రాఘవయ్య : వయస్సు 50 సం. పంచె, చొక్కా, పై పంచ – గంభీరం –హుందాతనం – పెద్ద మనిషి. ఆనంద్‌కు మేనమామ – మామయ్య, సునందకు తండ్రి.
రాజ్యలక్ష్మి : వయస్సు 46. రాఘవయ్య భార్య, సునంద తల్లి. లోకజ్ఞానమెక్కువ.
ఆనంద్ : వయసు 26 సం. బ్యాంక్ ఆఫీసర్. కొంచెం మోడ్రన్ – రాఘవయ్యకు మేనల్లుడు – అల్లుడు – సునందకు భర్త.
సునంద : వయస్సు 22 సం. గృహిణి – కొంచెం అమాయకం – రాఘవయ్య రాజ్యలక్ష్మిల కూతురు. ఆనంద్‌కు భార్య.
ఆనంద్ ఒక బ్యాంక్ ఆఫీసర్. హైదరాబాద్‌లో నివాసం. రెండేళ్ల క్రితం కరీంనగర్లో వుంటున్న మేనమామ రాఘవయ్య కూతురు సునందతో వివాహమయింది. కాపురం హాయిగా సాగిపోతుంది. కాని ఈ మధ్య ఆనంద్ ఫ్రెండ్స్‌తో పార్టీలని అర్ధరాత్రి వరకు ఇంటికి రావడం లేదు. సునందకు ఇది నచ్చలేదు. ఎలాగైనా ఆనంద్‌ని పార్టీలకు వెళ్లకుండా చూడాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆనంద్కి మాత్రం పార్టీలకు వెళ్ళి ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. సునంద తన నిర్ణయాన్ని అమలు చేయకలిగిందా? ఆనంద్ తన కిష్టమైన కోరికను తీర్చుకోగలిగాడా? ఆ ఇతివృత్తంతో నడిచేదే ఈ నాటిక.
సునంద : (ఫోన్లో) హలో.. హలో.. నాన్న.. నేనూ.. సునందను మాట్లాడుతున్నాను.
రాఘవయ్య : ఆ! సునందా.. ఎలా వున్నావమ్మా? అల్లుడుగారెలా వున్నారు?
సునంద : ఇక్కడ మేము బాగానే వున్నాము. మీరు, అమ్మ, తమ్ముడు ఎలా వున్నారు?
రాఘవయ్య : మేమంతా బాగానే వున్నావమ్మా.. అక్కడ విషయాలేంటి?
సునంద : పెద్దగా ఏమీ లేవు నాన్నా.. నాన్నా.. రాత్రి మీరు కల్లోకి వచ్చారు నాన్నా.. ఎందుకో మిమ్మల్ని చూడాలనిపిస్తుంది.. ఒక్కసారి హైద్రాబాద్ రాకూడదూ..
రాఘవయ్య : ఓ! తప్పకుండా వస్తానమ్మా.. నాక్కుడా నిన్ను చూడాలని వుంది..
సునంద : సరే.. ఎప్పుడొస్తారు.. నాన్నా..
రాఘవయ్య : ఎప్పుడో ఏంటమ్మా.. రేపే మధ్యాహ్నానికి నీముందుంటా..
సునంద : సరే నాన్నా.. అలాగేరండి.. ఎదురుచూస్తుంటాను. ఆ! అమ్మని, తమ్ముడ్ని అడిగానని చెప్పండి.
రాఘవయ్య : అలాగే.. మరి నే వుంటానమ్మ..
సునంద : బై.. నాన్నా…
***
(మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాఘవయ్య సునంద ఇంటికి వచ్చాడు)
సునంద : ఆ! వచ్చారా.. నాన్నా.. రండి.. లోపలికి రండి.
రాఘవయ్య : (లోపలికి వస్తూ) ఏంటమ్మా.. అంతా బాగేనా.. అల్లుడుగారు బాగున్నారా..?
సునంద : ఆయనకేం.. దర్జాగా వున్నారు.. ఆ ముందు మీరు భోంచేయండి.. ఇప్పటికే చాలా టైం అయింది. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం.
