కశ్మీరు నుంచి సదాంగుళుడు నాగుకు బహిష్కరణ విధించటం, విశ్వగాశ్వ భూభాగం సరస్సుగా మారిన వృత్తాంతం గురించి తెలుసుకోవాలన్న గోనందుడి కోరికను మన్నించి బృహదశ్వుడు ఆ సంఘటనలను చెప్పడం ప్రారంభించాడు.
“నాగమహాపద్ముడు సతీదేవి దేశాన్ని తన నివాసంగా చేసుకున్నాడని తెలుసుకున్న వినత సుతుడు అతడిని అణచివేయడం ప్రారంభించాడు. గరుడుడు దొరికిన పామునల్లా దొరికినట్టు దాడి చేసి, చంపేసేవాడు. ఈ విధంగా వేల సంఖ్యలో మహాపద్ముడి బంధువులను, అతడిపై ఆధారపడినవారిని, వారి బంధువులను చంపేసేవాడు.
తనవారి సంఖ్య గరుడుడి దాడుల వల్ల గణనీయంగా తగ్గిపోతుండడంతో మహాపద్ముడు నీలుడిని శరణువేడాడు. నీలుడిని తనకు కశ్మీరంలో అతడి అండన నివసించే అనుమతిని ఇవ్వమని కోరుకున్నాడు.
“నాగమహాపద్మా… కశ్మీరం నాగులతో నిండిపోయింది. నాగులంతా కశ్మీరాన్ని తమ నివాసంగా చేసుకోవటంతో, ఇసుమంత స్థలం కూడా లేని పరిస్థితి వచ్చింది. అదీగాక నీది చాలా పెద్ద కుటుంబం. కాబట్టి కశ్మీరంలో మీకు నివాస స్థలం దొరకటం కష్టమే. అయితే, సదాంగుళుడి ప్రాంతం ప్రస్తుతం ఖాళీగా ఉంది. అతడికి దేశబహిష్కారం విధించాను. అతడు మానవుల భార్యలను అపహరించుకుపోతున్నాడు. దాంతో అతడిని దార్వ ప్రాంతంలోని ఉత్తమ పర్వతం ఉశీరకపై నివాసం ఉండమని ఆజ్ఞాపించాను. అతడిని ఉశీరకకు పంపించడం వల్ల కశ్మీరు ప్రజల అభిమానాన్ని సాధించగల్గాను. తన తప్పు గ్రహించిన సదాంగుళుడు పద్ధతిని మార్చుకున్నాడు. అక్కడి ప్రజల గౌరవ మన్ననలను అందుకుంటున్నాడు. సంతోషంగా జీవిస్తున్నాడు. నా ప్రార్థనల వల్ల శ్రీ విష్ణువు అతడికి అక్కడ రక్షణ కల్పించాడు. కాబట్టి నువ్వు రాజు విశ్వగశ్వుడి రాజ్యంలో చాంద్రపుర అనే అందమైన నగరంలో నివాసం ఏర్పరుచుకో. సదాంగుళిడు ఉండే ప్రాంతాన్ని సరస్సుగా మార్చుకుని నివసించు. ఈ ప్రాంతం సరస్సుగా మారటం వెనుక ఈ గాథ ఉంది.
ఒకసారి దుర్వాసుడు పిచ్చివాడిలా వేషం వేసుకుని సదాంగుళుడి సామ్రాజ్యానికి వచ్చాడు. పిచ్చివాడి వేషంలో ఉన్న అతడిని ఎవరూ గౌరవించలేదు. అతడికి మర్యాదకరమైన ఆహ్వానం లభించలేదు. దాంతో కోపించిన దుర్వాసుడు శపించాడు – ‘ఈ ప్రాంతమంతా సరస్సుగా మారిపోనీ’ అన్నాడు.
అతని శాపం గురించి నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఆ ప్రాంతాన్ని నీ నివాసంగా మార్చుకో.
