(తతః ప్రవిశతి కఞ్చుకీ)
కఞ్చుకీ – (సనిర్వేదమ్) –
రూపాదీ న్విషయా న్నిరూప్య కరణై
ర్యైరాత్మలాభ స్వయా
లబ్ధ, స్తేష్వపి చక్షురాదిషు హతాః
స్వార్థావబోధక్రియాః,
అఙ్గాని ప్రసభం త్యజన్తి పటుతా
మాజ్ఞావిధేయాని తే,
న్యస్తం మూర్ధ్ని పదం తవైవ జరయా;
తృష్ణే, ముధా తామ్యసి॥ (1)
రూప+అదీన్+విషయాన్=శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే అయిదు ఇంద్రియ చర్యలను, యైః+కరణైః= ఏ చక్షుః, శ్రోత్ర, త్వన్, జిహ్వ, ఘ్రాణాలనే జ్ఞానేంద్రియాల సహాయంతో (అవి ఉపకరణాలుగా), త్వయా=నీ చేత, ఆత్మ+లాభః+లబ్ధః=స్వకీయమైన లబ్ధి (జన్మ అనేది) పొందడం సంభవమైనదో, తేషు+చక్షుం+ఆదిషు+అపి=ఆ నేత్ర, నాసాదులతో కూడా, స్వార్థ+అవబోధ+క్రియాః=తమ తమ విషయాలు బోధపడే పనులు, హతాః=అణగారిపోయాయి.
(అదే విధంగా) – తే+ఆజ్ఞా+విధేయాని=నీ ఆదేశాలకు లోబడి వుండే, అఙ్గాని=శరీరావయవాలు, ప్రసభం=తొందరగా, పటుతాం=పటుత్వాన్ని, త్యజన్తి=విడిచిపెడుతూంటాయి.
(అంతేకాదు) తవ+మూర్ధని+ఏవ=నీ శిరస్సుపైనే, జరయా=వార్ధక్యం కారణంగా, పదమ్+న్యస్తమ్=కాలుమోపడం జరిగింది (ముసలితనం నెత్తికెక్కింది). తృష్ణే=ఓ కామాది విషయాలనే దాహమా!, ముధా=వ్యర్థంగా, తామ్యసి=జాగు చేస్తున్నావే!
అంతఃపురాలలో వాళ్ళ అవసరాలు చూస్తూ తిరిగే వృద్ధుణ్ణి కంచుకి అంటారు. ఎంతో జీవితాన్ని కామాది వికారాల్ని చూసి – ముసలితనపు ఓపిక లేమి వల్ల విసుగుతో బాధపడే వ్యక్తిలోని వైరాగ్యాన్ని యీ శ్లోకం విశదం చేస్తోంది. యౌవనంలో ఎంతో చురుకుదనానికి, ఉత్సాహానికీ కారణాలైన శరీరావయవాలలో శక్తి సన్నగిల్లిపోతుంది. ఇంద్రియ చర్యల సూక్ష్మ స్పందనలు నశించిపోతాయి. ముసలితనం నెత్తి మీద కూర్చుంటుంది. – ఈ పనికి మాలిన వయస్సులో ఆశలు మాత్రం చావడం లేదని – యీ కంచుకి నిర్వేదం.
వరుసగా – వార్ధక్యపు నిరర్ధకతను చెప్పడానికి కారణాలను వరుసగా కూర్చడం వల్ల కారణమాలాలంకారం (గుమ్భః కారణమాలాస్యాత్ యథా ప్రాక్ప్రాన్త కారణైః – అని కువలయానందం).
శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.
