“ధర్మమిత్రా! మేమీ విషయం ముందుగనే ఊహించాము. వారితో ప్రస్తావిస్తే అనుమతించరు. అందుచేత మా మిత్రులను ప్రయాణికులుగా పంపడం లేదు. అతను మీ నౌకలో, మీ పరివారంలో ఒకరుగా ప్రయాణం చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీతో బాటు తీసుకొని రావలసిన వైద్యుడిని తేలేదు. మీరు, అదృష్టవశాన, ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా గమ్యం చేరుకున్నారు. తిరుగుదలలో మీరు వైద్య సహాయం లేకుండా ప్రయాణం చేయడానికి మేము అనుమతించము.”
మహానావికుడు ఆలోచిస్తున్నాడు. చంద్రకీర్తి పక్కను మరో అధికారి నిలుచున్నాడు. అతను రేవులో సుంకాలను వసూలు చేస్తాడు. నౌకలు ప్రయాణయోగ్యాలు అవునో కాదో అతడు నిర్ణయిస్తాడు. అతడు రాజహంస చంపావతి రేవును చేరుకోగానే కుడిచేతి వేపున్న చెక్కలను మార్చవలసిందని ఆజ్ఞ నిచ్చినవాడు. అందుచేత అతనికి తెలియని రహస్యం ఏదీ ఉండడానికి అవకాశం లేకపోయింది.
మళ్లా చంద్రకీర్తి అన్నాడు.
“ధర్మమిత్రా! నువ్వు బ్రాహ్మణుల అనుమతిని తీసుకోనక్కరలేదు. ఇది మా ఆజ్ఞగా వాళ్లకు చెప్పవలసింది. ఎందుచేతనంటే, నౌక చంపావతి విడిచి పెట్టడానికి మేము అనుమతించాలి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో నుంచుకొని చేసిన ఏర్పాటిది.”
మహానావికుడికి అభ్యంతరం తెలుపడానికి చంద్రకీర్తి అవకాశమివ్వలేదు.
“మహానావికా! ఈ వైద్యులకు ఆహారాదులను సమకూర్చడానికి నూరు సువర్ణాలిస్తున్నాము. మీ సముద్రయానం మంగళ కరమగుగాక!”
అంతవరకు ప్రయాణం చేయవలసిన వైద్యుడు మహానావికుడి కంటబడలేదు. కార్యస్థానంలో కూర్చున్నాడు. అధికారి అతనిని తనతో తీసుకొని వచ్చి ధర్మ మిత్రుని ముందు నిలబెట్టాడు.
మహానావికుడు ఆశ్చర్య చకితుడయాడు.
ఆ వచ్చిన వ్యక్తి శ్రవణుడు. సంఘం ఆమోదించిన విధంగా దుస్తులు ధరించాడు. అతని భుజానికొక జోలె ఉంది. ఆ జోలెలో ఆకుల పొట్లాలలో ఔషధాలు, ఒక మృణ్మయ భిక్షా పాత్ర – ఆహారం తినే మట్టి పళ్లెం ఇవే అందులో ఉన్నాయి.
అతడు చంద్రకీర్తి దగ్గర సెలవు తీసుకున్నాడు. ప్రభువు స్నేహితుడిని కౌగిలించుకొని వీడ్కోలు చెప్పాడు. మహానావికుని వెంట అతడు కర్రమెట్లు ఎక్కి నౌకలోకి ప్రవేశించాడు.
ఆ విధంగా శ్రమణుడు నావికులకు, ప్రయాణికులకు వైద్యుడై నౌకాయానానికి అర్హతను సంపాదించాడు. ధర్మమిత్రుడు ఘటికాయంత్రాన్ని చూశాడు.
సూర్యాస్తమయమయి ఎనిమిది ఘడియలయింది. మరొక్క ఆరు ఘడియలు తాను పూర్వాపరాలు విమర్శించుకోవచ్చు. చేయవలసిన పనికి ఒక ఘడియ మిగులుతుంది.
అతడు మళ్లా ఆలోచనలో పడ్డాడు.
నౌకలో వెనుకవేపున్న మందిరాలలో బ్రాహ్మణులందరూ ఉన్నారు. ముందున్న మందిరాలలో నౌక యొక్క పరివారముంది. మహానావికుని మందిరాన్ని ఆనుకొని ఉన్నదానిలో శ్రమణుడికి నోటిచ్చాడు. ఆ గది చిన్నది. నాలుగు మూరలు వెడల్పు, ఆరు మూరలు పొడవు ఉంది. బల్ల మంచమొకటి ఆ గదిలో మందిరాలను విభజించే చెక్కల గోడకు అనుకొని ఉంది.
