బాలలు.. బ్రిటీష్ పాలకుల దురాగతాలు మితిమీరి పోయాయి. వ్యాపారం కోసం వచ్చి, అధికారాన్ని చేజిక్కించుకుని పలురకాల సుంకాలు(పన్నులు) విధించసాగారు. అలా గుంటూరు జిల్లా లోని పెదనందిపాడులో కూడా ‘ప్యూనిటీవ్’ టాక్స్ విధించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ అధ్వర్యంలో అక్కడి ప్రజలు పన్నులు నిరాకరణోద్యమము చేసి, ప్రభుత్వఉద్యోగులకు నిత్యవసర సరుకులు అందకుండా కట్టడి చేసారు.
అదే సమయంలో పల్నాటి ప్రాంతంలో పశువులు అడవిలో మేపుకుంటున్నందుకు రెండు రూపాయలు ‘పుల్లరి’ పన్ను వింధించారు. తిరస్కరించిన ప్రజలతో కలసి కన్నెగంటి హనుమంతు అధ్వర్యంలో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.
***
బాలలు ఇక్కడమన దేశాన్ని పరాయిపాలకులు ఎలా వశపరుచుకున్నారో తెలుసుకోవడానికి ‘వందేమాతరం’ కధలో తెలుసుకొండి! అన్న తాత ఇలా చెప్పసాగాడు…..
మూడు పక్కలా కొండలు, మరోపక్క దట్టమైన అడవి కలిగిన ఊరు ‘పాలెం’. ఇరవై రెండు పూరి ఇళ్లు మాత్రమే ఉన్నాయి. వర్షాధారంపై ఆధారపడిన వ్యవసాయం. పశువులు, గొర్రెలు, మేకలు పెంపకమే వారి జీవనాధారం.
పన్ను కట్టడానికి నిరాకరించిన వారికి నాయకత్వం వహించే ‘శివయ్య’ పాలెం నివాసి. అతను తన భార్య సుగుణ, పదహారేళ్ల కుమార్తె సామ్రాజ్యం, పద్దెనిమిదేళ్ల కుమారుడు బోస్‌లతో కలసి నివశిస్తున్నాడు. బాల్యం నుండి సమయం ఉన్నప్పుడు తన పిల్లలకు ఆంగ్లేయుల దురాగతాలను, దేశభక్తి పూరిత వీరగాథలు వినిపించేవాడు శివయ్య.
బ్రిటీష్ వాళ్లు దాడి చేసి శివయ్యను బంధీచేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు. చుట్టుపక్కల గ్రామాలలో యువకులను, పోరాట పటిమ కలిగినవారికి రహస్య స్ధావరాలు ఏర్పాటు చేసి వాళ్ళకు బ్రిటీష్ సైనికులపై ఎలా దాడి చేయాలి, తప్పించుకుని అడవిలో ఎలా వెళ్ళాలి వంటి విషయాలు బోధిస్తూ, విలు విధ్య నేర్పసాగాడు. అడవిలోని పలుప్రాంతాలలో తాము తయారు చేసుకున్న వేలాది బాణాలు, అంబులు రహస్య ప్రదేశాలలో భద్రపరచబడ్డాయి. ఏ గ్రామంపై దాడి జరిగినా క్షణాలలో పిట్టకూతల శబ్ధాలతో అన్ని గ్రామాలకు తెలిసేలా ఏర్పాట్లు జరిగాయి. ఒక గ్రామంనుండి మరో గ్రామానికి పావురాయి టపా(పోస్టు) ఏర్పాటు చేసుకున్నారు. దాడి సమయంలో అడవిలో చిక్కుకున్నవారికి గాయపడిన వారికి మూలికా వైద్యం, ఎండుద్రాక్షా, బాదం, జీడిపప్పు, తేనె వంటి పలు రకాల ఆహారపదార్థాలు పలుప్రాంతాలలో ఆయుధాలతోపాటు భద్రపరచబడ్డాయి. వాటి ఉనికి పోరాట యోధులందరికి రహస్య సంకేతాల ద్వారా తెలియజేయబడింది. అడవి మార్గం అంతటా శివయ్య శిక్షణ పొందిన వేగులను నియమించాడు. సూర్యోదయానికి ముందే అడవికి చేరి పలుప్రాంతాలలో వంతుల వారిగా పోడవైన చెట్ల గుబురుల్లో చేరిన పోరాటయోధులు డేగ కళ్ళతో అడవిని అంతా గమనిస్తుంటారు. ఏ మాత్రం అనుమానం కలిగినా తమవద్దనున్న చిన్నగుడ్డముక్కపై వివరిస్తూ ప్రతేక రసాయనంతో రాసి, తమ వద్ద ఉన్న పావురాయి కాలికి కట్టి వదులుతారు అది నేరుగా శివయ్య ఇంటికి చేరుతుంది. ఆ పావురాయి శత్రువుల చేతచిక్కినా, దాని కాలికి కట్టిన గుడ్డ ముక్కపై రాతలు ఇతరులకు కనిపించవు. చూపరులకు తెల్లని వస్త్రం ముక్కలా కనిపిస్తూంది. ఆ గుడ్డముక్కకు వేడి(సెగ) తగిలేలా చేస్తేనే ఆ రాతలు కనిపిస్తాయి.
