“శేషయ్య గారూ, మా జ్యోతిశ్శాస్త్ర కళాశాలలో కొత్తగా కోర్సులు చేయటానికి వచ్చిన విద్యార్థులకు స్వాగత సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఈ జ్యోతిశ్శాస్త్రం ఒక సైన్సు అని మీరు బాగా నమ్ముతారు కనుక, ఈసారి చేరుతున్న కొత్త విద్యార్ధులకు మీరు వచ్చి కొంచెం మంచి మాటలు చెబితే బాగుంటుంది.”
జ్యోతిశ్శాస్త్రంలో అనేక టైటిల్స్ సాధించి, తన ఆధ్యాత్మిక ప్రసంగాలతోనూ, జ్యోతిశ్శాస్త్ర జ్ఞానంతోనూ తెలుగు రాష్ట్రాలలో వేలాది మందిచేత ‘గురువుగారు ‘ అని పిలిపించుకునే యోగ్యత సాధించిన 60 ఏళ్ళ పరబ్రహ్మం చరవాణిలో శేషయ్యకి చేసిన అభ్యర్థన అది. శేషయ్య ఆ కార్యక్రమం వివరాలు అడుగుతుంటే, ఫోను ఆగిపోయింది. మళ్ళీ శేషయ్య ప్రయత్నించారు. కానీ, కాల్ కలవటం లేదు.
“రేపు నేను రామకృష్ణ మఠానికి వెళ్ళేటప్పుడు వచ్చి కలుస్తాను” అని పరబ్రహ్మానికి ఒక సందేశం పంపించారు శేషయ్య.
ఆ మర్నాడు సాయంత్రం శేషయ్య వెళ్ళేసరికి, పరబ్రహ్మం ఇంటి దగ్గర ఓ పాతిక ముప్ఫై మంది ఆడా మగా కూర్చొని ఉన్నారు. ‘ఎవరి సమస్యలు వాళ్ళకి ఉన్నట్లున్నాయి’ అనుకున్నారు శేషయ్య.
“రండి రండి, కూర్చోండి. ఒక్క పదినిమిషాలు పడుతుంది. ఫరవాలేదా?” అని అడిగారు ‘గురువుగారు’ పరబ్రహ్మం ఎవరివో జాతకాలు చూస్తూ. శేషయ్యకి మంచి ఆసనం వేశారు.
పరబ్రహ్మం పడక కుర్చీలో కూర్చొని జాతకాల గురించి చెబుతూ, మధ్య మధ్యలో తన అభిమానులకి జ్యోతిష్యాన్ని సమర్థించే శ్లోకాల్ని శాస్త్రాల్లోంచి ఉటంకిస్తున్నారు.
గురువుగారికి కర్పూర తాంబూలం అలవాటున్నదని తెలిసిపోతోంది. ఘుమ ఘుమ వస్తోంది.
పక్కనే ఒక పాన్ దాన్ ఉంది. మధ్య మధ్యలో అందులో ‘తుపుకు తుపుకు’ ఉమ్మేస్తున్నారు.
దేవాలయ గంట లాంటి కంఠంతో ఆయన మాట్లాడుతుంటే కర్పూర తాంబూలపు తుంపరలు చిందుతున్నాయి. అభిమానులు, శిష్యులు అవి తమ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
నాలుగు జిల్లాల అవతలనుంచి వచ్చిన ఒక ప్రౌఢ, 10-12 ఏళ్ళ అమ్మాయి (ఆమె కూతురు కావచ్చు) గురువుగారి పాదాల దగ్గర కూర్చొని, ఆయన కాలి వ్రేళ్ళకి చెరో వైపునుంచి మర్దన చేస్తున్నారు.
పంచె, భుజం మీద కండువాతో పరబ్రహ్మం తన వృత్తిలో మునిగిపోయారు. పరబ్రహ్మంతో చాలాకాలంగా పరిచయం ఉన్నా, ఎప్పుడూ రామకృష్ణ మఠంలో కలుసుకోవటమే తప్ప, ఆయన కుటీరానికి వెళ్ళటం శేషయ్యకి అదే మొదటిసారి.
సమయం గడుస్తోంది. 10…15…30 నిమిషాలు గడిచింది. శేషయ్యగారికి కొబ్బరినీళ్ళు ఇవ్వటం, ఆయన తాగటం కూడా అయిపోయింది.
