కథ వినడానికి బాగుంటుంది. అదే చెయ్యి తిరిగిన రచయిత తన కథను తనే చెపితే, చెబుతున్నట్లు వ్రాస్తే ఆసక్తికరంగా, ఆసాంతం ఏకబిగిన చదివిస్తుంది. నాటకం, కథ, చలనచిత్ర కథలు, మాటల రచనలో లబ్ధ ప్రతిష్ఠులైన గొల్లపూడి మారుతి రావు “అమ్మ కడుపు చల్లగా” అంటూ తన జీవితాన్ని మన ముందు అక్షర రూపంలో ఆవిష్కరించారు. ఆత్మ కథ అనగానే కష్టాలు ఏకరువు పెడుతూ, ఆత్మ స్తుతి, పరనిందలతో కాకుండా వాస్తవానికి అతి దగ్గరగా స్వీయనుభవాలను పంచుకోవడం ఆత్మకథను పరిపుష్టం చేసి స్థాయిని పెంచింది. బాల్యం నుంచి పాఠశాల విద్య వరకు అందరిలాంటి జీవితమే. ఆ తరువాత నుంచి తన ఎదుగుదలలోని అనుభవాలు, తాను పడిన తపన నిజాయితీగా చెప్పారు. కాకపోతే 15, 16 ఏళ్ల వయసులోనే ఆంగ్లం నుంచి కథలు అనువదించానన్న గొల్లపూడి ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఒక్క వాక్యం కూడా ఆంగ్లములో మాట్లాడలేకపోయానని నిజం బయట పెట్టారు. చిన్ననాటి స్నేహితుల పేర్లు, సహపాఠీలు, తోటి నాటక రంగ కళాకారులు, ఆకాశవాణి ఉద్యోగులు ఇలా తనకు దగ్గరైనవారు, తన మీద ప్రభావం చూపిన వారిని దశాబ్దాలు గడిచినా పేరుపేరునా గుర్తుచేసుకోవటం వృత్తిపట్ల గొల్లపూడి శ్రద్ధను చాటుతాయి. నేను బుద్ధిమంతుడినని చెప్పుకోవటానికి ఎవరైనా ఇష్టపడతారు. కానీ గొల్లపూడి తన అలవాట్లు, ఇతరాలు, ఆకర్షణ గురించి దాయకుండా కొంత బయటపెట్టారు. గొల్లపూడిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నా సన్మానాల విషయంలో అప్పటి తన స్థాయిని నిజాయితీగా అంచనా వేసి చెప్పారు. ఆఖరికి తనకు పిల్లనిచ్చిన మామ గారికి తన ఆంధ్రప్రభ ఉద్యోగం కన్ను దూఱలేదని త్వరలో ఆకాశవాణికి వెళ్ళబోతున్నారని చెప్పటానికి వెనకాడలేదు. ఆకాశవాణి ఉద్యోగ పరీక్షలో మీ ప్రాంతానికి చెందిన మంచి నాటక రచయిత గురించి వ్రాయమంటే గొల్లపూడి తన గురించి రాసుకోవడం, బస్సు స్టాప్ లో నుంచుని మాటల్లో ప్రక్కతన్ని (కొంపెల్ల గోపాలకృష్ణమూర్తి, శంకరాభరణంలో బ్రోచేవారెవరురా) ఎవరి గురించి వ్రాశారు అంటే అతను కూడా గొల్లపూడి మారుతి రావు అనటం గొల్లపూడి తనను తాను పరిచయం చేసుకోవడం ఎంతో ఆసక్తికరమైన విషయాలు. “అమ్మ కడుపు చల్లగా” చదువుతున్నంతసేపు కథ చదువుతున్నట్టుగా కాక గొల్లపూడి జీవితాన్ని దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉంటుంది. రేడియోలో ఉద్యోగం చేస్తున్నప్పటి ఆయన అనుభవాలు చదివితే మనకు ఆకాశవాణి కార్యక్రమాల రూపకల్పన రికార్డింగ్ అక్కడి వాతావరణం మొదలగునవి అన్నీ పరిచయమయ్యి, వాటి మీద అవగాహన ఏర్పడుతుంది. తెలుగు నాటకం, ఆకాశవాణి, సాహిత్య, చలనచిత్ర రంగాలలోని ఉద్దండులతో కలిసి పనిచేసే అవకాశం గొల్లపూడికి