(పరిక్రమ్య, ఆకాశే) ‘భోభోః, సుగాఙ్గ ప్రాసాదాధికృతాః పురుషా, సుగ్రహీతనామా దేవ శ్చన్దగుప్తోవః సమాజ్ఞాపయతి‘.. ‘ప్రవృత్త కౌముదీ మహోత్సవ రమణీయం కుసుమపుర మవలోకయితు మిచ్ఛామి. తత్ సంస్క్రియన్తా మస్మద్దర్శన యోగ్యా సుగాఙ్గ ప్రాసాదో పరిభూమయః,’ ఇతి. (పునరాకాశే) కిం బ్రూథ ‘ఆర్య, కి మవిదత ఏ వాయం దేవస్య కౌముదీ మహోత్సవ ప్రతిషేధః‘ ఇతి? ‘ఆ దైవోపహతాః, కి మనేన వః సద్యః ప్రాణహరేణ కథోపోద్ఘాతేన? శీఘ్ర మిదానీమ్.
(పరిక్రమ్య=ముందుకు నడిచి, ఆకాశే=ఆకాశం వైపు చూపు నిలిపి) – ‘భోభోః=అయ్యా, అయ్యలారా! (వినండి), సుగాఙ్గ+ప్రాసాద+ఆధికృతాః+పురుషాః=సుగాఙ్గ రాజప్రాసాదంలో నియుక్తులైన ఉద్యోగులారా! (మీకిదే చెప్పడం!), సు+గ్రహీతనామా+చన్దగుప్తః=జగప్రసిద్ధుడైన చంద్రగుప్తుడనే పేరిటి వాడు, దేవః=మన ప్రభువు, వః=మీకు (మిమ్ము), ఆజ్ఞాపయతి=ఆదేశిస్తున్నాడు’ – ‘ప్రవృత్త+కౌముదీ మహోత్సవ+రమణీయం+కుసుమపురం=వెన్నెల పండుగ శోభ నడుస్తున్న అందమైన పాటలీపుత్రాన్ని, అవలోకయితుం+ఇచ్ఛామి=చూడాలనుకుంటున్నాను. తత్=అందువల్ల, అస్మత్+దర్శనయోగ్యాః+సుగాఙ్గ+ప్రాసాద+ఉపరి+భూమయా=సుగాఙ్గ భవనంపై (నుండి) మేము (పట్టణాన్ని) చూడదగిన ప్రదేశాలను, సంస్క్రియన్తాం=అలంకరించండి (ఆ ప్రదేశాలు అలంకరింపబడుగాక)’ ఇతి- అని. (పునః=మళ్ళీ, ఆకాశే=ఆకాశంలోకి దృష్టి నిలిపి) కిం+బ్రూథ=ఏమంటున్నారు?, ‘ఆర్య=అయ్యా (కంచుకి గారూ), దేవస్య+కౌముదీ+మహోత్సవ+అయం+ప్రతిషేధః=దేవరవారికి వెన్నెల పండుగ నిషేధింపబడినట్టు, అవిదతః+ఏవ+కిమ్=తెలియదా ఏమి’ ఇతి=అని (అంటున్నారా?) – ‘ఆః=అయ్యో, దైవ+ఉపహతాః(యుష్మదాదాయః)=విధివంచితుల వలె, వః=మీకు, సద్యః+ప్రాణహరేణ=వెంటనే ప్రాణాలు పోయే, కథ+ఉపోద్ఘాతేన?=ఇలా విషయం ప్రస్తావించారెందుకు? ఇదానీమ్=ఇప్పుడే, శీఘ్రం=వెంటనే…
ఇక్కడ కంచుకి ‘ఆకాశభాషణం’ చేస్తున్నాడు. అంటే: ఎదుట జరిగే సమాచారాన్ని ఇంకొక పాత్ర ద్వారా చెప్పించవలసిన అవసరం లేకుండా, ప్రవేశించిన ఒక్క పాత్రే, ఎదుటివారి మాటను కూడా తానే అనువదిస్తూ వ్యవహారం నడపడాన్ని నాటక పరిభాషలో ఆకాశభాషితం అంటారు.
