అది ఇన్ఫోసిస్టమ్స్ కంపెనీ. అధునాతనమైన అతి పెద్ద భవంతిలో నాలుగో అంతస్తులో తమ పని స్థలానికి ఒక పక్కగా ఉన్న కేఫిటేరియాకి వచ్చారు తన్మయి, భార్గవి.
మధ్యాహ్నం మూడు గంటల వేళ. బయట ఎండ మండిపోతున్నా, లోపల ఏ.సీ చల్లదనం వల్ల ఏ విసుగూ లేకుండా పని చేసుకుంటారు అందరూ.
“కృష్ణ తత్వం… దాని గురించి మాట్లాడేంత పరిణతి నాకెక్కడుంది?” నవ్వుతూ తన టీ కప్పు తీసుకుని ఒక కుర్చీ లాగి కూచుంటూ భార్గవితో అంది తన్మయి.
“నీకు కాకపోతే ఇక్కడింకెవరికి తెలుస్తుంది? కృష్ణుడి మీద నీకున్న ఆసక్తి విషయంలో నీలో ఏదో తెలీని ప్రత్యేకత కనిపిస్తుంది నాకు” టీ వెండింగ్ మెషీన్ నుంచి తన కప్పు టీ తీసుకుని తన్మయి పక్కనే మరో కుర్చీలో కూచుంటూ అంది భార్గవి.
తన్మయి తల కొంచం పక్కగా వంచి టీ కప్పులోకి చూస్తూ ఉండిపోయింది. ఆమె పెదవులపై విరిసిన చిరునవ్వు మెరుస్తూ అలాగే నిలిచిపోవడాన్ని వింతగా చూసింది భార్గవి.
“అదిగో చూసావా. కృష్ణుడి పేరు వినగానే మళ్ళీ ఏదో లోకంలోకి వెళిపోయావు.”
తన్మయికా మాటలు వినబడ్డాయో లేదోగానీ, ఆమె కళ్ళు ఆ టీ కప్పులోనే ఆమెకో బ్రహ్మాండమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయ్.
చిక్కటి, పచ్చటి అడవి మధ్యనున్న అందమైన ప్రదేశం. పైనెక్కడో చెట్ల మధ్యలోంచి పడుతున్న సూర్యకిరణాలు ఆ స్థలాన్ని వెలిగించాలని చేసే ప్రయత్నంలో ఉండగానే… నవనాడుల్లోనూ ఒక్కసారిగా యమునా జలాలు ఊరి నృత్యం చేస్తున్నంత అనుభూతితో కూడిన జలదరింపుని కలగజేసే మురళీగానం చేస్తూ అక్కడికొచ్చాడు జగన్మోహనాకారుడు. ఆ పరిసరాలన్నిటా ఒక్కసారిగా, ఉలిక్కిపాటుతో కూడిన కాంతి. ప్రతి మొక్కలోనూ, ప్రతి పూవు లోనూ దృగ్గోచరమవుతున్న పరవశం అతిశయించి, కొంత సౌరభంగా విడిపోయి, మేఘంలా రూపాంతరం చెంది, ఆ మోహనాకారుడిని చుట్టుముట్టినట్టు… అన్ని కోట్ల జీవుల చూపులు ఆర్తితో తడిమేస్తున్నందువల్లనేమో, ఆ రూపం కొంత అస్పష్టంగా…
“తన్మయీ…”
భార్గవి కుదుపుకి తల విదిలించింది తన్మయి. తన మనసుని నిరంతరం మంచు పొగల్లో ముంచేసే ఆ ఊహా చిత్రం వాస్తవపు వేడికి లేత మబ్బులా విడిపోయింది. మెల్లమెల్లగా కరిగిపోయింది.
చల్లారిపోయిన టీ ఒక్క గుక్కలో తాగేసి లేచి భార్గవి వెనుక నడిచింది.
“నీకు మీ అమ్మా, నాన్నా ఇంత కరెక్ట్ పేరు ఎలా పెట్టారంటావ్…” కేఫిటేరియా లోంచి బయటికి నడుస్తూనే తన్మయి మొహంలోకి చూస్తూ అడిగింది భార్గవి.
తన్మయికి ఆ ప్రశ్న సుపరిచితం. స్కూల్లో చదివే రోజుల్నుంచీ తనను ఎంత మంది ఆ ప్రశ్న అడిగారో లెఖ్ఖే లేదు.
భార్గవి వైపు చూస్తూ చిన్నగా నవ్వేసి ఆమె దగ్గరగా జరిగి భుజం మీద చెయ్యేసి, ఆమెతో పాటే నడవడం ప్రారంభించింది. ఆ మాత్రం దగ్గరతనానికే వికసించింది భార్గవి ముఖం.
కొంతమంది మనకి ఎందుకు నచ్చుతారో తెలీదు. వాళ్ళ సమక్షంలో, మనకి తెలీకుండానే శక్తివంతమైన పోజిటివ్ ఎనర్జీ ఏదో మనలోకి ప్రవేశించడం వల్ల కావొచ్చు, వాళ్ళ సంగీతపు శృతీ, మనకే తెలీని మన అంతర్ప్రవాహపు శృతీ ఒక్కటే అవ్వడం వల్ల కూడా కావొచ్చు, మనం కొందరికి ఎటువంటి ప్రత్యక్ష ప్రేరణలూ లేకుండానే ఆకర్షింపబడతాం. పైకి చూస్తే అలవాట్లన్నీ వేరే, వీళ్ళిద్దరికీ ఎలా స్నేహం కుదిరిందబ్బా అనిపించొచ్చు.
