మొదటి భాగం తరువాయి…
♣ ఒక సక్సెస్ఫుల్ సింగర్‌గా మీ ప్రొఫెషన్ గురించి చెప్పుకునేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు?
* నేను చాలా గర్వంగా ఫీలవుతానండి. అంతే కాదు మా నాన్నగారు మట్టితో కుండలు చేసేవారు. ఎంతో కళాత్మకమైన ఆకృతిలో తయారు చేసేవారు. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి నాన్న చేసిన కుండలే కావాలని తయారు చేయించుకునేవారు. నాన్న చేతిలో ఆ కళ అలా వర్ధిల్లింది.
నేను ఆటో డ్రైవర్‌నని, ‘ఇది నా వృత్తి’ అని ప్రకటించుకోడానికి నేనెప్పుడూ వెనకాడను. నేను మొదట్నించి వెహికల్స్ వ్యాపారం లోనే వున్నా. ఏమో, రేపు నేను ఆటోమొబైల్స్ – తయారీనే చేపడతానేమో.. తెలీదు కదా. విధి చేసే వింతలెన్నో తెలిసినవాణ్ణి. వయసు చిన్నదే అయినా, అనుభవాలు చాలా పెద్దవి. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది – నా సంగీత లోకం వేరు. బ్రతకాల్సిన ఈ లోకం వేరు అని. ఈ రెండూ, రెండు విరుద్ధమైన ప్రపంచాలు.. అని, నాకూ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
♣ అంటే ఘర్షణకి గురి అవుతున్నారా?
* కొంత వరకు తప్పదు కదా! తప్పించుకోలేము. కానీ, నేనెప్పుడూ నా సంగీత ప్రపంచాన్నే ప్రేమిస్తాను. నా స్నేహం, ప్రాణం, ఆరాధనం అంతా సంగీతమే. నీకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా? పాట అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగితే – ‘నాకు సంగీతమే ఇష్టం అమ్మ కంటే కూడా..’ అని జవాబిస్తాను.
అమ్మకి కూడా పాటంటేనే ఇష్టం కాబట్టి, పాట వెంటే అమ్మ కూడా వుంటుంది.
♣ మీ గాన ప్రస్థానంలో మైలురాయి వంటి సంఘటన వుందా?
* వుందండి. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. ఇది మీ అందరి ముందు ఉంచాల్సిన అవసరం చాలా వుంది. ఇది నా నైతిక బాధ్యతగా కూడా భావిస్తున్నాను. నిజానికి ఇలా చెప్పడం చాలా గర్వంగా కూడా వుంటుంది.
అంజి తాడూరి – గాయకుడిగా ఇక్కడి నుండి మరో మైలురాయిని చేరుకున్నాడు. అది ఎలా అంటే, 2013వ సంవత్సరంలో ఒక మ్యారేజ్ ఈవెంట్లో ‘సాయి పావని’ గారు నాకు సింగర్‌గా పరిచయమయ్యారు. తను మంచి గాయని. తనతో పరిచయం కొద్ది రోజుల్లోనే మేము మంచి కుటుంబ స్నేహితులుగా చేసింది. ఆమె సహృదయిని. అందరకీ సాయం చేసే మనస్తత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమతి సాయిపావని మంచితనానికి నిలువెత్తురూపం. ఆమె భర్త శ్రీ సురేష్ గారు కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి. ఈ నా విజయంలో వారు నాకందించిన ప్రోత్సాహ సహకారాలు ఎంతైనా కొనియాడదగినవని చెప్పాలి. ఈ దంపతులకి నా హృదయపూర్వక ధన్యవాదాలను మన సంచిక ద్వారా అందచేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా వుంది. థాంక్యూ! సాయి పావని గారు!!
♣ నిజమేనండి. సాయి పావని మంచితనం గురించి నాకూ తెలుసు. చేసిన సాయాన్ని మరచిపోయే మనుషులున్న ఈ కాలంలో మీరు గుర్తుపెట్టుకుని చెప్పుకోవడం ఎంతైనా హర్షణీయం… మీ అభిమాన గాయనీ గాయకులు?
* కేవలం ఒకరని చెప్పడం చాలా కష్టం మేడం! ఘంటసాల, బాలు, జేసుదాసు గారి గాత్రాలంటే ప్రాణం. అలాగే హిందీలో రఫీ గారి పాటల్ని తనివి తీరా పాడుకుంటుంటా. సంగీత దర్శకులలో మాత్రం, ఇళయరాజా, ఎ ఆర్ రెహ్మాన్ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. వీరి సంగీత కూర్పులలో ఒక కొత్త సృష్టి కనిపిస్తుంది. సృజనాత్మకతకి పెట్టింది పేరు అన్నట్టుంటాయి పాటలు. క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాబట్టే పాటలు పాపులర్ అవుతాయి. సంచలనాన్ని సృష్టిస్తాయి. కొన్ని ట్యూన్స్ అయితే అంత సులువుగా రావు. సాధన చేస్తే తప్ప ఆ బాణీలను అందిపుచ్చుకోలేం. అందుకున్నాక పొందే ఆనందం అద్వితీయంగా వుంటుంది.
