మా అమ్మా నాన్నలు పుణ్య దంపతులు. సదాచారం పాటించినవారు. వున్నంతలో దానధర్మాలు చేసి ముక్తి పొందినవారు. ఆస్తులు కూడేసి పిల్లలను ధనవంతులుగా మార్చాలని కోరుకోలేదు. వారు మాకిచ్చినది వారి పుణ్యఫలమే!
మాకు తెలిసిన ఒకరు ఒకనాడు ఫోను చేసి “వూరిలో కుర్తాళం స్వామిజీ వచ్చి వున్నారు. మీ ఇంటికి ఆహ్వానించండి” అని సలహాలిచ్చారు. అప్పటికి నాకు కుర్తాళం స్వామి గురించి తెలియదు.
ఆ విషయము చెబితే, “వారి గురించి ప్రచారము వుండదు. మీ మిత్రులను పిలచి వారి దర్శనము చేయించండి” అని కూడా చెప్పారు ఆ సన్నిహితులైన మిత్రులు.
కుర్తాళము పీఠము తపోభూమి, మహా మహిమాన్వితమైనది, దక్షిణ భారతాన వున్న పీఠము.
మౌనస్వామిగా భక్తులను బ్రోచిన శివ సచ్చిదానందస్వామిజీచే ఏర్పాటు చేసిన పీఠం అది శక్తివంతమైన పీఠం. అక్కడ అమ్మవారు సిద్దేశ్వరిదేవి. అమ్మవారు పిలిస్తే పలికే తల్లి. మౌన స్వామి గురించి కూడా ఎన్నో కధలు వ్యాప్తికి ఉన్నాయి.
మౌనస్వామి అక్కడ తపస్సు చేసుకుంటూ కుర్తాళనాథుని దేవాలయములో ప్రసాదము తింటూ గడుపుతూ వుంటారు.
1909లో శృంగేరి జగద్గురువులు నవనృసింహభారతీ స్వామి వారు అంబా సముద్రములో చాతుర్మాసము చేసినారు. మౌనస్వామి వారిని చూడబోయినారు. ఆ స్వామి మౌనస్వామితో కుర్తాళము ప్రశస్తమైనదని, కాని యతులకు వుండుటకి మఠము లేదని అక్కడ మఠము నిర్మించమని చెబుతారు. మౌనస్వామి అంగీకరిస్తారు. ఆయన మఠం కోసము ప్రజలను ఆకర్షించటానికి ప్రసాదము తీసుకొని చప్పట్లు చరుస్తారు. చేతుల నుంచి బంగారు కాయిన్స్ వస్తాయి.
అది చూచి చాలా మంది మౌనస్వామికి భక్తులవుతారు. వారి కష్టాలను తీరుస్తూ వుంటారు స్వామి.
అక్కడ కుర్తాళం సిద్ధేశ్వరీదేవిని ప్రతిష్ఠించి నాడి గణపతిని, దండపాణి సుబ్రమణ్యేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు.
ప్రాణ ప్రతిష్ఠను హేళన చేసిన నాస్తికులకు గణపతి నాడిని పరీక్షించమని సవాలు చేస్తారు మౌనస్వామి. బ్రిటీష్ వైద్యుడు వచ్చి పరీక్షిస్తే నాడి తగులుతుంది.
భయపడిన వారితో భయము లేదని అలా ఆ రోజు వుంటుందని అభయమిస్తారు స్వామి. ఆ గణపతిని ఆనాటి నుంచి ‘నాడి గణపతి’ అంటారు.
ఆ విషయము మద్రాసు గవర్నరు ఆర్చిబాల్డ్ నై కూడా చూశారట. అది ఆనాటి పత్రికలలో ప్రచురించారు.
ఆ పీఠములో మౌన స్వామిని ఆశ్రయించి భక్తులకు ఎన్నో అనుభవాలు జరిగాయి.
ప్రస్తుతం ఆ పీఠానికి అధిపతి, ఉత్తరాధిపతి జగద్గురువులు పరమహంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహా స్వామి వారు.
వారు పూర్వాశ్రమములో గొప్ప సాహిత్యవేత.
ఆశుకవి. అవధానశేఖర, అశుకవి కేసరి, సాహిత్యసౌరభౌమ, సరస్వతీ కంఠాభరణ వంటి ఎన్నో బిరుదులు పొంది వున్నారు. కులపతిగా, యతిగా, పీఠాదిపతిగా మారి మన మధ్య నడయాడు దైవము. వారి పూర్వ నామము ప్రసాదరాయ కులపతి.
