ఖరదూషణాదుల వధ తర్వాత రాముని చూచిన సీతాదేవి అతని పరాక్రమము వల్ల తృప్తి చెంది స్వయంగా కౌగిలించుకున్నదట.
తమ్ దృష్ట్వా శత్రు హర్తారమ్ మహర్షిణాం
సుఖావహమ్ బభూవవౄష్ట్వా వైదేహీ భర్తారమ్ పరిషస్వజే
ఇక్కడ సీతాదేవి రాముని శౌర్యాన్ని మెచ్చుకొనుటేగాక తాను సంకల్పించిన రాక్షస వధలో ఒక ఘట్టము ముగిసిందని సంతృప్తి పడ్డట్లుగా తెలియవస్తున్నది. ఇక్కడ వైదేహీ శబ్దము విదేహ రాజ కన్యక అని కాక దేహమునకు అతీతమైన జ్ఞానమూర్తి అని సూచన ఉన్నది. ఉత్తరకాండలో వేదవతి వృత్తాంతము వస్తుంది. ఈ వేదవతి సీత పూర్వజన్మ, ఆమె సాక్షాత్తు వేద స్వరూపురాలు. ఆమె సతీదేవి వలె తనను తాను దహించుకొని సీతాదేవిగా యజ్ఞధాత్రిలో జనకుడు దున్నుచుండగా పెట్టెలో లభించింది. వైదేహి శబ్దంలో వేద స్వరూపురాలనే అర్థము స్ఫురిస్తుంది. రామాయణమంతా సీతాదేవి యొక్క చరిత్రమని వాల్మీకి చెప్పడం గమనించాలి. త్రిమూర్తులు, వారి శక్తులు ముగ్గురు ఈ సృష్టి నిర్వాహకులు. ఈ ఆరుగురికి అతీతంగా స్వచ్ఛజ్ఞాన స్వరూపిణియైన, త్రిగుణాతీతమైన మహాదేవి ఒకతే ఉన్నది. ఈమెను గూర్చి విశ్వనాథ వారు ‘నా రాముడు’ అన్న కావ్యంలో వివరించారు.
కల్పవృక్షంలో ధనుఃఖండం తర్వాత కల్యాణ ఖండారంభంలో వశిష్ఠుడు తొలిసారి సీతాదేవి ప్రసక్తి తీసుకొని వస్తాడు.
మిథిలా శృంగాటంముల బృథులంబగు విషయమట్లు వినఃబడియెడు శ్రీ మధురాకృతి సీత ధరకు మధుసూదనురాణి వచ్చి మన్నించినటుల్ మధురాకృతి మా రాముడు మధుసూదనుడౌనొకాదో మధుసూదనునం శధురాఖ్యాతుని భార్గవు నధరీకృతతేజుజేయుటది యద్భుతమే
సీతాదేవిని గురించి శ్రీ మధురాకృతి అనడంలో ఆమె శ్రీ విద్యాధిష్ఠాత్రియైన పరాశక్తియని సూచన ఉన్నది. రాముడు కూడా మధురాకృతియనడం అతని చరిత్రలోనే మాధుర్యాన్ని ధర్మతత్పరతను తెలియజేస్తుంది. ఇక్కడ మధుకైటభ సంహారవృత్తాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ ఘట్టంలో మహా విష్ణువు విష్ణు మాయకు లోబడి నిద్రలో ఉండగా దేవతలు అతన్ని స్తుతించి మేల్కొల్పి మధుకైటభ వధకు దోహదం చేస్తారు. శ్రీరాముడు సీతా కళ్యాణం తర్వాత అయోధ్యలో సుఖవశుడై, యౌవరాజ్య పట్టాభిషేకానికి సిద్ధుడైయుండగా అతనిని అవతార కార్యం నిర్వహించవలసిందిగా దేవతలు ప్రార్థించి అతన్ని లోకముఖం నుండి దివ్యత్వ ముఖం వైపు మళ్ళించినట్లుగా కల్పవృక్షం చెబుతున్నది. మధుకైటభ వధ సందర్భంలో ఆధారభూతమైన శక్తి మహాకాళి. ఈమె తమః స్వరూపిణి. దశమహావిద్యల్లో మహాకాళి సంహారకారిణి.