(ఇద్దరూ భోంచేసి సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు)
రాఘవయ్య : ఆ! ఇప్పుడు చెప్పమ్మా.. ఏంటి విశేషాలు?
సునంద : ప్రత్యేకంగా ఏం లేవు నాన్నా.. ఈ మద్య ఈయనకు ఫ్రెండ్స్‌తో పార్టీలు ఎక్కువైనాయ్. ఆర్ధరాత్రి దాటాకే ఇంటికి వస్తున్నారు. ఆ టైంలో మాట కూడా తేడాగా వుంటుంది. బాగా తాగుతున్నారనిపిస్తుంది.
రాఘవయ్య : ఆ! ఈ రోజుల్లో అవన్నీ మామూలే కదమ్మా.. నువ్ అంతగా కంగారుపడుతన్నావేంటమ్మా..
సునంద : అది కాదు నాన్నా.. అదే అలవాటుగా మీరి ఆయన ఆరోగ్యం పాడవదా? మీరే ఏదో ఒకటి చేయాలి నాన్నాగారూ.. ఆయన చేత ఎలాగైనా ఈ పార్డీలు తాగుడూ అన్నీ మాన్పించాలి.
రాఘవయ్య : సరే! అలాగే.. అల్లుడుతో నేను మాట్లాడుతాగా.. నువ్ దీన్ని గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు.. అంతా నేను చూస్కుంటాగా..
సునంద : సరే నాన్నా..
(రాఘవయ్య సోఫోలోనే పడుకుని గుర్రుపెట్టి నిద్రపోయాడు. సాయంత్రం ఆరుగంటలకు ఆఫీసు నుండి వచ్చాడు ఆనంద్)
ఆనంద్ : (వస్తూనే) ఏం మావయ్యా! ఎప్పుడొచ్చారు? అంతా బాగున్నారా?
రాఘవయ్య : ఓ! అంతా బాగున్నాం అల్లుడూ. నీ ఉద్యోగం అదీ ఎలావుంది?
ఆనంద్ : ఓ! బ్రహ్మాండంగా వుంది. రెండు మూడు నెలల్లో ప్రమోషన్ కూడా రాబోతుంది.
రాఘవయ్య : సంతోషం అల్లుడు.. మరి.. మరి.. అంతా బాగానే వుంది కాని.. ఈ మధ్య పార్టీలకు బాగా వెళ్తున్నావంట.. బాగా ప్రొద్దుపోయి ఇంటికి వస్తున్నావంట..
ఆనంద్ : అలా అని మీ అమ్మాయి చెప్పిందా ?
రాఘవయ్య : ఆ! ఏదో.. నీ ఆరోగ్యం పాడవుతుందేమోనని బాధతో చెప్పిందిలే.. అంతే.. నువ్ అమ్మాయిని ఏమీ అనబాకు..
ఆనంద్ : అయినా మావయ్య. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే కదా.. దానికే మీ అమ్మాయి నా మీద కంప్లైట్ చేయాలా ?
రాఘవయ్య : కంప్లైట్ కాదు లే బాబూ.. తన భయం తనది. నీ ఆరోగ్యం కోసమే కదా.. అమ్మాయి ఆలోచిస్తుంది.
ఆనంద్ : సరే! ఇప్పుడేమంటారు?
రాఘవయ్య : ఏం లేదు బాబూ.. ఇలాంటివి మన కుటుంబాల్లో ఎక్కడా లేవు. ఎవరూ త్రాగుడు జోలికి పోరు. నువ్ కూడా ఈ పార్టీలు.. తాగుళ్ళు.. మానుకో అల్లుడు.
ఆనంద్ : సరే మావయ్య! మొదట్నించి మీరన్నా మీ మాటన్నా నా కెంతో గౌరవం. మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఇక నుంచి అవన్నీ మానేస్తాను. సరే! మావయ్యా.. నేను స్నానం చేసి వస్తాను. అందరం కలిసి భోంచేద్దాం.. ఏం సునందా.. మీ నాన్నగారొచ్చారుగా.. ఏమన్నా స్పెషల్స్ చేశావా.. లేదా..?
