జాన్ స్టీన్‌బెక్ అమెరికన్ రచయిత. 1962లో వీరికి నోబల్ బహుమతి లభించింది. వీరి నవలన్నీ గొప్ప రచనలే. మానవ జీవితాన్ని, మనిషి అంతరంగిక మథనాన్ని, మనిషిలోని విభిన్న కోణాల్ని, నైతిక సూత్రాలను ప్రభావితం చేసే సామాజిక అంశాలను, మనిషి ఆంతరంగిక సంఘర్షణను వీరు చాలా అద్భుతంగా తమ నవలలలో ఆవిష్కరించారు. ‘ది పర్ల్’ అన్నది వీరి నవలిక. వంద పేజీల కన్నా తక్కువ ఉండే ఈ చిన్ని పుస్తకం చాలా గొప్ప కథనంతో, విషయంతో రాయబడిన నవలిక. మనిషి జీవితంలో ధనం చేసే మాయని, మనిషి చుట్టూ ఉన్న పరిస్థితులను కలుషితం చేసే ధనార్జన గురించి ఈ నవల చర్చిస్తుంది. డబ్బు మనిషికి సౌకర్యాలను ఇవ్వవచ్చు, కాని అతని జీవితాన్ని సమస్యలమయం కూడా చేస్తుంది. అతన్ని సామాన్య ప్రజానికం నుండి, సామాన్య జీవితం నుండి దూరం చేస్తుంది. భౌతికమైన సుఖాలను ఎన్నిటికి ఇచ్చినా, స్వచ్ఛమైన మానవ సంబంధాల నుండి అనుబంధాల నుండి మనిషిని దూరం చేసే శక్తి డబ్బుకు ఉంది. మనిషిని ఇంతగా కలుషితం చేయగల మరో సాధనం ఈ భూమ్మీద డబ్బు కన్నా మరొకటి లేదు. అది మనిషిలోని సహజమైన ప్రేమను, సానుభూతిని, ఆదరించగల గుణాన్ని చంపి అతన్నో రాక్షసుడిని చేయగలదు. అందుకే డబ్బు చాలా చెడ్డది అని పెద్దలు అంటూనే ఉంటారు. అయినా దాని మీద మోహం, లోభం, మనిషిని వదలవు.
కథకు వస్తే, ఇది ఒక స్పానిష్ తెగకు సంబంధించిన కథ. ఒక చిన్న గిరిజన పల్లెలో కీనో అనే వ్యక్తి ఉంటాడు. అతనికి సహచరి హుయానా. కొయొటిటో వీరి కుమారుడు. నెలల పసివాడు. కీనో సముద్రంలో ముత్యాలను అన్వేషించే వ్యక్తి. బీదవాడు. సముద్రపు ఒడ్డున వీరి నివాసం. ఒక రోజు ఉయ్యాలలో పడుకుని ఉన్న పసివాడు కొయొటిటో పై ఇంటి కప్పు నుండి ఒక తేలు పడుతుంది. దాన్ని జాగ్రత్తగా పక్కకు తీద్దాం అని కీనో అనుకునే లోపల ఆ తేలు పసివాడిని కాటేస్తుంది. విషం బిడ్డలోకి ప్రవేశిస్తుంది బిడ్డను బ్రతికించుకోవడానికి కీనో, హుయానోలు బిడ్డడు డాక్టర్ వద్దకు తీసుకుని వెళతారు. కాని డాక్టర్ బిడ్డను చూడడానికి నిరాకరిస్తాడు. కీనో ఫీజు చెల్లించుకోలేడు కాబట్టి అతని వద్ద తన ఫీజుకు కావలసిన డబ్బు లేదు కాబట్టి బిడ్డకు వైద్యం చేయడానికి డాక్టర్ ఇష్టపడడు. అంతే కాకు తక్కువ స్థాయి, జాతివాడైన కీనోపై అతనికి పెద్ద గౌరవం ఉండదు. బిడ్డను తీసుకుని విచారంతో ఆ జంట సముద్రపు ఒడ్డు చేరతారు. హుయానాకు కొంత ప్రకృతి వైద్యం తెలుసు. బిడ్డ చేయి వాచి విపరీతంగా బాధపడుతుంటే సముద్రపు ఒడ్డున పెరిగే ఒక చెట్టు పసరు రాసి ఆ నొప్పి తగ్గించే ప్రయత్నం చేస్తుంది. డబ్బు ఉంటే డాక్టర్ వైద్యం చేస్తాడు కాబట్టి బిడ్డ కోసం కీనో ముత్యాల కోసం సముద్రం మధ్యలోకి వెళతాడు. పట్టుదలగా సముద్రం అడుగుకు చేరిన కీనోకు అదృష్టం వరించి ఒక అద్భుతమైన, అపురూపమైన ముత్యం దొరుకుతుంది. హుయానో రాసిన పసరుతో బిడ్డ వాపు నొప్పి కూదా తగ్గుతాయి. కీనోకి ఒక గొప్ప ముత్యం దొరికిందని ఊరివారందరికీ తెలుస్తుంది. అది అమ్మితే అతనికి చాలా ధనం రావడం తధ్యం అన్నది అర్థం అవుతుంది. ఆ ముత్యంతో కీనో శ్రీమంతుడు అవుతాడు. అతను ఇప్పుడు ధనవంతుల కోవలకి చేరాడు.