ఈ వృత్తాంతము అంతా మధుసూదన శబ్దం రామపరంగా సీతాపరంగా రెండుసార్లు ఆమ్రేడితం కావడం విశ్వనాథ తెలియజెప్పిన ఇతిహాస రహస్వాన్ని సూచిస్తున్నది. కల్పవృక్షంలో సీతాదేవి ప్రాధమ్యయు వనవాసానికి బయలుదేరుతున్న సందర్భంలో ఆమె వర్ణించిన ఘట్టంలో స్పష్టపడుతుంది.
సీ. తలపై జిరత్నరత్న సమూహ కాంతి చ్ఛ టాహేమమయ కిరీటమ్ముతోడ రత్న కంకణ సమారాధిత హస్తాగ్ర చలిత లీలా సరోజమ్ముతోడ నూత్నకింకిణి కుంకుణుక్వాణ మేఖలా కలనాత్త జఘనభాగమ్ముతోడ శంఖ సుందరగళస్థల లంబమానము క్తామణిహార సంతతులతోడ నిఱుదెసన్ రామలక్ష్మణులిద్దఱొలసి తుండములువోని ధనువుల తోడ నొప్ప రక్తిమెయి సుమంత్రా సీత రథముమీద జానకీదేవి గజలక్మీ సరణిబొలిచే
(అయోధ్య-ప్రస్థానం-279)
ఈ పద్యంలో వర్ణన సామాన్య మానుష స్త్రీ వర్ణనగా కనిపించదు. ఈ పద్యము దీని వెంట ఉన్న మరో మూడు పద్యాలు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే శ్రీ వైకుంఠ లక్ష్మీ క్షీరసాగర లక్ష్మీ, అవతార విభవ లక్ష్మీ, ఆద్యాది మహాలక్ష్మీ నలుగురూ వర్ణింపబడినట్లుగా తెలియవస్తుంది. ఈ మహాలక్ష్మీకి రామ లక్ష్మణులిరువురు సేవ చేస్తున్నారని, వారి ధనుస్సులు ఏనుగుల తొండముల వలె ఉన్నవనీ, వారు చేసే వరివస్య వరాశక్తికి వైకుంఠ నారాయణుడు, సమస్త విశ్వమును తన పడగల మీద మోస్తున్న ఆదిశేషుడు కలిసి సమాహార రూపంగా ఉపాసిస్తున్నారనే అంశాన్ని తెలియజేస్తుంది.
‘నా రాముడు’ అనే గ్రంథంలో సీతాదేవియే తన వివాహానికి ముందే బంగారు లేడిగా రప్పించుటకు మారీచుని రాముని బాణం చేత దూరంగా విసిరి వేయించదని చెప్పబడింది. అరణ్యకాండలో సీతాదేవి సౌందర్యాన్ని వర్ణిస్తున్న సందర్భంలో నిగమ మహార్థములను దాటి, నిగమ వైఖరులను దాటి, పరబ్రహ్మ పదార్థము సీతాదేవి పదనఖముల కాంతి చేత ప్రకాశిస్తున్నదని ఆమె వేద మూర్తియేనని వెల్లడించడం జరిగింది.
రావణుడు సీతాదేవిని అపహరించిన సందర్భంలో అనేక సన్నివేశాలు ఆమె ఇష్టపూర్వకంగా ఏర్పరచినవేనని విశ్వనాథ సూచించారు. రామ లక్ష్మణులకు తనను అపహరించినవాని జాడ తెలిసేందుకు వీలుగా జటాయు మృతదేహము, సుగ్రీవాదుల వద్ద నగల మూట మొదలైన గుర్తులను ఏర్పరచినదని భావించడం జరిగింది.
