ఎన్నో ఆశ్రమాలకు నెలవు రుషీకేష్. ప్రసిద్ధ శివానంద ఆశ్రమము ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. నేను వుండటానికి స్థలము వెతుకుంటే నాకు ‘పరమార్థ నికేతన్’ అన్న ఒక ఆశ్రమము కనిపించింది. నెట్లో వారి వివరాలు వున్నాయి. నేను ఈమెయిలులో నా వివరాలు పంపి, నా కోసము ఒక గది ముందుగా బుక్ చేసుకున్నాను. ఆ ఆశ్రమము గంగకు మరో వైపున వుంది. రుషికేష్ గంగకు పశ్చిమములో వుంటుంది.
ఆశ్రమము వెళ్ళాలంటే మనము గంగ ఒడ్డున దిగి బోటులో గంగపై పయనించి ఆవలి గట్టు వున్న ఆశ్రమానికి వెళ్ళాలి. ఎలా చూసినా మరో మార్గము లేదు. లక్ష్మణ్ ఝూలా మీద మనుషులు నడుస్తారు కానీ, కార్లు వెళ్ళవు. కొందరు టూవీలర్సు పై తిరుగుతారు. నేను విమానము దిగి ట్యాక్సీలో గంగానది ఒడ్డు వరకూ వచ్చాను. దారంతా ఆకుపచ్చ రంగుతో, అందమైన ఘూటు రోడ్డుతో చూడముచ్చటగా వుంది.
రుషీకేష్ వూరులో గంగ ఒడ్డు మంచి హడావిడిగా వుంది. నన్ను దింపి ట్యాక్సీ అతను వెళ్ళిపొయాడు. ఒక బోటు పట్టుకు నేను గంగకు ఆవల దిక్కుకు వెళ్ళాను. అటు కూడా మంచి హడావిడితో కళకళలాడుతోంది. ఆశ్రమాలు గంగకు రెండు వైపులా వ్యాపించి వున్నాయి. గంగ వడ్డునే ఎత్తుగా చిన్న సిమెంటు రోడ్డు. రోడ్డుకు మరో వైపు విదేశీ యాత్రికుల కోసము మాత్రమే పెట్టారన్నట్లుగా వున్న వివిధ దుకాణాలు. ఆధ్యాత్మికతను అమ్ముతున్నారు కుప్పలుగా! ఆశ్రమాలలో యోగాగా, దుకాణాలలో రంగు రాళ్ళుగా, బట్టల దుకాణాలలో శాలువలుగా, పుస్తకాల దుకాణాలలో పుస్తకాలుగా రాసులుగా అమ్ముతున్నారు ఆధ్యాత్మికతను. ఆ వాతావరణములో వింత పరిమళముంది. ఎలాంటి వారికైనా కొంత భక్తిని తప్పక పంచగలదా కరెంటు అనుకున్నా చూసి.
తెల్లవారు వింత వస్త్ర ధారణలో ఒంటరిగా, జంటలుగా, గుంపులుగా, నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ కనిపించారు. ఇందులో నిజమైన జిజ్ఞాసువెవరో కదా అనిపించింది. భక్తి కూడా వ్యాపారమైన వేళ… స్వచ్ఛత వెతికితే కానీ దొరకదు కదా. అది అట్లాంటా అయినా రుషికేష్ అయినా….
నేను ఆశ్రమములో ఆఫీసు గదికి వెతుకుతూ వెళ్ళాను, నా పెట్టను లాగుతూ. ఆశ్రమము చాలా పరిశుభ్రముగా వుంది. భవనాల మధ్య చిన్న ఉద్యానవనము. మధ్యలో తపస్సులో వున్న శివుని శిల్పము. మధ్య చిన్న చిన్న వాటరు ఫౌంటెన్లు. చాలా మంది యాత్రికులు తిరుగుతున్నారు చుట్టూ. ఎందరో వస్తున్నారు పోతున్నారు. కొందరు గది కోసము ఎదురుచూస్తూ వున్నారు. మొత్తానికి అందరూ విదేశీయులే. ఫిబ్రవరి నెలలో అక్కడికి వెళ్ళేది వారేగా. నేనొక్కదానినే భారతీయపు నల్లపిల్లను.