తన్మయి ప్రోజక్ట్ టీం లోకి భార్గవి కొత్తగా వచ్చింది. వచ్చిన నెల రోజుల్లోనే తన్మయి ఆమెని విపరీతంగా ఆకర్షించింది. ప్రశాంతమైన వదనం, చెదరని చిరునవ్వు…
తన్మయి ఎక్కువగా ఎవరితోనూ కలవదు. అందువల్ల తమ టీంలో ఎవరితోనూ అంతగా ఆమెకు చనువు ఏర్పడలేదు. మిగతా అందరూ కలిసి టీ కి వెళ్ళడం, సాయంత్రాలప్పుడు కలిసి కాంటిన్కి వెళ్ళి చిరు తిళ్ళు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవడం రోజూ జరిగేవే. కానీ ఎందులోనూ తన్మయి కనపడదు. అందరూ కలిసివెళ్ళేటప్పుడు ఆమెని మాత్రం పిలవకపోతే బాగోదని పిలుస్తారు కానీ తన్మయి నిర్మొహమాటంగా రానని చెప్పేస్తుంది.
భార్గవి ఆ టీంలో అందరితోనూ త్వరగానే కలిసిపోయింది. కొత్త, పాత అని లేకుండా అందరితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడుతుంది. చాలా చురుగ్గా ఉంటుంది. పని విషయంలో శ్రధ్ధ, సమయాన్ని పాటించే గుణం వల్ల త్వరలోనే వాళ్ళ ప్రోజక్ట్ మేనేజర్‌కి కూడా ఇష్టమైన మెంబర్ అయింది.
ఇద్దరూ వచ్చి తమ కాబిన్లో తమ స్థలాల్లో కూర్చుని తిరిగి పని చెయ్యడం ప్రారంభించారు.
***
అది చెంగల్వ రాజ్యం.
అత్యద్భుతమైన అందంతో భాసిల్లే అంతఃపుర ఉద్యానవనం.
ఎన్నో రకాల పూల మొక్కలు, నీడనిచ్చే వృక్షాలు. ఆ పూల మీద, చెట్ల మీదా స్వేఛ్ఛగా ఎగురుతున్న రంగు రంగుల సీతాకోక చిలుకలు, రకరకాల పక్షులు, వాటి కువ కువలతో సందడిగా ఉంది.
ఉద్యానవనం మధ్యలో ఉన్న కొలను వద్ద పచ్చగడ్డిలో కూర్చుని, అరవిరిసిన కమలాల్ని ముచ్చటగా చూస్తోంది రాకుమారి చంద్రహాసిని. ఆమె చుట్టూ చెలికత్తెలు. అప్పుడే కోసి తెచ్చిన తెల్లని మల్లెల్ని మాలగా కడుతున్నారు.
“విరజా, ఏదైనా సాహసం చెయ్యాలనుందే” కలువల మీదనుంచి చూపు తిప్పకుండానే తియ్యటి గొంతుతో పలికింది రాకుమారి.
ఆ మాటవిన్న చెలికత్తెలందరూ వింతగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మరుక్షణం ఫక్కున నవ్వుతూ “ఇదేం వింత కోరికమ్మా” అన్నారు.
“ఇందులో వింతేముందే? ఒకే దినచర్య నాకు విసుగు కలిగిస్తోంది. మగపిల్లలు లేని నా తండ్రి మగవారితో సమానంగా అన్ని విద్యలూ నేర్పించారు. అవన్నీ ప్రదర్శించే దారి మాత్రం లేదు నాకు. ఎందుకో మనసు విసుగుచెందుతోంది. కలత పడుతోంది. జీవితం సాహసోపేతంగా ఉండాలని నా కోరిక. ఇలా అంతఃపుర చిలుకలా ఉండటానికా నేనా విద్యలన్నీ నేర్చుకున్నది?”
విరజ అభిమానంగా చంద్రహాసిని భుజం మీద చెయ్యి వేసింది.
“అదేవిటమ్మా. ఎటువంటి సమయంలో అయినా మీరు అబల కాదు అనే సత్యం జగమెరగాలనీ, అవసరమైతే మీరు రాజకుమారుడు లేని లోటు తీర్చేలా యుధ్ధాల్లో పాల్గొనాలనే కాక మీ స్వీయ రక్షణార్థం కూడా మీకీ విద్యలన్నీ నేర్పించారు. తెలిసిందే కదా. అందుకని మీరు ఇప్పుడు అవసరం లేని సాహసాలు చేసి అవన్నీ ప్రదర్శించాలా ఏమిటి. యుధ్ధాలు వచ్చినప్పుడు మీ తండ్రిగారికి కుడిభుజంగా ఉండండి . అది చాలదూ.”
“లేదే. ఈ జీవితం ఇలా విసుగ్గా ఉంది. రాజధాని శివార్లలో ఉన్న అడవి చాలా అందమైనది అని విన్నాను. ఎప్పుడూ అటు వెళ్ళే అవకాశం రాలేదు. అద్భుతమైన జలాశయాలూ, వింత పరిమళాల పువ్వులూ ఇలా చాలా విన్నాను. అక్కడికి ప్రయాణమై వెళదామా. రెండురోజులైనా అక్కడ బస చేసి ఆ అందాలన్నీ చూసి వద్దామా? ” విరజ వైపు తిరిగుతూ ఉత్సాహంగా అంది రాకుమారి.
వెంటనే మరో చెలికత్తె జయంతి గుండెల మీద చెయ్యి వేసుకుంటూ ఆందోళనగా చూసింది.
(సశేషం)
Prasuna garu … Nice story
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™