సుందరకాండలో సీతాదేవి నిరాశతో దుఖఃమగ్నమై ఉండగా ఆమెకు శుభ శకునములు గోచరించాయి.
వ. అని యనుకొంచు జానకీదేవి దక్షిణ పార్శ్వంబుశోకంబు బోదకానించి యర్ధనారీశ్వరివోలె బరమశివాకారమై నిలుచున్న సీ. లోని నాళము చిన్నిమీమ కదల్చిన కొలకు పై తమ్మిపూ విలసంనంబు తమ్మి పూవును గరాంతముసాచి లాగెడు మహనీయ కరికుంభ మధురిమమ్ము కరికలభంబుచే గదలించబడిన యం దంపుటనంటి బోద చెలువమ్ము లేయనంటుల తోట పై యోగ్యముగదీచు నలువైన గాలి పిల్లల బెడంగు చెలగు వామనేత్ర కుచోరు చేలములయు నొలయు స్పందన మొప్పగా నుర్విసుతకు నంత పడమటి కొండ పై నస్తమయము కన్న జాబిల్లి యామెమొగాన బొడిచే
(సుందర-పరరాత్ర-406)
ఈ సన్నివేశంలో ఆమె జీవితంలో వచ్చిన పెద్ద మలుపు స్ఫురిస్తుంది. ఆంజనేయునితో సమాగమం కాబోతున్నది. తను లంకకు చేరిన రావణ సంహార రూపమైన పృథ్వి పైన దైవగుణ ప్రతిష్ఠాపన రూపమైన కార్యాన్ని సమగ్రంగా నిర్వహించబోతున్నది సీతాదేవి.
దైత్యధాత్రికి వచ్చిన ధరణిజాత దైత్యభావము కనునని దైత్యరాజు, దైత్యభావము పెకలించి దైవగుణము తాసముద్భిన్నమగుని ధరణిజాత మొదలుగా సీతా రావణుల సంఘర్షణ మొత్తం కావ్యానికి మూలద్రవ్యంగా మూడు పద్యాల్లో చెప్పబడింది. ఆమె ఖండించి తినియైన యసురగుణము కాల్నిలువదొక్కగా పంక్తికంధరుండు, అన్నిటిని నాశనము చేసియైనగాని దైవగుణము ప్రతిష్ఠింప జనకజాత. ఈ సన్నివేశంలో కావ్య మధ్యంలో ప్రధానేతివృత్తము సంస్థాపింపబడింది. ఒక వైపు సీత నాయకత్వం వహిస్తే మరొక వైపు రావణుడు ప్రతినాయకుడువుతున్నాడు. ఈ సంఘర్షణలో సీత వైపు రామాదులు సహాయకారులే తప్ప నాయకులు కారు. అందువల్లే ఆమె సుందరకాండములోని ఈ మలుపు దగ్గర భావాత్మకంగా తన స్వస్వరూపాన్ని ధరించింది. పడమట అస్తమించిన చంద్రుడు ఆమె ముఖంలో ప్రకాశించాడు. ఆమె చంద్రనిటల. చంద్రపాల, చంద్రరేఖాధర అయింది. ఈ శకునాలకు ముందే ఆమెను అర్ధనారీశ్వరిగా రచయిత దర్శింపజేశాడు. ముగురమ్మలకు అతీతమైన అర్ధనారీశ్వరి రూపమైన జానకీదేవి పరాశక్తిగా రూపుదాల్చింది.
తామ్ అగ్ని పర్ణామ్ తపసా జ్వలన్తీ వైరోచనీ కర్మఫలేషు జుష్ఠామ్ తామ్ పద్మినీమ్ ఈమ్ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః
అని వర్ణింపబడిన వేదములోని దుర్గా సూక్తము ఇక్కడ స్ఫురణకు వస్తుంది. ఈ దుర్గాదేవి జాత వేదస. అంటే వేదములు ఎరిగినది. వేదముల నుండి సముద్భవించినది. ఆ విధంగా దుర్గా సూక్తము వేదాత్మయైన సీతాదేవిని సంకేతించడంలో ఆశ్చర్యలేదు.
