“భద్రం కర్ణేభిశ్శృణుయామ దేవాః…..” శుభప్రదమైన మాటలనే విందుముగాక! అని వేదం ఆశంస. కాని, అటువంటి మాటలే వింటున్నామా? వినాలంటే ముందు అనాలి కదా! కల్యాణి అనేది ఒకరకమైన వాక్కు. ఆ లక్షణాలు ఉన్న వాక్కు శుభాన్ని కలిగిస్తుందిట! మాటలకి అటువంటి శక్తి ఉందన్నది అందరికి అనుభవంలో ఉన్న విషయమే. బాధలో ఉన్న వారికి ఒక ఓదార్పుమాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందో! గట్టిగా మాట్లాడి పిల్లలని భయపెట్టటం పెద్దలందరికి అలవాటే కదా! మంద్రస్థాయిలో కథలు చెపుతుంటే పిల్లలు నిద్రపోతారు. అంటే మాటలు మనిషి మనసు మీద ప్రభావం చూపిస్తాయని అర్థమవుతోంది కదా! మనుషుల మీద మాత్రమే కాదు జంతువుల మీద కూడా మాటల ప్రభావం ఉంటుందని అందరికి అనుభవంలో ఉన్నదే! ఇవన్నీ చూస్తూ కూడా మనం వింటున్న మాటల పట్ల అనాసక్తంగా ఎట్లా ఉండగలుగున్నాం? వింటున్న మాటల ప్రభావం అందరి మీదా తగినంతగా ఉంటుంది.
ఋష్యాశ్రమంలో పెరిగిన చిలక కూడా వేదాలు వల్లె వేస్తుంది. దుష్టుడి ఇంట పెరిగిన చిలక తన్ను, నరుకు, పొడు, చంపు అంటుంది. వాటికి ఎవరు ప్రత్యేకంగా నేర్పనక్కరలేదు. విన్నదానిని విన్నట్టుగా నేర్చుకున్నాయి. అదే విధంగా ఇంట్లో పెద్దలు ఎప్పుడు ఏమి మాట్లాడుకుంటూ ఉంటారో పిల్లలు అవే నేర్చుకుంటారు. నిత్యం పూజలు పునస్కారాలు జరిగే ఇంట్లో ప్రత్యేకంగా నేర్పించక పోయినా పిల్లలకి కొన్నైనా స్తోత్రాలు నోటికి వస్తాయి. అది వినికిడికి ఉన్న ప్రభావం.
పరీక్షాఫలితాల సీజన్ వచ్చిందంటే చాలు ఎవరో తరుముతున్నట్టు తమ విద్యాసంస్థకి వచ్చిన రాంకులు గొంతు చించుకుని అరుస్తుంటే వింటున్న వారికి దడ పుడుతుంది. గుండెలు అవిసి పోతాయి. ఈ నరకం అనుభవించటం అవసరమా?
పండగలు, పెళ్లిళ్లు, వేడుకలు వచ్చాయంటే ఆ హంగామా చెప్పనవసరం లేదు. లౌడ్ స్పీకర్లు కర్ణభేరిని పగలగొట్టేట్టు ఉంటాయి. వాటిలో పెట్టే పాటలలో చాలా వరకు ఫాస్ట్ బీట్, హై పిచ్. వాయిద్య ఘోష, ఉచ్చారణల పుణ్యమా అని మాటలు స్పష్టంగా లేక అర్థం కాక బతికి పోతున్నాం. అర్థం కూడా తెలిస్తే ……? సనాతన ధర్మాన్ని విమర్శించటానికి వేళాకోళం చేయటానికి ఇవి కొంత వరకు కారణాలు అవుతున్నాయి. వినాయక చవితి పూజ చేసుకుని, పాటలు చౌకబారువి పెట్టి, అందరి చెవులు చిల్లులు పడేట్టు చేస్తే భక్తి అవుతుందా? భగవంతుడి పట్ల అపచారం అవదా?
అసలు రొద మొదలయ్యేది ఇంట్లోనే. నట్టింట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తు నిరంతరం వాగుతూ ఉండే టీవిలో కార్యక్రమాలు ఎట్లా ఉంటున్నాయి? సత్ప్రవర్తన గురిచి ఒక్కమాట ఉండదు. పైగా అవహేళన. పెద్దలని ఎదిరించటం ఒక హీరోయిజంగా చూపించబడుతుంది. అమ్మని నాన్నని పేరుపెట్టి పిలవటం, చనువుగా ఉండటం అన్న పేరుతో ఎంత మాట పడితే అంత మాట అనటం సినిమాలలో హీరోల లక్షణం. ఎంత పొగరుగా మాట్లాడితే అంత గొప్ప.
పోనీ ఇంట్లో అయినా వాతావరణం ఎట్లా ఉంటోంది? మనుషులు కలిసి మాట్లాడుకునేదే తక్కువ. ఎవరి పనులలో వాళ్ళు ‘బిజీ’. మాట్లాడుకునేప్పుడు కూడా ఏమంత సొంపుగా ఉంటాయి ఆ మాటలు? ఒకరిని ఒకరు దెప్పిపొడుచుకోవటం, కోపం, చికాకు. నిరంతరం ఇవే వింటున్న అందరికి చిన్న పెద్ద అనే భేదం లేకుండ మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. దాని ఫలితమే నిరంతరం పోట్లాడుకోవటం. కుటుంబంలోనూ, సమాజంలోను ప్రశాంతత లేక పోవటం.
ఇవి అవసరమా? మంచి మాటలు వినలేమా?
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™