కరుణశ్రీ గారు శ్రీ స్వామి వారి మీద చెప్పిన పద్యము:
“ఆశుకవీ! జయోస్తు! కమలాసన పట్టపురాణి చేతి లీ లాశుకవీ! జయోస్తు! కులపతివై నవయుగ కవి కులపతివై భువనవిజయ గోవర్ధన గో కులపతివై శ్రితరజతా చలపతివై మనుము కనుము సకల శుభమ్ముల్” ఎందరి సత్కార్యాలు అందుకున్న కవిరాజూయన!
ఆయన ఆధ్యాత్మిక సాధన చాలా విచిత్రమైనది. ఆయనకు చిన్న వయస్సులో మరణాననంతర అనుభవము కలిగింది. ఒకరోజు పడుకొని వుండగా తాను తేలిపోతున్నట్లుగా అనుభవము కలిగింది.
చూస్తే ఆయన గదిలో పైన తేలుతున్నారు. క్రింద ఆయన శరీరము వుంది. అందులోకి వెళ్ళటానికి రాలేదు. భయం కలిగింది. అప్పుడు ఆయన తనకు వచ్చిన మంత్రం చేస్తూ వుండిపోయారట.
అలా తిరిగి శరీరములో ప్రవేశించారు. ఆనాటి నుంచి ఆయన మంత్రం విలువ తెలిసిందంటారు.
ఆయన ఎంతో పట్టుదలతో సాధన చేసేవారు. 16 గంటలు కదలక, ఉపవాసాలతో మండల దీక్షలతో దేవీ దేవతల ఉపాసన చేశారు. తరువాత వజ్రేశ్వరీ, చిన్నమస్తా, రేణుకాదేవి, నాగ భైరవ, భైరవలు వంటి దేవీదేవతల మంత్రాలు సాధన చేశారు. వారు ఏ మంత్ర దేవతనైనా సాధన చేసి ఆ దేవత సిద్ధి పొందేవారు.
చిన్నతనములో సన్యాసము తీసుకోవాలనుకున్నారు కాని తల్లితండ్రులు అనుమతించలేదు.
ఆయన మనసు లోపల సన్యాసముపై కోరిక పోనందున హిందూకాలేజిలో లెక్చరరుగా కులపతిగా, పిన్సిపాల్గా చేసి రిటైరు అయ్యాక సన్యసించారు.
శ్రీ శివచిదానంద సరస్వతి స్వామివారు పీఠాధిపతులు. వారు కులపతి గారికి 2002లో సన్యాసమిచ్చి ‘శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి’ అన్న నామమిచ్చారు.
శ్రీ శివచిదానందభారతీస్వామి వారి తదనంతరము, 2012లో దత్త జయంతి నాడు శ్రీ స్వామి వారు పీఠాధిపతిగా పట్టాభిషిక్తులైనారు.
స్వామివారు తపః సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులు. పరమ దయాళువు. కుర్తాళం సిద్దేశ్వరీ దేవి పిలిస్తే పలికే దేవత. ఆమె స్వామి మీద కరుణను చూపుతుందనటానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి.
వారు కుర్తాళంలో హోమము చేస్తూ వుండగా హోమ గుండము నుంచి సువాసన వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అలా ఆ సువాసన ఐదు గంటల పాటు వున్నదట. మరో మారు హోమము చేస్తున్న వారి మీద కుంకుమ వర్షంలా కురిసింది. భక్తులకు అది ప్రసాదమైనది.
గుంటూరులో వున్న కాళీ మాత మందిరములో కాళీమాత స్వామివారు పూర్వ జన్మలలో తపము చేసిన తల్లి. ఆమె భక్తుల సమక్షంలో ఆ ప్రదేశములో ప్రత్యక్షమయినది. అక్కడే కాళీ మందిరము కట్టారు.
ఆ మందిరములో హోమము చేసిన వారి కోరికలన్నీ తీరుతాయని స్వామి భక్తులకు వరమిచ్చారు.