గాలి తీవ్రంగా వీస్తున్నది. వర్షం ఏనుగు తొండాలతో నీటిని చిమ్ముతున్నట్లు పడుతున్నది. ముదుకగా ఉన్న మైనపు గుడ్డలను మందిరాలమీద కప్పాడు. అందుచేత గదులలో పొడిగా వెచ్చగా ఉంది. కుంభగత దీపాలు కప్పునుండి వ్రేలాడుతు కన్నాల నుండి మందమైన కాంతులను ప్రసరిస్తున్నాయి.
నౌకలో ప్రయాణం చేస్తున్న బ్రాహ్మణుల మనస్సులు స్థిమితంగా లేవు. రుద్ర భట్టు మహానావికునికి ఒక విషయం చెప్పాడు. అది సామాన్యమైనది కాదు. చాలా తీవ్రమైనది. ఆ సమస్యకు పరిష్కారమంటూ వేరే లేదు. వాళ్లు చెప్పినట్లు ఆచరించడమే.
కాని, ఆ విధంగా చేయకుండా, ప్రత్నామ్నాయం కోసం ధర్మ మిత్రడు జరిగిన సంగతులను మననం చేసుకుంటున్నాడు.
నౌక చంపావతిని విడిచి, అనుకూలమైన ప్రవాహంలో, ఇరావతీ నదిలో, అయిదు దినాలు ప్రయాణం చేసి ఆరోనాడు ఉదయానికి మహా సముద్రంలో ప్రవేశించింది. సముద్రాన్ని చేరిన తరువాత నౌకాగమనంలో మార్పు వచ్చింది. వేగం తగ్గింది. బ్రాహ్మణులు సూర్యోదయ సమయాన మేల్కొని చూస్తే అన్ని వేపులా సాగరజలాలు కనిపించాయి.
నౌక నదిలో ప్రయాణం చేసిన అయిదు దినాలు బ్రాహ్మణులు తాము సంపాదించిన సువర్ణం మొదలైన వాటిని చాలసార్లు లెక్క పెట్టుకున్నారు. మిగిలిన వస్తువులను కూడా మూటలు కట్టి, భద్రంగా అన్నిటినీ సర్దుకున్నారు.
నౌక నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు నావికులు ఆప్రమత్తులుగా ఉండి, నదీ మధ్యంలో నడుపుతూ, తీరుబాటు లేకుండా గడిపారు. సాగరజలాలను ప్రవేశించగానే వాళ్లు తెరచాపలు గాలివాటుకు అనుకూలంగా సవరించి, క్రమబద్ధంగా నౌకను నడపడం మొదలు పెట్టారు.
నౌక మహా సాగరం చేరేవరకు ధర్మ మిత్రుడికి బౌద్ధ శ్రమణుడిని ప్రయాణికులకు పరిచయం చేయడానికి వ్యవధి లభించలేదు. అటు పిమ్మట అతనిని వారికి చూపించక తప్పలేదు.
“మనం ఘంటవాలను విడిచి చంపావతికి ప్రయాణమైనప్పుడు అన్ని ఏర్పాటులు చేయగలిగాను. కాని, వైద్యుని సౌకర్యం మాత్రం చేయలేకపోయాను. చంపావతి రేవులో సుంకాలను వసూలు చేసే అధికారి ఈ లోపం గుర్తించాడు. తిరుగుదలలో, వైద్యుడు లేనిది, నౌక రేవును విడువరాదని శాసించాడు. అందుచేత అందుబాటులో నున్న ఒక వైద్యుడిని మహా మండలేశ్వరులు మనతో పంపించారు.” అన్నాడు మహా నావికుడు.
“ఎవరా వైద్యుడు?” రుద్రభట్టు ప్రశ్నించాడు.
రుద్రభట్టు బ్రాహ్మణ బృందానికి నాయకుడు. అతని ఆమోదమే అన్నిటికన్న ముఖ్యమైనది.
పక్కనే నిలుచున్న ఉపమహానావికుడు, గదిలో కూర్చున్న శ్రమణుడిని వాళ్ల దగ్గరికి తీసుకొని వచ్చాడు.