అడవిలో శివరాత్రి పండుగకు ఆ చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రభలు ఊరేగింపుతో అడ్డదారులలో పాలెం చేరుకుని కొండపైన ఉన్న శివాలయంలో తమ మొక్కులు చెల్లించి వెళతారు.
అక్కడ ఉండే పూజారికి సంవత్సరం పొడవున శివునికి దీపారాజన చేయడానికి కొండపైనే ఉంటాడు. పూజారికి కావలసిన దినసరి సరుకులు, దేవునికి దీపారాజనకు కావలసిన సామాగ్రి అందజేస్తారు. ప్రతి సంవత్సరం తిరునాళ్లలో జరిగే అన్నదానానికి వేయి మందికి పైగా పాల్గోంటారు. ఆ సంవత్సరం అన్నదానానికి కావలసిన సరుకులు అన్ని కొండపైకి చేరవేసారు.
శివయ్యను పట్టి ఇవ్వడానికి చాలా రోజుల ఎదురు చూస్తున్న పాలెం చేరువలోని ‘బొప్పిడి’ గ్రామ కరణం, వంద వెండి రూపాయలకు ఆశపడి శివయ్య మరో రెండురోజుల్లో జరిగే శివరాత్రి వేడుకలలో పాల్గోనే వార్త బ్రిటీష్ వారికి చేరవేసాడు.
జిల్లా కలెక్టర్ ఆదేశంతో బయలు దేరిన సబ్ ఇన్స్పెక్టర్ కొందరు సిపాయిలు, ఆహారపదార్థాలు, మందు గుండు సామాగ్రి నింపుకున్నఎడ్లబండ్లతో బొప్పిడి కరణం దారి చూపగా పాలెం బయలుదేరాడు.
ఎప్పటిలా కోలాహలంగా ప్రభలు అందంగా అలంకరించుకుని, పాలెం రావడానికి నర్సరావు పేట, మేరిగపూడి, అవిశాయపాలెం, అప్పాపురం, కావూరు, పురుషోత్తపట్నం, మద్దిరాల, ఎడవల్లి, గ్రామాల భక్తులు ప్రభలతో వచ్చారు. ఇంకా పరిసర గ్రామాల ప్రజలు శివరాత్రి పండుగ తిరునాళ్ల చాలా కోలాహలంగా జరుపుకుంటున్నారు. చాలామంది ప్రజలు కొండపై దేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించి, చాలామంది భక్తులు అక్కడే ఉండిపోయారు. నిడు పున్నమి వెన్నెల వెలుగుకు తోడు పెట్రోమాక్స్ లైట్లు, కాగడాల వెలుతురులో ప్రభలపై నృత్య ప్రదర్శనలను ప్రజలు ఆసక్తితో చూస్తూ ఆనందించసాగారు.
తెల్లవారు వారుతున్న సమయంలో బ్రిటీష్ సిపాయిలు దొంగదారిన కావలి వారికి తెలియకుండా పాలెం చేరుకుని అక్కడ ఉన్న వందలమందిలో శివయ్యను గుర్తించలేక కోపంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా, అక్కడి ప్రజలపై కాల్పులు ప్రారంభించారు.
విషయం అర్థమైన ప్రజలు కొండపైకి, అడవిలోనికి పరుగులు తీసారు. అప్పటికి సిపాయిలు రెండు రౌండ్ కాల్పులు జరిపారు. కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. కొందరు బందీలుగా పట్టుపడ్డారు. బందీలలో శివయ్య కుమార్తె స్వరాజ్యం, కుమారుడు బోస్‌తో మరికొందరు ఉన్నారు.