దక్కింది. సాహిత్యరంగంలో లబ్ధ ప్రతిష్టులైన వారందరికీ ఆనాటి ప్రసార మాధ్యమమైన రేడియోతో ఎంతో కొంత అనుబంధం ఉంది. అందరితో పరిచయం, ఎందరితోనో సాంగత్యం, కొందరితో కలిసి పనిచేసే అవకాశం అరుదుగా లభించే అదృషటాలు. ఆ అదృష్టాన్ని వరంగా పొందారు గొల్లపూడి. ఒక తరం ఉద్దండులను చూసి వారి నుంచి స్ఫూర్తిని పొంది, నేర్చుకుని జీవితంలో ఎదగడం గొల్లపూడి కృషికి నిదర్శనం. మునిమాణిక్యం, దాశరధి వంటి హేమాహేమీలతో రేడియో ఉద్యోగ జీవితం తొలినాళ్లలో కలిసి పని చేశారు. మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మరణవార్తను హైదరాబాద్ కేంద్రం నుంచి పొద్దున్నే ప్రజలకు చెప్పింది గొల్లపూడియే. మద్రాసు కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు చిత్తూరు నాగయ్య కాలం చేస్తే చలనచిత్ర ప్రముఖులైన నాగిరెడ్డి, ఘంటసాలల శ్రద్ధాంజలిని రికార్డు చేసి చదివి ప్రసారం చేశారు గొల్లపూడి. ఆ తరువాత కొద్దిరోజులకే ఘంటసాల మరణిస్తే పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, దాశరధి, ఎస్.రాజేశ్వరరావుల స్పందనను నివాళిగా గొల్లపూడి ప్రసారం చేశారు. వృత్తి రేడియో జీవితం, ప్రవృత్తి చలన చిత్ర కథా రచన కావటం వలన ఈ అవకాశం దక్కింది. చిత్రసీమలో ఒక్కో మెట్టు తను ఎలా ఎక్కింది సవివరంగా చెబుతుంటే చిత్ర పరిశ్రమ చిత్రవిచిత్రాలు ఔరా అనిపిస్తాయి. గానీ గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అవసరాల్లో ఉన్న వారిని గుట్టుగా ఆదుకుంటారని చెబుతూనే డబ్బున్న నిర్మాతల గదుల్లో ఉండిపోయే కథానాయికల గురించి చెప్పకనే చెప్పారు. హీరోయిన్లు ఇచ్చే విందులు, బొంబాయి తారలు షూటింగుల్లో ఒలక పోసే హొయలు, వలపులతోపాటు, కొందరు నిర్మాతల క్రమశిక్షణ, కొందరి పొగరు, కొడుకులు అల్లుళ్ళు సినీ నిర్మాణ రంగంలో అడుగు పెడితే సినిమా పెద్దలు పడే పాట్లు వంటి చిత్ర విచిత్రాలు కూడా తెలుస్తాయి. గొల్లపూడి రచన చేసిన చిత్రాలలో ఏవైనా అనుకున్న విధంగా విజయ తీరాలు చేరకపోతే కథ అద్భుతమని, నిర్మాత అభిరుచి దర్శకుని ప్రతిభలకు లోపాన్ని అంటగట్టారు. తన ప్రసిద్ధ నాటకం ‘కళ్ళు’ని సినిమా తీయాలని కె.బాలచందర్ వంటివారు కూడా ప్రయత్నించారు కానీ కుదరలేదు. చివరికి తీసిన కళ్ళు చిత్రం గొల్లపూడికి తృప్తినివ్వలేదు. దశాబ్దాల క్రితమే గొల్లపూడి రచయితగా వెలుగుతున్న రోజులలో కొందరు కథలు చెప్పించుకుని, తాము సొంతగా సినిమాలు తీసుకునే వారట. అలాంటి మోసాలు ఆ రోజుల్లోనే ఉండేవన్నారు గొల్లపూడి. అమెరికా అమ్మాయి చిత్రం ఘన విజయం సాధించినా పాడనా తెనుగు పాట ముందు అందరూ గాలికి కొట్టుకుపోయి ఎవరి పేరు పైకి రాలేదని పి సుశీల గానమాధుర్యం అంత గొప్పది