ఇదొక రకం మానసిక అస్వస్థత. ప్రస్తుతం అందరూ దీని బారిన పడ్డవాళ్లే. తప్పించుకోవడం,నూటికో కోటికో ఒక్కరివల్ల అవుతుంది. ప్రత్యేకించి చెప్పుకోదగ్గ రుగ్మత కాదు. అయితే కొంచెం తేడాయే అని ఒప్పుకోక తప్పదు. ఓ ముప్పయ్యేళ్లు దాటాక వచ్చే ఇబ్బంది ఇది. ఇప్పుడు మనందరికీ ఉన్నఅనారోగ్యం ఇదే.
లాస్ అఫ్ ఇన్నోసెన్స్ అంటే ఏం లేదు.. మనకున్న సున్నిత, లలిత, సుకుమార భావాల్ని కోల్పోవడం. పాలబుగ్గలప్పటి పసితనం, కపటం తెలీని అద్దంలాంటి మానసం, ఉత్సాహం ఇప్పుడు మన దగ్గర లేకపోవడం.
ఈ విషయం మనం గుర్తించం. అప్పుడప్పుడూ గమనించి కొంచెం బాధపడుతూ ఉంటాం. అయ్యో అనుకుంటూ ఉంటాం. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది ఎనభైల తర్వాత వచ్చే సమస్య. అలాగే ఇప్పుడు ఇదీ సమస్య. మన కష్టాలన్నిటికీ కారణం ఇదే. చిన్నప్పటి అమాయకత్వం, లేత మనసూ పోగొట్టుకోవడం, తద్వారా మన ఆనందాల సంఖ్యా తగ్గిపోవడం. ఇప్పుడు మనం ఏ విషయం విన్నా నిరాసక్తత ప్రదర్శిస్తూ, ఆశావాదానికి దూరంగా, నిరాశావాదానికి దగ్గరగా జరిగిపోతున్నాం.
ఇవాళ ఎవరైనా తలుపు కొట్టి కిలో బంగారం ఇచ్చిపోతే ఆనందంగా ఉంటామా? చచ్చినా ఉండం. ఇచ్చిన వాడెవడు? ఎందుకిచ్చాడు? దేవుళ్ళు ప్రత్యక్షం అయ్యి వరాలివ్వడం అనేది మన అనుభవంలో లేని విషయం. కాబట్టి వీడెవడో దొంగ కావచ్చు. కొంత సేపయ్యాక పోలీసులు రావచ్చు. మనల్ని లోపల వెయ్యొచ్చు. గొప్ప టెన్షన్! ఇవాళ కాకపోతే రేపైనా రావొచ్చు. ఇదీ వరస. అప్పనంగా ఏమైనా దొరికినా మనం తట్టుకోలేం. భయంతో వణికి ఛస్తాం.
మనం కాలేజీ రోజుల్లో దేశానికి ఎన్నికలొచ్చినపుడు, వివిధ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలు జాగ్రత్తగా చదివి మురిసిపోయేవాళ్ళం. ఓహో, సంక్షేమ రాజ్యం వచ్చేస్తోందన్నమాట అనేస్కుని ఆనందపడేవాళ్ళం. ఇప్పుడైతే ఎన్నో ఎన్నికలు చూసిన అనుభవంతో మేనిఫెస్టో అంటే ఉత్తుత్తి సరదా కాగితం అని గ్రహించినవాళ్లమై సరిగా చదవనుకూడా చదవం. అది చాలా తప్పు. ఏం? మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కొత్త ముఖ్యమంత్రి చేసేస్తాడని ఎందుకు అనుకోకూడదు? ఆయన కాకపొతే ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యాకైనా ఆ మేనిఫెస్టోలో కార్యాలు పూర్తవుతాయని ఎందుకు నమ్మకూడదు? ఆశిస్తే పోయేదేముంది? కాస్త నిరాశ తప్ప? మన జేబులో డబ్బేమీ పోదు కదా! భవిష్యత్తులో మనం ఆశాభంగం చెందకూడదన్న స్వార్థంతో మనలో మనమే సణుక్కుంటూ, ఈనాడు పబ్లిక్ మీటింగ్‌లో రాజకీయనాయకులు చేసే వాగ్దానాలను వినడమే మానేసి, పేపర్ కూడా చదవకుండా మూసెయ్యడం వల్ల మన ఆరోగ్యమే పాడవుతోంది.
