ఇది అసంపూర్తిగా వున్నది. దీనికి కారణం ఆలయాన్ని నిర్మించిన విరూపణ్ణ ఖజానా పైకము అనవసరంగా ఖర్చు పెట్టాడని, ఈ వీరభద్రాలయ నిర్మాణానికి ప్రభువుల అనుమతి తీసుకోలేదనీ, విరుపణ్ణమీద గిట్టనివారు కొందరు రాజుతో లేనిపోని నిందలు చెప్పగా, ఆ నిందలు విన్న రాయలవారు నిజమని నమ్మి కోపించి విరుపణ్ణ కన్నులు పీకించమని ఉత్తర్వులు చేశారుట. ఆ ఉత్తర్వులను విన్న విరుపణ్ణ నేను ప్రభువులకు తెలియకుండా ఏ తప్పు చేయలేదని భావించి, నా కన్నులను నేనే తీసి నా స్వామికి అర్పించెదనని రెండు కన్నలు ఊడబెరికి ఈ మంటపములో ఒక గోడపై వేసినాడు. ఆ గోడలపై గల గుంటలే విరుపణ్ణ కన్నుల గుర్తులని స్ధానికుల అభిప్రాయం. ఈ కారణంగానే ఈ కళ్యాణ మంటప నిర్మాణ అసంపూర్ణంగా నిలిచిపోయిందని చెప్తారు.
ఈ కళ్యాణ మండపము స్తంభములపై రెండు కోతులని చెక్కి వాటిని శిల్పి తన చాతుర్యంతో నాలుగు కోతులుగా చూపించడమూ, ఒకే ఆవు శరీరానికి మూడు తలలు చెక్కి మూడు ఆవులుగా చూపించడమూ శిల్పుల నైపుణ్యానికి నిదర్శనము.
అసంపూర్తిగా వున్న ఈ కళ్యాణ మండపంలో స్తంభాలమీద పార్వతీ పరమేశ్వరుల వివాహానికి అతిధులుగా దేవేంద్ర, అగ్ని, యమ, వశిష్ట, వరుణ, బృహస్పతి, దత్తాత్రేయ, విష్ణు, వాయు, కుబేర, విశ్వామిత్రులు వారి వారి వాహనములపై వచ్చినట్లు స్తంభములమీద మలచారు. పార్వతి తల్లిదండ్రలు మేనాదేవి, హిమవంతులు శివుని పాదాలు కడిగి కన్యాదానము చేయడానికి పాత్రలలో నీరు పట్టుకుని నిల్చున్నట్లుగా మలచారు. వధూవరులైన పార్వతీ పరమేశ్వరులను పురోహితుడు ఆశీర్వదిస్తున్నట్లు ఒక స్తంభం మీద చెక్కబడింది. ఐదు తలలు పది చేతులతో సదాశివుడు ద్వారములో నిలబడి అతిధులకు స్వాగతం పలుకుతున్నాడు.
ఈ కల్యాణ మంటపం ప్రక్కనే లతా మంటపంలో రాతి స్తంభాల పైన డిజైన్స్ చెక్కబడి ఉంటాయి. మొత్తం 36 స్తంభాలు. ఒక్కో స్తంభం పైన 4. అలా మొత్తం 144 డిజైన్స్ ఉన్నాయి. వీటిలో ఏ డిజైనూ మళ్ళీ రిపీట్ కాకుండా చెక్కారు.
కళ్యాణ మంటపానికి కొంచెం దూరంలో ఆనాటి శిల్పులు భోజనము చేయటానికి ఉపయోగించిన పళ్ళాలు నేలలో చెక్కబడ్డవి చూడవచ్చు. వీటిని చూస్తే ఆనాటి మనుష్యులు ఎంతటి ఆజానుబాహులో తెలుసుకోవచ్చు. ఈ భోజనం పళ్ళాలని ఆనాడు శిల్పులు రంగులు కలుపుకోవటానికి వుపయోగించి వుండవచ్చని కొందరి అభిప్రాయం. అదే నిజమయి వుండవచ్చు. ఎందుకంటే నేలపై ఎవరూ భోజనం చెయ్యరు కదా.