సీతా పరతత్త్వాన్ని స్పష్టంగా చిత్రించిన సన్నివేశం సుందరకాండలో త్రిజటా స్వప్న ఘట్టం శ్రీరాముని విజయాన్ని సీతాదేవి మహత్యాన్ని వెల్లడించే గాథ. ఈ గాథ సప్న రూపంలో వాల్మీకి చేత ప్రతిష్ఠింపబడింది. ఈ స్వప్నం యథార్థపు సీమలలోకి ప్రవేశించడం అచిర కాలంలోనే జరిగింది. స్వప్నంలో సంకేతింపబడిన అంశాలు సామాజిక విశ్వాసాలను వెల్లడించేవిగా ఉన్నా స్వప్నము జాగ్రత్ స్థితి నడుమ విభాజక రేఖలు తొలగిపోయినవి. అవస్థాత్రయ వివేకంలోని విచారణలో స్వప్నం ఉపాసకులకు తురీయస్థితిని జీవన్ముక్తస్థితిని, గాయత్రి మంత్రానికి సంకేతమైన త్రిజటకు ఈ దర్శనం కలగటం రామాయణ తాత్పర్యాన్ని తెలియజేస్తున్నది. “వాల్మీకి కావ్యమ్ రామాయణ కృత్స్నమ్…. సీతాయాశ్చరితంమహత్.. పౌతస్త్యవథమ్” అన్న మూడు పేర్లు ఈ త్రిజట నామంలో గర్భితమై ఉన్నది.
సుందరాకాండ సీతాదేవి వైభవాన్ని సమగ్రంగా ప్రకటిస్తుంది. ఆమెను రావణుడు చూచిన చూపు, హనుమంతుడు చూచిన చూపు, అశోక వనములోని రాక్షస స్త్రీలు చూచిన చూపు, ఆమె కూర్చొనియున్న అశోకవనిలోని వేయి కంబాల మంటపము, హనుమంతుని తోకకు నిప్పు పెట్టినపుడు దానిని చల్లార్చిన తీరు ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఆమె ధీరత ఆశ్చర్యకరమైనది. ప్రపంచ వాఙ్మయంలో ఏ ఇతిహాసంలోనైనా అంత దుఃఖ సముద్రంలో మునిగి కూడా అంత ధైర్యంగా మాట్లాడిన, మాట్లాడగలిగిన స్త్రీ మూర్తి కలదో లేదో చెప్పలేము.
హనుమంతునితో సంభాషించే సందర్భంలో ఆమె శ్రీ రామచంద్రుని పై గల భక్తి భావాన్ని ప్రకటించిన తీరు అద్భుతమైంది. అయోధ్యలో ఉన్న రోజుల్లో తాను ఎర్రంచు నల్ల చీర ధరించినపుడు వర్షాకాలంలో తడిసి కాళ్ళనిండా బురదలో వచ్చిన భర్త తన చీర నిండా ఆ బురద పూసిన సన్నివేశం లలిత శృంగార భావ పూర్ణంగా సాగి తుదకు “అప్పటి నుండి నాదు బ్రతుకంతయు అతని కాలి దుమ్ముగా చొప్పడేనోయి” అని సాగినటుల కథనము శృంగారం నుండి సర్వ సమర్పణ రూపమైన అంశం. ఈ మొత్తం సన్నివేశంలో వెనుక ఒక అరుదైన యోగా విషాద రేఖ అంతర్గర్భితమై ఉంటుంది.