సునంద : మీరే చూస్తారుగా.. త్వరగా స్నానం చేసిరండి.
(ఆనంద్ తన గదిలోకి వెళ్ళాడు)
రాఘవయ్య : ఏమ్మా.. ఇప్పుడు సంతోషమేనా?
సునంద : మా నాన్న తలుచుకుంటే నాకెప్పుడూ సంతోషమే.
(రోజులు గడుస్తున్నాయ్. ఆనంద్‌కు పార్టీలు బందైనాయ్. ఆఫీసు అయింతరువాత ఇంటి పట్టునే వుంటున్నాడు. సునంద తన పంతాన్ని నెగ్గించుకుంది పాపం ఆనంద్.. పరిస్థితి బాధాకరం)
ఆనంద్ : ఛ..ఛ..ఒక పార్టీ లేదు. ఒక ఎంజాయ్మెంట్ లేదు. శత్రువుకి కూడా ఇలాంటి పరిస్థితి రాగూడదు. కనీసం ఇంట్లోనైనా అప్పుడప్పుడు.. అమ్మో.. ఇంకేమైనా ఉందా? పైగా మావయ్యకు మాటిచ్చాను. ఆ మాట తప్పకూడదు.. అయితే.. ఇప్పుడెలా? ఏదొకటి ఆలోచించాలి.
(న్యూస్ పేపర్ చదువుతూ)
ఆ! ఏంటిది? వైన్ బాటిల్ – గ్లాస్ ఫోటో ‘రోజుకో గ్లాసు వైన్ తాగండి. గుండె జబ్బులకు దూరంగా ఉండండి. శాస్త్రజ్ఞుల పరిశోధనలలో తేలిన విషయం.’ ఓ.. ఇదేదో.. బావుందే.. ‘వైన్ వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.. చర్మం తేజోవంతంగా అందంగా తయారవుతుంది.’
ఈ న్యూస్ సునంద చూస్తే తన రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి. తనూ.. పేపర్ చదువుతుందిగా చూద్దాం.. ఏమవుతుందో?
సునంద : (ఎదురు సోఫోలో కూర్చుని.. ఆనంద్ ప్రక్కన పెట్టిన న్యూస్ పేపర్ చదవడం మొదలెట్టింది. రోజుకో గ్లాస్ వైన్ న్యూస్ చదివి) ఏవండీ.. వైన్ అంటే ఏమిటండీ?
ఆనంద్ : వైన్.. వైన్ అంటే.. ఆ! చెప్తా.. నీకు ద్రాక్ష పండ్లు తెలుసు కదా.. ఆ పండ్ల నుండి తీసిన రసమే.. వైన్.. అంటే దాక్ష రసమన్న మాట.. కాకపోతే ద్రాక్షరసాన్ని ఎక్కువ కాలం నిల్వ చేస్తే అది వైన్‌గా మారుతుంది. అంతే! అవునూ.. ఇప్పుడు నువ్ సడన్‌గా వైన్ గురించి అడుగుతున్నావేంటి? అసలేంటి విషయం.. సునందా..?
సునంద : ఏం లేదండీ.. ఈ పేపర్లో ఏం రాశారో చూడండి.
ఆనంద్ : నువ్వే చెప్పు.. ఏం రాశారేంటి?
సునంద : రోజుకో గ్లాసు వైన్ తాగితేనంట గుండె జబ్బులు రావంట.. రక్త ప్రసరణ బాగా జరుగుతుందంట.. చర్మం అందంగా అవుతుందంట..
ఆనంద్ : ఆ! పేపర్లలో ఏదో రాస్తుంటారు.. అవన్నీ వట్టి మాటలు.. మనం నమ్మాల్సిన అవసరం లేదు సునందా..
సునంద : కాదండి.. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ఈ విషయాన్నికనుక్కొన్నారంట..
ఆనంద్ : ఆ విషయాలన్నీ మన కెందుకులే సునందా.
సునంద : అది కాదండీ.. ఆరోగ్యం కోసం చాలా మంది వైన్ తాగుతున్నారట!
