అండమాన్‌లో ఎక్కడ చూసినా పగడాల (corals) గురించి మాట్లాడుకుంటారు. కాని అవి ఎక్కడ దొరుకుతాయి. సముద్రపు లోతులకెళితే ఎక్కడయినా వుంటాయంటారు. కానీ ఎక్కడికి వెళ్ళి చూడాలి. కానీ ఇంతకు ముందు నార్త్ బే ద్వీపంలో చూసాము. అక్కడ చాలా తక్కువ స్థాయిలో వున్నది. అసలు అండమాన్‌లో corals కోసమే కొన్ని ద్వీపాలున్నాయని ఒక సంవత్సరం గడిచాక తెలిసింది. అప్పుడు మిత్ర్రులు సూచించినది “జాలీ బాయ్“. ఎప్పుడు వెళదామా అని అలోచిస్తుంటే నా కుటుంబం నా మేనకోడలు గాయత్రితో సహా పోర్ట్ బ్లయర్‌లో దిగారు. ఒక ఆదివారం మా కెమెరామెన్ మిత్రుడు స్టాలిన్ కుటుంబంతో సహా జాలీ బాయ్ ద్వీప ప్రయాణానికి శ్రీకారం చుట్టాము.
పోర్ట్ బ్లయర్‌కు పాతిక కి.మీ. దూరంలో వండూర్ అనే గ్రామం వుంది. సిటీ దాటగానే రోడ్డుకురుపక్కల రకరకాల చెట్లు వాటి మధ్య అక్కడక్కడా ఇళ్ళు. ఊరుకి మధ్యలో సముద్రంనుండి ఒక పాయ చెరువుగా ఏర్పడింది. నీటి కొరత వున్నట్లు లేదు. ఊరంతా పచ్చగా కళకళలాడుతు వుంటుంది. గ్రామం చివర అంటే సముద్రపు ఒడ్డున Mahatma Gandhi Marine National Park వుంది. ఇదీ అటవీ శాఖ ఆధ్వర్యంలో వుంది. ఈ సంస్థ ఆధీనంలో మొత్తం 15 ద్వీపాలు వున్నాయి. ప్రపంచంలో పగడాలు ఎక్కువగా ఆస్ట్రేలియాలో దొరుకుతాయిట. ఆ తరువాత స్థానం భారతదేశంలో అండమాన్ ఆక్రమించింది. ఈ పదిహేను ద్వీపాలు పగడాలకు నెలవు.
Mahatma Gandhi Marine National Park లో ఒక ఆడిటోరియం, ప్రదర్శనశాల వున్నాయి. ఈ ప్రదర్శనశాలను కచ్చితంగా చూడాలి. అండమాన్ లోని జలజీవ సంపదను పరిరక్షించే అనేక సమాచారం, ఫోటోలు వుంచారు. మొసలి, డ్యుగాంగ్ మొదలైన జంతువుల నమూనాలు, 15 ద్వీపాలను చూపే map with lights మొదలయినవి అందరూ తెలుసుకోవలసిన చూడదగిన విషయాలను ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడే ఇతర ద్వీపాలకు వెళ్ళటానికి జెట్టీ కూడా వుంది.
Corals పూర్తి స్థాయిలో తయారవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందిట. కాని పాడవటానికి కొన్ని గంటలు చాలు. అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. జాలీ బాయ్, రెడ్ స్కిన్ అనే రెండు ద్వీపాలు మాత్రమే సందర్శకులకు అనుమతి వుంది. అది కూడా ఒక్కో ద్వీపాన్ని ఆరునెలలు మూసి వుంచుతారు. జాలీ బాయ్ ప్రవేశం మరికొద్ది రోజులలో ముగుస్తుందనగా మేము ప్రయాణం పెట్టుకున్నాము.