కౌంటరులో వున్న అతని పేరు కృష్ణమూర్తి. తెలుగు వాడే. నేను నా రూము బుక్ చేసుకున్న ధృవీకరణ మెయిలు ప్రింటుకాపీ, నా పాస్‌పోర్టు జిరాక్సు కాపీ అతనికి ఇచ్చి కూర్చున్నాను. అతను నా పాస్‌పోర్టు ఒరిజినల్ చూపమన్నాడు. నా వద్ద ఆ క్షణములో లేదు. నా యాత్ర ముందు నా సామాను ఎటు పడేసుకుంటానోయని నా పాస్‌పోర్టు హైద్రాబాదులో వదిలేశాను. జిరాక్సు కాపీ పెట్టుకున్నాను. నా డ్రైవర్సు లైసెన్సు మాత్రమే నా వద్ద ఒరిజినలు వున్నది. అది ఇబ్బందియని నేను అనుకోలేదు, ఎదురు పడేవరకూ.
పాస్‌పోర్టు ఎక్స్‌ఫైర్ అయితే టెక్సస్ లోని భారతీయ రాయభార కార్యాలయములో నేను రెన్యూవల్ చెయించుకున్నాను. అందులో రెన్యూ చేసిన స్థలము హ్యూస్టను అని వున్నందున నాకు రూము ఇవ్వ నిరాకరించాడు ఆ పెద్దమనిషి. అప్పటికింకా నేను భారతీయ పాస్‌పోర్టు మార్చుకోలేదు. కానీ నా పాస్‌పోర్టులో హ్యుస్టను అని వున్నందుకు నాకు రూము ఇవ్వటానికి తిరస్కరించాడుట. అంతే కాకుండా నేను ఒక్కదానినే వచ్చానని చాలా అనుమానముగా, అవమానకరముగా “నీవు ఎవరికోసమోచ్చావో…. బయట గదులుంటాయి నీ వంటి వారికి” అంటూ ఛీత్కారముగా మాట్లాడాడు. నాకు ఆశ్చర్యముతో, అవమానముతో మాట రాలేదు. నాతో అంత అవమానకరముగా, నిందాకరముగా ఎవ్వరూ మాట్లాడలేదు అప్పటివరకూ. నాకు ఏమి చెయ్యటానికి తోచలేదు. కళ్ళ నిండుగా నీరు తన్నుకు వచ్చాయి. నేను అసలే దారీ తెన్ను లేకుండా తిరుగుతుంటే, కంగారుగా వుంటే ఈ గోల, నిందలూ ఏమిటో అర్థము కాలేదు. అప్పుడే మరో విదేశీ యాత్రికులు వస్తే వారితో నోరంతా తెరిచి నవ్వుతూ మాట్లాడే అతనిని చూస్తూ ఆశ్చర్యము కలిగింది.
భారతీయ బానిస స్వభావాలకు తెల్లవారు కనపడితే, ఇక కొందరికీ ఎక్కడలేని ఉత్సాహము, వింత, వినోదము, సంతోషము. అలాంటి భావాలతో 200 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికినా బుద్ధి మారలేదు. ఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళను మనము భారతదేశములో అడుగడునా చూస్తూ వుంటాము. విదేశీ యాత్రికులను కళ్ళు అప్పగించి ఒళ్ళు మరిచి చూస్తూ కనపడుతారు. వంగి వంగి సలాములు కొడతారు. ప్రక్కన వున్న మాలాంటి వారిని చూసి చీదరిస్తారు. మా శ్రీవారు కూడా తమ విదేశీ కోలీగ్స్‌తో వచ్చినప్పుడు ఆయనకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. మా పాప కూడా తన తెల్ల మిత్రులతో ఇండియా యాత్రలో ఇలాంటివి అనుభవించి ఇక వారితో వెళ్ళకూడదనుకుని గట్టిగా నిశ్చయించుకుంది. మన దేశ ప్రజలు కొందరు ఈ విధమైన ప్రవర్తన చూపించినందుకు వారు ఎంతో చవకబారు మాటలతో అగౌరవ పరుస్తారో ఎవ్వరూ వూహించరు. మేము ఇక్కడ వుండి చూశాము వారి భాష, శరీర కదలికలలో కనపడే నిర్లక్ష్యము తెలుసు కాబట్టి మనదేశము మీద ప్రేమతో మనస్సు చివుక్కుమంటుంది.
