“కష్టపడి పెంచాం పిల్లలని” అనే మాట తరచుగా చాలా మంది అనటం వింటూ ఉంటాం. ఏం కష్టపడ్డారు? అని ప్రశ్నిస్తే, సమాధానాలు చిత్రంగా అనిపిస్తాయి. ‘చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సరిగా నిద్రాహారాలు లేకుండా ఉన్నా’మంటారు. ఆ మాట అనని ఏ తల్లితండ్రులైనా కూడా చేసే పని అదే. తమని పెంచిన వాళ్ళు కూడా అంతే కదా. వాళ్ళు అనరు అంతే. ‘కష్టపడి చదివించా’మంటారు. పిల్లలు “కష్ట పెట్టి చదివించారు”, “చదివించి కష్టపెట్టారు” అంటారు. చదివించటం తల్లితండ్రుల కర్తవ్యం. దానికి కష్టపడవలసిన అవసరం ఏముంది? ఎవరినో చూసి వాళ్ళ లాగా తామ పిల్లల్ని పేరు పొందిన స్కూళ్ళలో చదివించాలని తాపత్రయ పడటం, వాళ్ళకి నచ్చిన చదువులు కాక తమకు నచ్చిన చదువులు చదివించటం మొదలైనవి ఈ కష్టపడటానికి కారణం. ఈ క్రమంలో పిల్లలని అపురూపంగా చూసి వాళ్ళని నెత్తికెక్కించుకోవటం జరుగుతోంది. వాళ్ళు తరువాత తమని పట్టించుకోలేదు అనుకుంటే కారణం ఎవరు?
చదువు మాత్రమే కాదు ఇతర విషయాలు కూడా తాము ఏమి కోల్పోయామని అనుకుంటారో అవన్నీ పిల్లలకి అందించి నెత్తికెక్కించుకోవటం చూస్తాం. “నేను ఉద్యోగంలో చేరాక బండి కొనుక్కున్నాను. నా కొడుకుకి అటువంటి పరిస్థితి ఎందుకు?” అని చిన్నతనంలో సైకిలు, కాస్త పెద్దయ్యాక బండి కొని ఇస్తారు. అత్యవసరం అయితే కూడా ఆ పిల్లలు బస్ ఎక్కటానికి కానీ, ఆటోలో ప్రయాణం చేయటానికి కానీ ఇష్టపడరు. భోగమయంగా పెరగటం అలవాటు చేస్తారు.
“మాకు చిన్నప్పుడు ప్రత్యేకంగా ఒక గది లేదు. పరిచిపెట్టిన మంచం లేదు. ప్రతిరోజు మా పక్కలు మేమే వేసుకోవలసి ఉండేది. ఇంటికి ఎవరైనా వస్తే మా మంచం వారికి ఇచ్చి మేము కింద పడుకొనే వాళ్ళం. మా పిల్లలకి ఇటువంటి పరిస్థితి లేకుండా దర్జాగా పెంచాలనుకుంటున్నాం.” ఇటువంటి మాటలు తరచుగా వినపడుతూనే ఉంటాయి. చిన్నతనం నుండి వాళ్ళకి విడిగా ఒక గదిని ఇచ్చి, ఇంటికి బంధువులు వస్తే, తాము సద్దుకుంటారే కానీ, పిల్లల గదిలో సద్దుకోమని చెప్పరు.
పైగా, “వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ ఏకాంతానికి భంగం చేయము” అని వచ్చిన వారికి చెపుతూ ఉంటారు. దీనితో వాళ్ళలో పెంచినది ఏమిటి? నిస్సందేహంగా స్వార్థమే. అంతే కాదు, బంధుమిత్రులతో కలిసి మెలిసి ఉండటం అన్నది అలవాటు లేకుండా పోతోంది. తమ ఇంటికి వచ్చిన వారితో కలుపుగోలుగా ఉండకపోవటమే కాదు, పెళ్ళిళ్ళకి, ఇతర శుభకార్యాలకి రాకపోవటం జరుగుతోంది. మాట్లాడటం, పలకరించటం కూడా తెలియకుండా పోతోంది. పెద్దలు కూడా ఏమీ అనరు, చదువుకి అంతరాయం అని. “మావాడు ఎవరితో కలవడండి. మోహమాటస్తుడు. చదువు తప్ప మరొక లోకం తెలియదు” అని గొప్పలు చెప్పుకుంటారు. వీళ్ళు బయటికి వెళ్లినప్పుడు చదువుకుంటున్నాడో, ఛాటింగ్ చేస్తున్నాడో, ఏ సైట్లు చూస్తున్నాడో, ఎవరిని ఇంటికి పిలిచి ఏం చేస్తున్నాడో తెలియదు కదా. ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహించటం వల్ల కుటుంబసభ్యుల నుండి, బంధుమిత్రుల నుండి దూరం కావటం జరుగుతుంది. తన సర్కిల్ని తాను ఏర్పరచుకుంటాడు. కొన్ని సందర్భాలలో ఇంట్రావర్ట్లుగా కూడా మారటం జరుగుతుంది. క్రమంగా తల్లితండ్రుల నుండి దూరం అవటం జరుగుతుంది. ఇది వారి దోషమా?
ఈ క్రమంలో అర్థం చేసుకుంటే తల్లితండ్రులు పెంచినదేమంటే – అతిగారాబం వల్ల, తమంతటి వాళ్ళు లేరనే అహంభావం, పొగరు ఇత్యాదులు. తల్లితండ్రులు తాము ఏది కోరుకుంటే అది ఇచ్చే ATMలుగా భావించటం. తీసుకోవటం తప్ప ఇవ్వటం అన్న భావం లేకపోవటం. ఇతరులతో పంచుకోవటం అన్నది ఏ కోశానా లేకపోవటం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™