మర్నాడు (24-2-15) మంగళవారం ఉదయం 8-10కి పల్లా రెసిడెన్సీలో గది ఖాళీ చేసి ఆటోలో బస్ స్టాండ్‌కి వెళ్ళాము. కదిరి బస్ రెడీగా వున్నది. హోటల్లో చెప్పారు గోరంట్లలో పురాతన ఆలయం వున్నదని, బస్‌లో వెళ్ళవచ్చని. దాన్లో ఎక్కాము గోరంట్ల వెళ్ళటానికి. ఇవాళ మా ప్రోగ్రాం గోరంట్ల, అక్కడనుండి కదిరి.
హిందూపూర్ నుంచి గోరంట్ల 37 కి.మీ.లు. బస్ ఛార్జీ ఒక్కొక్కరికి 24 రూ.
ఉదయం 9-25 అయింది గోరంట్ల చేరేసరిగి. ఆలయానికి వెళ్ళాలంటే ఒక నాలుగు రోడ్ల కూడలిలో దింపి అక్కడనుంచే వెళ్ళాలి అన్నారు. అక్కడ షాపులో అడిగాము ఆలయానికి ఎలా వెళ్ళాలని. దగ్గరే… నడిచి వెళ్ళచ్చని చెప్పారు. సామాను ఆ షాపులోనే పెట్టి మేము ఆలయానికి వెళ్ళాము.
ఇది గోరంట్ల మండలంలో గౌనువారిపల్లి అనే ఊళ్ళో వుంది. అన్నీ కలిసి వున్నట్లే వుంటాయి. ఇక్కడ ప్రధాన దైవం మాధవరాయలు పేరుతో వెలిసిన శ్రీ మహావిష్ణువు. నిర్మాణ శైలి విజయనగర రాజులది. ప్రస్తుతం ఈ ఆలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధీనంలో వున్నది.
ఆలయాన్ని క్రీ.శ. 1354లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన నరసింహ సాలువ రాజు నిర్మించాడు. వాకిట ఆదప్పనాయుడు, ఈ ప్రాంతంలో కప్పం వసూలు చేసిన అధికారి, దగ్గరవుండి ఈ ఆలయాన్ని నిర్మింప చేసినట్లు ఇక్కడ వున్న శాసనంలో వున్నదిట. ఆయన బొమ్మ వాకిట్లో చెక్కించారు. ఇక్కడ రెండు శాసనాలు వున్నాయి. ఇక్కడికి ఒక కిలో మీటరు దూరంలో ఇంకో ఐదు శాసనాలు లభ్యం అయినాయి. అళయరాయలు చివరి సమయంలో బయట గోపురం నిర్మాణం ప్రారంభమయిందిగానీ, మధ్యలో ఆగిపోయింది. ముందు మంటపంలో స్తంభాలకి యాలి శిల్పాలు చెక్కబడ్డాయి. మూల స్తంభాలు మహావిష్ణువు దశావతారాలు, ఇంకా ఇతర దేవతల విగ్రహాలతో అలంకరింపబడ్డాయి. మహా మంటపంలో రామాయణంలోని వివిధ ఘట్టాలు అందంగా చెక్కబడ్డాయి. అర్ధ మంటపంలో స్తంభాలు, పై కప్పు అంతా అత్యద్భుతమైన శిల్పాలే. గుడిలోకి ప్రవేశించే మార్గాలు కూడా అత్యద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి.