సీతాదేవి ఆంజనేయుడు దర్శించినప్పుడు ఆమె సర్వమైన మూర్తికి శ్రీ రామమయంగానే గోచరించింది. ఇక్కడ ప్రసిద్ధమైన పద్యం
ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొతీరు స్వామి చా పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశిక మందురామదే హాకృతి, సర్వదేహఉన యందున శ్రీ రఘువంశమౌళిధ ర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై
నిత్యరామనామ నిభృత గీతిమ తల్లి తాప శిఖర భావ లీనయగుచు నిర్గ తంత్రియనుచు నిది యష్టియంచునే ర్పరుపరాని దగు విపంచివోలె.
త్రికరణములలోనూ భేదములేని అచ్చమైన చైతన్యము నందు సంలీనమైన బ్రతుకులు గల సీత రాముల ఐకమత్య భావము ఈ పద్యాలలో వ్యక్తమౌతున్నది. సీతాదేవి ఆత్మ సకలీన నిండియున్నన్ని నాళ్ళు అతడు పతి నేను భార్యను అని అంశం ప్రకృతి పురుషుల ఏకత్వాన్ని తెలియజేస్తుంది. సీతోపనిషత్లో సీతా దేవి మూల ప్రకృతి స్వరూపమని చెప్పబడింది. ఈ మూల ప్రకృతికి పురుషుడైన శ్రీ రామునకు అభేదము అనాది సిద్ధమైనదే.
సీతాదేవిని రక్షించుటకై నియోగింపబడిన రాక్షస స్త్రీలు సంవాదము కల్పవృక్ష సుందరకాండ కొంత మేరకు పెరిగింది. వాళ్ళ భాషణలో ఒక వైపు ఆమెను నిందించడం రావణునికి అనుకూలంగా మనస్సును మార్చడం అనే అంశాలు ఎంత ముఖ్యమైనవో ఆమె మౌలిమైన తత్వాన్ని కూడా వాళ్ళ మాటల్లో వ్యక్తం చేయటం మరొక ప్రధానాంశం. పోతన భాగవతంలో రాక్షసుల సంవాదాలను రాక్షస ప్రాయులైన రుక్మి మొదలైన వారి మాటలలో రెండు స్తరాలలో వారి వాక్కు అర్థమీయడం మనం గమనించవచ్చు. పోతనగారు ప్రయోగించిన ఈ సంవాద శిల్పాన్ని విశ్వనాథ కల్పవృక్షంలో విస్తృతంగా ప్రయోగించారు. దీనికి కారణం సర్వ జీవులయందు ఆత్యంతకంగా పరమేశ్వర స్పహ ఉంటుందని అందరూ ఎపుడో ఒకప్పుడు ఈశ్వరుని చేరపలసిన వారే అన్న భారతీయ తత్త్వ చింతన దీనికి ఆధారభూతమైనది. దీన్నే విశ్వనాథ జీవుని వేదన అంటారు. ఆ రాక్షస స్త్రీలలో ప్రఘస అన్న ఆమె
శివ మహాకార్ముక చ్ఛేత్త యోవ్వాడని కన్న తండ్రికిని దుఃఖంబుతొలుత శిహహాకార్ముక చ్ఛేత్త వీడంచు భా ర్గవ రామునకును దు:ఖంబు పైన తగ మహాటవి జంకతాళివి మరితాళి కట్టిన వాని దు:ఖంబు మరియు నీ వన్న ద మున్కలౌ వల పైన రా క్షసరాజునుకును దు:ఖంబు పెచ్చు ఇంక మహట చెప్పగానేల రేపు వరగు తినిపించెదపుమమ్ము పరమ దుఃఖ మయ విచిత్ర లోకేశ్వరీ! మాయవైసు ఖంబు చూపించెదవు దుఃఖంబు నెఱపి
