పట్టణాలతో పోలిస్తే గతంలో పల్లెటూళ్ళలో ఒక స్వయం సమృద్ధ, సమీకృత ఆర్థిక వ్యవస్థ ఉండేది. ఒక చక్కటి సంఘ జీవితం ఉండేది. వృత్తి ఆధారిత వ్యవస్థ కారణంగా కాని, మరే కారణంగా కాని ఆదాయంలో కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉన్నా మరో పస్తులు ఉండవలసి వచ్చేంత దురవస్థ ఉండేది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీతమైన వేగంతో విస్తరించిన వ్యాపార సంస్కృతి పరోక్షంగా ఎన్నో దుష్పరిమాణాలకు కారణమయ్యింది. తమ ఉత్పత్తులకు కొద్దో గొప్పో తక్కువ లాభం వచ్చే పరిస్థితులు పోయి – విపరీతమైన పెట్టుబడుల కారణంగా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
కాళ్ళూ చేతులూ బావుంటే చాలు సంపాదించుకోగలం అన్న రోజులు పోయి చాలా కాలమయ్యింది. ‘జీవనోపాధి’ కావటం వంటి అత్యంత సరళమైన దశ నుండి వివిధ వృత్తులు పోటీయే పరమార్థంగా నడిచే ‘వ్యాపారం’ చట్రంలోకి వెళ్ళిపోయాయి. అంతా పోటీమయం. పెట్టుబడుల మయం. పారిశ్రామికీకరణలో భాగంగా జరిగిన భూసేకరణల కారణంగా భూస్వాములు రైతులుగా, రైతులు రైతు కూలీలుగా, రైతు కూలీలు వలస కూలీలుగా మారిన సంఘటనలు కోకొల్లలు. అదే రకమైన ప్రభావం మిగిలిన అన్ని రంగాలపైనా పడింది.
అనాదిగా ఉన్న – ‘అన్ని రోజులూ ఒక్కలా ఉండవు’ అన్న ఆశావహ దృక్పథానికి మనిషి క్రమేపి దూరమైపోయాడు. ఈ నేపథ్యంలో ఏదైనా పని దొరకకపోదనే ఆశతో పొట్ట చేత బట్టుకొని పల్లెల నుండి పట్టణాలకు వలసపోయే వారి సంఖ్య ఎక్కువై పోయింది.
సూటిగా చెప్పాలంటే భారీ పెట్టుబడుల బెడద లేకుండా శ్రమనీ, వర్షాన్నీ నమ్ముకుని వాస్తవిక దృక్పథంతో వ్యవహరించి రైతు వ్యవసాయం చేసినన్నాళ్ళూ పల్లె ప్రాంతంలో ఎవరికీ తిండిగింజలకు లోటు ఉండేది కాదు. పల్లానికి పల్లం, మెట్టకి మెట్టకి తగిన దిగుబడులతో – విపరీతమైన లాభాలు రాకపోయినప్పటికీ ఆకలి బాధలు ఉండేవి కావు.
చర్విత చర్వణం కానవసరం లేని అనేక కారణాలుగా దాదాపు అన్ని వృత్తులు ‘వ్యాపార సంస్కృతి’ తాలూకూ విషవలయంలోకి నెట్టివేయబడ్డాయి. ప్రభుత్వాల విధానాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల ప్రవేశం కారణంగా పరిస్థితులు ఇంకా జటిలమైపోయాయి. ప్రజల పరిస్థితి ‘ముందు నుయ్యి – వెనుక గొయ్యి’లా మారిపోయింది. వాణిజ్య పంటలకు ప్రోత్సాహాకాలు పెరిగి తిండిగింజల సేద్యం తగ్గిపోయి దిగుబడుల మీద ఆధారపడవలసిన పరిస్థితులూ దాపురించాయి. ఇవన్నీ అనాలోచిత నిర్ణయాల ఫలితాలే! ఏది ఏమైనా ఈనాటి ఈ గడ్డు పరిస్థితి ఒక్క రోజులో దాపురించినది కాదు. చక్కబడడానికీ చాలా కాలమే పడుతుంది. ఖచ్చితమైన విధి విధానాలతో, పటిష్టమైన పద్ధతులతో అవినీతి రహితులైన వ్యక్తులు అహరహం శ్రమిస్తే పరిస్థితులు తప్పనిసరిగా చక్కబడతాయి. ప్రభుత్వాలు గాని, ప్రజలు గాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుండి ఒక్కసారిగా వెనుకకు రాగల అవకాశం లేదు. క్రమేపీ సమాంతర ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించడం ద్వారా మాత్రమే పరిస్థితులు కొద్దో గొప్పో చక్కబడగలవు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™