చెజియన్ (Chezian ని ఇలాగే పలుకుతారా, నా అనుమానం) తనే స్క్రిప్టు వ్రాసుకుని, షూట్ చేసి, (మొదటిసారిగా) దర్శకత్వం కూడా చేసిన చిత్రం “టు లెట్”. 2017 లో వచ్చిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో నాకు సంపూర్తిగా సంతృప్తినిచ్చిన చిత్రం. చివరిదాకా ఆ చాయాగ్రహణాన్ని, షాట్ కంపోజిషన్లనే అచ్చెరువోతూ చూస్తున్న నేను, ఇతను మొదట పి సి శ్రీరాం దగ్గర అసిస్టెంటుగా చేసి, చాలా తమిళ చిత్రాలలో చాయాగ్రాహకుడుగా చేసి అవార్డులు కూడా పొందిన మనిషి అని తెలిసుకున్నాక గాని ఆ ఆశ్చర్యం పోలేదు. పాత జపనీయ మాస్టర్లు ఒజు లాంటి వాళ్ళు గుర్తుకొచ్చారు.
మన దేశంలో ఈ శతాబ్ది మొదటి దశకంలో IT BOOM వల్ల ఉద్యోగాలు, మంచి జీతాలు కొందరి జీవితాలను వెలిగిస్తే, మరో పార్శ్వంలో ఇళ్ళ ఖరీదులు, అద్దెలు పెరిగి ఇతర దిగువ మధ్య తరగతి జీవులమీద యెలాంటి ప్రభావం చూపించిందో బొమ్మ కడుతుంది ఈ చిత్రం.
ఇలాంగో (సంతోష్ శ్రీరాం) చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తుంటాడు. భార్య అముద (సుశీల), కిండర్గార్టెన్ చదువుతున్న కొడుకు సిద్ధార్థ్ (ధరుణ్). చిన్న ఇంట్లో సంసారం. ఇప్పుడు దేశంలో ఆర్థిక వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అద్దెలు పెరిగి, ఇల్లు గలవాళ్ళను కూడా అత్యాశపరులను చేసింది. ఇలాంగో ఇంటి వోనరు అలాంటి మనిషి. వొక నెలలో ఇల్లు ఖాళీ చెయ్యమని ఆదేశిస్తుంది, తర్వాత యెక్కువ అద్దెకు ఆ ఇంటిని ఇచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇక అకస్మాత్తుగా వీళ్ళ గుండెల్లో రైళ్ళు పరుగెడుతాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇల్లు యెలా సంపాదించడం? యెక్కే గుమ్మం, దిగే గుమ్మం. అద్దె వాళ్ళ అందుబాటులో వుండదు. దానికి యెలాగోలా మానసికంగా సంసిధ్ధమైతే ఐటి ఉద్యోగస్తులకే గాని ఇలా నిలకడ లేని సినెమా రంగంలో పనిచేసే వాళ్ళకి ఇవ్వమంటారు. ఇంకొందరు మాంసాహారులని చెప్పి ఇవ్వమంటారు. మరో స్నేహితుని సలహా మీద తను ఐటి లో చేస్తున్నట్టు దొంగ విజిటింగ్ కార్డు చేయించి దాన్ని చూపించి ఇల్లు అద్దెకు అడగడం మొదలు పెడతాడు. చివరిలో వో ఇల్లు ఖాయం కూడా అవుతుంది, కాని ఆ వోనరు ఇంక్వైరీలు చేసి అతను నిజంగా ఆ ఉద్యోగంలో లేడని చెప్పి ఇల్లు ఇవ్వము అనేస్తాడు. ఇక విసిగి, ఈ నగరమే వద్దు పల్లెకు వెళ్ళిపోదామంటాడు ఇలాంగో.
ఆ దశకంలో మన నగరాల్లో ఆ జీవితాన్ని చూసిన వాళ్ళకు ఇది అత్యంత సహజమైన కథలా తెలుస్తుంది. చక్కగా ఆ మూల కథ కు సరిపోయే విధంగా సన్నివేశాలు పేర్చుకుంటూ అన్ని కోణాల నుంచీ కథను పరిశీలిస్తూ కథ చెబుతాడు దర్శకుడు. ఆ భార్యా భర్తల ముఖాలపై కోపం, అసహానం, నిస్సహాయతా, దుఃఖం, నిరాశ, కాంప్లెక్సు అన్నీ కనిపిస్తాయి. కొంచెం అతి అనుకునే ప్రమాదం వుంది, కాని వాళ్ళ స్థితిగతులు, అప్పటి పరిస్థితులు చూస్తే మళ్ళీ కాదనిపిస్తుంది. ఆ వోనరు కూడా చాలా తక్కువ సన్నివేశాలలో కనిపించి ఆమె సృష్టించిన విపత్కర పరిస్థితుల ద్వారనే, ఆమె దర్శనమిస్తుంది. ఆమె చేత అతి గా చేయించక పోవడం గొప్ప సమ్యమనమే.
