కాశ్మీరీ ప్రజలు పాటించాల్సిన పండుగలు, శుభకార్యాల గురించి నీలుడు చెప్పిన వాటిని మాటిమాటికి ప్రజలకు ప్రకటిస్తూండాలి. కాలం గడుస్తున్న కొద్దీ పలు కారణాల వల్ల ప్రజలు అన్ని నియమాలను పాటించడం కుదరక కొన్ని నియమాలనే పాటిస్తుంటారు. కాబట్టి ఈ నియమ నిబంధనలను పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. మరచిపోయిన వాటిని పునరుద్ధరించుకుని పాటిస్తూ ఉండాలి. అలా చేసిన వారు ఆనందంగా, సుఖంగా ఉంటారు. సకల ఐశ్వర్యాలు అనుభవిస్తారు.
ఇదంతా వివరిస్తున్న వైశంపాయనుడు అన్నాడు. “బృహదశ్వుడి ద్వారా ఇదంతా విన్న రాజు గోనందుడు మరచిపోయిన కొన్ని నియమాలను తిరిగి రాజ్యంలో ప్రవేశపెట్టాడు. వాటిని పాలనను ఆరంభించాడు. అతడు అవలంబించిన నియమాలు అనేకం కాలగర్భంలో కలిసిపోయాయి. నీలుడు చెప్పిన నియామాలను పాటించక బలభద్రుడనే రాజు మధుర వద్ద ఓటమి చెంది రాజ్యాన్ని కోల్పోయాడు. నీలుడు చెప్పిన నియమాలను తూ.చ. తప్పకుండా పాటించని రాజులు అకాల మరణం చెందుతారు. వారి రాజ్యంలో భయం తాండవిస్తుంది. ఇందుకు బలభద్రుడు ఉదాహరణ. ఎవరయితే నీలుడు చెప్పిన నియమాలను పాటిస్తారో వారి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. భయం అన్నది ప్రజలు ఎరుగరు.”
బృహదశ్వుడి నుంచి నీలుడు చెప్పిన నియమాలను, సూత్రాలను విన్న గోనందుడు ఏమన్నాడు? ఎలా స్పందించాడు?
దానికి సమాధానంగా వైశంపాయనుడు “బృహదశ్వుడు చెప్పిన మాటలు విన్న గోనందుడు కశ్మీరును తమ నివాసంగా చేసుకున్న నాగులు ఎవరు? వారి గురించి తెలుసుకోవాలని ఉంది” అనడిగాడు.
క్రుధాన్యేన తు యే నాగాః కశ్మీరేషు కృతాలయా। నామతస్తు సమాచక్షు శ్రోతుభిచ్ఛామి తానషమ్॥
ఇది సర్వసాధారణమైన విషయం. ఏదైనా ఒక ప్రాంతం గురించి తెలుసుకుంటున్నప్పుడు అక్కడి పవిత్ర స్థలాలతో పాటు ఆ ప్రాంతంలో నివసించిన గొప్పవారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ గోవిందుడు కూడా కశ్మీరు గురించి నీలుడు చెప్పిన విషయాలు విన్న తరువాత కశ్మీరును నివాసం చేసుకున్న పేరుపొందిన నాగుల గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. ప్రశ్న అడిగాడు.
ఇక్కడి నుంచి కశ్మీరాన్ని నివాసం చేసుకున్న ప్రధాన నాగుల జాబితాను గోనందుడికి చెప్తాడు బృహదశ్వుడు.
‘జాబితా’ అనగానే ఇటీవలి కాలంలో ‘నాగరీకుల చిట్టా’ తయారీ గురించి జరుగుతున్న గొడవలు గుర్తుకు వస్తాయి. రాజకీయాంశాలు పక్కన పెడితే ఇంకా సరిహద్దులు లేని ‘వసుధైక కుటుంబం’ స్థాయికి ప్రపంచం ఎదగలేదన్నది నిర్వివాదాంశాం. ఎంత విశాలంగా ఆలోచించాలనుకున్నా ఎవరికి వారు తమ తమ దేశ సరిహద్దుల ఆధారంగా తమ విశాలత్వంపై పరిమితులు విధించుకోవాల్సి వస్తుంది. తమ దేశం వారెవరు? పరాయి దేశం వారెవరు? అని ఇష్టం లేకున్నా గీతలు గీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, మనం ‘వసుధైక కుటంబం’ అని నమ్మినా, మన దేశానికి వచ్చిన పరాయి దేశం వారు అలా అనుకోవటం తప్పనిసరి కాదు కదా! అదీ గాక ప్రతి దేశానికి తన దేశ పౌరుల గురించిన జాబితా, సమాచారం ఉండడం ఆవశ్యకం. అందుకే ఒక దేశం నుంచి మరో దేశం వెళ్ళే సమయంలో పాస్‌పోర్ట్‌లు, వీసాలు, ఆ దేశంలో ఎన్నిరోజులుంటారు? ఏం చేస్తారు వంటి వివరాలు తెలుపాల్సి ఉంటుంది. సమయం దాటిన తరువాత పరాయి దేశంలో ఉండడం నేరంగా పరిగణిస్తారు. కానీ మన దేశం దగ్గరకు వచ్చేసరికి ఈ చేశానికి చెందిన ప్రజల జాబితా తయారు చేయటం ఓ పెద్ద వివాదంగా పరిణమించింది. దానికి కారణాలు ఏవైనా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కించిత్తయినా ఆలోచన, బాధ్యత లేకుండా సమాజాన్ని, వ్యవస్థను సైతం దెబ్బతీసే రీతిలో నాయకులు వ్యవహరించటం శోచనీయమైన అంశం. దీనికి తోడు, పలు కారణాల వల్ల కొన్ని అంశాల ప్రాతిపాదికల ఆధారంగా ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి చెందినవాడా, చెందనివాడా అని నిర్ణయించి అడ్డుగోడలు నిర్మిస్తూ, గిరి గీస్తున్న వారే, దేశం సంగతి వచ్చేసరికి మరో రకంగా ప్రవర్తించటం ఆలోచించవలసిన అంశం. అత్యంత సమాచార విస్ఫోటనం సంభవిస్తున్న తరుణంలో సమాజంలో అత్యంత తీవ్రమైన రీతిలో అజ్ఞానం ప్రచారమవటం శోచనీయం. అందరూ అపోహలు, కళ్ళకు గంతలు, రంగుటద్దాలు పక్కనపెట్టి నిజాయితీగా ఆత్మవిమర్శ చేయాల్సిన అవసరం ఉంది.
గోనందుడి ప్రశ్నకు సమాధానంగా బృహదశ్వుడు నాగుల పేర్లు చెప్పడం ప్రారంభించాడు.
నాగుల రాజు నీలుడు, వాఉస్కి ఉపతక్షక, కంబల, అశ్వతర, కర్కోటక, ధనంజయ్, ఇలపాత్ర, అనంత, నంద, ఉపనందన్, తులిక, శ్వేతశంఖ, పలాస, భేదిమ, బది, హేళీహేల, శంఖపాల, చందన, నందన, నీల, మహానీల, వాటిక, సాంచిక, పద్మ, మహాపద్మ, కాల, కచ్ఛప, సముద్ర, సముద్రణ, గజ, తక్షక జంటలు, హస్తికర్ణ, వామన, మహిశ, వరాహ, కుసాన జంటలు కశ్మీరంలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నాయి.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™