కష్టాలలో స్వామివారినాశ్రయించి, ఆయన ఇచ్చిన మంత్రం లక్ష జపం చేసిన భక్తులు ఎందరో అక్కడ హోమము చేసి వారి కోరికలు తీర్చుకుంటారు. కోరి వచ్చిన భక్తులను స్వామి వారు కరుణతో అనుగ్రహిస్తారు. ఆర్తులకు మంత్రమిచ్చి, వారిని ఆధ్యాత్మికత వైపుకు, ధర్మం వైపుకు మరల్చుతారు. ఇలా మంత్రంతో భక్తులను అనుగ్రహించే గురువులను కానీ, పీఠాడిపతులను కానీ మరొకరిని నేటి లోకములో మనము చూడము.
అంతేకాదు వారు సదా భక్తులను రక్షిస్తూ వుంటారనటానికి ఎన్నో నిదర్శనాలు వున్నవి. ఎందరో భక్తులకు భైరవ ఉపాసనతో ప్రాణగండాలు తప్పించారు.
భైరవుడు ఆయన పిలిస్తే పలికే దైవము. ఒకసారి కైలాస పర్వతము వద్ద భక్తులతో పరిక్రమణ చేస్తుంటే ఒక భక్తురాలికి గుండె పోటు వచ్చింది. అందరూ భయపడినారు. స్వామి ధైర్యం చెప్పి అప్పటికప్పుడు భైరవ హోమము చెయ్యగా, ఆ హిమపర్వతము వద్ద నల్లకుక్క వచ్చి ఆ భక్తురాలి చేతిని పట్టుకు నడ్పించి గమ్యం చేర్చింది.
ఆమె స్వస్తురాలయినది. ఆమె ప్రాణగండం తప్పినదని స్వామివారు సెలవిచ్చారు. ఈ విషయము నాటి పేపర్లలో ప్రచరించబడింది.
శంబలా లోయ గురించి, సిద్ధయోగుల గురించి సిద్ధాశ్రమము గురించి స్వామివారు చెబుతూ వుంటారు. ఆ యోగులను మనము పిలిస్తే వచ్చి సహయము చేస్తారని అంటారు. మనసులో మౌనము సాధన చెయ్యమని, మౌనము కష్టం కాబట్టి, మనసును మంత్రంతో నింపితే, మంత్రాధిదేవత వచ్చి మన ముందు నిలుస్తుందని స్వామి చెబుతారు.
అది మన మాంస నేత్రానికి కనపడదు కాని, ఆ దేవత మన ముందు వుంటుంది. మనలకు కలిగిన కష్టం తీరుస్తుందని చెబుతారు స్వామి. అలా ఎన్నో సార్లు నిరూపించారు కూడా. వారు మన తెలుగువారవటము మన నేల చేసుకున్న పుణ్యము. ఆయన కరుణ అతి విస్తారమైనది. ఆ కరుణను మానవళికి సమంగా పంచుతారు.
అటువంటి మహిమాన్వితుడైన స్వామి రూపములో పరమాత్మ మా గృహము పావనము చేశారు. నేను చేసిన పలహారము భుజించారు. ఇది కేవలము భగవంతుని లీల. అడగకనే వచ్చిన సాయం భగవంతుని సందేశమని దానిని తిరస్కరించకూడదని పెద్దలు చెబుతారు.
స్వామి వారు వచ్చారు. మా మిత్రులెందరికో వారి సమస్యలకు మంత్రమిచ్చి సాధన చేయ్యమని, మంత్రాధిదేవత కాపాడుతుందని చెప్పారు.
మేము వారి సన్నిధిలో మౌనస్వామి పాదాలను పూజించాము. స్వామికి ముందుగా నే చేసి వుంచిన ఇడ్లీలు మా దేవుని గదిలో కూర్చొని తిన్నారు. మమ్ముల ప్రక్కన కూర్చోపెట్టుకొని, ఏమైనా అడగమన్నారు. గురువుగా సాయి బాబా వుంటే మరోటి అడగటేమిటో తోచలేదు. ‘సద్గురువు దర్శనము’ ఇప్పించమని ప్రార్థించాను.
స్వామి దయతో ‘గురు మంత్రము’ ఉపదేశించారు. “ఇది లక్ష చెయ్యి, నీ కోరిక తీరుతుంది” అని చెప్పి శిష్యులతో వెళ్ళిపోయారు వారు.
