బుగ్గ రామలింగేశ్వరాలయం శిల్ప సౌందర్యం కనుల ముందు కదలాడుతుండగా, ఆ రోజు మేము చూడాల్సిన ఆలయం ఇంకా ఒకటుందని గుర్తుండటంతో అక్కడనుండి బయల్దేరి చింతల వెంకటేశ్వరస్వామి ఆలయం చేరుకున్నాము. ఇది శిల్పకళలో ఇంకో అద్భుతం.
ఇదికూడా పెన్నా నది ఒడ్డునే సుమారు 5 ఎకరాల స్ధలంలో వున్నది. పెన్నానది ఈ ఊరులోంచి ప్రవహిస్తూ వుంటుంది.
ఈ ఆలయ నిర్మాణం కూడా విజయనగర సామ్రాజ్య సమయంలో జరిగింది. 16వ శతాబ్దంలో దీనిని నిర్మించింది పెమ్మసాని నాయకుల వంశానికి చెందిన పెమ్మసాని తిమ్మనాయుడు -2. ఈ ఆలయంలో గ్రనైట్ రాళ్ళమీది చెక్కిన అత్యద్భుత శిల్పాలున్నాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీనిని మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద క్లాసిఫై చేశారు.
ఒక కథ ప్రకారం ఇక్కడ నెలకొన్న వెంకటేశ్వరస్వామి విగ్రహం చింతల తోపులో దొరికింది. అందుకనే ఆయన పేరు చింతల వెంకట రమణ. ఈయన్ని కొలిచిన వారికున్న చింతలన్ని తొలగి పోతాయంటారు. ఒకసారి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద చింత చెట్టు నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. దాంతో అక్కడి స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది.
అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కనబడి చింత చిట్టు తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం తిమ్మానాయుడీ ఆలయం నిర్మించి, స్వామి నిత్యపూజలకు అర్చకులను నియమించి, అనేక భూములు కైంకర్యం చేశాడు. చింత చెట్టు తొర్రలో నుండి విగ్రహం లభించడం వల్ల అప్పటి నుండి చింతల వేంకటరమణ స్వామిగా పిలుస్తున్నారు.
అధ్బుతమైన శిల్ప సంపద అంటే గుర్తొచ్చేది ఉత్తరాదిన ఖజురహో, దక్షిణాదిన హళేబీడు, బేలూరు లోని హొయసలేశ్వర గుడి మరియు చెన్నకేశావాలయం. అటువంటి గుడులకు ఏ మాత్రం తీసిపోని శిల్ప సంపద ఉన్న గుడులు తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ చింతల వెంకట రమణస్వామి దేవాలయం. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలు, ఆలయాల నిర్మాణంలో ద్రవిడ శిల్ప శైలి కనిపిస్తుంది.
విజయనగర నిర్మాణ శైలిలో వున్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాశి నుండి శిల్పులను రప్పించారు.
ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సినది సూర్యుని కిరణాలు గర్భగుడిలోని స్వామి వారి పాదాలను తాకడం. ఆ తర్వాత చెప్పుకోవలసినది ఆలయం నిర్మాణంలోని శిల్ప సౌందర్యం. ఆలయం ముందు భాగంలో ఉన్న రాతిరథం హంపిలోని ఏకశిలారథాలను పోలి ఉంటుంది. కదలిక మినహా రథానికి ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి.
రథంలో నాలుగు అడుగుల గరుక్మంతుడి విగ్రహం ముకుళిత హస్తాలతో దర్శనమిస్తుంది. ఆలయం చుట్టూ, లోపల అపారమైన శిల్పసంపద ఉంది. దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది. ఇది కూడా హంపీలోని విఠలాలయాన్ని పోలి ఉండటం విశేషం.
గోడలపై, స్తంభాలపైన రామాయణం, మహాభారతం, భాగవతం ఘట్టాలు, మరియు శ్రీ మహావిష్ణువు అవతారాలతో కూడిన ఘట్టాలను చూపిస్తూ వున్న శిల్పాలు జీవం ఉట్టిపడేలా దర్శనమిస్తాయి.
ఇక్కడ బ్రహ్మ, కుబేర, యక్ష, కిన్నెర, మానవమూర్తులు, గజ, తురగ, మర్కటాది బొమ్మలను చూడవచ్చు. హంసలు, చిలకలు కుడ్యాలపై కనువిందు చేస్తాయి. కాళీయ మర్ధన కృష్ణరూపం అత్యంత రమణీయం.
గర్భగుడి గోపురం ఎనిమిది ముఖాలతో ద్రావిడ పద్ధతిలో నిర్మితమైంది. గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథానికి వున్న రెండు రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారు.
గర్భాలయం పై కప్పుకు బిగించిన అష్దదళ రాతిపద్మం ఒకప్పుడు తిరుగుతూ ఉండేదంటారు. ఇక ఆస్థాన మండపంలో కిష్కింధ, చిత్రకూట, సీతారాముల అరణ్యవాస ఘట్టాలను చూడవలిసిందే. ఆలయం బయట ఎత్తయిన రాజగోపురం దానికీ ఎదురుగా ఓ పెద్ద రాతి మండపం మీద శిలాతోరణం ముందుగా మనకు కనిపిస్తాయి. ఆలయం లోపల ధ్వజస్తంభం ఉంది.
ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి ఆలయం,12మంది ఆళ్వారుల వారి మందిరం, ఆంజనేయస్వామి వారి మందిరం, ఆనంద వల్లి, లక్ష్మి చెన్నకేశవ స్వామి మొదలైన ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఏటా ఆశ్వీయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) నుంచి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
అనంతపురం నుండి తాడిపత్రికి 56 కి.మీ.ల దూరంలో వున్న తాడిపత్రికి అనంతపురంనుంచి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది. అదే విధంగా తాడిపత్రిలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుండి ఇక్కడకు నిత్యం రైళ్లు వస్తుంటాయి. తిరుపతి నుంచి తాడిపత్రికి సుమారు 257 కిలోమీటర్లు. తిరుపతి నుంచి కూడా తాడిపత్రికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి.
అంత అద్భుత శిల్పకళని చూసిన తర్వాత అక్కడనుండి రావటం కూడా కష్టమయింది. రాత్రి 7-15కి బయటకి వచ్చి బస్ స్టాండ్‌కి చేరుకున్నాము. 7-30కల్లా అనంతపురం బస్ ఎక్కి 8-45కి రూమ్‌కి చేరుకుని విశ్రాంతి తీసుకున్నాము.
దీనితో ఉమా నేను చేసిన అనంతపురం పర్యటన అయిపోయింది. ఐదు రోజుల్లో 23 ఊళ్ళు, 27 ఆలయాలు చూశాము బస్సుల్లో, ఆటోల్లో మాత్రమే తిరిగి. బాగుంది కదా మా యాత్ర.
అన్నట్లు మర్నాడు ధర్మవరంలో, చుట్టుపక్కల ఇంకో నాలుగు ఆలయాలు చూశాము. అవేమిటంటే, ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, ఇది వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయం, ధర్మవరంలోనే శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం, మేడాపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఇంకా దోవలో చిన్న కొండమీద వున్న నరసింహస్వామి ఆలయం (ఊరు పేరు కూడా తెలియదు). వాటి కథా, కమామీషూ తెలియదుగనుక మీకు పరిచయం చెయ్యలేదు. ఆ రోజు రాత్రి బయల్దేరి హైదరాబాద్ వచ్చేశాము. వచ్చేవారం నుంచి దీనికి ముందు మా వారితో చేసిన అనంతపురం జిల్లా పర్యటన గురించి తెలియజేస్తాను.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™