ఇంతలో, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక శిష్యుడు గురువుగారిని వేరొక జ్యోతిష్యపండితులు చెప్పినదాని గురించి అడిగాడు. గురువుగారికి ఆగ్రహం వచ్చేసింది.
“… అడ్డమైన గాడిదకొడుకు జ్యోతిష్యం చెప్పేవాడే. అది పట్టుకొని నన్ను సందేహం అడుగుతార్రా?… మొన్నా మధ్య ఇలాగే, ఒక ‘డిఎంకె’ ఏదో టివి లో ఏదో చెప్పాడని, దాన్ని పట్టుకొని ఇంకో టివి గాడిద వచ్చి నన్ను అడిగాడు… ” ఇలా పరబ్రహ్మం దుర్భాషల ప్రవాహం ఆగటం లేదు.
ఆయన దగ్గరికి పనిమీద వచ్చిన భక్తులు మాత్రం “ఓ, అలాగా!” అంటున్నారు గురువుగారి జ్ఞానం పట్ల తమ సంభ్రమాన్ని వ్యక్తం చేస్తూ.
శేషయ్యకి తాను అక్కడ ఉండాలో వెళ్ళాలో అర్థం కావటం లేదు.
పైగా జాతకాల పనిమీద ఇంకా జనం వస్తున్నారు. వాళ్ళంతా పరబ్రహ్మాన్ని ఎంతో భక్తిభావంతో చూస్తున్నారు. అంతలో మరో పెద్దావిడ (భక్తురాలు కావచ్చు) వచ్చి, గురువుగారి పాదాల దగ్గర పాపని లేపి, తాను కూర్చొని, పాదాలొత్తే శుశ్రూష మొదలుపెట్టింది.
శేషయ్య లేచారు.
పరబ్రహ్మం వెంటనే తన ప్రవాహాన్ని, తుపుకు తుపుకుల్ని ఆపి, శేషయ్యని లోపలికి తీసుకెళ్ళి, కార్యక్రమం వివరాలు చెప్పారు.
“క్షమించండి. ఏదో మాటల్లో పడిపోయాను. ఈసారి చాలా పెద్ద సంఖ్యలో కొత్త విద్యార్ధులు వచ్చారు. మీరు మంచి మాటలు చెబితే, వాళ్ళు జ్యోతిష్యం మీద గౌరవంతో ఈ విద్య నేర్చుకోవాలి. ఈ శాస్త్రంలో అన్ని డిగ్రీలు నేర్చుకొనేలా చేయాలన్న మాట..”
“మీ తపన నాకు అర్థమయింది. ప్రయత్నం చేస్తాను.” శేషయ్య శలవు తీసుకున్నారు.
ఆ ఆదివారం సాయంత్రం పరబ్రహ్మం గారి జ్యోతిష్య విద్యాశ్రమం – కొత్తగా చేరిన ఓ 50 మంది విద్యార్థులతో కళకళలాడిపోతోంది. స్వాగత సభ మొదలైంది. ఒకరిద్దరు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను వివరిస్తూ, గురువుగారి ఘనత గురించి గొప్పగా చెప్పారు.
పరబ్రహ్మం మాట్లాడుతూ, “… ఈ శేషయ్య గారు ఒక గొప్ప జ్ఞాని. ఈ రోజు మీరు ఈయన చెప్పిన మాటల్ని మనసుకి ఎక్కించుకుంటే, మీకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది ….”
కరతాళ ధ్వనులు మ్రోగాయి.
పరబ్రహ్మం గారి విద్వత్తు గురించి తనకు ఎంతో మంది చెప్పారని గుర్తు చేసుకున్నారు. జ్యోతిష్యం ఎలా సైన్సు అని నిరూపితమయిందో కూడా చెప్పారు. “మనం ” గురువుల నుంచి విజ్ఞానాన్ని గడించేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలో కూడా చెప్పారు.