విషయం తెలిసి గ్రామస్తులంతా అతని చుట్టు చేరతారు, అతని అదృష్టానికి అసూయ చెందుతారు. ఆ ఇంటివైపు చూడడానికే ఇష్టపడని చర్చ్ ఫాదర్ వారి ఇంటికి వస్తాడు. దేవుని కృప కీనో పై ప్రసరించిన కారణంగా చర్చ్‌కి వచ్చి కొంత రుసుం భగవంతుని పేర ఇవ్వాలని అడుగుతాడు. డాక్టర్ స్వయంగా కీనో ఇంటిడి వచ్చి బిడ్డను చూస్తాడు. బిడ్డకు ఆ పసరు వైద్యం పని చేసి రోగ లక్షణాలు తగ్గు మొహం పడతాయి. కాని బిడ్డ ప్రమాద స్థితిలోనే ఉన్నాడని ప్రలోభపెట్టి డాక్టర్ వైద్యం మొదలెడతాడు. ముందు బిడ్డకు కడుపు నొప్పి రావడానికి మందు ఇచ్చి తరువాత దాన్నితగ్గించడానికి వైద్యం మొదలెడతాడు.
కీనో ఆ ముత్యాన్ని అమ్మి ముందు హుయానోని చర్చ్ పద్దతిలో వివాహం చేసుకుని గౌరవస్తుల మధ్య చేరాలనుకుంటాడు. ఆ తెగలో వ్యక్తులు వివాహం చేసుకోవాలంటే కొంత డబ్బు అవసరం. అది లేక సహజీవనం చేస్తూ ఉంటారు. వీరికి మర్యాదస్తుల మధ్య చోటు ఉండదు. ఇప్పుడు డబ్బు వస్తే దానితో వివాహం చేసుకోవాలని, కొడుకుని చదివించాలని, మంచి బట్టలు కొనాలని, మర్యాదస్తునిలా గౌరవం పొందాలని, ఇలా కుటుంబం కోసం కీనో కలలు కంటూ ఉంటాడు. ఆ ముత్యం అమ్మడానికి నగరానికి వెళ్తే అక్కడి వ్యాపారస్తులు ఈ పేద వ్యక్తి చేతిలో అంత అపురూపమైన ముత్యాన్నిచూసి దాన్ని తక్కువ ధరకు కొనేయడానికి అతన్ని మోసం చేసి ముత్యం తాము స్వాధీనపరుచుకోవడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అతి తక్కువ డబ్బులు అతనికి ఇవ్వడానికి ముందుకు వస్తారు. కీనోకి తనను వారు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది. అక్కడ ముత్యం అమ్మితే పెద్ద పైకం రాదని. దాని కోసం పెద్ద నగరానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. ఆ ముత్యం అతని నుండి లాక్కోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అతను ఇంటికి వచ్చి దాన్ని ఇంట్లో ఒక భాగంలో పాతిపెడతాడు. ఇంట్లో అర్ధరాత్రి ఒక దొంగ ప్రవేశిస్తాడు. కీనో ఆ దొంగను ఇంటి నుండి తరిమి వేస్తాడు. ఈ ముత్యం వల్ల తమకు హాని జరుగుతుందని దాన్ని వదిలించుకొమ్మని హుయానా అతన్ని అడుగుతుంది. కాని ఈ పేదరికాన్ని తప్పించుకునే ఒకే ఒక మార్గం ఈ ముత్యం అని దాన్ని అమ్మి రావల్సిన పైకాన్ని తీసుకుని తీరతానని కీనో బదులిస్తాడు. మొదటి సారి సహచరిపై చేయి కూడా చేసుకుంటాడు. ఇంతలో వారి ఇంటిపై ఎవరో వ్యక్తులు దాడి చేయడం, పిల్లవానితో ఆ జంట బైటపడడం, తనను తాను రక్షించుకోవడానికి వారిలో ఒకరినికి కీనో చంపడం జరుగుతుంది. ఆత్మరక్షణకోసం అయినా హత్య జరిగాక తనను ఎవరూ రక్షించరని కీనోకు అర్థం అవుతుంది. ఊరంతా శత్రువులవుతారు. అతని వృత్తి పరికరాలను, ఇంటిని ద్వంసం చేస్తారు. గత్యంతరం లేక ఆ రాత్రి బంధువుల ఇంటిలో ఆ జంట తలదాచుకుంటారు.