ఎంతో మంది మన కుటుంబం లోని వాళ్లే అన్నమాట తప్పుతారు. మనం తిరిగి ఏమీ అనకుండా మౌనంగా ఉంటున్నామా, లేదా? ఒక్కటంటే పదంటారన్న భయంతో. అలాగే ఇదీనూ. మరంచేత రేపటినుంచీ మనందరం ఇంకొంచెం అమాయకంగా ఉందాం. ఆనందంగా ఉందాం. ఎవరో వచ్చి చెవిలో పువ్వులు పెట్టేస్తున్నారని వాపోవడం ఎందుకు? అవన్నీ దండగా చేసుకుని గుచ్చి ఏ దేశభక్త నాయకుడి ఫోటోకో వేసేస్తే సరిపోతుంది కదా! వారసులు ఇలా అయినా పనికొచ్చారని ఆ పెద్దాయన పై లోకంలోంచి ఆనందిస్తాడు కదా! సో, బీ ఇన్నోసెంట్. అమాయకత్వాన్ని పోగొట్టుకోకండి.
అమాయకంగా ఉన్నంతవరకే ఆనందం. అలాగే ఉండడానికి కృషి చేసి ప్రయత్నించడం మంచిది, దాని వల్ల గొప్ప సుఖం, సౌఖ్యం ఉన్నాయి. అంచేత పోగొట్టుకున్న పసితనాన్ని కష్టపడి తిరిగి తెచ్చుకుందాం. అది ఉంటే మనమే ఋషులం. అదృష్టం కలిసొస్తే మహర్షులం కూడా అయిపోవచ్చు.
ఎవరైతే దైనందిన జీవితంలో ఎక్కువ ఆనందంగా ఉంటున్నారో వారు అమాయకత్వపు విత్తనాల్ని జాగ్రత్తగా నాటి, వాటిని ఓపిగ్గా పాదుచేసి పెంచుతున్నారన్నమాట. చక్కగా, ఆశాలతల్ని పైకి పాకించి, ఆశావహ పుష్పాల్ని పూయిస్తున్నారన్నమాట. ఆ విధంగా ఒక సంతోషాల పూదోట తయారు చేస్తున్నారన్న మాట. గొప్పసంగతే మరి.
అనుభవాల భారంతో, ఊరికే బోలెడు విషయాల గురించి ఆలోచించేసి,అప్పుడలా అయ్యింది, ఇంకెప్పుడో అలా అయ్యింది అని బుర్రంతా ఏవేవో విషయాలతో డేటా నింపేసి, అప్రమత్తంగా బతికెయ్యడం అవసరమా మనకి? ఏదో సరదాగా లైట్, లైట్‌గా ఉంటే మనసుకెంత స్థిమితంగా ఉంటుందో కదా! ఆలోచించండి. అయినా మనకి రోజు చివరికీ, జీవితం చివరికీ మిగిలేవి గుప్పెడు ప్రశాంతతా, దోసెడు మనశ్శాంతీ మాత్రమే కదా!
పసిపిల్లలెందుకంత సంతోషంగా ఉంటారు? చిన్న చిన్న విషయాలకే మురిసిపోతుంటారు. సముద్రం ఒడ్డున ఉండే చిన్న చిన్నగవ్వల్ని బుజ్జి బుజ్జి చేతుల్తో ఏరి జేబులో వేసుకుంటూ పొంగిపోతుంటారు. అంతమాత్రానికి మనం “ఎందుకవి? ఏం చేసుకుంటారు? పారెయ్యండి” అని పిల్లల్ని బెదిరించక్కర్లేదు.అప్పటి వాళ్ళ ఆనందం నిజమే కదా! వాళ్ళు బుడగలు ఊదుకుంటూ ఉంటే అవి ఎప్పుడు పేలిపోతాయో అనుకుంటూ మిడిగుడ్లేసుకుని చూడొద్దు. అలాంటి సంతోషం పొందే అదృష్టం మనం పోగొట్టుకున్నాం. కాబట్టి కాస్త నిదానిద్దాం. వీలయితే వాళ్లతో జాయిన్ అవుదాం, లేదంటే మౌనంగా ఉందాం.