జాతీయ ఉత్తమ తమిళ చిత్రం అవార్డును పొందిన ఈ చిత్రంలో చెజియన్ పాత్ర యెంత ముఖ్యమో కొత్తగా వచ్చిన ఆ నటీనటులు -ఆ బాలుడితో సహా- చాలా బాగా చేసి అంతే ముఖ్యమైన పాత్రను పోషించారు. నాకు తమిళం రాకపోయినా ఆ పాత్రధారుల ఉచ్చారణ, టోనల్ కంట్రోల్ వగైరాలు ఆ భావాలను బాగా పట్టి ఇచ్చాయి. కచ్చితంగా తమిళం వచ్చిన వారు నాకంటే యెక్కువ ఆస్వాదించగలరు ఈ చిత్రాన్ని. పాటలు లేవు. ఇన్సిడెంటల్ సౌండ్స్ తప్ప వేరే సంగీతమూ లేదు. అసలు ఆ విషయం మనకు స్ఫురించదు కూడా, అంతగా లీనమైపోతాము చిత్రంలో.
ఆ ఇంట్లో వో పిచ్చుక ప్రవేశిస్తుంది. వో మూల గూడు కట్టుకుంటుంది. వో సన్నివేశంలో ఇలాంగో పంకా కింద కుర్చీలో కూర్చొని వుంటాడు. మనసులో దిగులు కమ్ముకుని వుంది. ఇంతలో పంకా రెక్కకు యేదో తగిలినట్టు వొక రకమైన శబ్దం. గబుక్కున లేచి పంకా స్విచ్ తీసేస్తాడు. నెమ్మదిగా పైనుంచి రాలుతున్న పక్షి ఈకలు. షాట్ లో మాత్రం కేవలం ఇలాంగో నే వుంటాడు. యెంత నేర్పుగా అల్లాడో ఈ షాట్లను, సన్నివేశాన్నీ. అలాగే కొన్ని సార్లైతే భార్యా భర్తలను చూపించకుండానే వాళ్ళు అవతల ఉండి మాట్లాడుకుంటున్న మాటలతో కేవలం గోడను షూట్ చేస్తూ చూపిస్తాడు. మరో చోట గుమ్మానికివతల పడుకున్న బాబు వెనక నుంచి గుమ్మానికి అవతల కూర్చున్న ఇలాంగో వొళ్ళో తల పెట్టుకుని భవిష్యత్ గురించిన కలలను ఆమె చెబుతూ వుంటే చిత్రీకరిస్తాడు. ఇలా యెన్నని చెప్తాను గాని, ప్రతీదీ మనసులో అలా ముద్ర పడిపోతుంది.
ఇదంతా వొక పార్శ్వం ఆ కాలంలో ఇక్కడున్న వాళ్ళు చూసిన మరో పార్శ్వం గురించి (ఈ సినెమా కు అవతల) కూడా చెప్పుకోవాలి. ఆ బూం పడిపోగానే, చాలా మంది ఐటి ఉద్యోగులు ఉద్యోగాలు వూడిపోయి, ఖరీదైన ఫ్లాట్లు కొన్న వాటికి నెలసరి వాయిదాలు కట్టుకోలేక, చివరికి అవి వేలం అయి, రోడ్డున పడ్డ జీవితాలు కూడా వున్నాయి. యేదైనా ఈ సినెమా వరకు మనకు కనిపించేది ఐటి కాని వేరే unorganised sector లో వున్న దిగువ మధ్య తరగతి నగరంలో అద్దె ఇంటికోసం పడ్డ కష్టాలు.
బాలచందర్ అటు తమిళంలో ఇటు తెలుగులోనూ గొప్ప సినెమాలు అందించాడు. ఈ చెజియన్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడొక కన్ను వేస్తే మనకి కొన్ని మంచి చిత్రాలు చూసే అవకాశం వస్తుంది కదా అని నా లాంటి వాళ్ళ ఆశ. పోయినవారం ఆ తమిళులు మన నాని ని యెత్తుకుపోనూ అని హాస్యమాడాను. అలా కాకపోయినా మనవాళ్ళైనా ఆ చెజియన్ లాంటి వాళ్ళని యెత్తుకొస్తే మంచిది కదా. యెటు తిరిగి మనకు కావాల్సింది మంచి తెలుగు చిత్రాలు.
ఇది అమేజాన్ ప్రైం లో వుంది. నేను చూడమనే చెప్తాను.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Thanks for introducing a good movie and director’s name is చెళియన్
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™