ఆనంద్ : అయితే.. ఇప్పుడేమంటావ్?
సునంద : మీరు కూడా రోజూ ఒక గ్లాస్ వైన్ తాగండి.
ఆనంద్ : (లోలోపల సంతోషిస్తూ) ఆ! వద్దులే.. సునంద.. మన ఇంట్లో అవన్నీ కుదరవులే.. వదిలేయ్.
సునంద : ఒకసారి ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదండి.. నా పుసుపు కుంకాలు పదికాలాల పాటు పదిలంగా వుంటాయి. ఆ! ఏమంటారు? సరేనా?.. సరే అనండి.. ప్లీజ్..
ఆనంద్ : నువ్ మరీ ఇంత సెంటిమెంటల్‌గా అడుగుతున్నావ్.. సరే అనకుండా వుండగలనా.. సరే చూద్దాంలే..
సునంద : చుద్దాం మంటే కుదరదు. రేపు చాలా మంచి రోజు. రేపటి నుండి మొదలెట్టాలి. ఓకేనా.. ఊ..
(ఆనంద్ సరే అన్నట్లు తలూపుతాడు.)
నాకు చాలా పనుంది. చూసుకుంటాను.
(సునంద వంటగది వైపు వెళ్లింది)
ఆనంద్ : ఆహా! ఏమి నా అదృష్టం.. ఇక రోజూ ఇంట్లోనే వైన్.. ఒక గ్లాసు తన కోసం.. ఇంకో గ్లాసు నా కోసం.. ఏది ఏమైనా.. ఈ న్యూస్ పేపర్లు చాలా గ్రేట్.. అని చెప్పాలి. ప్రపంచంలోని విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు మనకు చేరవేయడమే కాకుండా అప్పుడప్పుడూ.. ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటాయ్. హ్యాట్స్ ఆఫ్ టూ యూ.. న్యూస్‌పేపర్.
(అంటూ న్యూస్‌పేపర్‌ను ముద్దుపెట్టుకుంటాడు)
(రోజూ ఆఫీసు నుంచి రావడం.. స్నానం చేయడం.. వైన్ తాగడం – భోజనం చోయడం పడుకోవడం.. ఇలా ఆనంద్ దినచర్య నిరాటంకంగా సాగిపోతుంది.. ఒక రోజు..)
ఆనంద్ : ఈ రోజు ఒకసారి టెస్ట్ చేస్తా.. నేను వైన్ తాగకపోతే సునంద ఎలా రియాక్టవుద్దో చూస్తా.. ఆ! సునందా.. సునందా.. నాకు భోజనం వడ్డించు.. త్వరగా పడుకుని ఉదయం ఎర్లీగాలేవాలి. యూనిట్‌కి వెళ్ళాలి.
సునంద : ఆదేంటండి.. మర్చిపోయారా? ముందు వైన్ తాగండి.. తర్వాతే భోజనం.. ఆ.. (చెప్పింది అమాయకంగా)
ఆనంద్ : (సంతోషంగా) ఆ! వెరీగుడ్.. బండి లైన్లోనే వుంది.. థాంక్ గాడ్!!
(అప్పుడే రాఘవయ్యగారు ఇంట్లోకి వచ్చారు)
ఆనంద్ : రండి.. మావయ్యా రండి.. ఆ! సునందా మీ నాన్నగారొచ్చారు..
రాఘవయ్య : ఆ.. అల్లుడు.. ఏంటి విషయం. పార్టీలు బంద్ అయినాయా?
సునంద : (కల్పించుకుని) మీరు ఆ రోజు చెప్పారు కదా నాన్నా.. అంతే.. అప్పట్నించి అన్నీ బంద్.
రాఘవయ్య : వెరీగుడ్.. ఇప్పుడు నువ్ నాకు బాగా నచ్చావ్ అల్లుడూ..
సునంద : ఆ! ఇంకో విషయం నాన్నగారూ..
రాఘవయ్య : మళ్లీ ఏంటమ్మా?
సునంద : ఆరోగ్యం కాపాడుకోవడం కోసం రోజూ సాయంత్రం ఒక గ్లాస్ వైన్ తాగి భోంచేస్తున్నారు.. నాన్నా..
