మనోరమ తన అన్న మకరంద్ని వెతుకుతూ, చీకట్లో, కళామందిర్ పరిసర ప్రాంతాలన్నీ తిరుగుతూ, కనిపించిన మార్గాన్ని అనుసరించి వడివడిగా పోతుంటే, వెనక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. చూస్తే లాల్మియా! “మా అన్న ఎక్కడున్నాడు? స్త్రీ వేషంలో నీ దగ్గరికి వచ్చాడు కదా” అని ధైర్యంగా అడిగింది. ‘ఓ, వాడా! చూపిస్తాను రా’ అని నమ్మకంగా ఆమెను ఒక పెద్ద గోరీ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అది ఒక పెద్ద రాతి కట్టడం. ‘లోపలవున్నాడు మీ అన్న’– అని చెప్పిన లాల్మియా మాటలు నమ్మి ఆ గోరి లోపలికి ప్రవేశించింది మనోరమ. వెంటనే తలుపులు బంధించి గబగబా వెళ్ళి పోతున్న లాల్మియాకి ఒక రక్షక భటుడు ఎదురయ్యాడు. అతడు పురుషవేషంలో ఉన్న అవంతి అని తెలియక, సాయం చేయమని అడిగాడు. “సింహళ ద్వీపం నుండి ఇక్కడకు వచ్చి వలువల వ్యాపారం చేస్తున్నాను. నా భార్య మాధురీ బేగంని వదిలించుకొని, తీరా వస్తే, ఇప్పుడు ఆమె నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. నువ్వు లోపలకి వెళ్లి వ్యాపారరీత్యా ఓడలో వెళుతున్న లాల్మియాని దొంగలు చంపి సముద్రంలో పడవేసారన్న వార్త అధికార రీత్యా అందిందని నమ్మించి చెప్పాలి. అప్పుడు మాధురి బేగం తిరిగి వెళ్ళిపోతుంది” అంటూ, తన ముద్రికను ఇచ్చాడు. “దీనిని చూపిస్తే లోపలున్న కాపలాదారుడు నిన్ను అనుమతిస్తాడు. ఈ ఉపకారం చెయ్యి” అని ముద్రికను ఇచ్చాడు లాల్మియా.
ముద్రికను తీసుకొని ధైర్యంగా లోపలికి ప్రవేశించింది అవంతి. అక్కడ ఉన్న కాపలాదారుడు ముద్రికను చూసిన తర్వాత, ఆమెను మాధురీ బేగం దగ్గరకు తీసుకు వెళ్ళాడు. తన పేరు జయంతుడు అని చెప్తూ, లాల్మియా మరణించాడు అని చెప్పింది అవంతి.’ పీడ వదిలింది’ అంటూ ఆనందంతో జయంతుని చేతులు పట్టుకొని ముద్దాడింది బేగం.
“ఇప్పటికీ ఎనిమిది తరాల నుండి సింహళ ద్వీపమును మా పూర్వీకులు పరిపాలిస్తున్నారు. తొమ్మిదవ తరం నేను రాణిని కావలసింది. లాల్మియా మా అమ్మకి తమ్ముడు, నాకు రెట్టింపు వయసు ఉన్నవాడు. చిన్నప్పటినుంచి జులాయిగా తిరుగుతూ ఏవేవో మంత్ర తంత్రాలు నేర్చుకొని ఎన్నెన్నో దుర్మార్గపు పనులన్నీ చేస్తూ ఉండేవాడు. మారుతాడేమోనన్న అమ్మమ్మ ఆశ, కోరిక వలన వీడిని వివాహ మాడినందుకు ఎన్నో కష్టాలు పడ్డాను. వాడి దుర్మార్గాలన్ని అడ్డగిస్తానని వాడికి నా మీద ద్వేషం. వాడి కంటే నాకు మరింత మంత్ర శక్తి ఉంది కాబట్టి వాడి విద్యలన్నీ తిరగకొట్టేదాన్ని, అందుకని నా ముందు నిలవలేక పారిపోయాడు. రెండేళ్ళ తర్వాత కొందరు గూఢచారుల వల్ల అతను ఇక్కడ ఏదో వ్యాపారం చేస్తున్నాడని తెలిసి కడసారి బుద్ధి చెప్పాలని వచ్చాను. ఆ అవసరం లేకుండా వాడు చచ్చాడు అన్న శుభవార్త నీ వల్ల తెలుసుకున్నాను. నన్ను చపలచిత్తురాలిననుకోవద్దు. ఈ శుభవార్త చెప్పిన నీ యందు నా మనసు లగ్నం అయిపోయింది. భగవంతుడు నిన్ను నా దగ్గరకు పంపించాడు” అన్నది మాధురీ బేగం. అంతలో పులి గాండ్రింపులు విన్న జయంతుడు అదేమిటని ప్రశ్నించాడు. ‘వికారి’ అనే పులి అనీ, ఇటీవల ఒక యువకుడిని దానికి ఆహారంగా వేశారని చెప్పింది బేగం. తన భయాందోళనలను మనసులోనే దాచుకుని “నేను ఆ పులిని చూడవచ్చా” అని అడిగాడు జయంతుడు. కొందరు భటులు దారి చూపగా మాధురీ బేగం జయంతుని ఆ పులి ఉన్న బోను దగ్గరికి తీసుకు వెళ్ళింది. అక్కడ పులితో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మకరంద్ని చూసి , జయంతుని ప్రాణాలు ఎగిరి పోతున్నంత పని అయింది. “అతడు నా స్నేహితుడు రక్షించండి” అని బేగంని ప్రార్థించాడు జయంతుడు. అప్పటికే అతని మీద ప్రేమ పెంచుకున్న రాణీ బేగం, భటులచే పులిని బంధించి మకరంద్ని విడిపించింది. వైద్యులను పిలిపించి మకరంద్ గాయాలన్నింటికి వైద్యం చేయించింది. శ్రద్ధగా పరిచర్యలు చేసి మకరంద్ కోలుకునేటట్లు సేవ చేసింది జయంతుని వేషంలో ఉన్న అవంతి.
