శివశివయన శివుడే పలుకు.. హరహరయన మనసే తుళ్లు.. శివనామమె వింటే ఒళ్లు పులకరించు.. శివాత్మికను తలచి జీవనమ్ సాగించు.. అర్ధనారీశ్వరమే నరునకు దారిచూపు..
శివుడు నిజంగా ఉన్నాడా.. ఉంటే ఎక్కడ ఉన్నాడు.. కైలాసగిరిపై ఉన్న రహస్యమేంటి.. లింగానికి, పానవట్టానికి సంబంధమేంటి.. శృంగార భావనలకు శివపార్వతులు ఆద్యులెలా అవుతారు.. లయకారుడైన శివుడి జలాభిషేకంలో ఆంతర్యమేంటి, దైవీ భాననకు, సైన్స్‌కు లింక్ ఉందా.. అటు పండితులను, పామరులను వేలాది సంవత్సరాలుగా వేధిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు అర్థం తెలుసుకునే దిశగా ఇలా ఎన్నో శోధనలు.. మరెన్నో పరిశోధనలు.. లింగోద్భవాన్ని తలపించే స్థాయిలో కొనసాగాయి. ఇప్పటికీ సాగుతున్న ఈ పరిశోధనలో ఇంకా ఏదో కావాలి అనుకుంటున్న జిజ్ఞాసుల ఉత్కంఠ మధ్య సంతోషన్న చేసిన శివరహస్య ఛేదన తాండవమే ఈ అక్షరమాలిక. మానవజాతి మనుగడకు మూలమైన ఆధ్యాత్మిక భావనలో సైన్స్‌ను మేళవించి చేసే ప్రయత్నాలు ఎన్ని వచ్చినా.. వాటిలో పండిత పామరులను సైతం ఆలోచింపచేసి నిజానిజాలు నిర్ధారించే అవగాహనను కలిగించే గొప్ప ప్రయత్నం కోవెల సంతోషన్నది.
తాను దేవరహస్యం రచన ప్రారంభించిన కొత్తలో పెద్దగా చర్చ జరగకపోయినా.. ఆ తర్వాత అమ్మవారి దశమహావిద్యల రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో అష్టాదశశక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపూర్ జోగులాంబ కరుణాకటాకాలలో సఫలమయ్యారు. అదే క్రమంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వాటికి ధీటుగా సమాధానమిచ్చి తన రచనలోని నిజాయితీని, నిక్కచ్చితనాన్ని నిరూపించుకున్నారు. ఈ రెండిటి తర్వాత మళ్లీ ఏదో చేస్తున్నావా అని అడిగితే తనదైన చిరుమందహాసంలో చూద్దాంలేరా.. అంటూనే విలయ విన్యాసానికి తెరదీశాడు. ఈ పుస్తకాన్ని శివతత్వం అనే కంటే శివరహస్యమనాలేమో.. శివుని ఆద్యంతాలు తెలియక బ్రహ్మ, విష్ణులు వెతుకుతున్న సందర్భంలో ఆ రహస్యాన్ని శోధించే పనిలో సంతోషన్న డివోషనల్ సైన్స్‌ను ఆధారంగా చేసుకుని నేటి తరానికి మహాదేవుని గొప్పతనాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే శివుడంటే న్యూక్లియర్ ఎనర్జీగా పోల్చడంలోనే ఆ లయకారుడి సర్వం అవగతమవుతోంది. ప్రకృతిపురుషులకు లింగపానవట్టాలకు మధ్యపోలికకు అశ్లీలతను చెప్పిన కుహనా మేధావులకు ఆ రెండింటిమధ్య ఉన్న సారూప్యాన్ని వాటి ఏర్పాటులో ఉన్న రహస్యాన్ని చెప్పారు. అసలు ఇదంతా చెప్పేముందు సంతోషన్న స్టైల్ డిఫరెంట్..
ఎన్ని ఆధ్యాత్మిక రచనలు వస్తున్నా.. వాటికి భిన్నంగా నవీన సమాజానికి హైందవ ధర్మాన్ని, దైవం ఆవశ్యకతను, దేవుడు లేడన్న భావననుంచి దేవుడే సైన్స్‌కు మూలమన్న భావనను తన అక్షరాల్లో ప్రస్ఫుటీకరిస్తున్నారు. ఎల్లోరా గుహల సౌందర్యాన్ని అందరూ చూస్తే.. అక్కడ ఉన్న కైలాసనాథ దేవాలయ విశేషాలను అందరూ గమనిస్తే.. ఆ గుహల రహస్యాన్ని .. అక్కడ ఉన్న కైలాసనాథుని ఆలయ విశేషాలను.. భౌమాస్త్ర ప్రయోగాన్ని వివరించిన తీరు ఒక టూరిస్ట్‌గా తన అనుభవాలే కాకుండా.. యాత్ర చేస్తే అక్కడి విషయాన్ని పట్టుకోవాలి.. ఆ ప్రాంతంపై ఇప్పటివరకు జగమెరుగని ముచ్చట్లను చెప్పాలి.. అందులో ఉన్న రహస్యాలను ఔత్సాహికులకు అందించాలన్న గొప్ప సూత్రాన్ని చెప్పిన సంతోషన్న విలయ విన్యాసం పాఠకులను అలరిస్తుంది.. నాస్తిక మెదళ్లకు పనిచెబుతుంది.. ఆస్తిక వాదాలకు బలం చేకూరుస్తుంది.. వెరసి దైవం అనే భావనలో సైన్స్ మిళితమైన విషయాన్ని చక్కగా వివరిస్తుంది.. ఈ నాలుగు ముక్కలు రాసే అవకాశమిచ్చిన సంతోషన్నకు ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్దనాన్నగారైన ఆచార్య కోవెల సుప్రసన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ.. ఇది ఆధ్యాత్మిక రచనల్లో కొత్త ఒరవడికి శ్రీకారంచుట్టి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కలగలిపిన మహాదేవరహస్యం పాఠకుల ముందుకు తీసుకువస్తున్న తరుణంలో సంతోషన్నకు అభినందనలు..
***
విలయ విన్యాసం రచన: కోవెల సంతోష్‌కుమార్ ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ పేజీలు: 160, ధర: ₹ 100/- ప్రతులకు: సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520004. ఫోన్: 0866-2436643 ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™