అయితే మారువేషంలో వెళ్ళి అక్కడ నివాసం ఉండటానికి రాజు విశ్వగశ్వుడి అనుమతిని అభ్యర్థించు. ఒకవేళ, మారువేషంలో ఉన్న నిన్ను గుర్తించకుండా, నీ అభ్యర్థనను మన్నించలేదనుకో… అప్పుడు రాజు అసలు స్వభావం తెలుస్తుంది. వెళ్ళు” అన్నాడు నీలుడు.
ఇక్కడ మహానాగపద్ముడు మారువేషంలో వెళ్ళి అభ్యర్థించటం ఎందుకంటే విశ్వగశ్వుడి ప్రవర్తనా, ఆలోచనా విధానం గురించి తెలుసుకోవటానికే… సాధారణంగా ఎవరయినా పేరున్నవారితో, ప్రసిద్ధులతో ఒకరకంగా వ్యవహరిస్తారు. అనామకులతో మరో రకంగా వ్యవహరిస్తారు. అలా కాక ప్రజలందరినీ సమానంగా చూడగల్గినవాడే ఉత్తముడు. స్థాయిని బట్టి, లాభనష్టాలను బేరీజు వేసుకుని వ్యక్తులను గౌరవించేవాడు రాజు కాదు. అది ఉత్తమ రాజ లక్షణం కాదు. ప్రజాపాలకుడికి ప్రజలంతా సమానమే అయి ఉండాలి. ఇది ఒక ఆదర్శవంతమైన స్థితి.
గమనిస్తే, పూర్వకాలంలో రాజులు పెద్ద పెద్ద రాజభవనాలలో ఉన్నా, అత్యంత ఐశ్వర్యాలతో తులతూగుతున్నా, వారు సామాన్య ప్రజలను అత్యంత శ్రద్ధతో గౌరవించేవారు. ప్రజల స్థాయితో సంబంధం లేకుండా వారిని గౌరవించేవారు. ఎలాంటి వారయినా అన్యాయం జరిగితే న్యాయం కోసం ఏకంగా రాజును అభ్యర్థించే వీలుండేది. ధర్మగంటలు ఏర్పాటు చేసేవారు. ఎవరు వచ్చి గంట మ్రోగించినా, రాజు వెంటనే వారి సమస్యను విచారించి పరిష్కరించేవారు. ఇది భారతీయ సంప్రదాయం.
ఇక్కడ నీలుడు కూడా విశ్వగశ్వుడు తన రాజ ధర్మాన్ని సరిగ్గా పాటిస్తున్నాడో, లేడో అని పరిశీలిస్తున్నాడు.
నీలుడి మాటలను అనుసరించి, మహానాగపద్ముడు బ్రాహ్మణుడి వేషం వేసుకుని చంద్రపురం వెళ్ళాడు.
విశ్వగశ్వ మహారాజును కలిశాడు.
విష్ణువు బలి మహారాజు కోరినట్టు కోరిక కోరాడు, అభ్యర్థించాడు.
“రాజా నాది పెద్ద కుటుంబం. ఎక్కడా ఆశ్రయం లభించడం లేదు. నాకూ, నా కుటుంబానికి సరిపడా నివాసస్థలాన్ని నీ రాజ్యంలో నాకు ఏర్పాటు చేయాలి” అని అభ్యర్థించాడు.
విశ్వగశ్వ మహారాజు తనని అభ్యర్థిస్తున్న బ్రాహ్మణుడి వైపు పరిశీలనగా చూశాడు.
వామనుడిని బలిచక్రవర్తి చూసినట్టు చూశాడు.
వామనుడు ముల్లోకాలు ఆక్రమించి మూడవ పాదం తనపైనే మోపుతాడని గ్రహించిన బలి మహారాజు వామనుడి ముందు మోకరిల్లినట్టు మోకరిల్లాడు.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™