ఎప్పుడైనా గాలి మళ్లి సంక్రాంతికి మన గ్రామాలకి బయలుదేరి వెళ్లినా, పండగ మూడు రోజులూ ఉండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. పండగ సీజన్లో డబుల్ అయిన బస్సు చార్జీలూ, అక్కడా ఇక్కడా తిరిగిన టాక్సీ ఖర్చులూ తడిసి మోపెడు అవ్వగానే, ఊరు వెళ్లి వచ్చిన ఆనందం ఆవిరైపోతుంది. ఇంతలో మళ్ళీ పోవద్దు బాబూ అనేసుకుంటాం. ఊరినీ, అక్కడున్న ఆత్మీయుల్నీ చూసిన ఆనందం కొంత ఉన్నాఆ ప్రభల తీర్థంలో తిరగడం, కొబ్బరి తోటల్లో నడవడం ఇవన్నీ శరీరం తట్టుకోలేదు. అంచేత అలాంటి ప్రోగ్రామ్స్‌ని తప్పించుకుంటాం. ఇక ఆటలాడడం,ఊరంతా తిరగడం మన వల్ల అయ్యే పని కాదు. ఏదో కాస్త ముచ్చట పడినా చివరికి బాబోయ్ అనిపించేస్తుంది బాడీ. ఇదే మరి అమాయకత్వం పోగొట్టుకోవడం అంటే. కాస్త ఓర్చుకోవాలి. పాపం మనూరు ఫీలవదూ! మనం ఇలా అనుకుంటున్నామని తెలిస్తే.
అయితే యాంత్రికమైన నగర జీవనం తప్పనిసరి కాబట్టి జీవనం నడిపిస్తుంటాం. చిన్నప్పటి అనుభూతులూ, అనురాగాలూ, ఆనందాలూ ఇప్పుడు లేవే అని వాట్సాప్‌లో ఎవరో పంపినప్పుడు మనసులో ఓ క్షణం దుఃఖ పడి రొటీన్లో పడి పోతాం. దిగులు పడి కూర్చుంటే పనులాగిపోతాయికదా.
మన అమాయకత్వాన్ని మాయం చేస్తూ అనుభవాలు నేర్పిన పాఠాల్ని పదే పదే గుర్తుచేసుకోకండి. అవి మనల్ని కొత్త అనుభూతుల లోనికి పోనివ్వకుండా చెయ్యి పట్టి ఆపేస్తాయి. తద్వారా మనం వినేసిన లెక్చర్ మళ్ళీ వింటున్నట్టుగా జీవితంపట్ల విసుగు చెందే ప్రమాదం ఉంది. మనం ఇలా చీటికీ మాటికీ మన నెగటివ్ అనుభవాల్ని కోట్ చేసుకుంటూ కూర్చుంటే జనం మనల్ని నెగటివ్ మనిషి గానూ, చెడు కోరే వ్యక్తిగానూ భావిస్తారు. పెద్ద మనిషి అన్న బిరుదు ఇవ్వరు సరికదా మనం కనబడగానే పారిపోతూ ఉంటారు, గుర్తుంచుకోండి.
అప్పటికే బోలెడన్ని విఫల ప్రయోగాలు చేసి కొంత పొలం అమ్మేసిన మీ బంధువొకరు ఇంటి కొచ్చి, అత్యంత ఉత్సాహంగా తాను మొదలెట్టబోయే సరికొత్త వ్యాపారం గురించి చెప్పబోతాడు. మీరు మొహం మాడ్చుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. సరదాగా వినండి. అమాయకంగా మొహం పెట్టండి. ‘ఆల్ ది బెస్ట్’ చెప్పండి. ఓ పూట భోంచేసి వెళ్ళిపోతాడంతేగా! మీరేమీ అతనికి సుద్దులు చెప్పడానికి ఉద్యుక్తులు కాకండి. మనకీ, అతనికీ టైం అండ్ మూడ్ వేస్ట్.
కొత్తగా సహాయకురాలిగా చేరిన అమ్మాయిని చూసి, “భలే చురుకైన పిల్ల దొరికిందండీ!ఎంత బాగా చేస్తోందో!” అంటూ మీ అర్ధాంగి మురిసిపోతోందనుకోండి. “ఈ ముచ్చట మూన్నాళ్ళే, కొత్త తీరాక ఎగ్గొడతారు” అని మీరు కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారి మొహం పెట్టుకుని జోస్యం చెప్పెయ్యకండి. “లక్కీ లేడీవమ్మా! అలాగే సుఖపడవమ్మా!” అని దీవించెయ్యండి. ఆల్ ఖుష్. పక్క వాళ్ళని ఆనందంగా ఉండనిస్తేనే పిసరంత ఆనందం మనకీ పంచుతారు. లేకపోతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లన్నీ రుసరుసల్తో పోపు వెయ్యబడతాయ్. ప్రమాదాలు రాకుండా నివారించుకునే తెలివితేటలూ అవసరమే.