వీటికి కొంచెం దూరంలో సీతాదేవి కుడి పాదము వున్నది. ఎడమ పాదము పెనుకొండ కొండపై వున్నదని కొందరంటారు.
విరుపణ్ణ వీరభద్రాలయము అర్ధ మండపము ఈశాన్యమూల తమ కులమునకు మూల పురుషుడైన కుబేరుని కొడుకు కోడలు, రంభా నలకూబరులను చెక్కించాడు. రంభ నట్టువరాలు దుస్తులతో ఉంది. నలకూబరుడు కోరలతో ఉన్నాడు. ఇటువంటి శిల్పాలు అరుదు.
వీరభద్రస్వామి ఆలయం వెనక ఒక పెద్ద శిల మీద ఏడు తలల నాగలింగాన్ని చూడవచ్చు. ఈ సర్పము మూడు చుట్టలతో, ఏడు పడగలతో, చుట్టలపై మధ్యన శివలింగంతో యాత్రీకులను ఆకర్షిస్తూవుంటుంది.
దీనిని గురించి స్ధానికులు ఒక కథ చెబుతారు. ఈ శిల్పానికి ఎదురుగా ఆనాటి శిల్పులకి వంట చేయటానికి వంటశాల వుండేదిట. ఒక రోజు ప్రధాన శిల్పుల తల్లి వంట చెయ్యటం ఆలస్యమయిందిట. శిల్పులు భోజనానికి వస్తారుగానీ, వంట పూర్తికాకపోవటంతో సమయం వృథా చెయ్యకూడదని భావించి, ఆవిడ వంట పూర్తి చేసే లోపల ఎదురుగా వున్న పెద్ద రాతిపై ఈ నాగేంద్రుని విగ్రహం మలచారుట. దానిని చూసి ఇంత తొందరగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలా మలిచారని తల్లి ఆశ్చర్యము చెందగా, ఆ తల్లి కంటి దృష్టి ఆ శిల్పము మీద పడి, ఆ విగ్రహానికి చీలిక వచ్చిందని చెప్తారు.
ఈ రాతిమీదే ఇంకోపక్క శివలింగానికి పూజ చేస్తున్న బ్రాహ్మణుడు, ఏనుకు, సాలె పురుగులను చెక్కారు. అంటే ఈ ఆలయం కాళహస్తి ఆలయం నిర్మించిన తర్వాత నిర్మింపబడిందని తెలుస్తోంది.
అసంపూర్తి కళ్యాణ మండపంలో దక్షిణ దిక్కున యముని ప్రతిమ వుంది. ఈ ప్రతిమలో యముడు రౌద్రుడుగా, పెద్ద పెద్దవిగా విప్పార్చుకున్న కనులతోనూ, గుండ్రని కనుబొమలతోనూ మలచబడి కనిపిస్తాడు. నాలుగు చేతులు – పై చేతులలో గద, పాశం, క్రింది చేతులు అభయ, వరద ముద్రలలో వున్నాయి.
ఊరి మొదట్లో, వీరభద్రుని ఆలయానికి దాదాపు ఒక కిలో మీటరు దూరంలో వున్నాడు లేపాక్షి బసవన్న. ఇది ఒకే రాతిలో చెక్కబడ్డ విగ్రహం. ప్రపంచంలో వున్న నంది విగ్రహాలన్నింటిలోనూ ఇదే పెద్దది. ఈ విగ్రహం పొడవు 10 మీటర్లు, ఎత్తు 6 మీటర్లు. నెక్లెస్, మువ్వల హారం, గంటల హారం, మొదలగు అనేక అలంకరణలతో అలరారుతున్న ఈ నందిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే. ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది.
ఇంత అద్భుత శిల్ప సంపద చూడాలంటే మనం ఒక పూటన్నా అక్కడ గడపగలిగేటట్లు వెళ్తే బాగుంటుంది.
దీనితో ఇవాళ్టి ట్రిప్, అనుకున్నట్లు అవటమేగాక, ఒక బోనస్ ఆలయం కూడా చూశామనే తృప్తితో రూమ్‌కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాము.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™