పార్క్ దగ్గర జెట్టీనుండి ఉదయం ఎనిమిది గంటలకు మా ప్రయాణం ప్రారంభమయింది. టికెట్ మనిషికి 750 రూపాయలు. గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ ద్వీపాలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. ఇంకా చాలా వస్తువులను నిషేధించారు. Water bottles కు అనుమతి లేదు. జెట్టీ దగ్గర డబ్బులు Deposit కట్టించుకుని water cans ఇస్తున్నారు. అక్కడి సిబ్బంది మన వస్తువులను సునిశితంగా పరీక్షించిన తరువాతే బోటు ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. అలా అన్ని పరీక్షలు నిరాటంకంగా అధిగమించి జాలీ బాయ్ వెళ్ళే ఫెర్రీ ఎక్కాము. ఫెర్రిలోనే దాని నిర్వాహకులు వ్యాపారం మొదలుపెట్టారు. ఈ ద్వీపాలలో కేవలం రెండు రకాల activities మాత్రమే వున్నాయి. Coral islands కదా అందుకని సముద్రం లోపలి అందాలు చూపించటమే వీళ్ళ వ్యాపారం. అవి ‘స్నోర్ కెల్లింగ్’ మరొకటి glass boat. వీటి ఖరీదు మూడు వందల నుండి వెయ్యి రూపాయలు వరకు వుంది. మా శ్రీమతి, అబ్బాయి glass boat, మా మేనకోడలు గాయత్రి వెయ్యి రూపాయలు పెట్టి స్నోర్ కెల్లింగ్ టికెట్లు తీసుకున్నారు. అలాగే మా మిత్రుడు స్టాలిన్ కుటుంబం కూడా రకరకాల టిక్కెట్లు తీసుకున్నారు. ఏమీ లేనివాణ్ణి నేను మాత్రం అందరి సామాన్లకు కాపలా వుండే బాధ్యత తీసుకున్నాను. దాదాపు ముప్పావు గంట ప్రయాణం తరువాత మా ఫెర్రీ జాలీ బాయ్ ద్వీపానికి ఓ వంద గజాల దూరంలో ఆగింది. ఇక్కడ ద్వీపాలలో జెట్టీలు వుండవు అందుకే దూరంగా ఆగిపోతాయి.
అక్కడనుండి చిన్న చిన్న glass boats లో యాత్రికులను ఒడ్డుకు చేరవేస్తున్నారు. ఈ కొంచెం దూరంలోనే పడవ అడుగున వుండే glass ద్వారా సముద్రపు అడుగున అందాలు చూసే అవకాశం కలిగింది. అనేక రంగులు, రూపాలలో పగడాలు, అక్కడక్కడా చిన్న చిన్న చేపలు-అందమైన దృశ్యం. ఇక్కడే ఇలా వుంటే సముద్రం లోపలికి వెళితే ఇంకా ఎంత అందంగా వుంటుందో కదా.
ఇలాంటి ఆలోచనలతో జాలీ బాయ్ లోకి అడుగుపెట్టాను. చాలా చిన్న island. తళతళా మెరిసిపోతూ తెల్లని ఇసుక, దూరంగా సేద తీరటనికి పెద్దపెద్ద చెట్లు, కొన్ని huts కూడా వున్నాయి. అందరూ సముద్రం లోకి విహారానికి వెళ్ళారు. అన్ని సామాన్లను ఒక పెద్ద బెంచిమీద పరచి నేను కూలబడ్డాను. ఎండ కూడా బాగనే వుండటం వలన చిన్న కునుకు పట్టింది. ఓ పావుగంట తర్వాత లేవగానే fresh గా అనిపించింది. ఆ తరువాత మెల్లగా చుట్టూ పరికించాను. వాతవరణం ఆహ్లదకరంగానే వుంది. దట్టమైన చెట్లు ఎండనుండి కాపడుతున్నాయి. నాలాగే చాలామంది చెట్ల కింద, గుడిసెల్లో enjoy చేస్తున్నారు.