యాతాయాత విహారేరాధా రేషుచ శీర్షే సంచారం విదధానం కించాశేష విసారి ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్రహ్మాస్ఫురతాన్మే॥ (- గురుగీతము గణపతిముని)
తా: ఎయ్యది షడాధార చక్రములందును, సహస్రారము నందును యాతాయాత విహారము చేయుచూ సర్వవ్యాప్త మగుచున్నదో, అట్టి నిరాలంబము, ఆకాశ సదృశము, పరిపూర్ణము, నిశ్శబ్దము అయిన గురురూపము నాకు స్ఫురించుగాక!
***
షిర్డిసాయిని నమ్మి కొలుస్తుంటే, మరో గురువు కావాలా? అని ప్రశ్న ఉదయిస్తుంది. సమాధానము నాకు ‘రమణాశ్రమ లేఖలు’ లో దొరికింది.
‘రమణాశ్రమలేఖలు’ సూరి నాగమ్మగారు రచించారు. బాల వితంతువైన నాగమ్మగారు రమణాశ్రమము చాలా విచిత్రంగా చేరుతారు. ఆమె చాలా పసివయస్సులో పెళ్ళి, భర్త మరణించటం జరుగుతుంది. పన్నెండు సంవత్సరాల పసిపిల్ల వితంతువై, గదిలో దుఃఖిస్తూ ఉంటుంది. ఆమెకు ఇద్దరు అన్నలు. వారు ఆమెను ఎంతో ఆప్యాయంగా చేరదీశారు. చదవటం, రాయటం నేర్పుతారు. ఇంట్లో ఉంటే ఎప్పుడు దుఃఖపడుతూ ఉందని యాత్రలకు పంపుతారు. తిరుపతి యాత్ర చేస్తూ వుండగా అరుణాచలం గురించి తెలుస్తుంది.
తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళి భగవాన్ సమక్షంలో మొదటి సారి మానసిక ప్రశాంతత అనుభవిస్తుంది నాగమ్మ. ఆమెకు చాల మొహమాటం, తనమీద తనకు కల దురదృష్ట భావంతో అందరి వెనుక తలవంచుకు కూర్చునేదిట. ఏనాడూ తలెత్తే సాహసం కాని, మాట్లాడే సాహసం కానీ చెయ్యదు. ఒక రోజు తలెత్తితే భగవాన్ ఆమెనే చూస్తూ ఉంటారు. భగవాన్ చూపు కళ్ళ ద్వారా మనస్సు లోలోపలి వెళ్లి, మనసు నెమ్మదిస్తుంది. దుఃఖం తీరుతుంది.
ఆమె అన్నలకి ఆమె తేరుకోవటం సంతోషాన్నిస్తుంది. ఖాళీగా ఎందుకు ఉండటం అని ఆమెకు అనిపిస్తే, భగవాన్ సమక్షంలో జరిగేవి, భగవాన్ చెప్పిన కబుర్లు రాసి తనకి ఉత్తరంలా పంపమని ఆమెని, చిన్నన్నగారు కోరుతారు. అలా ఆమె భగవాన్ సమక్షంలో జరిగే విశేషాలు, వింతలూ, కథలూ రాసి ఉత్తరాలుగా పంపేది. తరువాత తరువాత అవి భగవానుకు ముందు చదివి వినిపించి, అప్పుడు పంపేది. అలా భగవాన్ సమక్షంలో 1945 నుంచి 1950 వరకు, అంటే ఐదు సంవత్సరాల కాలము జరిగినవి వ్రాసింది.
సర్వసామాన్యముగా మొదలయిన ఆ లేఖలు తరువాత అత్యంత లోతైన వేదాంతపు రహస్యాలను సామాన్యమైన పరిభాషలో వివరిస్తాయి. మనకు కొంత అవగాహన లేకపోతే అవి అర్థము కావు. అటువంటి లోతైన విషయాలు సైతం ఎటువంటి విద్యాభ్యాసము లేని ఆమె రాయగలిగారంటే కేవలము, ఆమెపై రమణుల కున్న అనుగ్రహం కనపడుతుంది. ఆ గ్రంథం ఎన్నో భాషలలోకి అనువాదము చేశారు. అంత అత్యంత అద్భుతమైన గ్రంథం మరోటి లేదంటే అతిశయోక్తి లేదు. ఈ లేఖలు రాసి సూరినాగమ్మ గారి జీవితం శాశ్వతమైన కీర్తిని పొందారు. భగవాన్ సమక్షంలో అలా అన్ని సంవత్సరాలు, అన్ని విషయాలు రాసిన వారు మరొకరు లేరు.