చెప్పారు. మద్రాసు రేడియో నుంచి బదిలీకి ఒక్కరోజు ముందు మహానటి సావిత్రి గాత్ర ధారణలో ఒక సినీ నటి కథ “తనలో తాను” నాటకాన్ని రికార్డు చేయటం మరపురాని అనుభవం అంటారు గొల్లపూడి. కళ ఒక మైకం, పిచ్చి. కెమెరా ఆవిష్కరించే ఉన్నతమైన కళావైభవాన్ని చూసి ఆనందించాలంటే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు తప్పక వెళ్లాలి అంటూ ఆ విషయంలో తనకు నటులు గుమ్మడి ఆదర్శం అంటారు గొల్లపూడి. పత్రికలో కాలమ్ వ్రాయటం అంటే కత్తి మీద సాము. సమాజంలోని మంచి చెడులను విశ్లేషించే ‘జీవన కాలమ్’ మొహమాటానికి మొదలుపెట్టినా రుచి మరిగాక వ్యసనమై మూడు దశాబ్దాలకు పైగా సాగింది. విమర్శని తట్టుకునే స్థాయి అందరికీ ఉండదు. అలాగే విమర్శకులకు తగిన గౌరవం దక్కదు. జనసామాన్యంలోకి జీవన కాలమ్ చొచ్చుకు పోయినా గొల్లపూడికి దక్క వలసిన అనేక గౌరవాలు దూరం చేసిందేమో ఈ జీవనకాలమ్. ఈ కాలమ్ గురించి మురిసి పోతూ పొగడ్తలు చెప్పుకున్నట్టే పరుషమైన తెగడ్తలను నిస్సంకోచంగా చెప్పారు గొల్లపూడి. త్వరగా డబ్బింగ్ చెప్పగలిగిన అతి కొద్దిమంది ప్రతిభావంతులలో ఒకరైన గొల్లపూడి తెరవైపు చూడకుండానే డబ్బింగ్ చెబుతారుట. పనిలోపనిగా తన మత్తు పానీయపలవాటు, తాగి చిత్రీకరణలో పాల్గొనే నటులను కూడా ఉట్టంకించారు. కాకపోతే మహాకవి శ్రీశ్రీని కొందరు మత్తుసీసాలతో వచ్చి కలిసేవారని, శ్రీశ్రీ కూడా ఆ ఏర్పాటుల గురించి తెలిసి వెళ్ళేవారని చదివితే బలహీనత ఎంత ఒలమైనదో తెలుస్తుంది. రాజా లక్ష్మీ ఫౌండేషన్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుమతి గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గురించిన ప్రసంగంలో వేటూరి పాటను సినారె వ్రాసినట్టుగా విపులంగా ఉదహరించానంటూ తన పొరపాటును ఒప్పేసుకున్నారు. గొల్లపూడి నటవైభవం కాస్త తగ్గుముఖం పట్టేసరికి, మూడవ కుమారుడు శ్రీనివాస్ సినీరంగంలో నిలదొక్కుకునే ప్రయత్నాలలో ఉండటం, సముద్రపలలు నిలబడనీయక లాక్కుపోవటం చదువుతుంటే పాఠకులు దుఃఖసముద్రములో మునిగిపోతారు. చేయి తిరిగిన కథకుడైన గొల్లపూడి తన కుమారుడి ఆఖరు రోజులను , తన కడుపు కోతను వ్రాసినట్టుగా కాక మనతో చెప్పుకుని ఉపశమనం పొందుతున్నట్టు అనిపించుతుంది. అకాల మరణం పొందిన తన కొడుకు పేరున కొత్త దర్శకునకు “గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ బహుమతి” ఇవ్వటం కోసం ఒక ఫౌండేషన్ స్థాపించి, జాతీయ స్థాయిలో బహుమతి ప్రదానోత్సవం కోసం ప్రముఖులను కలవటం, ఆ కార్యక్రమం నిర్వహించటం, వీటికోసం పడిన తపన, శ్రమ చూసేవారికి (చదివేవారికి)ఒక ప్రేమించే తండ్రి అంతకంటే ప్రతిక్షణం కొడుకు ఙ్ఞాపకాలలో బ్రతికే గొల్లపూడి మన కళ్ళముందుంటారు.