మనోరమ గోరి లోకి ప్రవేశించిన తర్వాత తాను మోసపోయానని గ్రహించింది. కానీ లాల్మియా లోనికి ప్రవేశించకుండా లోపల గడియ వేసుకుంది. ఆ చీకటిలోనే మసకగా కనిపిస్తున్న మెట్లు దిగుతూ కిందకి వెళ్ళసాగింది. అంతలో ఆమెకి ఒక ఛాయా రూపం ఎదురుగా గోచరించడంతో భయంతో స్తంభించిపోయింది.
***
తెలతెలవారుతుండగా కథను ఆపింది సారంగి. మహారాజు శయనాగారమును వదిలి వెళ్ళాక రాగలత సారంగిని తీసుకుని “కొంత తడవు ఫల వృక్షాలతో ఉన్న ఉద్యానవనానికి వెళ్తాను” అని చెలులతో చెప్పి బయలుదేరింది. సారంగి దారి చూపుతుండగా, మొగలి పొదలు వద్దకు వెళ్లింది రాగలత. అక్కడ చిలుక శరీరాన్ని వదిలి, గుబురుగా ఉన్న ఆ మొగలి పొదల లోపల దాచి ఉంచిన తన శరీరంలోకి ప్రవేశించాడు జయదేవ్. అద్భుత రూపు రేఖా విలాసములతో, తన ఎదుట నిలిచిన జయదేవుని చూచి ఆనంద పరవశం అయినది రాగలత. ఇరువురు సర్వం మరచి ఆ ఉద్యానవనంలో విహరించారు. కొద్దిసేపటికి ఏదో సవ్వడి విన వచ్చినది. అది ఒక విధమైన గంటల సవ్వడి. అంతలో చెలుల పిలుపులు విన్న జయదేవ్, తన శరీరాన్ని పొదలమాటున దాచి, చిలుక లోకి పరకాయ ప్రవేశం చేశాడు. చెలులు సమీపించి భయకంపితులై “ఎవరో ఒక విచిత్రాకారుడు రంగురంగుల గుడ్డ పేలికలు చుట్టుకొని, ఒంటినిండా చిరుగంటలు కట్టుకొని, చింపిరి జుట్టు పొడవు గడ్డంతో, మమ్మల్ని పట్టుకోవాలని చూశాడు. మేము పారిపోయి మీకోసం వెతుక్కుంటూ వచ్చాము” అని చెప్పారు. రాగాలత సారంగిని తీసుకొని వాళ్ళ వెంట రాణి వాసాభి ముఖముగా బయలుదేరింది.
(మనోరమకి గోచరించిన ఛాయా రూపం ఎవరిది? మాధురి బేగం లాల్మియాల మధ్య వైరం ఏమిటి? అది ఏ రూపంగా పరిణమించబోతుంది? తరువాయి భాగంలో…..)
(సశేషం)
డా. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో పనిచేసి, ప్రిన్సిపాల్‌గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్‌గా, ఎడిటర్‌గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. విద్యార్థినులు చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం తన కెరీర్లో ఆమెకిష్టమైన పనులు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం సంతృప్తి కలిగించిందంటారు.
EXCELLENT
Raanu raanu katha oopu andukontundi katha nu kudinchi chaala chakkaga asakthi karamaina vidhamuga vraastunnaru paiga paatha novels loni andamaina mukhachitram nu kooda andistunnaru JAGAJJANA novel teliyani chaalamandi pathakulaku meeru andinche sampkhiptha katha chadivina taruvaatha Jagajjana novel konukkovalane korika tappakunda kalugutundi. Super
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™