ఆ గ్రంథంలో ఒక చోట నాగమ్మగారు భగవానుతో “షిర్డి సాయి భక్తులు. వీరు పరమపదించిన వారి గురువే వారికి మార్గం చూపుతారని నమ్ముతారు. కాని సజీవమైన గురువు కావలెను కదా” అని అడుగుతారు. ‘కావలెను’ అంటారు భగవానులు. “వీరి మాట” అని అడిగితే రమణులు ఏమీ చెప్పరు, మౌనం వహిస్తారు.
మరి నేనూ సాయి సమర్థులను నమ్మి నడిచే జీవిని. నా గతి ఏమిటి?
సజీవమైన గురువు వుండాలి. ఇటువంటి తపనతో తిరిగిన భరద్వాజ మాష్టారును సాయిబాబా ఎలా దరి చేర్చుకున్నారో మనము ‘సాయి సచ్చరితము’లో చదువుతాము. ఎక్కిరాల భరద్వాజ మాష్టారు సాయి సచ్చరితమును, గురు చరిత్రను తెలుగులో రాసిన పుణ్యపురుషులు. సజీవమైన గురువు కోసము ఆయన ఎంతో మంది మహానుభావులను దర్శిస్తారు. వారి చరిత్రలను పారాయణ గ్రంథాలుగా రాశారు. సాయి సమర్థులు వారి ద్వారా ఎన్నో అసాధ్యాలను సాధ్యము చేశారు. వారిని సాయి సమర్థులు కౌగిలించుకొని “నీవు నావాడివి” అని అభయమిచ్చారని వారి చరిత్రలో మనము చదవవచ్చు. పూర్వపుణ్యాల మూటలైన మాష్టారో, సూరి నాగమ్మగారి సంగతో సరి, వారికి గురువుల అనుగ్రహం ఉన్నది. వారి జీవితమే అందుకు ఉదాహరణ.
కాని, నా వంటి మూఢుల గతి ఏమిటి? అన్న దిగులు నాకున్న ప్రశ్నలకు తోడైనది.
గురువు అవశ్యకతను తెలియాలంటే తప్పక ‘గురుచరిత్ర’ చదవాలి. గురువును గురించి మనకు వివరించే గ్రంథం “శ్రీ గురు చరిత్ర”. గురువంటే శ్రీ దత్తస్వామి. ఆయన అత్రి, అనసూయల పుత్రుడు. వింధ్యపర్వత ప్రాంతాలలో దిగంబరునిగా తిరుగుతూ, ఖేచరీ ముద్రలో ధ్యానం చేస్తూ ఉంటాడుట. వేదాలు నాలుగు ఆయనతో పాటు నాలుగు కుక్కలుగా తిరుగుతాయట. అటువంటి శ్రీదత్తుడు గురువులకు గురువు. తరువాత కాలంలో ఆయన వివిధ అవతారాలు దాల్చి భక్తులను కాపాడుతాడు.
ఆయన అవతారములు, వివరణలు, గురువు ఎలా శిష్యులను కాపాడుతాడో ఆ గురుచరుత్ర మనకు వివరిస్తుంది.
గురుకృప లేనిదే సాధించేది ఏమి ఉండదని, గురువు మన యందు ప్రసన్నుడై ఉంటే సర్వ దేవతలు, త్రిమూర్తులు మన యందు ప్రసన్నతతో ఉంటారని “గురు చరిత్ర” స్పష్టంగా చెబుతుంది.
దానికి దీపకుని కథ ఉదాహరణగా చూపుతుంది. దీపకుని గురువు పండితుడు. వేదవేదాంగాలు తెలిసిన ఋషి. ఆయన మోక్షానికి అడ్డుగా ఉన్న తన కర్మను పూర్తిచేసుకోవటానికి కాశీ పట్టణములో కుష్ఠు రోగంతో కొంత కాలం గడపాలని అనుకుంటాడు. తనకు ఆ సమయంలో సేవ చేసేందుకు ఎవ్వరు రాగలరో చెప్పమని శిష్యులని అడుగుతాడు. దీపకుడు తనకు ఆ అవకాశం ఇవ్వని గురువుని ప్రార్థించి, గురు సేవ చేసే నిమిత్తం కాశీకి వస్తాడు.