“… అసలు సమాజంలో మనకి తారసపడే – ‘శ్రేష్ఠులు’ గా పరిగణించబడే – పెద్దవాళ్ళదగ్గర్నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలి. ఒంటబట్టించుకోవాలి. ఎందుకు వాళ్ళు శ్ష్ఠులు అనబడతారో గీత చెబుతోంది-
‘యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః, సః యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ‘ – శ్రేష్ఠులనబడే వాళ్ళు ఏం ఆచరిస్తే అదే ప్రామాణికంగా సమాజం పరిగణిస్తుంది కనుక, వారిని అనుసరించాలి… మరికొంతమంది శ్రేష్ఠుల్లా కనబడతారు గానీ, దుర్గంధ పూరితమైన వాళ్ళ నోటిని, భక్తులచేత అడ్డమైన సేవలు చేయించుకొనే ‘వికారమైన గురుత్వ’ లక్షణాలని సమాజం హర్షించదు. కాబట్టి, ఎలాంటి అవలక్షణాల్ని మనం అలవరచుకోగూడదో తెలుసుకోవటానికి అలాంటి గురువుల్ని కూడా మనం సేవించాల్సి వస్తూంటుంది. భరించాలి మరి…”
పరబ్రహ్మం మొహం పాలిపోయింది. ఆయనలో మార్పుకి బీజం పడింది.
ఆ కళాశాలలో చరిత్ర శాఖలో విశాలరావు తన జూనియర్ లెక్చరర్లకి సుబోధ చేస్తునాడు.
“.. మగవాళ్ళం ఆడవాళ్ళు చేసే అన్ని పనులు చేయగలం – ఒక్క పిల్లల్ని కనటం తప్ప. అవునా?”
కుర్ర లెక్చరర్లు చప్పట్లు కొట్టేశారు.
“కాని, మగవాళ్ళం చేసే అనేక పనులు ఆడవాళ్ళు చేయలేరు. అందుకే, నేనంటాను – నాలా ప్రతి భర్తా తన భార్యకి మగవాళ్ళు చేసే పనులు అలవాటు చేయాలి. ముఖ్యంగా ఉద్యోగాలు చేయకుండా ఇల్లే స్వర్గసీమలా ఆనంద పడుతున్న గృహిణులకి ఇది చాలా అవసరం. లేకపోతే, మనం ఉద్యోగాలకి వెళ్ళాక, పిల్లలు బడికి వెళ్ళాక వాళ్ళకి పని ఏముంటుంది?…”
చప్పట్లు. కాని ఓ కుర్రడు ప్రశ్న సంధించాడు.
“మీరు చేస్తున్నారా సర్!”
విశాలరావు ఆశ్చర్యపోయాడు. “నీకు తెలియదా! నేను ఇంట్లో అస్సలు ఏ పనీ చేయను. బ్యాంకుకి వెళ్ళాలన్నా, పోస్టు ఆఫీసుకి వెళ్ళాలన్నా, గ్యాస్ బండ కోసం, కూరల కోసం, సరుకుల కోసం….. ఇలా ఏ పనీ చేయను. ఎందుకని?”
“మేడంని సమర్థురాలైన కార్య దీక్షా దక్షురాలిగా తీర్చి దిద్దటం కోసం…!” అని వెంకటేశం అందించాడు.
“భలే గుర్తు పెట్టుకున్నావోయ్… అలా ఎందుకు చేస్తున్నాను ?”
“మీది ‘సువిశాల’ హృదయం కాబట్టి…”
“అబ్బ ఏం పట్టేశావోయ్ వెంకటేశం! నీకు మంచి భవిష్యత్తు ఉంది సుమా… అయితే, ఇలా భార్యని కా.దీ.ద గా తయారు చేసే పని పెళ్ళయిన వెంటనే మొదలెట్టాలి. ఆలస్యం అయితే.. ఊహు, లాభం లేదు.”
చప్పట్ల మోత, మోత ….!
***
విశాలరావు ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య మేథ వేడి వేడిగా కాఫీ ఇచ్చింది. అప్పటికే, స్కూలు నుంచి వచ్చిన 10,12 ఏళ్ళ అరటిక్కెట్లనిద్దర్నీ కాస్సేపు పార్కులో ఆడించి, స్నానం చేయించింది. ఇంటికిచ్చిన క్లాసు అభ్యాసాలు చేయిస్తోంది.
విశాలరావు విలాసంగా వాలు కుర్చీలో కూర్చొని, టెలివిజన్ లో ‘రేపటి భారతం’ సీరియల్ చూస్తున్నాడు.
ఆ రాత్రి మేథ వండిన రుచికరమైన భోజనం చేశాక, విశాలరావు ప్రశంసాపూర్వకంగా అన్నాడు:
“అందుకే, గృహిణుల్ని ‘భోజ్యేషు మాతా’ అన్నారు. అంటే, భోజనం విషయంలో అమ్మల్ని మించిన వాళ్ళు – అని.’
మేధ నోరు విప్పింది.