(సుందర-పరరాత్ర-251)
సీతాదేవి మూల ప్రకృతి అని ఇంతకు ముందే చెప్పుకున్నాము. జీవుడు ఈ ప్రకృతిలోకి ప్రవేశించినపుడు నిత్య పరిణామశీలమైన జరామృత్యత్రస్తమైన లోకంలో దుఃఖాన్నే పొందుతున్నాడు. అపుడపుడు ఒక దుఃఖానికీ రెండవ దుఃఖానికి నడుమ కొంత తెరపి కలిగితే దానినే సుఖం అనుకుంటున్నాడు. ఇది మాయాతీతుడైన జీవుని అనుభవం. ఈ జీవుడు నిలిచి ఉండే ప్రపంచమే పరమ దుఃఖమయ విచిత్ర లోకము. దీని కంతా కారణము ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న మహామాయ. ఈ మాయ ప్రసక్తి మధుకైటభ వధా వృత్తాంత సందర్భంలో ముందే పేర్కొనడం జరిగింది. ఈ మహా మాయ ఆవరించనపుడు పరబ్రహ్మ పదార్ధము ఈశ్వరుడవుతున్నది. ఈశ్వరుడి వల్ల వ్యవహార జగత్తు ఏర్పడుతున్నది. ఇది దర్పణ దృశ్యమాన నగరీతుల్యము. ఈ అన్వైత సిద్ధాంత తాత్పర్యాన్ని ప్రఘస చెప్పిన పైకి కనిపించే వెక్కిరింపు మాటల్లో వ్యక్తం చేస్తున్నాడు కవి. వ్యాజోక్తులలో ఒక పరమార్థాన్ని వ్యాఖ్యానించటం చెప్పకయే చెప్పటం ఇక్కడి విశిష్టమైన అంశం.
యుద్ధకాండలో సీతాదేవి ప్రాభవమంతా ఉపసంహణ ఖండంలో గోచరిస్తున్నది. ఆమెను హనుమ చూచినపుడు గోళ్ళతోడ దీసిన పాపట, దూముడి జుత్తు, మలిన వస్త్రాన్ని దులిపి కట్టుకున్న తీరుగా కనిపిస్తుంది. అయినా ఆమె త్రిజగత్ శిరస్థితమణి ప్రవికల్పిత దీపికాకృతి వలె ఉంది. అంతటి దీన స్థితిలోనూ అంత సామాన్యమైన స్త్రీగా కనిపించినా ఆమె యందు పరమ భక్తిగల ఆంజనేయునికి మూడు లోకాల శిరస్సు మీద నిలిపిన రత్న దీపంలాగా ఉంది. రాముడు చెప్పినట్లుగా ఆమె అలంకరించుకొని రావడం వల్ల సహజ స్థితి తొలగి అలంకారాలే ముందుకు వచ్చాయి. ఇన్ని మహా ప్రయత్నాలకు ఆమెయే కారణమనిపించింది. ఆమె కోసము సముద్రాన్ని దాటినట్లు, రాక్షసులను సంహరించిట్లు అనిపించింది. ఆమె త్రైలోక్య సర్వసైణాకృతి పూని అంబిక వలె కనిపించటం మొదలుపెట్టింది. కపి రాక్షస సమూహము అమెనట్లా దర్శింస్తుండగా రామునకు లోపల కోపం పెరుగుతూ వచ్చింది. వనవాసం నాటి నుంచి ప్రతి కష్టానికి ఆమెయే కారణమనిపించింది. అప్పుడు రాముడు సీతను పరిగ్రహించే సందర్భంలో ఆమె పై దోషాలను ఆరోపించటం మొదలు పెట్టాడు. ఆ సందర్భంలో ఆంజనేయునికి లక్ష్మణస్వామికి కూడా