కాశీ మహానగరానికి వచ్చినా అతను అక్కడ ఉన్న విశ్వనాథని దర్శనం, దానము ఇత్యాదివి కూడా చెయ్యడు. తన గురువు యందు మాత్రమే దృష్టి పెట్టి గురుసేవ చేసుకుంటూ ఉంటాడు. ఇది చూసి త్రిమూర్తులు సంతోషించి తమంతట తామే వచ్చి ఆ శిష్యుని దీవించి వరము కోరమని అడిగితే “దర్శనం కూడా చెయ్యని నాకు వరమును ఇస్తామంటున్నారు ఎందుకు?” అని అడుగుతాడు దీపకుడు.
“గురువుని కొలిస్తే త్రిమూర్తులను కొలిచిన దానితో సమానం. త్రిమూర్తులను పూజిస్తే త్రిమూర్తులు సంతోషపడతారు. గురువు ఆనందపడాలని లేదు. కానీ గురువుకు సేవ చేస్తే త్రిమూర్తులు ఆనందపడతారు” అని చెపుతారు త్రిమూర్తులు. దీపకుని దీవించి వెళ్ళిపోతారు.
అందుకే “గురుఃబ్రహ్మ, గురుఃవిష్ణు, గురుఃదేవో మహేశ్వరః” అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు మన పెద్దలు.
మనకు ఎలాంటి సాధనకైనా ముందు ఒక గురువు కావాలి. మనకు దారి చూపటానికి, మనము దారితప్పక పయనించడానికి. ఆ గురువు తత్వదర్శి, ఆత్మదర్శి అయిఉండాలి.
అలా సద్గురువు దొరకటానికి మనం చేసుకున్న పుణ్యం కావాలి. ఆ పుణ్యఫలం వల్ల గురువు దొరికినా మన శ్రద్ధ సడలకూడదు. సడలని శ్రద్ధ కూడా గురుకృప వల్లనే సాధ్యం.
సాయి బాబా ఇలాంటి వారి గురించే మామిడిపూతతో పోలుస్తారు. మనము మామిడి పూతలా రాలిపోకుండా నిలబడాలంటే దానికీ మళ్ళీ గురుకృపే శరణ్యం.
సాధకుడికి ముందుగా వచ్చే రెండు ప్రధాన అడ్డంకులు నిద్ర, బద్ధకం. ఇవి రెంటిని జయిస్తే ఇంక అనుకోవలసినది లేదు.
ఎంత తపన, వేదన ఉంటే అంతగా త్వరగా పరమాత్మ తత్త్వం తెలుస్తుంది.
కానీ నిద్రతో, బద్దకంతో మునిగే జీవికి సహాయపడువారు ఎవరు?
మనకు శ్రద్ధ కుదిరి, సర్వం అనుకూలిస్తే ఇంకేదో అడ్డంకి వస్తుంది.
గురు సేవ ఏదో ఒక టైంకి వచ్చాము, చేసాములా ఉండకూడదు అని చెబుతారు బాబా.
“తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, జ్ఞానిన స్తత్త్వ దర్శినః” (భగవద్గీత)
సేవ చేయ్యాలనిపించినప్పుడు కాదు, మనం (శిష్యులు) ఉన్నది సేవకోసం అన్నట్లుగా సేవిస్తే, తత్వదర్శి అయిన ఆ గురువు జ్ఞానం బోధిస్తారని చెప్పారు బాబా.
(బాబా చరిత్ర చదివిన వారికి ఇది తెలిసిన విషయమే).
(సశేషం)
అమ్మో…..చాలా విషయాలే విశదపరిచారే…మీ భక్తితత్పరతకు ముచ్చటేసింది… స్వామి వారు మీ గృహానికి విచ్చేసి పావనం చేయటం మీ అదృష్టంగా భావిస్తున్నాను..మీరు వారికి ఇడ్లీలు పెట్టానన్న నిజాయితీ వాక్యాలు నవ్వు తెప్పించాయి😀😀
సంధ్య గారు సాహిత్య విషయాలు,సామాజిక విషయాలలోనే కాదు ఆధ్యాత్మిక విషయాలలో కూడా చాలా నిబద్దతతో వుంటారని అర్థమయ్యింది. కుర్తాళం స్వామీజీ గురించి,రమణ మహర్షి గురించి, దత్తాత్రేయుడు,సాయిబాబా గురించి, గురువు ఆవశ్యకత గురించి చాలా చక్కగా చెప్పారు. సద్గురు కటాక్షం సదా మీకు లభించాలని కోరుకుంటున్నాను..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™