పాటలీపుత్రంలో ఆచారంగా వెన్నెల పండుగ ఆ రోజు రాత్రి జరగవలసి వుంది. దానిని చాణక్యుడు నిషేధించాడు. ఈ సంగతి చంద్రగుప్తుడికి తెలియదు. సుగాఙ్గ ప్రాసాదంలో ఉద్యోగులు యీ సంగతి కంచుకికి చెప్పారు. “ఉత్సవం నిషేధింపబడడేమిటి? చంద్రగుప్తుల వారికి తెలియదా” అని కంచుకి ఆశ్చర్యం. అందుకే యీ సంగతి చెప్పిన వాళ్ళని – “ప్రాణాలు పోతాయి జాగ్రత్త! మీరేమి మాట్లాడుతున్నారు?” – అని హెచ్చరించాడు. వెంటనే అలంకరణ పనులు చూడమని ఆదేశిస్తున్నాడు కూడ.
ఆలిఙ్గన్తు గృహీతధూపసురభీన్
స్తమ్భా న్పినద్ధ స్రజః,
సంపూర్ణేన్దు మయూఖ సంహతి రుచాం
సచ్చామరాణాం శ్రియః
సింహాఙ్కాసన ధారణా చ్చ సుచిరం
సఙ్జాతమూర్ఛా మివ
క్షిప్రం చన్దనవారిణా సకుసుమః
సేకోఽనుగృహ్ణాతు గామ్॥ (2)
గృహీత+ధూప+సురభీన్=పరిమళించే పొగలతో, సువాసానలు స్వీకరించిన, స్తమ్భాన్=స్తంభాలు (లను), పినద్ధ+స్రజః=పూలదండలతో చుట్టబెట్టండి, సంపూర్ణ+ఇన్దుమయూఖరుచాం=పూర్ణచంద్రుని కిరణాల కాంతి గల, సత్+చామరాణా=మేలైన చామరాల, శ్రియః=వైభవాలను, ఆలిఙ్గన్తు=దరిచేర్చుకొనుగాక (కౌగిలించుకొనుగాక), సుచిరం=చాలాసేపు, సింహాఙ్కాసన+ధారణాత్=సింహాసనాన్ని మోయడం వల్ల, సఙ్జాత+మూర్ఛాం+ఇవ=సొమ్మసిల్లినట్లున్న, గామ్=భూమి, చన్దనవారిణా=మంచి గంధపు నీటితో, సకుసుమః+సేకో=పూలతో కలిపి చల్లడమనే పనిని, క్షిప్రం=వెంటనే, అనుగృహ్ణాతు+చ=దయచేసి జరిపించండి కూడ.
‘సుగాఙ్గ ప్రాసాదోపరిభూమయః సంస్క్రియన్తాం’ అని కంచుకి ఆజ్ఞాపించాడు కదా ముందు! ఆ అలంకారాలు ఎలా ఉండాలో వివరించాడిక్కడ. స్తంభాలకు పరిమళపు పొగలు, పూలదండలు కట్టాలి. తెల్లని చామరాలు వాటికి కట్టాలి. నేలను పూలు కలిపిన మంచి గంధపు నీటితో తడపాలి – అని ఆదేశించాడు.
ఉత్ప్రేక్ష – (సంభావన్యాదుత్ప్రేక్షౌ వస్తుహేతు ఫలాత్మనా – అని వస్తూత్ప్రేక్ష – కువలయానందం). – అలంకరించవలసిన పరిమళాది విషయాలను ఉత్ప్రేక్షిస్తున్నాడు.
శార్దూల విక్రీడితం.
కిం బ్రూథ ‘ఆర్య ఇద మనుష్ఠీయతే దేవస్య శాసనమ్’ ఇతి? భద్రాః,
త్వరధ్వమ్. అయ మాగత ఏవ దేవ శ్చన్ద్రగుప్తః. య ఏషః.