♣ అలా మచ్చుకి కొన్ని పాటలు చెబుతారా?
* లలిత ప్రియ కమలం విరిసినది, నాదము వేదము నాట్య విలాసము, శశి వదనే శశి వదనే, కురిసేను విరిజల్లులే..ఇలా ఎన్నో అమృత ధారలై కురిసే స్వర కూర్పులతో మనలని ఆనందంలో ముంచెత్తారు – వీరిద్దరూ.
♣ మీకు ఎక్కువ ప్రీతికరమైన పాట?
* ‘నా పాట పంచామృతం ‘- ప్రతి ప్రోగ్రాంలో నా అభిమానులు నన్నడిగి మరీ పాడించుకుంటుంటారు. ఇది నాకెంతో ఇష్టమైన గీతం కూడా! నాకెంతో సక్సెస్‌ని ఇచ్చిన గీతమే, నాకు ప్రీతికరమైన పాటగా మారింది.
నిజం చెప్పాలీ అంటే, ఏ పాట కా పాటనే ఓ దేవుడిలా కొలుచుకుంటుంటానండి. సంగీత ఆరాధనలో నేనొక పాటల పూజారిని అనుకోండి. పాట ఒక్కటుంటె చాలు తోడుగా.. ఎక్కడలేని ఉత్సాహం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. నా జీవం, జీవన రాగం – పాట ఒక్కటే.
♣ మీ స్వరం బావుంటుందని అందరూ మెచ్చుకుంటారు. ఆ మాట నిజం కూడా. కానీ, గుర్తింపు ఆశించినంత మేర దొరుకుతోందంటారా?
* ఎప్పటికైనా విజయం నా ఇంటి తలుపు తడుతుందన్న నమ్మకం వుందండి. ఎప్పటికైనా బాలు వంటి గాయకులు నా టాలెంట్‌ని గుర్తించి నాకూ ఒక అవకాశాన్ని ఇస్తారన్న పూర్తి విశ్వాసం వుంది.
ఎందుకు నాకింత ఆశ అంటే నేను సినిమా పాటని అంత శ్రద్ధగా, రాగ భావ యుక్తంగా నేర్చుకుని, రికార్డ్ చేసుకుని, తప్పులుంటే సవరించుకుని, మళ్ళా మళ్లా సాధన చేస్తుంటా. వేదిక మీద నా పాటకి గుర్తింపు వస్తోందంటే, పాట అనే దేవతని భక్తిగా ఆరాధించుకోవడం వల్ల నాపై కురిసిన ఆ కటాక్షంగా భావిస్తుంటాను.
♣ మీరు సినిమా పాటని విని నేర్చుకుంటారా? లేక స్వరం రాసుకుంటారా?
* అన్ని పాటలకీ స్వరం అవసరం వుండదండి. శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యత నిస్తూ సమకూర్చిన గీతాలకు తప్పని సరిగా స్వరం రాసుకునే పాడతాను. కొన్ని పాటలు మైండ్‌లో అలా అచ్చుగుద్దినట్టు గుర్తుండిపోతాయి. అనుసరిస్తూ పాడటమే తరువాయన్నట్టు ఎప్పటికీ సిధ్ధంగా రికార్డ్ అయి పోతాయి.
♣ మీ ఆశలు, ఆశయాలు, భవిష్యత్తు ప్రణాళికలు..
* అన్నిటికీ కేంద్ర బిందువు పాట ఒక్కటే! ఎప్పటికైనా ఈ అంజి పాపులర్ సింగర్ అవుతాడని – ఆశ వుంది. సెలెబ్రెటీల ముందు అద్భుత గీతాలను ఆలపించి శభాష్ అనిపించుకోవాలన్నదే నా ఆశయం.
♣ మీ ఆశ ఫలించాలని కోరుకుంటున్నాం అంజి గారు.
* థాంక్సండి. సంచికతో నా మనసులోని మాటలను పంచుకోవడం నాకెంతో ఆనందం గా వుంది. నూతన గాయనీ గాయకులకు మీరందిస్తున్న సహకారం ఎంతైనా ప్రశంసనీయం. మీకు, సంచిక సంపాదకులకు నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
♣ థాంక్సండి. ఆల్ ద బెస్ట్!.
***
Songs links
10.Naa kallu chebuthunnayi ninu preminchanani song
అంజి తాడూరి
Cell: 9640215297, 8919421720
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™