రాముని మీద కోపం పెరిగింది. ఆమె అగ్ని ప్రవేశం చేయడానికి సిద్దమైంది. ఇక్కడ సమాధానం చెప్తున్న అమ్మవారిని ‘శ్రీ జానకీ దేవి” అని కవి పేర్కొంటున్నాడు. ఒకానొక ఋషి భావన నా హృదయంలోకి ప్రవేశించి మాయలేడి కోరేట్టు చేసింది. నా కోరిక ఇలా ఉంటుందనే స్ఫూర్తి రావణుని హృదయంలోనూ కలిగి ఉంటుంది. తరువాత ఇంత కార్యక్రమానికి స్త్రీయే కారణమని నీవు నిందించినావు
ఉ. ఆడది యింత సేయునను ఉన్నది యున్నదె యంచు నన్నునూ టూడితి, కైక కోరక మహాప్రభు నీవని రాకలేదు, నీ యాడది సీత కోరక మహాసుర సంహరణంబులేద, యా యాడది లేక లేద, జగమంచు, నిదంతయునేన చేసితిన్
(యుద్ద-ఉపసంహరణ-154)
ఈ పద్యంలో ఆడది అన్న శబ్దం సామాన్య స్త్రీ పరంగా వాడినా అది పరాశక్తికి సంకేతం. “అంతయు నేన చేసితిన్” అన్న సమాపన వాక్యం దేవీ సూక్తాలలోని భావనలను స్ఫురింపజేస్తుంది. కార్యకారణ యోజనకు కైక పేరు చెప్పినా ఆమె మనస్సులో దేవతలు నిర్వహించిన రూపకం గుర్తుకు వస్తుంది. అట్లాగే తానై ఈ మొత్తం రామకథా రూపకాన్ని నిర్వహించటం “సీత కోరక మహసుర సంహరణంబు లేదు” అన్న వాక్యం విశద పరుస్తున్నది. మరియు ఈ పద్యం లోక వ్యవహారంలో స్త్రీ ప్రాధాన్యాన్ని అతి బలంగా తెలియజేస్తున్నది. ఇంత చర్చ చివర సీతాదేవి “మనమిరువురము ఒకరిని విడిచి ఒకరము ఉండలేము లోకము కోసమై ఈ కలయిక అని చివరకు ఒక మాట చెపుతాను” అని అంటుంది. ఇది దేవతలకు కూడా తెలియని అంశం.
కం. ఇరువురము నొక్క వెలుగున జెఱు సగమును దీని నెఱుగు శివుడొకరుండే పురుషుడ వీ వైతివి నే గరితనుగా నైతిబ్రాణకాంతా! మఱియున్
(యుద్ద-ఉపసంహరణ-176)
శ్రీ రామకథలో తర్వాతి రామనాటక కర్తలు అనేక పరివర్తనాలు చేశారు. వీటిలో ఒకటి రావణుడు అపహరించినది మాయా సీతయే గాని అసలు సీత కాదని. మాయా సీత యొక్క స్వరూపం వేరు. అయోధ్య నుండి వనవాసం దాకా కదలి వచ్చిన జనకుని బిడ్డ సీతాదేవి స్వరూపం వేరు. ఇంతగా విస్తరించిన వృత్తాంతాన్ని విశ్వనాథ రెండు పద్యాలలో సూచనగా వాచ్యం చేయకుండా వ్యక్తీకరించినాడు. లంక నుండి అయోధ్యకు తిరిగి వస్తున్న సందర్భంలో పంచవటిలో దిగిన సీత తానొక్కతె పర్ణశాల లోనికి ప్రవేశించి తిరిగి వస్తున్నది. ఈ రెండు పద్యాలు సీతకు, మహా మాయకు నడిమి భేదాన్ని స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నవి.