“నేను బి.ఏ చదివేటప్పుడు ఈ శ్లోకం చెప్పారు. దానర్థం అది కాదనుకొంటాను..”
“పోనీలే మేథా, ఇవ్వాళ నేను చెప్పిన పనులన్నీ చేయగలిగావా”
“మీరు చెప్పారని పోస్టు ఆఫీసుకి వెళ్ళి, ఎక్కువ వడ్డీ వచ్చే పథకాల్ని అధ్యయనం చేశాను. ఇవిగో.. అప్పుడు అక్కడికి చదువురాని వాళ్ళు వచ్చి, మనీ ఆర్డరు రాసిపెట్టమని అడిగారు. … రాసి పెట్టాను…”
“ఓహ్, అద్భుతం. చూశావా నువ్వు ఎలా ఎదిగిపోతున్నావో…” వి.రా మెచ్చేసుకున్నాడు మేథని.
ఇంకోరోజు …
“ఏమండీ, ఇవ్వాళ బ్యాంకులో మీరిచ్చిన చెక్కు డిపాజిట్ చేయటానికి వెళ్ళానా! అప్పుడు అక్కడికి బస్తీలో ఆడవాళ్ళు వచ్చి, ‘ఇళ్ళకే మందులు ఉచితంగా చేరవేసే పథకం’ కోసం దరఖాస్తు రాసిపెట్టమని అడిగారు. రాసి పెట్టాను… వాళ్ళు నన్ను ఆశీర్వదించారు…”
“అబ్బబ్బ, ఏం ఎదిగిపోతున్నావు మేధ! ఇదే నేను కోరుకున్నది. నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి… నాది సువిశాల హృదయం కాబట్టి నీకు ఇంత అవకాశం లభించింది. తెలుస్తోందా…!” ఉత్సాహపడిపోయాడు వి.రా.
ఇంకోసారి …
పేదవాళ్ళకి ఉచిత త్రాగునీటి కొళాయిలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి దరఖాస్తు రాయాలి. ఆధార్ సంఖ్య అందులో వేయాలి. చిరునామా రాయాలి. అప్పటికే, దరఖాస్తులు రాసిపెట్టే మహా తల్లిగా పేరు పడిన మేథ దగ్గరికి ఏకంగా ఆ పక్క బస్తీ మొత్తం వచ్చేసింది. క్రమంగా మేధని ఒక ఆధారపడదగిన సేవా కార్యకర్తగా చుట్టుపక్కల బస్తీల వాళ్ళు గుర్తించారు.
ఆ చుట్టుపక్కల బస్తీల్లో ఎవరికి ఎలాంటి దరఖాస్తు రాయాలన్నా మేథ … మేథ …! ఇంటి పనులు అన్నీ చక్కబెట్టుకుంటూనే, మేథ మిగతా రోజుని వాళ్ళ సేవలో గడిపేస్తోంది. విశాల రావు తన ‘సువిశాలత ‘ అలా తన భార్య ఒక కా.దీ.ద గా ఎదగటానికి దోహదపడుతోందని తన జూనియర్ల దగ్గర కథలు కథలుగా చెబుతున్నాడు.
అకస్మాత్తుగా…
రెండేళ్ళక్రితం ఎన్నికైన ఆ వార్డు కార్పొరేటర్ కరోనా కారణంగా పైకి టిక్కెట్టు తీశాడు. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే, బస్తీ నాయకులంతా కల్సి మాట్లాడుకొని, తమ ఏకగ్రీవ అభ్యర్ధిగా మేథని ప్రకటించారు. అంతే! రిటర్నింగు అధికారి ఆమె ఎన్నికయినట్లు ప్రకటించాడు. దాంతో, ఆ తరువాత ఆరు మాసాల కాలంలో, ఏకైక విద్యావంతురాలైన మహిళా కార్పొరేటరు కావటం మూలాన, ఆమెను ‘వైదేహి’ వితరణ సంస్థ, ‘నైటింగేల్’ మహిళా జూనియర్ కళాశాల, ‘జన హిత’ వయోజన విద్యా కేంద్రం, కొత్తగా ఏర్పడిన ‘యువ మహిళా క్లబ్’, ప్రభుత్వంలో మహిళా వసతి గృహాల సలహా కమిటీ వగైరా సంస్థలు మేథను అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సలహాదారు… వంటి పోస్టుల్లోకి తీసేసుకున్నాయి.
