1970లో ప్రారంభమైన నా రచనా వ్యాసంగం 2020 నాటికి ఏటా ఒక పుస్తకం లెక్కన వేసుకుంటే 50 పుస్తకాలు కావాలి. కాని 120 గ్రంథాలు వెలువడ్డాయి. అంటే కొన్ని సంవత్సరాలు కవలలని చెప్పవచ్చు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోనూ చేయి పెట్టడం వల్ల ఏ ఒక్క ప్రక్రియలోనూ పతాకస్థాయికి చేరుకోలేకపోయాను. పద్యాలు, వచనం, విమర్శ, పరిశోధన, అనువాదం, పరిష్కరణ, జీవితచరిత్రలు, అష్టావధానాలు, ఉదాహరణలు, అష్టకాలు, వ్యాసాలు – ఇలా సబ్బండు రచనలు పుంఖానుపుంఖాలుగా వ్రాసేశాను. ప్రచురణ చేతి చమురు భాగవతం. ఇంటి నిండా పుస్తకాల గుట్టలు. ట్రాన్స్ఫర్లు నా సర్వీసులో 20 దాకా జరిగాయి. పుస్తకాల గోతాలు తరలించడం మా ఆవిడకు విసుగు పుట్టించాయి. దానికి తోడు చెదలు పట్టి ఇల్లంతా గొడవ గొడవ. అయినా పట్టువిడవని విక్రమార్కుడిలా వ్రాస్తూ వస్తున్నాను. 12 ఏళ్ళ క్రితం నాకు డిటిపి చేసే రాజేంద్రప్రసాద్ పరిచయమయ్యాడు. నేను వ్రాసి ఇవ్వడం, అతను డిటిపి చేసి పుస్తకాలు ప్రింటింగు చేయించడం అలవాటైంది. నా పెన్షన్‌లో అధిక భాగం పుస్తక ప్రచురణ మీద ఖర్చు చేశా ననిపిస్తుంది. ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్ అధిపతి ఒక మంచి మాట సలహా ఇచ్చాడు:
“ఇలా పెన్షన్ డబ్బులు ఎందుకు వృథా చేస్తారు సార్! పుస్తకాలు కొని చదివే రోజులు అయిపోయాయి. నిశ్చింతగా కూచోండి సార్!” అన్నాడు.
పుస్తక రచన, ప్రచురణ ఒక వ్యసనంగా మారింది. 1970 నుండి 90 వరకు వెయ్యి కాపీలు వేశాను. క్రమంగా 500, 300, 100 స్థాయికి దిగి ప్రచురణలు వెలువడ్డాయి. అయితే నా అనువాదాలకు రెండింటికి అవార్డులు వచ్చాయి. 1993లో ముల్క్‌రాజ్ ఆనంద్ ‘Morning Face’ అనువాదం ‘ప్రభాత వదనా’నికి ఐదువేలు, 2000లలో అమితావ్ ఘోష్ ‘Shadow Lines’ అనువాదం ‘ఛాయారేఖలు’కు కేంద్ర సాహిత్య అకాడమీ వారి 25 వేలు ముట్టాయి. అదొక తృప్తి. డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు నిలిచిపోతుందని భయం. పది పుస్తకాలు అనువదించాను. కేంద్ర సాహిత్య అకాడమీకి మూడు, నేషనల్ బుక్ ట్రస్ట్‌కు ఐదు, పబ్లికేషన్స్ డివిజన్‌కు రెండు – ఇలా అనువాద పరంపర కొనసాగింది.