కిం+బ్రూథ=ఏమంటున్నారు? ‘ఆర్య=అయ్యా, ఇదం+దేవస్యశాసనమ్+అనుష్ఠీయతే=ఇదిగో, చెయ్యడమవుతోంది (కాగలదు)’ ఇతి=అని, భద్రాః=నాయనలారా, త్వరధ్వమ్=త్వరపడండి. అయం+చన్ద్రగుప్తః+ఆగతః+ఏవ=ఈ చంద్రగుప్తుడు రానే వచ్చాడు. య+ఏషః=అతను ఎలాంటి వాడంటే….
“సువిస్రబ్ధైః రఙ్గై పథిషు విషమే ష్వ వ్యచలతా
చిరం ధుర్యేణోఢా గురు రపి భువో యాస్య గురుణా
ధురం తా మే వోచ్చై ర్నవవయసి వోఢుం వ్యవసితో
మనస్వీ దమ్యత్వాత్ స్ఖలతి చ న దుఃఖం వహతి చ॥” (3)
సు+విస్రబ్ధైః+రఙ్గై=అలవాటు పడిన, విశ్వసనీయమైన శరీరావయవాలతో, విషమేషు=క్లిష్టమైన, పథిషు=దారులలో, అపి=అయినప్పటికీ, అచలతా=చలించని యట్టివాడు (అట్టి ‘తనము’ కలవాడు), ధుర్యేణ+అస్య+గురుణా+యా+అస్య+భువః (భారః)=ఎంతటి బరువునైనా (బాధ్యత) వహించగల ఇతడి తండ్రి చేత ఏ భూభారము వహించబడిందో, తాం+ఏవ+ధురం=ఆ భారాన్నే, ఉచ్చైః+నవ+వయసి=నిండైన యౌవనంలో, వోఢుం+వ్యవసితః=మోయడానికి సిద్ధపడిన వాడు, మనస్వీ=ఉన్నతమైన మనసున్నవాడు, దమ్యత్వాత్=శిక్షణకు యోగ్యుడు కావడం వల్ల, స్ఖలతి+చ=అప్పుడప్పుడు తొట్రుపడేవాడైనా, న+దుఃఖం+వహతి+చ=బాధపడనివాడు (చంద్రగుప్తుడు) – ఆగతః యేవ- అని అన్వయము.
మరో అర్థం: అఙ్గై=పాలనాపరమైన రాజ్య విభాగాలతో, విషమేషు=చిక్కులు ఎదురయ్యే, పథిషు=పరిస్థితులలో, అచలతా=తడబాటు ఎరుగని, ధుర్యేణ+అస్య+గురుణా= భారం వహించగల ఇతడి తండ్రి చేత, యః+భువః+ధూః+చిరం+ఊధా=ఏ భూభారము చాలాకాలంగా వహించబడిందో (తండ్రి ఇంతకాలం వహించిన రాజ్యభారాన్ని), ఉచ్చైః నవ వయసి వోఢుం వ్యవసితః అయం మనస్వీ చన్ద్రగుప్తః – అని అన్వయము.
శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.
సమాసోక్తి – ఇక్కడ ఉపయోగించిన విశేషణాల ద్వారా పోలికగా మరొక విశేషణం స్ఫురించడం ప్రత్యేకత (‘విశేషణానాం తౌల్యేన యత్ర ప్రస్తుతవర్తినామ్, అప్రస్తుతస్య గమ్యత్వం సా సమాసోక్తి రితీషతే’ – ప్రతాపరుద్రీయం). చంద్రగుప్తుడు తండ్రి నుండి సంక్రమించిన రాజ్యభారం భౌతికంగా భరించడంతో పాటు, రాజకీయమైన పాలనాసామర్థ్యం కూడా ఇక్కడ స్ఫురిస్తున్నది.
అతడు మనస్వి కావడం వల్ల దుఃఖవహన క్షమత్వం ఏర్పడింది – అనే సందర్భంలో కావ్యలిఙ్గం అనే అలంకారం కూడా (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్’ అని – కువలయానందం).