మరునాడు రాజధాని చేరాలని ఆ జంట బైలుదేరుతుంది. కాని వారిని వెంబడించే కొందరు మనుష్యులు వారికి కనిపిస్తారు. వారి నుండి తప్పించుకోవడానికి ఒక గుహలోకి వెళతారు. ఆ గుహ క్రిందే ఆ మనుష్యులు కూడా వీరి కోసం కాపు కాస్తారు. బిడ్డ ఏడుపు విని వారిలో ఒకరు అది ఒక జంతువేమో అని ఆ వైపు కాలుస్తారు. కుటుంబాన్ని రక్షించడానికి ఆ గుంపులో ముగ్గురిని కీనో చంపేస్తాడు. కాని ఆప్పటికే మొదటి గుండు తగిలి అతని పసిబిడ్డ మరణిస్తాడు. వారి ప్రాణప్రదమైన బిడ్డ మరణించాక ఇక ఆ ముత్యంపై కీనో కోరిక చచ్చిపోతుంది. ఊరికి ఆ జంట బిడ్డ శవంతో తిర్రుగు ప్రయాణమవుతారు. దారిలో సముద్రపు ఒడ్డున కీనో ఆ ముత్యాన్ని తీసుకుని పరీక్షగా చూస్తాడు. అందులో తలకు రంధ్రంతో రక్తం కారుతున్న అతని బిడ్డ రూపం కనిపిస్తుంది. కసితో ఆ ముత్యాన్ని సముద్రంలోకి విసిరివెస్తాడు కీనో.
పేదరికాన్ని తప్పించుకోవడానికి, సమాజంలో హోదా, గౌరవం కోసం తనకు డబ్బు కావాలనుకుంటాడు కీనో. కాని ఆ ధనంతో పాటు ఎంతో ద్వేషం, ఒంటరితనం తనకు దక్కుతాయని అతనికి చివర్లో అర్థం అవుతుంది. సోదరుడిగా భావించే ఊరి జనం అతనిపై అసూయ పెంచుకుంటారు. అతని మరణాన్ని కోరుకుంటారు. డబ్బు మనిషిని ఎంతగా మార్చేస్తుందో కళ్లతో చూసి అనుభవిస్తాడు కీనో. అ అధ్బుతమైన ముత్యం ప్రతి ఒక్కరిలోని దెయ్యాన్ని బైటకు తీసింది. భార్యను కొట్టడం, మనుష్యులను చంపడం అతను ఊహించని విషయాలు. కాని ఇవన్నీ అతని ద్వారా జరుతుతాయి. అసూయ, ద్వేషాలు ఐశ్వర్యాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండగలవో అతను అనుభవిస్తాడు. ప్రేమ అనేది ధన ప్రాప్తితో మాయం అవడం. మానవ ప్రేమ నశించి ద్వేషం పెరగడం చూసాక అతనికి ధనం నిజరూపం అర్ధమవుతుంది. పవిత్రమైన, అందమైన ఆ అద్భుతమైన ముత్యం ఊరినంతా ఎలా విషపూరితం చేయగలిగింది, ముత్యం లాంటి తన బిడ్డ మరణానికి ఎలా కారణమవగలిగింది చూసాక ధనం అంటే విరక్తి కలుగుతుంది అతనికి.
1947లో రాసిన ఈ కథలో చాలా గొప్ప సత్యం ఉంది. దీనిని స్పానిష్ మరియు కన్నడ భాషలలో సినిమాగా కూడా తీసారట. స్టీన్‌బెక్ రాసిన ఎన్నో గొప్ప నవలల మధ్య ‘ద పర్ల్’ చుక్కల మధ్య చంద్రుడిలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ పుస్తకం చదవడం ఒక చక్కని అనుభవం. చాలా తేలికైన భాషతో సరళమైన శైలితో రచయిత తాను అనుకున్నదాన్ని స్పష్టంగా చెప్పగలిగారు. స్టీన్‌బెక్ శైలికి పుస్తకం అసాంతం చదివించగలిగే గుణం వుంది. కథను దృశ్యరూపంలో మన మనసు త్వరత్వరగా మార్చుకుని చూడగలుగుతుంది. అది వీరి శైలి ప్రత్యేకత. మన ముందే కథ నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇక వీరి వర్ణనకు ఒక ప్రత్యేకత ఉంది. కథ నడిచే వాతావరణాన్ని వీరు వర్ణించే తీరు పాఠకులను కట్టిపడేస్తుంది. పదాలన్నీ దృశ్యాలుగా మారిపోతాయి. కథను అసాంతం ఆస్వాదించగలుగుతాం. నాకు వీరి శైలి ప్రత్యేకంగా ఇష్టం. అందుకే వీరి పుస్తకాలు చదవడమే ఒక గొప్ప అనుభూతి. స్టీన్బెక్ని చదవని వారు ఈ పుస్తకంతో మొదలెట్టండి. అతని ప్రభావం నుండి తప్పించుకోలేరు.
సముద్రం నుండి వెలికి తీయబడ్డ ముత్యం – స్వాతిముత్యం లా ఉండాల్సిన మనిషి మనసు లోని కల్శషాన్ని, స్వార్థపూరితమైన దుర్మార్గాన్ని వెలికి తీసింది. అద్భుతమైన కథ. అంతే చక్కగా వివరించారు జ్యోతి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™