శ్రమణుడు సంఘం ఆమోదించిన విధంగా వస్త్రాలు ధరించాడు. మనిషి పొడగరి కాకపోయినా ఎత్తుగానే ఉన్నాడు. నాసిక పొడవుగా సూదిగా ఉంది. చెవులు పెద్దవిగా ఉన్నాయి. ఫాలం చాల విశాలంగా ఉంది. అతని వెడల్పైన కన్నుల నుండి వెలువడే చూపులు సమ్మోహనంగా ఉన్నాయి. అతని వయసు పాతిక సంవత్సరాలను మించదు.
స్ఫురద్రూపిగా ఉన్న ఆ బౌద్ధ శ్రమణుడిని చూసి రుద్రభట్టు పెదవి విరిచాడు.
“ఈ వైద్యుడు తక్షశిలలో చదువుకున్నాడు. ప్రజలకు సేవ చేయడం కోసం బౌద్ధ భిక్షువుగా సంఘంలో చేరాడు. ఇతని వయసు తక్కువే. కాని, బిక్షువులలో ఉత్తమమైన ప్రవజ్ఞ శ్రేణికి చెందినవాడితడు.” అన్నాడు ధర్మ మిత్రుడు.
“ఓ మహానావికా! నువ్వేం చెప్తే చెప్పు – యజ్ఞ విధులను నిందించే ఈ బౌద్ధుడు నాస్తికుడే కదా? ఇతడు ఉత్తమ శ్రేణికి చెందిన బౌద్ధుడైతే ఇంకా కరడు గట్టిన నిరీశ్వర వాది” అన్నాడు రుద్రభట్టు.
“అయ్యా! మీరు వేద పండితులు – బౌద్దాన్ని ఆ విధంగా మీరు చులకన చేస్తే నేనేం చెప్పేది. నేను బౌద్ధుడిని కాను. కాని ఆ మతాన్ని అభిమానించిన ఉపాసకుడిని. ధాన్యకటక మహాస్తూప నవ కర్మకు సహాయమందించినవాడిని. ఆంధ్రా పథంలో బౌద్ధమూ వైదికమతమూ సమానాంతరంగా ప్రయాణం చేస్తున్నవి. నౌకలో కూడా ఈ ఉదారమైన పద్ధతిని మనం అనుసరించుదాం.”
మహానావికుని మాటలు కాదనడానికి, నౌకను ఆపి ఆ నాస్తికుడిని దింపివేయడానికి, రుద్రభట్టుకి అవకాశం లేకపోయింది. చుట్టూ అంతం లేని సముద్రముంది.
రుద్రభట్టు మహానావికుడితో అన్నాడు.
“మేమందరం మధ్యాహ్నవేళవరకు వైదిక సంబంధమైన చర్చలలో ఉంటాం. అపరాహ్నం పూట ఎండ తగ్గిన తరువాత ఇతని సేవలను స్వీకరిస్తాం. పొరపాటున కూడా ఈ నాస్తికుడు ఉదయాన్ని మా కళ్లబడడానికి వీలులేదు.”
ఇది రుద్రభట్టు చేసిన అభ్యర్థన కాదు. వినిపించిన ఆజ్ఞ.
శ్రమణుడు సంభాషణ వింటున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు తప్ప మరే విధమైన తిరస్కార భావం గోచరించలేదు.
ప్రయాణికులకు వైద్యుడిని పరిచయం చేసిన మరునాటి మధ్యాహ్నం రుద్రభట్టు అతనిని పిలిపించాడు.
“ఇతడు యజ్ఞదత్తశర్మ – నామకరణోత్సవ సమారాధనలో పురీషిళ్లతో నేతిని తాగాడు. ఇతనికి అగ్నిమాంద్యం సంభవించినట్లుంది. ఓయి శ్రమణుడా! ఎటువంటి ఔషధమిస్తావో!” అన్నాడు రుద్రభట్టు.
శ్రమణుడు యజ్ఞదత్త శర్మకే కాదు. మరి పదిమందికి కూడా మందులిచ్చాడు. రెండవ దినానికి రమారమి అందరికీ అతను వైద్యం చేశాడు.
నౌక నిలకడగా ప్రయాణం చేస్తున్నది. వైదికులకు ఇంటివేపు ధ్యానం పోయిన మాట నిజమే. కాని, ఎంత సేపు పెళ్లాల గురించి ఆలోచించగలరు?
నౌక సముద్రంలో ప్రవేశించిన నాలుగోరోజు నుండి శ్రమణుడిని ఎప్పుడు వీలయితే అప్పుడు వాళ్లు పిలిపించేవారు. ఉదయం, సాయంకాలం అన్ని నియమం వెనుకబెట్టారు. ప్రొద్దుటి వేళల్లో శ్రమణుడు వాళ్ల శారీరకమైన అనారోగ్యాన్ని కుదిర్చేవాడు. సాయంకాలం వాళ్ల మనసులు తేలికపడేటట్లు అతను ఏవో విషయాలు వాళ్లకి చెప్పేవాడు.