చంద్రగుప్తుడి రాకలో విశేషాలను కంచుకి వివరిస్తున్నాడు. కౌముదీ మహోత్సవం సందర్భం ఇది.
కౌముదీ ఉత్సవం కృత్తికా దీపోత్సవమని రామదాసయ్యంగారు స్మృతి ప్రమాణం చూపించారు.
మా స్యూర్జే కృత్తికాధిష్ణ్యే
సాయంకాలే ప్రరోపయేత్
దీపాం శ్చైవ మహాదీపాన్
అనేకాన్ సర్వతో గృహే – ఇత్యాది.
ఇది కార్తీకమాసంలో చేసే ఉత్సవం. కార్తీక పూర్ణిమ శుభప్రదమని నేటికీ సంప్రదాయజ్ఞుల విశ్వాసం.
(నేపథ్యే)
ఇత ఇతో దేవః
(నేపథ్యే=తెరలో)
దేవః=దేవరవారు – ఇతః+ఇతః=ఇటు ఇటు (దారి) –
(తతః ప్రవిశతి రాజా ప్రతీహారీ చ)
తతః=పిమ్మట, రాజా+ప్రవిశతి+ప్రతీహారీ+చ=రాజు ప్రతీహారీతో కూడా ప్రవేశించాడు.
(స్వగతమ్) రాజ్యం హి నామ రాజధర్మాను వృత్తిపరస్య నృపతే ర్మహ దప్రీతిస్థానమ్। కుతః…
(స్వగతమ్=తనలో), రాజ్యం+హి+నామ=రాజ్యం అంటేనే, రాజధర్మ+అనువృత్తిపరస్య+నృపతేః=రాజధర్మం అనుసరించడంలో ఇష్టం చూపించే రాజుకు, మహత్+అప్రీతి+స్థానమ్=చాలా అసంతృప్తి కలిగించే విషయం. – కుతః=ఎందుకంటే…
పరార్థానుష్ఠానే రహయతి నృపం
స్వార్థ పరతా
పరిత్యక్త స్వార్థో నియత మయథార్ధ
క్షితిపతి।
పరార్థశ్చేత్ స్వార్థా దభిమతతరో,
హన్త పరవాన్
పరాయత్తః ప్రీతేః కథ మివ రసం
వేత్తి పురుషః (4)
పరార్థ+అనుష్ఠానే=ఇతరుల గురించి పనులు చేసే సందర్భాలలో, స్వార్థపరతా=నాకేమిటి లాభం? అనే ధోరణి, నృపం=రాజును, రహయతి=వదిలిపెడుతుంది (తనకంటూ తాను ఏమీ చేసుకోజాలడు).
పరిత్యక్త+స్వార్థః=(పోనీ) స్వార్థం విడిచిపెట్టే (రాజు) వాడు, నియతం=వాస్తవానికి, అయథార్ధః+క్షితిపతి=అబద్ధపు రాజు (పేరుకే రాజు).
పరార్థః=ఇతరుల అవసరాన్ని, స్వార్థాత్=తన ప్రయోజనాలకంటే, అభిమతతరః=అత్యధికమని అనుకుంటే, హన్త=అయ్యే, పరవాన్=ఇతరుల పాలబడ్డట్టే!
పరాయత్తః+పురుషః=పరాధీనుడైన వ్యక్తి, కథం+ఇవ=ఏ విధంగా, ప్రీతేః+రసం+వేత్తి=సంతోషం అనే మాటకర్థాన్ని తెలుసుకోగలడు?
పాలకుడి బ్రతుకు ఎప్పుడూ సంకటంగానే ఉంటుంది. స్వార్థం చూసుకుంటే పరార్థం నడవదు. పోనీ పరార్థం ముఖ్యమనుకుంటే, తనకంటూ ఏమీ చేసుకోజాలడు. కాదయ్యా, తన పని కంటే ఇతరుల పని నెరవేర్చడమే ప్రధానమనుకుంటే పరాధీనపు బ్రతుకైపోతుంది. అటువంటి వాడికి ఏమి సంతోషం మిగులుతుంది? అని చంద్రగుప్తుడి ఆలోచన. తాను పరాధీన స్థితిలో ఉన్నాడని సూచన.