జీవితంలో స్వశక్తిపై వృద్ధిలోకి వచ్చినవాడిని. జీవన పోరాటం నాకు తెలుసు. ఎండ్రకాయ మనస్తత్వం గల మనకు క్రిందకి లాగడం అలవాటు. అందువలన ప్రముఖుల జీవన రేఖలను గ్రంథస్థం చేసే ప్రయత్నంలో కృతకృత్యుడనయ్యాను. వి.వి.గిరి రాష్ట్రపతి కావడానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. స్వతంత్రుడిగా నిలబడి అంతరాత్మ ప్రబోధం పేరిట ఇందిరాగాంధీ సహకారంలో గెలిచాడు. అందుకని నేను వి.వి.గిరి జీవిత చరిత్ర తొలి రచనగా కందుకూరు కళాశాల అధ్యాపకుడిగా 1970లో నా స్వంత ఖర్చుతో ముద్రించాను. 120 పుస్తకాలలో సగ భాగం నా ప్రచురణలే. దాదాపుగా పది లక్షల దాకా ముద్రణ వ్యయం అయింది. సంవత్సరానికి నాలుగు వేలు, ఐదు వేలు చొప్పున పుస్తక విక్రేతలు పంపించి ఉంటారు. ఏతా వాతా ముద్రణాభారం నాదే.
ఈ విధంగా వివిధ సంస్థల వారికి అనేక గ్రంథాలు వ్రాసి ఇచ్చాను. సముచిత పారితోషికాలు లభించాయి.
2020 మార్చి నుండి ఏప్రిల్ వరకు ధారావాహికంగా ఏడు గ్రంథాలు ప్రచురించి రికార్డు సృష్టించాను. 30 రోజులలో ఈ పుస్తకాలు వెలువడ్డాయి. రికార్డు కెక్కడానికి ప్రచురణ సంస్థ ద్వారా ప్రయత్నించాలని నియమం వుందట. నాకు తెలియదు. ఆ గ్రంథాలు:
1. పద్యనాటక పంచకం – రేడియోలో ప్రసారమైన 5 శ్రవ్య నాటకాలు
2. శతకద్వయం – 16వ ఏట నేను వ్రాసిన రెండు శతకాలు (1964)
3. రాయలసీమ మహారథులు
4. కథా దర్పణం – కథల సంపుటి
5. కావ్య పరిమళం – 24 కావ్యాల సమీక్ష
6. లోకమాన్య తిలక్ – అనువాదం పూర్తి
7. Civils Marathon
ఖాళీగా ఇంట్లో కూచోకుండా కరోనా సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకొన్నాను. కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు ఒక వెబినార్ నిర్వహించారు. అందులో కరోనా కాలంలో సాహితీ వ్యాసంగంపై ప్రసంగించమన్నారు. ఈ వివరాలన్నీ చెప్పాను.
రెండేళ్ళు కష్టపడి రాఘవ పాండవీయం (పింగళి సూరన) ద్వర్ధి కావ్య వ్యాఖ్యానం పూర్తి చేశాను. వావిళ్ళ వారు ఆ బాధ్యతను నాకప్పగించారు. ఆ గ్రంథ ప్రచురణ బాగా ఆలస్యమైంది. శాంతా బయోటెక్స్ కె.ఇ. వరప్రసాద్ రెడ్డిగారికి వాట్సాప్ సందేశం పంపాను. 10 నిమిషాల్లో వారు ఫోన్ చేసి శాంతా వసంత పబ్లికేషన్స్ ద్వారా దానిని ముద్రించారు. రాఘవ పాండవీయం తాను చిన్నతనంలో చదివాననీ తెలిపారు. వారి మాతృమూర్తి సంస్మరణ సభలో ఆ గ్రంథాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పవిత్ర హస్తాల మీదుగా ఆవిష్కరింపజేసి మా దంపతులను సత్కరించారు. వారు సౌజన్యమూర్తులు. ఆ విధంగా నా పరిశ్రమకు సాఫల్యం లభించి గ్రంథం వెలుగులోకి వచ్చింది.