ఒక దినాన ఎండకొంచెం తగ్గిన తరువాత బ్రాహ్మణులతో పాటు మహానావికుడు కూడా శ్రమణుడి పలుకులు వినడానికి కూర్చున్నాడు.
ఏవో సంగతులు ఒకరూ ఒకరూ అడుగుతున్నారు. అపుడు శాండిల్యుడు ఒక ప్రశ్న వేశాడు.
“శ్రమణా! నీకు చాల విషయాలు తెలిసినట్లు నీ సంభాషణల వల్ల విదితమవుతున్నది. మనం ప్రయాణం చేస్తున్న నౌక గురించి నువ్వు చెప్పగలవా?”
శ్రమణుడు నవ్వి అన్నాడు.
“మనతో మహానానికులు కూర్చున్నారు. వారికన్నా ఈ విషయం ఎవరికి బాగా తెలుస్తుంది? వారిక్కడ ఆసీనులై ఉండగా నేను నౌకను గురించి చెప్తే, అది సూర్యుని ముందు దివిటీని వెలిగించినట్లు అవుతుంది.”
ధర్మమిత్రుడు కూడా నవ్వాడు. బ్రాహ్మణులందరూ వినడానికి కుతూహలంగా ఉన్నారు. “నేను చెప్పవలసినది ఎప్పుడేనా చెప్తాను. మన శ్రమణుడికి తెలిసినది వినాలని నాకు కూడా కుతూహలంగా ఉంది”. అన్నాడు మహానావికుడు.
“విషయం జటిలమైనది. యినా మీరు ఆసక్తితో వినదలచుకున్నారు. నాకు తెలిసినది చెప్పడానికి ఆటంకం లేదు” అన్నాడు శ్రమణుడు.
అందరూ సావధానులై కూర్చున్నారు. శ్రమణుడు చెప్పడం మొదలు పెట్టాడు.
“నౌకలమీద ప్రయాణికులు ఉండడానికి, సరుకులు మొదలైనవి ఉంచడానికి నిర్మించే గదులను మందిరాలంటారు. మొదటి తరగతికి చెందిన నౌక సర్వమందిర నౌకలోని గదులు ఈ చివరనుండి ఆ చివరవరకు వ్యాపించి ఉంటాయి. ఇటువంటి నౌకకు రాజుగారి ధనాగారం లోని నిధులను, గుర్రాలను, స్త్రీలను పంపడానికి నియోగిస్తారు.
రెండవ తరగతికి చెందిన నౌక మధ్యమందిర. మనం ప్రయాణం చేస్తున్న రాజహంస ఈ కోవకు చెందుతుంది. ఈ నౌకలో గదులు మధ్యభాగంలో ఉంటాయి. వీటిని రాజులు విలాసయాత్రలకు వినియోగిస్తారు. ఈ నౌక వర్షాకాలపు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
“మూడవ తరగతికి చెందిన నౌక అగ్రమందిర. నౌక ముఖం వేపు గదులను నిర్మిస్తారు. వీటిని వానలు వెలిసిన తరువాత, వాతావరణం పొడిగానున్నప్పుడు ఉపయోగిస్తారు. వీటిని నౌకాయుద్దానికి వినియోగిస్తారు. దూర ప్రయాణాలకు ఇవి అనువుగా ఉంటాయి.”
రుద్రభట్టు ధర్మమిత్రుడివేపు చూసి అడిగాడు.
“ఓ మహానావికా! ఈ శ్రమణుడు చెప్తున్నది శాస్త్ర సమ్మతంగానే ఉందా?”
ధర్మమిత్రుడు తల ఊపాడు. శ్రమణుడు చెప్పడం సాగించాడు.
(సశేషం)
ఘండికోట బ్రహ్మాజీరావు గారు సుప్రసిద్ధ సాహితీవేత్త. పలు కథలు, అనేక నవలలు రచించారు. ‘శ్రామిక శకటం’, ‘ప్రతిమ’, ‘విజయవాడ జంక్షన్’, ‘ఒక దీపం వెలిగింది’ వారి ప్రసిద్ధ నవలలు. శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం, వేయిన్నొక్క రాత్రులు (అనువాదం) వారి ఇతర రచనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™