గర్భగృహంలో స్వామి విగ్రహం చిన్నదే. 1912 సంవత్సరపు డిస్ట్రిక్ట్ గెజిట్ మరియు మైసూర్ ఎపిగ్రాఫిక్ రిపోర్టు ప్రకారం ఈ ఆలయం సాలువ వంశానికి చెందిన విజయనగర రాజు నరసింహ రాయలు చేత 1354లో నిర్మింపబడింది. 1610 – 1904 మధ్య ఇక్కడ స్వామి ముక్కు పగలటంతో పూజలు చెయ్యటానికి వీలు లేక పోయింది. (తురుష్కుల దాడిలో స్వామి ముక్కు, గద ధ్వంసమయ్యాయి అనీ, దీనిని డెత్ మాన్యుమెంట్ కింద డిక్లేర్ చేశారని అని అక్కడివారు చెప్పారు). బ్రిటిష్ గవర్నమెంట్ దీనిని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద ధృవీకరించింది. స్వామి ముక్కు శిధిలమయితే ఆ విగ్రహం తీసి, ఇంకో విగ్రహం ప్రతిష్ఠ చేసి వుంటే, ఈ ఆలయం చాలా అభివృధ్ధిలోకి వచ్చి వుండేదనిపించింది. అలా చేయకపోవటానిక కారణాలు మనకి తెలియవు. ఆలయం చుట్టూ విశాలమైన స్ధలం, తోట పెంచుతున్నారు.
ఇక్కడి శిల్పాలలో నన్నూ, మా ఉమనీ అమితంగా ఆకర్షించిన శిల్పాలు స్త్రీలు విలు విద్య ప్రదర్శించటం, యుధ్ధాలు చెయ్యటం, వగైరా స్త్రీల ఉన్నతి చూపించే శిల్పాలు. ఆ కాలంలో స్త్రీలు కూడా వీటన్నింటిలో రాణించారని సంతోషించాము.
ఆలయం ముందు ఒక పెద్ద దిగుడు బావి వున్నది. దానిలో నీరు చర్మ వ్యాధులకి బాగా పని చేస్తాయని ఇక్కడివారి నమ్మకం. దీని గురించి శాస్త్రవేత్తలు పరీక్షలు జరిపి 2000 సంవత్సరంలో హిందూ పేపర్ లో వ్యాసం కూడా ప్రచురించారుట. ఈ నీటిలో వున్న లవణాలు మూలంగా చర్మ వ్యాధులు దూరమవుతాయిట. కొందరు భక్తులు అది మాధవరాయ స్వామి మహిమ అని కొనియాడుతారు. సాసుల చిన్నమాంబ ఈ బావి కట్టించిందని ఇక్కడి వారు చెప్పారు. ఆలయంలో పూజలు లేకపోయినా, ఈ నీటి విలువని నమ్మిన భక్తులు ఇప్పటికీ ఆది, శుక్రు, మంగళ వారాలలో ఇక్కడకి అధిక సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తారు. అలా మూడు, లేక ఐదు వారాలు చేస్తే వారికున్న చర్మ వ్యాధులు పోతాయని వారి నమ్మకం.
మేము ఆలయానికి వెళ్ళి పరీక్షగా చూడటం, ఫోటోలు తీసుకోవటం, రాసుకోవటం చూసి అక్కడి గార్డెనర్ శ్రీ చంద్రశేఖర్, వాచ్‌మేన్ శ్రీ సూరి వచ్చి వారికి తెలిసిన వివరాలు చెప్పారు. చంద్రశేఖర్ గారి ఫోన్ నెంబరు 8008760539.
ఆలయం బయట గేట్లు ఉదయం 6 గంటల నుంచీ సాయంకాలం 6 గంటల దాకా తెరిచి వుంటాయి.
ఈ ఆలయంలో పూజలు లేవు గనుక పూజలు జరిగే సోమశేఖర ఆలయం దగ్గరలోనే వుందని అక్కడివారిలో ఒకరు వచ్చి ఆ ఆలయాన్ని చూపించారు. చిన్న గుడి. నిత్య పూజలు జరుగుతున్నాయి. విశేషమేమీ లేదు.
అక్కడ నా కెమేరా చాలా మొండికేసింది. మా ఉమా తీసిన ఫోటోలే ఎక్కువ పెట్టాను… చూడండి.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™