ఉ. లోనికి జన్మ పృథ్విజ విలోకనలోక జయ ప్రగల్భప్ర జ్ఞానిధి, సింహయన, వికసన్నవలోచన పుండరీక, ర క్షోనివసంబునందగడు సొచ్చిన శీర్ణతనూ ప్రబంధ సం ధ్యానవవహ్నికా విరచితాకృతి, యాకృతి మత్ర్పతిజ్ఞయున్
(యుద్ధ-ఉపసంహరణ-271)
ఉ. వెలికినవచ్చు జానకియు జిన్న వయస్సుది మందయానమం జులతర మూర్తియై యడవిజొచ్చిన యంతి వురంబుకన్యదే హలలిత సౌకుమార్య వరమవధి రాఘవ బాహులగ్నయ ల్ల లనయి వీచు గాలి గదలాడెడు క్రొంజివురాకు బోడియున్
(యుద్ధ-ఉపసంహరణ-272)
వాల్మీకి చెప్పని కథాంశాల నిర్వహణలో కవి పాటించే జాగరూకత మనం తెలుసుకోవచ్చు. మొత్తం కల్పవృక్షంలోనూ సీతాదేవి మహా మాహిమాన్వితయే కథా ప్రవాహాన్ని నియమిస్తూ కొనసాగింపజేస్తూ ప్రవర్తింపజేస్తున్నది.
మొత్తం రామాయణంలోనూ, రామయణ కల్పవృక్షంలోనూ ఆధ్యాత్మిక స్పర్శ పై పై పొరలలో మాత్రమే కాకుండా అంతర్గర్భితంగా సాధకోపయోగ్యంగా నడుస్తుంది. అది తన ఉనికికి మించి పొంగి పొరలదు. మానుషేతి వృత్తమైన రామకథా ప్రవాహాన్ని రసోన్ముఖంగా తీర్చిదిద్దుతుంది. కల్పవృక్షం మొత్తం మీద వీరము, కరుణము, అద్భుతం అన్న మూడు రసాలు అక్కడక్కడా ప్రాధాన్యం వహించినా, కావ్యారంభం నుంచి చివరి దాకా అవి తమ మేరలు దాటి పొంగి పొరలి ఇతర రసభావాలను మ్రింగవు. కావ్యారంభం ఆత్మతత్త్వ నిరూపణతో ప్రారంభమైనది.
సీ. ఆత్మ నిత్యమ్మ కాలాద్య వచ్ఛిన్నమ్ము సచ్చిదానంద సంపచ్చయమ్ము అద్వితీయమ్మేక మపరిణామ ప్రాప్త మపరిమేయమ్మది యచ్చ తెలివి అట్టి జ్ఞానము తోడ నైక కాలికముగా నాదిమునుల్ గల రా ప్రభువులు యోగ నిద్రాముద్ర నూని తామే యదై యదియ తామై యుందు రమృతకళలు ఆత్మలో నాది మును లెట్టులవని తోడ నాది నృపులైక కాలికులై చరింత్రు ఆ నృపులయందు నిక్ష్వాకు వంబు జాప్తు మనుమడొప్పు వైవస్వత మనువు కొడుకు
(బాలాకాండం-ఇష్టి-1)
ఈ పద్యంలో ఆది మునులు ఆత్మానుభవంలో నిరంతరం ఉండేవారు. ఇది నృపులు భూలోక జీవనంలో సదా కలిసి మెలిసి ఉండేవారు. సమగ్ర జీవనానికి వీరిరువురు పరస్పర పరిపోషకులు. మునుల పరంపరలో ఆధ్యాత్మ శాస్త్రం వెల్లి విరుస్తుంది. నృపుల వ్యవహారంలో రసమయ కావ్యాలు ప్రవర్తిస్తాయి. కల్పవృక్షంలో బహుళంగా రసమయ కావ్యము గర్భితంగా ఆథ్యాత్మ కావ్యం సీతా రాములు గంగా యమునల వలె రెండు మార్గాలు సంగమించిన వాళ్ళు రసమయ జీవనానికి ఆత్మ ముఖ సాధనానికి సంకేతాలు.
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.
Excellent article. It reveals the secret narrative skills of Viswanatha in Kalpavruksha. Suprasanna charya Kovela is competent to explore and reveal the inner meaning of Kalpavruksha. Sincerely requesting to publish such articles in future. —– Raghavan. Chittoor.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™