అర్థాంతరన్యాసం. (ఉక్తి రర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలాయనందం). చంద్రగుప్తుడు తన పరిస్థితిని, అర్థాంతరంతో సమర్థిస్తున్నాడు.
ఆపి చ, దురా రాధ్యా హి రాజలక్ష్మీ రాత్మవద్భి రపి రాజభిః.
కుతః…
ఆపి+చ=ఇంకా ఏమంటే,
ఆత్మవద్భిః+రాజభిః+అపి=స్వస్వరూప జ్ఞానంగల రాజులు (చేత) కూడా, రాజలక్ష్మీః=రాజవైభవం (వైభవాన్ని), దుర్+ఆరాధ్యా=సంతోషపెట్టడం సాధ్యం కానిది (వారి చేత కూడా రాజ్యలక్ష్మి సంతోషపెట్టబడజాలదు), కుతః=ఎందుకంటే…
తీక్ష్ణా దుద్విజ తే, మృదౌ పరిభవ
త్రాసా న్న సంతిష్ఠ తే,
మూర్ఖం ద్వేష్టి, న గచ్ఛతి ప్రణయితా
మత్యన్త విద్వ త్స్వపి,
శూరేభ్యోఽప్యధికం బిభే త్యుపహస
త్యేకాన్తభీరూ. నహో!
శ్రీ లబ్ధ ప్రస రేవ వేశవనితా
దుఃఖోపచర్యా భృశమ్॥ (5)
శ్రీః=(రాజ్య)లక్ష్మి, తీష్ణౌత్=తీవ్రత చూపించడం వల్ల, ఉద్విజతే=ఉద్వేగం పొందుతుంది (ఆందోళన చెందుతుంది), మృదౌ=మెత్తదనం చూపిస్తే, పరిభవ+త్రాసాత్=లోకువై పోతామనే భయంతో, న+సంతిష్ఠతే=పాదుకొనజాలదు (స్థిరంగా నిలవదు), మూర్ఖాం=తెలివితక్కువవాడిని, ద్వేష్టి=ద్వేషిస్తుంది (అసహ్యించుకుంటుంది), అత్యన్త+విద్వత్యు+అపి=మిక్కిలిగా పాండిత్యం గలవారి విషయంలో కూడా, ప్రణయితాం+న+గచ్ఛతి=చనువు చూపదు. శూరేభ్యః+అపి=వీరుల పట్ల కూడా, అధికం+బభౌతి=మిక్కిలిగా భయపడుతుంది. ఏకాన్త+భీరూన్=ఒంటరిగా (ఉంటూ) భయపడేవారిని, ఉపహసతి=వెటకారం చేస్తుంది.
లబ్ధ+ప్రసరా+వేశవనితా+ఇవ=మిక్కిలి చనువు గల వేశ్య మాదిరిగా, భృశం=మిక్కిలి, దుఃఖ+ఉపచర్యా=కష్టంతో సేవించదగినది (అగును).
శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.
వేశవనితా ఇవ దుఃఖోపచర్యా – శ్రీః – అనడం వల్ల ఉపమాలంకారం (ఉపమాయత్ర సాదృశ్యలక్ష్మీరుల్లసతి ద్వయోః – అని కువలయానందం).
రాజవైభవం అనేది బాగా చనువున్న వేశ్య వంటిది. ఎప్పుడు, ఎవరిపట్ల, ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడం కష్టం. పాలకుడెటువంటి వాడైతే, అన్ని తీరుల ప్రవర్తిస్తుంటుంది అది – అని చంద్రగుప్తుడి ఎరుక. అప్రమత్తంగా వ్యవహరించకపోతే – హేళన పాలుకాక తప్పదని సూచన.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™