ఈ కృష్ణమూర్తి వంటి వారు మారరు జన్మలో. వీరికి సొంత గౌరవము వుండదా? నా కన్నులలో నీరు ఆగలేదు. నే మూగబోయాను. ఆ రోజు ఉదయము నుంచీ ఏమి తినకపోవటము వలనా, కంగారుగా కొత్త ప్రదేశములో వంటరిగా గురువుకై వెదుకుతూ ఇలా వచ్చి, ఈ గతిన పడ్డాను. నాకు ఏమీ తోచక ఇక భాగవతములో చాలా ఇష్టమైన పద్యమును చదువుతూ పరమాత్మను ప్రార్థించాను……
“లా వొక్కింతయు లేదు. ధైర్యము విలోలంబయ్య. బ్రాణంబులున్
ఠావున్ దప్పెను. మూర్చను వచ్చె. దనువులు డస్సన్, శ్రమంబయ్యెడిన్
నీవు తప్ప నితః పరంబెరుగ: మన్నింపతగున్ దీనునిన్
రావే ఈశ్వరా! కావవే వరదా! సంరక్షించు భద్రాత్మకా!” (పోతన భాగవతము. దశమ స్కందము)
మా మేనమామ గారు వచ్చే ముందు “రుషికేషా? మన స్వామి వారి మఠముంది కదరా!” అన్న మాట గుర్తుకొచ్చింది. మామయ్యకు ఫోను చేశాను. ఆయన కొంత సేపటిలో ఫోను చేస్తానన్నారు.
ఇంతలో ఆశ్రమవాసి మరో ఇన్చార్జు రాజేష్ గుప్తా యని పెద్దమనిషి వచ్చారు. నా కంగారు ముఖము, కన్నీరు చూసి వివరాలు అడిగారు. నేను జరిగినదంతా చెప్పాను. ఆయన కృష్ణమూర్తితో మాట్లాడితే ఆ మూర్ఖశిఖామణి ససేమిరా అన్నాడు.
“పాస్‌పోర్టు మెయిలు చెయ్యగలరా” అని అడిగారు రాజేష్ గుప్తా.
“వెంటనే చెయ్యగలను” నని చెప్పాను.
“మనము మెయిలు లో వుంచుకుందాము” అన్నాడు రాజేష్.
తల అడ్డముగా వూపుతున్నాడు కృష్ణమూర్తి.
నాకు ఆయన సమస్య ఏంటో అర్థం కాదు. భారతీయులకు ఒక ధర విదేశీ యాత్రికులకు ఒక ధర చార్జు చేస్తారు యాత్రా స్థలాలలో. నాకు భారతీయ ధర వెయ్యటానికి నేను అమెరికాలో వున్నాను.
విదేశీ ధర వేద్దామంటే నా పాస్‌పోర్టు భారతదేశ పాస్‌పోర్టు. అది ఆయనకు నచ్చక నాకు రూము లేదని, బయట ఎక్కడికన్నా పొమ్మని, వుండమని పిచ్చిగా మాట్లాడాడు.
రాజేషే గుప్తా ఎలా సముదాయించాడో తెలియదు ఒకపూట వుండమని నాకో గది ఇచ్చారు. ఆయన చాలా సార్లు నన్ను క్షమాపణ వేడారు కౌంటరులోని మూర్ఖుని తరఫున. నన్ను విచారపడవద్దని, ఆశ్రమ స్వామిజీ వూరిలో లేరని బుధవారము వస్తారని చెప్పి టెంపరరీ గది ఇచ్చి వెళ్ళారు.
(మా శ్రీవారు నాకు కలిగిన ఖేదానికి, అవమానానికి అతనిపై ఆశ్రమము వారికి కంప్లైంటు పంపారు. నేను ఆశ్రమములో విచారించలేదు తరువాత. అతని కర్మ అతనే చెల్లించుకుంటాడు. నా దుష్కర్మ అలా కాలింది)
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™