ఊరికే పెద్ద మనిషిలా, మెచ్యూరిటీ ఒలకబోస్తూ కూర్చుంటే లాభం ఏమీ ఉండదు. మొహంలో ముడతలు రావడం తప్ప. పైగా జనం మనల్ని దూరంగా పెడతారు. మరంచేత నా మాట విని బుద్దిగా చక్కగా వయసు రీత్యా పోగొట్టుకున్న అమాయకత్వాన్నీ, పసితనాన్నీ నిర్మొహమాటంగా అరువు తెచ్చుకోండి. ఆనందంగా ఉండండి. కనీసం నటించండి. వాళ్ళూ వీళ్లూ చెప్పే అర్థం పర్థం లేని కబుర్లు వినండి. మరీ విసుగెత్తితే మనల్ని రక్షించే వాట్సాప్ ఫోన్ చేతిలో ఉండనే ఉంటుంది.
ఇంట్లో ఉన్న సాఫ్ట్వేర్ పిల్లలు, ఓ వారాంతం లో ఓ.టీ.టీ. లో విడుదలైన ఒక ప్రాంతీయ చిత్రం ప్రదర్శిస్తూ మురిసిపోతూ ఉంటారు. కుప్ప తెప్పలుగా ప్రాంతీయ అసభ్య పదాలతో ఉన్న ఆ చిత్రరాజాన్ని చూస్తూ మీరు బీ. పీ. పెంచుకోవడం అనవసరం. మీరు చూసేసిన వేల, వేల సినిమాల అనుభవంతో అదొక పిల్ల ప్రయోగంలా మీకనిపించొచ్చు. తప్పులేదు. అవన్నీ గుర్తుచేసుకుని మీ బుర్రకి బోలెడంత పని చెప్పే బదులు వాళ్ళ పక్కనే బుద్ధిగా కూర్చుంటే వాళ్ళు మేస్తున్న చిప్సో, మురుకులో, పాప్ కార్నో మీక్కూడా పెట్టకపోరు. అవి నములుతూ ఆపై వాళ్ళిచ్చే రెండు పెగ్గులు కూల్ డ్రింకు తాగుతూ ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మీద జాలి పడుతూ కూర్చోండి. పైకి ఇలాంటి సినిమా ‘న భూతే.. న భవిష్యత్తే’ అన్నట్టు మొహంలో భావం చూపించండి. మీ సొమ్మేం పోతుంది? అప్పుడు కదా మీ ఇన్నోసెన్స్ మిమ్మల్ని వదలకుండా ఉండిపోతుంది. ఏమంటారు? ప్రయత్నపూర్వకంగా మనలోని జ్ఞానాన్ని తగ్గించుకుని, నిర్మలత్వం పెంచుకుంటూ పోతే హృదయం తేలికగా ఉంటుంది. సీతాకోక చిలుకల్నీ, చెట్లపై వాలే పేరు తెలియని పిట్టల్నీ, కింద రాలిన పువ్వుల్నీ చూసి మురిసిపోవడం, వీలయితే ఏరుకోవడం అలవాటు చేసుకుని చూడండి. ఎంత బావుంటుందో!
అసలు జీవితం అంటేనే కాస్త అమాయకత్వం లో బతకడం! అప్పుడూ, ఇప్పుడూ మొట్టికాయలూ, వీపు చరుపులూ పడుతూ ఉండడంలోనే మజా ఉంటుంది. అలా కాకుండా మహా తెలివిగా, గడుసుగా, బోల్డంత ముందు చూపుతో, కావలసినంత ప్లాన్‌తో ‘రోబో’లా బతకడంలో ‘కిక్కే’ లేదు తెలుసా! ఏమంటారు?