రాత్రి శయ్య మీద ఆనందతరంగాల్లో తేలి, పడిపోయాక, మేథ మెల్లగా విశాలరావుకి చెప్పింది.
“ఏమండీ,నాకు రోజూ ఏదో ఒక సంస్థలో మీటింగులు ఉంటున్నాయి. ఎవ్వర్నీ కాదనలేకపోతున్నాను. ఒక్కో సారి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతోంది. అందుకని …”
“ఆ, అందుకని…?”
“రేపట్నుంచి మీరే అన్నీ చూసుకోవాలి. నేను పొద్దుట పిల్లలకీ, మీకూ వంట చేసి వెళ్ళిపోతాను. మీరు సాయంత్రం పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళకి పాఠాలు చెప్పటం, రాత్రి వంట చేయటం … అన్నట్లు మధ్యలో బట్టలు వాషింగ్ మెషినులో వేసి, మీకు వీలైనప్పుడు ఆరేయటం, సరుకులు, కూరలు తెచ్చుకోవటం …. ఇవ్వన్నీ చూసుకోవాలి…అప్పుడు అందరికీ నేను ఇంకా బలంగా చెబుతాను: నన్ను కార్య దీక్షా దక్షురాలిగా తీర్చి దిద్దింది ‘మా వారి సువిశాల హృదయమే’ అని !!!”
అంతే! అప్పటిదాకా ‘సువిశాలత’ వెనకాల తన బద్ధకాన్ని దాచుకుంటూ వచ్చిన విశాలరావు కళ్ళు తిరిగిపడిపోయాడు.
వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు. ‘జుగల్బందీ ‘ (అద్వానీ-వాజపేయిల బంధం), ‘నిప్పులాంటి నిజం’ (రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు), ‘నరసింహుడు’ (పి.వి. నరసింహారావు సమగ్ర జీవిత కథ), ‘రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల…’ (ప్రజా జీవితాలపై ఆర్.బి.ఐ ప్రభావం) వీరి అనువాద రచనలు. శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి – ‘నాహం కర్తా, హరిః కర్తా’; ‘తిరుమల లీలామృతం’, ‘తిరుమల చరితామృతం’, ‘అసలేం జరిగిందంటే …!’ – పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ‘ఇదీ యదార్థ మహాభారతం’ (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు) లిఖితరూపం ఇచ్చారు. ‘అయినా నేను ఓడిపోలేదు ‘ (జ్యోతిరెడ్డి ఆత్మకథ), ‘వైఎస్సార్ ఛాయలో … (సి.ఎం మీడియా సలహాదారుగా స్వీయ అనుభవాలు), ‘వాల్మీకి రామాయణం ‘ (పిల్లల కోసం 108 తైల వర్ణ చిత్రాలతో ఎమెస్కో ప్రచురణ) వీరి ఇతర రచనలు.
ఈ వారం కూడా రెండు కథలూ మెరుపులూ చురకలే!
విద్యార్థుల కే కాకుండా గురువు గారికి కూడా ఉపదేశం చేసారు. హోదాని అడ్డం పెట్టుకుని సేవలు చేయించుకునేవారికి వారికి చురకలు వేసారు శేషయ్య ‘ ఇలాంటి గురువు కావాలి’ లో.
భర్త విశాలహృదయుడైతే ఇక కావాల్సింది ఏముంది .ఉత్సాహవంతురాలు కావాలి కానీ ఆకాశమే హద్దుగా ఎదుగుతుంది భార్యామణి. పైకి చెప్పేది ఒకటి లోన ఉండే గూఢార్ధం వేరైతే మాత్రం ఏదో ఒకరోజు పచ్చి వెలక్కాయ గొంతులో పడక తప్పదు. అదే జరిగింది ఆ బద్దకం భర్తకు రెండవ కథలో. ఆసక్తి గా చదివించాయి ఎప్పటిలానే.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జీవితమంటే..
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-26
మిత్రుల నాగాలాండ్ మేఘాలయ యాత్రానుభవాలు-1
జూన్ 2019 సంపాదకీయం
ఆమని-4
దేశ విభజన విషవృక్షం-4
నియో రిచ్-5
మహాభారత కథలు-34: స్త్రీ పురుషుల విషయంలో కట్టడి చేసిన శ్వేతకేతుడు
మరుగునపడ్డ మాణిక్యాలు – 91: మీట్ జో బ్లాక్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®