రాఘవయ్య : ఏంటి? వైనా? (తత్తరపాటుగా)
ఆనంద్ : అదే మావయ్యా.. అదీ.. ఈ వైన్..
సునంద : మీరుండండీ. నాన్నకు అర్థమయేటట్లు నేను చెప్తాను. (రాఘవయ్య వైపు తిరిగి) ఏం లేదు నాన్నా వైన్ అంటే ద్రాక్షరసం.. కొంచెం నిల్వ వుంచిన ద్రాక్షరసం. అది రోజుకో గ్లాసు తాగితే గుండె జబ్బులు రావు, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం అందంగా తయారవుతుంది. అందుకే రోజుకో గ్లాస్ వైన్ తాగుతున్నారు.
రాఘవయ్య : (సునంద వైపు ఆశ్చర్యంగా చూస్తాడు, ఆననంద వైపు ఉరిమురిమి చూస్తాడు).
రాఘవయ్య : అలాగని ఎవరు చెప్పారమ్మా?
సునంద : పేపర్లో చదివాను. శాస్త్రజ్ఞులు కూడా పరిశోధనలు చేసి ఆ విషయాలన్నింటినీ నిర్ధారించారట!
రాఘవయ్య : (ఆశ్చర్యంతో) అవునా..
సునంద : అవున్నాన్నా..అవును..
(గోముగా) నాన్నా.. మీరు కూడా ఈ రోజు నుండి ప్రతి రోజూ ఒక గ్లాస్ వైన్ తాగండి. మీకు గుండె జబ్బులు రావు. అసలే మీది పెద్ద వయసు. ఏ క్షణాన గుండె జబ్బు వస్తుందో.. ఏమో.. కాబట్టి మీరు రోజూ వైన్ తాగితే మీ ఆరోగ్యం పదిలంగా వుంటుంది. మాకూ ధైర్యంగా వుంటుంది. ఆ! మీరిద్దరూ.. మాట్లాడుతూ వుండండి.. నేను ఆ ఏర్పాట్లు చూస్తా.. (అంటూ ఫ్రిజ్ వైపు వెళ్తుంది)
రాఘవయ్య : ఏం అల్లుడూ.. మా అమ్మయిని బాగానే మేనేజ్ చేశావ్.. నువ్ సామాన్యుడివి కావు.. అల్లుడూ..
(ఇంతలో సునంద వైన్ పోసిన గ్లాసులను ఇద్దరి ముందు ఉంచుతుంది)
సునంద : ఇక మొదలెట్టండి.. నేను భోజనం ఏర్పాట్లు చేస్తా..(అంటూ లోనికెళ్ళింది)
(మామ అల్లుళ్లు గానా బజానా.. ఆనందమే ఆనందం..)
రాఘవయ్య : అల్లుడూ.. ఎన్ని సంవత్సరాలయింది మందు తాగి.. నీలాగే నేను మా మావయ్యకు మాటిచ్చి మందుని దూరంగా పెట్టా. ఇన్నాళ్లకి.. ఏదో.. నీ వల్ల మళ్ళీ రుచి చూశా..
ఆనంద్ : నాదేముందిలే మావయ్యా.. మీ ఆనందమే.. నా ఆనందం..
(మామా అల్లుళ్ళు సునందకు తెలిసి చెరోగ్లాసు తెలియకుండా చెరో గ్లాసు వైన్ తాగుతూ ఆనంద డోలికల్లో.. తేలియాడారు..)
సునంద : (వస్తూనే) నాన్నా.. ఇక రోజూ మీరూ వైన్ తాగాలి. రోజూ మరిచిపోకుండా మీకు వైన్ ఇవ్వాలని అమ్మకు నేను చెప్తాగా.
రాఘవయ్య : ఆ! ఆ! నువ్వే మీ అమ్మకు చెప్పాలి మరి. ఎందుకంటే నువ్వు చెప్తేనే తను వింటుంది.
సునంద : వైన్ తాగడం పూర్తయిందిగా.. ఇక లేవండి.. అందరం కలిసి భోంచేద్దాం..