బుల్లితెర తొలితరం టి.వి.ప్రయోక్తగా “మనసును మనసై” ఆరోగ్యకరమైన, ఆహ్లాదాన్ని పెంచుతూ, ఆలోచనలు రేకేత్తించే ప్రశ్నలను “ప్రతిధ్వనిం”చే కార్యక్రమాలతో ఇంటింటా వెలసి రాణించారు గొల్లపూడి. మనసున మనసై కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు గారు కూడా పాల్గొన్నారు. నటుడిగా విశ్రాంతి దొరికితే, ఆయనలోని రచయిత సామాజిక స్పృహని పెంచుతూ ఆ కార్యక్రమాలు స్థాయిని పెంచారు. దృశ్యం మాధ్యమం ఆలోచన నుంచి వెనక్కి తగ్గి వినోదానికి పరిమితం కావటంతో గొల్లపూడికి బుల్లితెర నుంచి కూడా విశ్రాంతి దొరికింది. గొల్లపూడి సినిమా నటుడిగా గణుతికెక్కి, గణించినా, సినిమాలకన్నా నాటకాలంటేనే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టమెంతంటే ఆయనకు అమెరికా కన్నా బ్రిటన్ గొప్పగా వచ్చేంత.. అమెరికా వైభవం కృత్రిమమని, బ్రిటన్ వైభవం సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో ఉందని అంటారు. కాని ఆత్మకథ చదివాక బ్రిటన్ వాసులు నాలుగు వందల సంవత్సరాల నాటి నాటకాలను టిక్కెట్టు కొని మరీ ప్రజలు చూడటం గొల్లపూడి నచ్చుబాటుకి అసలు కారణమని తెలుస్తుంది. ఆ అభిమానంతోనే తన అభిమాన నటుడు చార్లీ చాప్లిన్, ఆయన భార్య సమాధులను కుటుంబ సమేతంగా యూరప్ పర్యటించినలో భాగంగా స్విట్జర్లాండ్ వెళ్ళినపుడు వెతుక్కుంటూ వెళ్లి మరీ సందర్శించారు. వృత్తి జీవితం నుంచి విశ్రాంతి లభించాక వ్యక్తిగత జీవితాన్ని సతీసమేతంగా చలన చిత్రోత్సవాలకి, నాటకోత్సవాలకి హాజరవుతూ తాను కోరుకున్న అనేక ప్రాంతాలను సందర్శించుతూ జీవితంలో ప్రతి క్షణాన్ని రుచి చూసి ఆస్వాదించారు గొల్లపూడి. ప్రసిద్ధ ”సాయంకాలమైంది” నవలతో పాటు “జీవనకాలమ్” దశాబ్దాల పాటు కొనసాగించిన అలుపెరుగని రచయిత గొల్లపూడి. తల్లి చివరి రోజుల్లో విశాఖపట్టణంలో ఉండి తల్లిని కడతేర్చిన కొడుకు గొల్లపూడి. సామాన్య కుటుంబంలో పుట్టి, సైన్స్ చదివినా ఆసక్తి ఉన్న నాటక, సాహిత్య రంగాలలో కాలుమోపి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుగు కళారంగంలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్న గొల్లపూడి ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా” అందరూ చదువవలసిన గ్రంథం.
***
నేను అమ్మ కడుపు చల్లగా చదివి గొల్లపూడి గారికి ఒక తరంగలేఖ పంపాను.
“మీరు పదిహేను పదహారేళ్ళ వయసులోనే ఆంగ్లం నవలలు అనువాదం చేశానన్నారు. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఒక్క వాక్యం కూడా ఆంగ్లములో మాట్లాడలేకపోయానని కూడా అన్నారు” అదెలా?
దానికి మరునాడు గొల్లపూడి మారుతీరావు గారి నుంచి తిరుగు తరంగలేఖ వచ్చింది. ఈ సమాధానంతో
“Speaking is a habit. Then I didn’t have it”.
అమ్మ కడుపు చల్లగా రచన: గొల్లపూడి మారుతీరావు ప్రచురణ: కళాతపస్వి క్రియేషన్స్, పేజీలు: 518 వెల: 560 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™