఛబ్బీస్ జనవరి నాడో లేచేసరికి వస్తున్న “మేరె దేశ్ కి ధర్ తీ.. సోనా ఉగలే ఉగలే… హీరే మోతీ” మైక్ పాట మనలోని దేశభక్తిని తడుతుంది.
“తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!” అంటూ వినగానే తెలుగుప్రజల మీద, భాష మీదా ప్రేమ ఉబుకుతుంది.
ఒకోరోజు ముభావంగా తెల్లారుతుంది. అప్పుడు “ఆనే వాలా పల్ జానే వాలా హై. హో సకేతో ఇస్ మే జిందగీ బిటాదో..పల్ జో ఏ జానే వాలా హై..” పాట ఏదైనా మంచి పని చేద్దామనిపించేట్లు చేస్తుంది
సైకిల్ పై వెళుతూ భార్యా భర్తలు పాడుకునే తేలికైన “హే మైనే కసం లీ.. హే తునె కసం లీ.. నహీ హొంగే జుదా హమ్” అనే పాట ఎంత మధురాతి మధురమో! పొద్దున్నే గుర్తు చేసుకుంటే సాయంకాలం దాకా నోట్లో ఆడుతూనే ఉంటుంది.
ఏకాంత సెల్ఫ్ పీటీ సమయాల్లో
“మై జిందగీ కా సాథ్ నిభాతా చాలా గయా” సాంగ్ ఎంతో హుందాతనాన్ని ఇస్తుంది.
ఒక నచ్చిన పాట విన్నతర్వాత రోజంతా కష్టపడి ఆనందంగా పని చేయొచ్చు మరో తియ్యని పాట సాయంత్రానికి ఎవరైనా ప్రామిస్ చేస్తే. పాటల్ని ధ్యానంలా కళ్ళు మూసుకుని వినాలి. తేట నీటిసరస్సులోకి ఇష్టంగా దిగినట్టుగా వినడం మొదలు పెట్టాలి. పాటంతా నీటిలో తేలుతున్నట్టుగా తన్మయించాలి. మ్యూజిక్ మొక్కల మధ్య గాయకుల గొంతు నాట్యమాడాలి. పాట పూర్తయ్యాక రేవులో ఉండే మెట్ల మీద కూర్చుని కళ్లు తెరవకుండా… బుజ్జిమేక అరమోడ్పు కన్నులతో నెమరువేసుకుంటున్నట్టు ఉండిపోవాలి ఎవరో ఒకరు మనల్ని తట్టి పిలిచేదాకా. అదీ పాట తియ్యదనాన్ని ఆస్వాదించే మార్గం అని నేననుకుంటాను. మరి మీరేమనుకుంటారో కదా!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
ఆహా…ఎంత బాగా రాసారు మేడం ..👏👏పాటల పుష్పాల గురించి….అద్భుతం గా రాసారు అండీ..🎊🎊
పులకించిన మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసునే మరపించు గానం….పాటలు నిజంగా అమృతపుష్పాలే గౌరీలక్మిగారు.మీకు నా అభినందనలు
“ప్రతీ రాత్రీ ! వసంత రాత్రి… ప్రతి గాలి పైర గాలి!… బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలీ! ” అన్నట్లు జీవితంలో ప్రతి క్షణమూ… పాటతోనే ముడిపడి ఉంటాయని ఆ ‘అమృత పుష్పాలు’మనని వెన్నంటి…వెన్నుతట్టి…ఓదారుస్తూ…చివరిదాకా … మన కూడా వచ్చేస్తాయి… నిజం…..చాలా చాలా బాగా చెప్పారు గౌరీ లక్ష్మి గారూ! అభినందనలు…
Jivitha prayanam patala pallaki tho chakkaga varnnicharu kavieitri Gowrie Laxmi.
అమృత పుష్పాల గురించి అమృతోపమానమైన పలుకులు తెలిపారండీ.
Chalinchina guvva లాంటి మనసును అదుపులో unche parimalala pushpa varnana Gourilakshmi gari కలం lo adbhutam ga, మనసు aananda baritamu ga unnadi. Thank you so much madam
నిజంగా అమృతమే Vijayamrutha..Hyd
Wah! Paatala paklakilo manasuni ooregincharu…. aadyantham amogham… Kaasimbi..Guntur
Hi very nice. Chaduvutunte patalu vintunnatlu vunnadi. Kalavathi..Hyd
Wow super 🤗🥰👌 Geethavani..Hyd
I read your column. “Amruta Pushpala” Parimalam maalu cherindi. Congratulations. And thank you for sharing. Expecting more gems. Seshamma..Ahmedabad
పాటల డాక్టర్ గారు, మీ వ్యాసం భలే ఉందండీ… ప్రిస్క్రిప్షన్ వ్రాయించుకుంటానండీ ఓసారి… Dr.Shailaja..Kakinada
👍👌🙏😄 Adbhutamgaa Undi column.. G.S.Rao..Bandaru
భావకుసుమాలు LALITHA.. HYD
🤗🤝 కొత్త ఏడాది..అమృత పుష్పాలు..కమనీయం Mallik..Nlr
I read the article Gauri, it’s super. Songs will definitely divert us from difficulties and anxieties, thank you Gauri. – Anu, Khairatabad
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™