ఒక చిత్రానికి మొట్ట మొదట కావాలసింది ప్రేక్షకులను సాంతం చూసేలా చెయ్యగలగడం. ఇక అలా ఆకట్టుకోగలిగితే ముఖ్యమైన పరీక్ష పాసయినట్టే. ఎందుకంటే ఆ తర్వాతే కథా, తీసిన తీరూ మిగతావన్నీ చర్చలోకి వస్తాయి. ఎంత గొప్ప కథ అయినా సగంలో వదిలేసి ప్రేక్షకుడు వెళ్ళిపోయినా, లేదా థియేటర్లో వుంటే చేతిలోకి మొబైల్ తీసుకున్నా పరీక్ష తప్పినట్టే. ఇది సస్పెన్స్ చిత్రాలకైతే మరీ ముఖ్యం. ఈ వారం నేను చూసిన (చాలా చెత్త చిత్రాలు చూసాక చూసానిది) “ద సలోన్” ఆ పరీక్ష పాసైంది. రోడ్డు మీద ఒకతను వెళ్తున్నాడు. పొడగరి. నీలం చొక్కా, నల్ల పేంట్, పెరిగిన గడ్డం, భుజాల దాకా పెరిగిన వెంట్రుకలు. ఒక సలూన్ షట్టర్ సగం తీసి వుంది. దగ్గరికెళ్ళి వంగి చూస్తాడు. లోపల ఓ మనిషి ఏదో బస్తాని అవతలి రూం లోకి ఈడ్చుకెళ్తుంటాడు. ఇతను లోపలికెళ్తాడు. హెలో, హెలో అని కేకేస్తాడు. కాసేపటి తర్వాత వెనుక వైపు తలుపు తీసుకుని వస్తాడు ఆ మనిషి. టీ షర్ట్, నల్ల పేంటు, తల గుండు. రావడమే కోపంగా ఎవరయ్యా నువ్వూ దూసుకొస్తున్నావు, షట్టర్ బంద్ అని చూసి కూడా వచ్చావే అని కోప్పడతాడు. తనకు అర్జంటుగా గడ్డం గీయమంటాడు, రెట్టింపు డబ్బిస్తానంటాడు. ఈ రోజు సోమవారం, నేను రేజర్ ముట్టను అంటాడు. చివరికి 150/- ఇస్తానంటే, 200/- అయితే చేస్తానంటాడు. కస్టమర్ కూర్చుంటాడు. మగలి ముందు ఫోం, తర్వాత నీళ్ళ స్ప్రే, తర్వాత రేజర్ ఇలా వొక్కొక్కటీ వెతికి తీస్తుంటాడు. కస్టమర్ తన ముందు వున్న టూ ఇన్ వన్ ఆన్ చేయబోతే మంగలి కసురుకుంటాడు రువాబుగా. మళ్ళీ దేనికో అవతలి గదిలోకెళ్తే, కస్టమర్ రేడియో ఆన్ చేస్తాడు. ఏదో ఆడియో కథ వస్తున్నది. ఇద్దరు అక్క చెల్లెళ్ళ గురించి. (టీవీ రోజుల్లో రేడియోనా అని అడగకండి, కథకు అవసరం.) మంగలి మళ్ళీ కసురుకుంటాడు. నెమ్మదిగా గడ్డం గీయడం మొదలు పెడతాడు.
కస్టమర్ మాటిమాటికీ తల కదుపుతుంటే కోప్పడతాడు కూడా. కథ మధ్యలో విశేష వార్తలొస్తాయి. ఒక హంతకుడు జైలు నుంచి తప్పించుకున్నాడనీ, పొడగరి, నీలం చొక్కా, నలుపు రంగు పేంటు, పొడవైన జుత్తు; ఇలాంటి మనిషి కనిపిస్తే పోలీసుకు ఫోన్ చెయమనీ, అప్రమత్తంగా వుండమనీ సమాచారం. మంగలి కస్టమర్ని అనుమానంగా చూస్తాడు. మీరుండేదెక్కడ అని అడుగుతాడు మంగలి. ఇక్కడే నంటాడు. మరైతే ఈ ప్రాంతం లో సోమవారం సలూన్లకి శలవు అని మీకు తెలిసుండాలే, అదీగాక మీ ఇంట్లో షేవింగ్ సెట్ లేదా, అర్జంటైనా ఇక్కడిదాకా వచ్చారు అని అడుగుతాడు. బ్లేడులైపోయినై అంటాడు. నువ్వు ఇక్కడి మంగలివేనా? మరి ఒక్కొక్క వస్తువుకోసం వెతుక్కుంటున్నావేంటి? అని అనుమానంగా అడుగుతాడు కస్టమర్. ఆ మంగలి క్రితం రాత్రే పనిలో జేరాడనీ, తనకు సలూన్ శుభ్రం చేయమని చెప్పి వోనర్ తన భార్యతో షికారు కెళ్ళడని చెబుతాడు. నమ్మకంగా ఎలా వదిలివెళ్ళడని అడిగితే మాదొకటే వూరంటాడు. రేడియో కథలో బ్రేక్, మళ్ళీ సమాచారం : తన యజమాని, అతని భార్యనూ చంపి జైలు కెళ్ళినతను జైలు నుంచి పారిపోయి అదే ప్రాంతంలో తిరుగుతున్నాడని వస్తుంది. గడ్డం గీస్తూ వుంటే బ్లేడ్ తగిలి చెంప తెగుతుంది. గాయం మీద రాయడానికి పటిక అడుగుతాడు. దాన్ని వెతుకుతుంటాడు మంగలి. లాభం లేదని తన కళ్ళద్దాల కోసం తగిలించిన నీలం రంగు చొక్కా జేబులోంచి కళ్ళద్దాలు తీసి పెట్టుకుంటాడు. ఈ లోగా పోలీసు సైరన్ వినిపిస్తుంది బయటి నుంచి. తర్వాత ఏమవుతుందో మీరు యూట్యూబ్ లో చూడండి. 22 నిముషాల చిత్రం. మొదటి పరీక్షలో నెగ్గిన ఈ చిత్రం చివరిలో కూడా అవును కదా అనిపించేలా చేస్తుంది. దర్శకత్వం, నటనా, చాయా గ్రహణం (అర్చిత్ జైన్, వినయ్ వర్మ), నేపథ్య సంగీతం (జాయ్ రాహా) అన్నీ బాగున్నాయి. ఇంతకంటే ఎక్కువ చర్చించడానికి సస్పెన్స్ అడ్డు వస్తుంది. దర్శకుడు బీరేన్. కథ అతనూ, ఓంకార్ కలిసి వ్రాసారు. ఇద్దరు నటులు బీరేన్, కె కె గౌతం. ఒకే గదిలో షూట్. సంభాషణలు ఎక్కువ. అయితే కథ డీటైలింగ్ కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇలాంటిదే వొక చిత్రం హిందీలో వచ్చింది. రాజేష్ ఖన్నా, నందా లు నటించినది. “ఇత్తెఫాక్” దాని పేరు. అది ఒక గది కాదు గాని ఒక పెద్ద బంగళాలో షూట్ చేసారు. కథ మొదలు ఇలాంటిదే. కాని మూల స్వభావం వేరు. చూడమనే నా రెకమెండేషన్. యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=493mFwQia6s
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™