దూరంగా తెలుపు, నీలం మిశ్రమ వర్ణంలో సముద్రం. అందులో కేరింతలు కొడుతున్న పర్యాటకులు. సముద్రపు లోపలికి వెళ్ళిన వారు తిరిగి వస్తున్న జాడ లేదు. పక్కనే ఒకే ఒక చిన్న గుడిసెలో snacks అమ్ముతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా సెక్యూరిటీ వాళ్ళు కాపలా వున్నారు. మొత్తానికి పరిసరాలు శుభ్రంగానే వున్నాయనిపించింది. అలా పావుగంట గడిచాక కుటుంబ సభ్యులు, మిత్రులు తిరిగి వచ్చారు. అందరి కళ్ళలో అమితానందం కనపడింది. ముఖ్యంగా మా గాయత్రి చాలా ఉద్వేగంగా తన అనుభవం చెప్పింది. పడవ వాడు మమ్మల్ని వెనక్కు తీసుకువెళ్ళే దాకా పిల్లలందరూ మళ్ళీ సముద్రంలో ఆడి పాడారు. నేను మాత్రం నా మొబైల్ లో ఫోటోలు తీస్తూ గడిపాను. ఒంటి గంటకల్లా marine park చేరాము. హఠాత్తుగా వాన మొదలైంది. కారులో ప్రకృతిని ఆస్వాదిస్తూ దారిలో భోజనం కానిచ్చి ఇంటికి క్షేమంగా చేరాము.
జాలీ బాయ్ ద్వీపం మూసేసిన వారానికి మా ఆవిడ ఒక కోరిక కోరింది. ఎలాగూ హైదరాబాదు వెళుతున్నాము మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు “రెడ్ స్కిన్” ఐలాండ్ కూడా చూద్దాము అంది. ఇక్కడ ఎలాంటి ప్రత్యేకతలు వుండవు. పైగా జాలీ బాయ్ కంటే ఏమీ గొప్పగా వుండదని మా ఆఫీసులో సలహా ఇచ్చారు. అయినా కుటుంబం కోసం, నా మనసులో కూడా చూస్తే ఓ పనయిపోతుందనే ఉద్దేశం వుండటంతో రెడ్ స్కిన్ ద్వీపానికి ఓ ఆదివారం ప్రయాణం అయ్యాము. జాలీ బాయ్‌కు ఎలా వెళ్ళామో ఇక్కడ కూడా అదే పద్దతి. Mahatma Gandhi Marine National Park దగ్గర నుండి ప్రయాణం మొదలువుతుంది. జాలీ బాయ్ మూసిన పది రోజులకే బయలుదేరటం వలన మా అబ్బాయి అక్కడి పడవ వాళ్ళను కూడా గుర్తు పట్టాడు. ఫెర్రి ఎక్కగానే వాళ్ళ వ్యాపారం మొదలయింది.
మా అబ్బాయి, శ్రీమతి glass boat లో సముద్రపు అడుగున జల సంపద చూడటానికి టిక్కెట్లు తీసుకున్నాను. నేను మాత్రం యధాప్రకారం ఒడ్డున కూర్చుని సామానులు కాపాలా కాయటానికి రెడి అయ్యాను. ఓ అరగంట తరువాత మా పెర్రీ రెడ్ స్కిన్ ద్వీపం చేరింది. జాలీ బాయ్ కంటే ఇక్కడ పచ్చదనం ఎక్కువగానే వుంది. ప్రజలు సేద తీరటానికి, విశ్రాంతి తీసుకోవటానికి చిన్న చిన్న హట్స్ (గుడిసెలు) ఏర్పాటు చేసారు. ఒక గుడిసెలో మాత్రం snacks అమ్ముతున్నారు. పరిశుభ్రత విషయంలో మాత్రం కొంచెం గట్టిగానే వున్నారు. ఒక్క రాయి(గవ్వ)కూడా బయటకు తీసుకెళ్ళకూడదట. ఈ బీచ్‌లో కూడా బల్లలు, కుర్చీలు అన్నీ చెట్ల కాండాలతో అందంగా అమర్చారు. అలాంటి ఓ అందమైన ఆకృతిలో ఆసీనుడయ్యాను. మా సామానులు చూసుకుంటూనే నా చుట్టూ వాతావరణాన్ని పరికించాను. చాలా మంది సముద్రంలో స్నానాలు చేసి బట్టలు మార్చుకోవటానికి చెట్లలోపలికి వెడుతున్నారు. అక్కడ గదులు కట్టి మంచి ఏర్పాట్లు చేసారు.