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
సమకాలీన ప్రపంచపు జీవితచిత్రణలే ీ ఈ కాలమ్స్… కాలమ్స్ ఒకదానిని మించి మరొకటి హైలైట్ గా వస్తున్నాయి… అమాయకపు అల్లూరి కలం నుండీ! 🌹😊😅💐👏🙏🏻
రచయిత👍 సంతోషంగా ఉండటానికి అమాయకత్వాన్ని పునరుజ్జీవింపజేయవసరము బాగా ప్రస్తావించారు.
Marvellous write up mam Loved it a.lott .. Manam కోల్పోతున్న సున్నితత్వాన్ని చెప్పకనే చెప్పారు..
innocent persons can enjoy with everyone. Well said.
Innocence is a bliss అనే విషయాన్ని ఎంత అందంగా చెప్పారండీ గౌరీ లక్ష్మి గారూ. 👏👏👏
Excellent madam..🙏💐👏👏entha baga chepparandi…Arati pandu valichinattuga
I need to develop innocence. It is very important to me. Syamala..KKP
👌👌Yes Madam…Innocence gives Inner Happiness… We must accept time to time changes….and happy all the time…. Venumadhav..Guntur
పోతే…జ్ఞానం కొంత వొదులుకుని నిర్మలత్వం…😍 మరీ రూళ్లు కర్రల కంటే రవంత పసిడి బుగ్గల అమాయకత్వం తలుచుకుంటేనే..పడితే ఏం? తగిలితే ఏం.. ఎంత బావుందో..మీకలాన్ని వయసును బట్టి,అభినందించవచ్చు..నమస్కరించవచ్చు..వూ..కౌగలించుకోవచ్చు. ఈమెనోసారి చూడాలి..ఒకసారైనా ప్రేమించాలి అనిపిస్తాయి మీ మాటలు..💐💐💐 Malleeswari…Guntur
Dear Gouri Lakshmi garu, the topic”Loss of Innocence… Treatment ” is realistic and convincing. When we get bored with life and its events, we become restless, disgruntled and time becomes a big drag. That helps dialogue, discussion and leads to interest in life. Very well analysed. Always one should not lose interest in the happenings around. Seshamma. KAKINADA
Innocence is bliss gauri, my father used to be like that, he lived above 95 years gauri, you gave an apt message to the society, keep going Gauri Radha..Hyd
చాలా బాగుంది. నీవు చదివితే ఇంకా బావుండేది. Vijaya..Hyd
శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారి రంగుల హేల 37 లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ …ట్రీట్మెంట్ చాలా బాగుంది నిర్మలత్వం పెంచుకుంటూ పోతే అంటూ చెప్పిన విధానం చాలా బాగుంది . ప్రతివారం సంచిక కోసం ఎదురుచూస్తూ ఉంటున్నాము రంగుల హేల కోసం అంటే అతిసయోక్తి కాదు ఉషా లక్ష్మి చైతన్యపురి
మన కథే ఇది G.Lakshmi..Vja
Baavundi Hema
Nice…raa Hyma
చాలా చాలా బాగుంది మేడం గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. ఇది నాలోని అమాయకత్వాన్ని నిద్రలేపి చెప్పేమాటగా కాక, నా సహజ అవగాహనగా తెలియజేస్తున్నాను. ఇది చాలా చాలా బాగా రాశారు 🎉🎉 ఇలాంటి రచనలు మీకే సాధ్యం. మీరే ఇంత బాగా రాయగలరు 🎉🎉 ఎంత విశ్లేషణతో ఉందో…..🎉🎉 చాలా సామాన్య మైన వివరాలతో చక్కటి మనోరంజకమైన రచన చేశారు. శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌷🌷🌺🌺🌸🌸🌹🌹ఫిదా🎉 Venkataramana..Hyd
Loss of innocence ని మరల ఎలా తెచ్చుకోవచ్చు అనేది గుర్తు చేశారు గౌరీ లక్ష్మి గారు! నిజంగా అది ఎక్కడికీ పోదు. మనందరిలో మనతోపాటు ఎప్పుడూ ఉంటుంది.మనం ఇలాగే ఉండాలి అని పెట్టుకునే హద్దుల్లో దా న్ని దాచి పెడుతున్నాం జయవేణి, గుడివాడ
Your column 👌👌👌 Durga..Bhimavaram
😅. సూపర్ సే బహుత్ బహుత్ ఊపర్ హయ్…. పెదవులపై చక్కటి నవ్వుల్నీ పూయించింది… చాలా బాగా రాశారు బంగారం…. ❤️ Kaasimbi..Guntur
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™