(భోజనాలు ముగించుకుని అందరూ నిద్రపోయారు. ఉదయాన్నే రాఘవయ్య ఊరు ప్రయాణం అయ్యాడు.)
రాఘవయ్య : ఆ! సునంద.. నే వెళ్లొస్తా.. అల్లుడుగారూ.. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.. ఆ!
ఆనంద్ : ఆ!ఆ! అలాగే మావయ్యా.. మరి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
సునంద : నాన్నా! నేను చెప్పినట్లు చేస్తారుగా.. మరిచిపోకండి..
రాఘవయ్య : ఆ! అలాగే! మరి మీ అమ్మకు చెప్పుడం మరిచిపోకు.. చెప్తావుగా..
సునంద : తప్పకుండా చెప్తాను నాన్నగారూ.. అయినా ఇంత మంచి విషయం ఇన్ని రోజులూ మనకు తెలియకపోవడం ఏమిటి.. నాన్నా.. (అడుగుతుంది అమాయకంగా)
రాఘవయ్య : అదేనమ్మా.. విచిత్రం.. దేనికానా టైం రావాలి కదా!! ఏం అల్లుడూ.. ఏమంటావ్!!! (గూడార్థంగా అడుగుతాడు)
ఆనంద్ : ఆ!ఆ!! అవును మావయ్యా.. టైం రావాలి కదా!!!
(అంటూ పక పకా నవ్వాడు ఆనంద్.. కోరస్ అందుకున్నారు.. సునంద, రాఘవయ్య)
సునంద : (ఆనంద్ బ్యాంకుకి వెళ్ళాకా, ఫోన్లో) అమ్మా! ఆఁ.. నాన్న బయలుదేరారు. నీతో ఓ విషయం చెప్పాలి” (అంటూ పేపర్లో వైన్ గురించి చదివిన వైనం, భర్తకి రోజు ఓ గ్లాసు ఇస్తున్న సంగతి చెప్పింది.) “వింటున్నావా? ఇక నుంచీ రోజూ నాన్నకి కూడా ఇవ్వాలి. నాన్న ఆరోగ్యం నువ్వే చూసుకోవాలి…”
రాజ్యలక్ష్మి: “ఓసి నీ అమాయకత్వం తగలెయ్యా… ఆరోగ్యం పేరుతో నువ్వే మీ ఆయనకీ, మీ నాన్నని మందు పోసావే… వాళ్ళని మళ్ళీ తాగుడికి మళ్ళేలా చేశావు.”
సునంద : “అదెలా?”
రాజ్యలక్ష్మి : వాళ్ళిద్దరూ నిన్ను బురిడీ కొట్టించారే పిల్లా… సరే నేనొక ఉపాయం చెబుతాను… అలా చేస్తే వాళ్ళెంత తాగినా ఏం కాదు” (ఏం చేయాలో కూతురికి వివరించింది)
సునంద : “అమ్మా! నువ్వు సూపరు! ఈ రోజు నుంచే పాటిస్తాను… నువ్వు కూడా నాన్నకి అలాగే చెయ్. బై అమ్మా” అంటూ ఫోన్ పెట్టేసింది.
(తాము తమ భార్యలని బురిడీ కొట్టించామని ఆనంద్, రాఘవయ్య అనుకుంటున్నారు… కానీ తామే బురిడీ అయ్యామని వాళ్ళకి తెలియదు… ఇంతకీ రాజ్యలక్ష్మి ఏం చెప్పిందో? ష్… అది రహస్యం…)
ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
Contemporary – But What might be the secret…. My expectation is Sunanda offers Kashaayam to Anand and it is also for health…. & Anand Rejects it. Sunanda questions when wine is good for health, why not kashaayam? So have it also. Otherwise just stop drinking wine also…….Am I correct 2nd Option is Sunanda asks Anand to share the wine to her also as wine is good for health… as per paper article….Anand realises the risk and stops drinking …………Sreenivasa Rao
Sreenivasa Rao! Meaningful Opinion. Thanks for the analytical observations.
నాటకం బాగా రాసారు.
Thank you very much Sir
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™