ఇంతలో మా అబ్బాయి, శ్రీమతి వచ్చారు. వస్తూనే వారితో ఒక యువజంటను తీసుకొచ్చారు. వాళ్ళతో నాకూ పరిచయం అయింది. Your son is very active అని వాళ్ళు మా అబ్బాయికి కితాబు ఇచ్చారు. చూడటానికి ఉత్తర భారతీయులులా వున్నారు. వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చారుట. ఆ అమ్మాయి రెండు చేతులకు పూర్తిగా గాజులు వేసుకుంది. పెళ్ళి అయి పదిరోజులే అయిందిట. హనీమూన్ అండమాన్‌లో జరుపుకుంటున్నారు. వాళ్ళతో కబుర్లలో పడ్డాను. ఇంతలో హఠాత్తుగా ఆ అమ్మాయి మాతో తెలుగులో మాట్లాడటం మొదలు పెట్టింది. ఆశ్చర్యపోవటం మా వంతయింది. వాళ్ళు వైజాగ్‌లో వుంటారుట. వాళ్ళ అమ్మా, నాన్న వైజాగ్ లోనే వున్నారు. ఆ పిల్ల చిన్నప్పుడు వైజాగ్ వచ్చి వ్యాపారం మొదల్లెట్టారుట. నాకు తెలుగు రాయటం, చదవటం కూడా వచ్చు అంకుల్ అంది. ఆహా ఎంతచిన్నది ఈ ప్రపంచం అనుకున్నాము. ఆ జంట వెళ్ళాక మళ్ళీ మేము నీళ్ళలోకి వెళ్ళి కాసేపు కేరింతలు కొట్టాము. తెచ్చుకున్న ఆహారాన్ని లాగించాము. అలా ఓ గంట గడిచాక తిరుగు ప్రయాణానికి పిలుపొచ్చింది. ముగ్గురం red skin island అనుభవాలు జాలీ బాయతో పోల్చుకుంటు కబుర్లు చెప్పుకుంటూ వండూర్ జెట్టీ చేరుకున్నాము. అప్పుడు సమయం ఒంటిగంట మాత్రమే అయింది. ఆ రోజు మా వాళ్ళకు వండూర్ బీచ్ కూడా చూపిద్దామనుకున్నాను. ఆ జెట్టీ పక్కన రెండు హోటళ్ళు వున్నాయి. ఒక దాంట్లో తీరిగా ఆసీనులయ్యాము. ముగ్గురం వేడి వేడిగా veg. Fried rice తిని బయటపడేసరికి సమయం రెండు గంటలయింది. అక్కడనుంది ఒక కి.మీ. దూరంలో వున్న వండూర్ బీచ్ చేరుకున్నాము. నేను ఇక్కడకు రావటం ఇది రెండవసారి. ఎందుకో ఇక్కడ ఎప్పుడు చూసినా పండుగ వాతావరణం వుంటుంది. జనం గుంపులు గుంపులుగా పిక్నిక్కు వస్తారు. వండూర్ బీచ్‌లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ కూడా వుంది. అక్కడ పార్కింగ్‌లో వున్న కార్లను చూసి ఎంతమంది జనం వున్నారో చెప్పవచ్చు. ఆ రోజు కూడా అలానే వుంది. మేం ముగ్గురం నీళ్ళల్లో దిగాము.