కొండపైకి పారిపోయిన వారిని కొందరు సిపాయిలు తరమసాగారు. కొండఎక్కిన వారు సిపాయిలపై పెద్దరాళ్లు దొర్లించగా పలువురు సిపాయిలు మరణించారు, మరికొందరు గాయపడ్డారు.
కొండపైకి వెళ్లిన వారిని వెంబడించే పని ఆపు చేయించాడు సబ్ ఇన్స్పెక్టర్. తన పిల్లలు, మరో గ్రామస్తుడు బందీ అయ్యారన్న విషయం తెలుసుకున్న శివయ్య తుపాకి చేతబట్టి బయలుదేరాడు.
ఆవేశపడవద్దని ఎలాగైనా బందీలను విడిపిద్దాం అని గ్రామ పెద్దలు శివయ్యకు నచ్చచెప్పారు. ఇన్స్పెక్టర్ ఊరిమధ్య బావి వద్ద ఉన్న ఒక ఇంట్లో తన మందుగుండు సామాగ్రి, ఆహార పదార్థాలు చేరవేసి, పాలెంలో ఉన్నమిగిలిన ఇళ్లలోని విలువైన వస్తువులు, ఆహారపదార్థాలు తను ఉండే యింటికి చేర్పించి, మిగిలిన ఇళ్లను తను దగ్గర ఉండి తగులబెట్టించాడు.
బందీలను,గాయపడిన వారిని ఒక గదిలో బంధించారు. కొండలకు తూటాలు పెట్టి పగులకొట్టే చంద్రయ్య ఇల్లు అది. ఆ యింటి తలుపు వెనుక భాగాన సంచిలో తూటాలు ఉంటాయని బోస్‌కు తెలుసు.
“అక్కా నువ్వు ఎలాగైనా కొంత సమయం ఇంటి వెలుపల ఉండు. నేను వీళ్లకు సరైన గుణపాఠం నేర్పుతాను” అన్నాడు రహస్యంగా బోస్.
సరే అని తల ఊపిన స్వరాజ్యం, కొంతసేపటికి ‘అయ్యా’ అని పిలిచి రెండు వేళ్ళు చూపించింది. తీసుకువెళ్లమనట్లు సైగచేసాడు సిపాయికి సబ్ ఇన్స్పెక్టర్.
గదిలోనుండి వెలుపలకు వచ్చిన స్వరాజ్యం దగ్గరగా ఉన్న చింతల తోపు లోనికి వెళ్లింది, ఆమెకు తుపాకి గురిపెట్టి అనుసరిస్తున్న సైనికుడు ఆమెకు కొంతదూరంలో ఉండిపోయాడు. పెద్ద చింతచెట్టు చాటుకు వెళ్లింది స్వరాజ్యం. కొన్నిక్షణాల అనంతరం నెమ్మదిగా చింతచెట్టు చేరువగా వెళ్లిన సిపాయి తుపాకి చింతచెట్టు మోదలుకు ఆనించి నడుముకు ఉన్న తోలు బెల్టు ఊడదీసి అక్కడ పడవేస్తూ చింతచెట్టు చాటుకు తొంగి చూసాడు. అతని ఉద్దేశం ఊహించిన సామ్రాజ్యం మెరుపువేగంతో సిపాయిని కింద పడదోసి, చెట్టుకి ఆనించి ఉన్న తుపాకి చేతిలోనికి తీసుకున్న దాన్ని ఎలా వినియోగించాలో తెలియక తుపాకికి ఉన్న బానెట్ (కత్తి)ని సిపాయి గుండెల్లో బలంగా దించింది. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది. కింద పడిన సిపాయి సామ్రాజ్యం కాలు పట్టుకు లాగడంతో ఆమె నేలపై పడి పల్లంగా ఉన్న ప్రాంతంలోనికి దొల్లుతూ అక్కడ ఉన్నఊబి (బురదగుంట)లో దిగబడింది. క్షణ క్షణానికి ఊబిలో నెమ్మదిగా కూరుకుపోతూ, స్వరాజ్యం ‘వందేమాతరం’ అని పెట్టిన కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఆ ఊబిలో ఆమె ఎత్తిపెట్టిన తుపాకి చేయి మాత్రమే వెలుపలకు కనిపిస్తుంది.
(సశేషం)
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™