ఆరుగురు పరిశోధకులు నాలుగు విశ్వవిద్యాలయాల నుండి నా రచనలపై పరిశోధనలు జరిపి యం.ఫిల్/పి.హెచ్.డి. పట్టా పొందారు. అందులో నాలుగు గ్రంథాలు ప్రచురించారు కూడా. ఒక వ్యక్తి జీవితకాలంలో తన రచనలపై ఉత్తమ పర్యవేక్షకుల ఆధీనంలో పరిశోధనలు పలు విశ్వవిద్యాలయాలలో జరపబడటం కంతే సంతోషం ఏముంటుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ఆయా విశ్వవిద్యాలయాల తెలుగు శాఖ ఆచార్యులకు అభివాదాలు.
1965 నుండి 2020 వరకు నేను ఎం.ఎ. విద్యార్థిగా వున్న కాలం నుండి వివిధ పత్రికలకు అనేకానేక విషయాలపై వెయ్యికి పైగా తెలుగు, ఆంగ్లభాషలలో వ్యాసాలు పుంఖానుపుంఖంగా వ్రాశాను. నేను విద్యార్థిగా వుండగా ‘స్రవంతి’లో చాలా వ్యాసాలు ప్రచురించాను. ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రికలో 1966లో ఉత్తర రామాయాణము, కంకంటి పాపరాజు – తిక్కన వ్యాసం వచ్చింది. అప్పటికి నేను ఎం.ఎ. విద్యార్థిని. భారతి పత్రికలో ప్రయోగ విశేషాలు వ్యాసం ప్రముఖం. దినపత్రికలైన ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త, ఉదయం, సమయం, సాక్షి, విశాలాంధ్రలలో సాహిత్య వ్యాసాలు ప్రచురించాను. ప్రత్యేక సంచికలకు విశేష వ్యాసాలు వ్రాశాను. సెమినార్లలో వందదాకా పత్రాలు సమర్పించాను. ఆకాశవాణి ప్రసంగాలు, దూరదర్శన్ పరిచయాలకు తోడు, తిరుమల, భద్రాచలం శ్రీశైలం ప్రత్యక్ష వ్యాఖ్యానాలు 30 ఏళ్ళుగా చేస్తున్నాను.
ఆయా సందర్భాలలో ఎందరో ప్రముఖులు నా గ్రంథావిష్కరణలు చేశారు. వారిలో కొందరు – డా. సి.హెచ్.దేవానంద రావు (మంత్రి), డా. బెజవాడ గోపాలరెడ్డి, యం.యస్.రెడ్డి (సినీ నిర్మాత), బ్రహ్మానందం (సినీ నటులు), అరుణ్ జైట్లీ (కేంద్ర మంత్రి), జి.యం.సి. బాలయోగి (లోక్‌సభ స్పీకరు), కెజ్రివాల్, ముల్క్‌రాజ్ ఆనంద్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, తణికెళ్ళ భరణి, మండలి బుద్ధ ప్రసాద్, జమున, రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, సి.హెచ్. విద్యాసాగరరావు, కె.వి. రమణాచారి, వై.వి. సుబ్బారెడ్డి, గవర్నర్ నరసింహన్ ప్రభృతులు.
రిటైరయిన తర్వాత 2005 నుండి 2020 లోపు 15 సంవత్సరాలలో 60కి పైగా పుస్తకాలు ఆ సరస్వతీ కటాక్షంతో ప్రచురించగలిగాను. సమగ్ర సంకలనంగా నా 120 పుస్తకాలను ⅛ డెమ్మీ సైజులో 10 వేల పుటలు దాకా వస్తాయి. అంతా భగవదనుగ్రహం. విశ్రాంత జీవనంలో అవిశ్రాంత గమనం… నా ఆత్మకథను సంచిక వెబ్ పత్రిక ద్వారా ధారావాహికగా లోగడ తెచ్చి ‘ఆకాశవాణి పరిమళాలు – అదృష్ణవంతుని ఆత్మకథ’ పేరిట 2018లోనే ప్రచురించాను. శుభమస్తు.
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
అపురూప సమాచారం
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™