మా అబ్బాయి మొదట కొంచెం సంశయించినా చుట్టుపక్కల పిల్లలను చూసి నీళ్ళలో ఆడటం ప్రారంభించాడు. ఆబాలగోపాలం మిట్టమధ్యాహ్నం వేడిని లెక్కచేయకుండా సముద్రజలాల్లో కేరింతలు కొడుతూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. నిలువెత్తు లోతులో కూడా మునగకుండా తేలియాడుతూ ఆటలాడుతున్నారు. నేను కూడా అదే స్థితిలో ఆశ్చర్యకరంగా ఐదు నిమిషాలు ఆ నీళ్ళల్లో ధ్యానం చేసాను. ఎంతో relaxed గా , relief గా వుంది. అలా ఓ గంట గడిచింది. వండూర్ బీచ్ చాలా అందంగా అర్ధచంద్రాకారంలో వుంది. తెల్లని మెత్తని ఇసుకలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాము. కుడి వైపు దట్టమైన చెట్లు, అవి కూడా వివిధ భంగిమల్లో వున్నాయి. వాటి అందాలు వీక్షిస్తుంటే ఓ వ్యక్తి మమ్మల్ని అడ్డుకుని ముందుకు వెళ్ళటానికి అనుమతి లేదని వెనక్కు వెళ్ళమన్నాడు. ఇంకా ముందుకు వెళితే ఆ అడవికి అవతల గిరిజన (జార్వా) ప్రాంతం వుందిట. అతని మాట మన్నించి వెనక్కు వచ్చాము. మళ్ళీ కారు పార్కింగ్ దగ్గరకు చేరుకుని నేను మా అవిడ వేడి టీ గొంతులో పోసుకున్నాము. ఇక్కడ చాలా మంది పాలపొడితొ టీ తయారు చేస్తారు. అందుకే మరొకసారి టీ ఇంట్లో తాగుదామని తిరుగు ప్రయాణమయ్యాము. అలా ఓ ఆదివారం కుటుంబంతో అండమాన్‌లో ఆనందంగా గడిచింది.
ఇది యాత్రా చరిత్ర కాదు. ఉద్యోగ ధర్మంగా నేను అండమాన్‌లో రెండు సంవత్సరాలు వున్నాను. ఆ సమయంలో ముఖ్యంగా మొదటి సంవత్సరం నేను చూసిన వివిధ ప్రదేశాల గురించి face book (fb) లో క్లుప్తంగా అక్షర బద్దం చేసాను. ఆ తరువాత కొంతమంది మిత్రుల ప్రోత్సాహంతో కొంచెం విస్తారంగా రాశాను. చూసిన ప్రదేశలను అక్షరాలలో దాచుకోవటం నాకలవాటు. బయటి నుండి వెళ్ళిన మనకు అది నిజంగా ఒక కొత్త దేశం, సరికొత్త ప్రదేశం అనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణం మరీ ఒంటరిగా వున్నవాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా 2018 జనవరి నుండి ఇంటి మీద, కుటుంబం మీద గాలి మళ్ళి ఎక్కువ కాలం హైదరాబాదులోనే గడిపాను. అందుకే అండమాన్‌లో నేను చూసింది పిసరంత మాత్రమే. ఇది సమగ్ర యాత్ర కాలేక పోయింది. ఉత్తర, దక్షిణ అండమాన్లను నేను ఏ మాత్రం చూడలేకపోయాను. అందుకు కొద్దిగా అసంతృప్తి వుంది. కానీ చివరకు నాకు ఒక విషయం అర్ధమయింది This is not my life. అందుకే అక్కడినుండి transfer చేయించుకుని హైదరాబాదు వచ్చాను. వదిలి రావటం వలన ఎలాంటి అసంతృప్తి లేదు. కొద్దిగా ఆనందం కలిగింది. కాబట్టి ఇది యాత్రా చరిత్ర కాదు. దీన్ని అనేక రూపాల్లో చదివి అనందించిన మిత్రులకు, పాఠకులకు ధన్యవాదాలు.
(అయిపోయింది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™