ఇది పాత గుంటూరులో వున్న అతి పురాతన ఆలయం. చాళుక్య చక్రవర్తుల సామంతులైన పరిచ్ఛేద వంశస్తులు గుంటూరు రాజధానిగా పరిపాలించినప్పుడు 12వ శతాబ్దంలో పరిఛ్చేద పండయ్యరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శాసనాన్నిబట్టి తెలుస్తోంది. అంతకు మునుపు వేలాది సంవత్సరాల క్రితం మేరు పర్వతం గర్వమణచటానికి పరమ శివుడు అగస్త్య మహర్షిని దక్షిణాదికి పంపినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలో అగస్త్య మహర్షి తాను తిరిగిన ప్రదేశాలలో అనేక శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆయన ప్రతిష్ఠించిన శివలింగాలలో చాలామటుకు ఆయన పేరుతోనే అగస్త్యేశ్వరస్వామిగా ఈ నాటికీ పూజలందుకుంటున్నాయి. వాటిలో ప్రసిధ్ధమైన ఈ శివాలయం పాత గుంటూరులో ఆర్.టి.సి. బస్ స్టాండుకు సమీపాన వున్నది.
స్వాగత తోరణంపై శివ పార్వతుల విగ్రహాలు, వారికిరుప్రక్కలా గణపతి, కుమారస్వామి విగ్రహాలను చూడవచ్చు. ప్రధాన గోపురంపై వివిధ భంగిమలలో శివ రూపాలు, మండపం పై శివ కళ్యాణ ఘట్టం ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సువిశాలమైన ప్రదక్షిణా మార్గం. ఆలయం ఆవరణలో ఎటు చూసినా దేవతా మూర్తులతో పవిత్ర భావంలోకి తీసుకెళ్తాయి. ముఖ మంటపానికి ఎదురుగా ప్రత్యేక మంటపంలో నందీశ్వరుడు కొలువు తీరి వుంటాడు.
గర్భాలయంలో మహా తేజోమూర్తియైన శివలింగం నలుచదరంగా దర్శనమిస్తుంది. మేము వెళ్ళేసరికి అభిషేకం అయి స్వామి అలంకరణ కూడా పూర్తి అయింది. చాళుక్యుల కాలంనాటి ముఖ ద్వారం చతురస్రాకారంలో వుంది. గర్భాలయ ముఖ మంటపంలో వున్న స్తంభాలు అలనాటి శిల్ప కళా వైభావానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ మండపంలో కుడివైపు వినాయకుడు, ఎడమ వైపు కమారస్వామి విగ్రహాలు కొలువు తీరి వున్నాయి. మరోపక్క పంచ లోహ ఉత్సవ విగ్రహాలుంటాయి.
ప్రతి నిత్యం వివిధ పూజాది అభిషేకాలు ఘనంగా జరిగే ఈ ఆలయంలో పండయరాజు నిర్మించిన ప్రధాన ఆలయంతో బాటు ఎన్నో పరివార దేవతల ఆలయాలు కూడా నిర్మింపబడ్డాయి. స్వామి పక్కన ప్రత్యేక ఆలయంలో వున్న జగజ్జనని పార్వతీదేవిని దర్శిస్తే అక్కడనుండి రాబుధ్ధి కాదు. అంత కళగల తల్లి. ఈ తల్లికి ప్రతి నిత్యం వివిధ పూజలతోబాటు విశేషించి శుక్రవారాలలో కుంకుమ పూజలు విరివిగా జరుగుతాయి.
ముందు భాగంలో కళ్యాణ మండపం వున్నది. క్రీ.శ. 1771లో చెవిడిగంట రాముడు అనే భక్తుడు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు ఇక్కడి శిలా శాసనం ద్వారా తెలుస్తోంది. చేరువలోనే నాగ శిలా శాసనం వుంది. పండయరాజు దీన్ని రాయించాడు. దీని వల్లనే ఈ ఆలయ వైభవం ప్రకటితమైంది.
ఈ ప్రాంగణంలోనే ఏకాంబరేశ్వరస్వామి ఆలయం కూడా వున్నది. చిన్న పానవట్టం మీద చిన్న శివ లింగం ఐదు పడగల నాగరాజుతో నిత్య పూజలు అందుకుంటూ వుంటుంది. అక్కడే అమ్మవారు కామాక్షీదేవి. పచ్చని ముఖంతో అలంకృతగా భక్తులను ఆశీర్వదిస్తూ వుంటుంది.
ఇక్కడ ముందుగా వీరభద్రస్వామిని దర్శించే ఆచారం. పక్కనే ఆది శంకరులు, నవగ్రహా మండపం. గ్రహ దోష నివారణార్ధం భక్తులు ఇక్కడ పూజలు జరిపించుకుంటారు. కుడివైపు హరిహర సుతుడు అయ్యప్ప మండపం. ఇక్కడ అయ్యప్ప దీక్షా స్వీకరణ ప్రసిధ్ధి చెందింది.
పక్కనే జమ్మి వృక్షం దానికింద నాగ ప్రతిమలు. మొత్తానికి ఆలయం సర్వ లక్షణశోభితమై ఇంత దూరం వాళ్ళమైనా మాకు మళ్ళీ వెళ్ళాలనే కోరిక చాలా బలంగా కలిగేంత పవిత్ర భావం కలిగించే విధంగా వున్నది.
ఆలయానికి వెళ్ళగానే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సైదమ్మ బాయిగారిని కలిశాము. నేను ఆ ఆలయం చూడటానికి వచ్చిన కారణం, నా ఆసక్తి తెలియజేసి నేను రాసిన పుస్తకాన్ని ఇచ్చాను. ఆవిడ (చిన్నావిడే) ఎంతో శ్రధ్ధగా వెంటబెట్టుకుని తీసుకెళ్ళి అన్నీ చూపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి అక్కడనుండి బయల్దేరాము.
దీనికి సమీపంలోనే వున్న కోదండ రామాలయాన్ని కూడా దర్శించి అక్కడనుంచి పొట్ట పూజకై శంకర విలాస్ చేరుకున్నాము.
ఫోటోల క్రెడిట్: శ్రీమతి రాధికా పులిగడ్డ
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™