ఉదయం 9-50కల్లా వెల్లటూరు చేరుకున్నామండీ. వెల్లటూరులో దగ్గర దగ్గరగా చాలా ఆలయాలున్నాయి. ఒకే రోడ్డులో మూడు ఆలయాలు వున్నాయి. ఊరు పేరుకు తగ్గట్టే శ్వేత వర్ణంలో మెరుస్తున్నాయి ఆ ఆలయాలు. మేము ముందుగా దర్శించినది 14, 15 శతాబ్దాలనాటి గణపతి పంచాయతన ఆలయం.
సాధారణంగా గణపతి పంచాయతన ఆలయాలు తక్కువగా వుంటాయి. అందులో ఇది ఒకటి. ఇంతకీ పంచాయతనం అంటే ఏమిటో తెలియని పిన్న వయస్కులకోసం ఒక్కసారి పంచాయతనం గురించి కూడా తెలుసుకుందాము.
పంచాయతనం అంటే అయిదు దేవతల్ని ఏకంగా పూజించుట అని అర్థం. ఈ పంచాయతన పూజా విధానాన్ని పూజ్యులు శ్రీ శంకరాచార్యులవారు ప్రథమంగా ప్రవేశ పెట్టి, ప్రచారం చేశారు. ఆ కాలంలో వివిధ దేవతలను పూజించే వారు ఎక్కువై, వారి మధ్య వైషమ్యాలు పెరుగుతున్న సందర్భంగా, ఒకేసారి వివిధ దేవతలను అర్చించే ఈ పూజా విధానాన్ని అమలు పరచటమేకాక, ప్రచారం చేసి వారి మధ్య విద్వేషాలను తగ్గించారు.
మహావిష్ణు, శివుడు, శక్తి, గణపతి, ఆదిత్యుడు, వీరే ఈ అయిదు దేవతలు. పంచాయతన పూజలో ఈ ఐదుగురిలో ఏ దేవత ప్రధానమయితే వారిని మధ్యలో వుంచి చుట్టూ మిగిలిన దేవతలనుఉంచి పూజిస్తారు. వీరిలో ఏ దేవతను మధ్యలో ప్రధానంగా ఉంచి పూజిస్తే ఆ దేవత పేరిట పంచాయతనాన్ని వ్యవహరిస్తారు. పంచాయతనంలో ఏ దేవత ఏ దిశలో వుండాలో ధర్మసింధు అనే గ్రంధంలో వున్నది.
ప్రకృతి పంచభూతాత్మకం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం – ఇవి పంచభూతాలు. పంచభూతాలకు ప్రతీకలే పైన మనం చెప్పుకొన్న దేవతలు. ఆ దేవతల్ని పూజిస్తే పంచ భూతాలను అర్చించిన ఫలం లభిస్తుంది.
పంచభూతాలను స్మరిస్తే ఆ దేవతల్ని అర్చించినట్లే! ఆకాశమునుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి భూమి, భూమినుంచి ఓషధులు, వాటినుంచి ఆహారం, ఆహారం వల్ల ప్రాణులు ఉత్పన్న మవుతున్నాయి. ఈ సంగతిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. శివుడు ఆకాశతత్వాన్నీ, అమ్మవారు వాయుతత్వాన్నీ, సూర్యుడు అగ్నిత్వాన్నీ, విష్ణువు జలతత్వాన్నీ, గణపతి పృధ్వీ తత్వాన్నీ కలిగి ఉంటారని దైవజ్ఞుల చెప్పారు. నాదం శబ్ద ప్రధానం. శబ్దం గగనగుణం. అందువల్లనే ఆకాశతత్వానికి శివుణ్ణి ప్రతీకగా అభివర్ణించారు. వాయువుకు ప్రాణాన్ని ప్రసాదించే శక్తి ఉంది. అందుకే అమ్మవారికి వాయుతత్వం ఉందన్నారు. అమ్మవారిని ‘ప్రాణదాత్రి’ అన్నారు కదా! సూర్యుడగ్నికి ప్రతీక.. విష్ణువు జల సంభూతుడు. ‘నార’ అంటే జలం. నారనుంచి ఆవిర్భవించాడు కనుకనే ఆయనను నారాయణుడంటున్నాం. మూలాధార చక్రాధిదేవత గణపతి. మూలాధారమన్నది పృధ్వీతత్వం. అందుచేతనే గణపతిని మట్టితోచేసి పూజిస్తారు. మట్టి గణపతి మహత్తు ఎంతో అద్భుతమైనది. మన శరీరం పాంచభౌతికం కదా! అంటే మన శరీరంలోనే పంచాయతనముందన్నమాట. ఈ పంచాయతన పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు.
పంచాయతనమంటే తెలిసిందికదా. ఇక్కడ శ్రీ సిధ్ధి బుధ్ధి సమేత శ్రీ సిధ్ధి గణపతి స్వామి ఆలయంలో గణపతి ప్రధాన దేవత. అందుకనే దీనిని గణపతి పంచాయతన ఆలయం అన్నారు. విశాలమైన ఆవరణలో మధ్యలో సిధ్ధి బుధ్ధి సమేతంగా గణపతి కొలువు తీరి వున్నాడు.
ఈ దేవాలయం 14, 15 శతాబ్దాల కాలంనాటిదట. అప్పుడు దేవాలయ నిర్మాతలు శ్రీ తాడికొండ శేషయ్య, ఆదెమ్మల విగ్రహాలు గర్భగుడి ముందున్న హాలులో వున్నాయి. పూర్వం ఈ గణపతి కళ్ళు తిప్పి చూసేవాడని ప్రతీతి.
మరి పంచాయతనంలో మిగిలిన దేవతలకి కూడా, గణపతి ఆలయం చుట్టూ, వారి వారి స్ధానాల్లో ప్రత్యేక ఆలయాలున్నాయి. శక్తి స్వరూపిణి శ్రీ ఆదిలక్ష్మీ కామేశ్వరి అమ్మవారు ఒక ప్రత్యేక ఆలయంలో కొలువు తీరి వున్నారు. కామేశ్వరి రూపంలో అమ్మవారు కొలువు తీరటం కూడా కొంచెం తక్కువే. ఈవిడ కొందరికి ఇలవేల్పు. వారి ఇంట శుభకార్యాలకు కామేశ్వరిని పెట్టుకుని కానీ మిగతా పనులు చెయ్యరు. శివుడు భీమేశ్వరుడు పేరుతో, సూర్యుడు శ్రీ రాజరాజేశ్వరస్వామి, విష్ణువు ఆది శేషాచలస్వామిగా (ఈయనే క్షేత్రపాలకుడు కూడా) ప్రత్యేక ఆలయాల్లో కొలువు తీరి వున్నారు.
ఇక్కడ స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుందిట. ఇంకొక విశేషమేమిటంటే పెళ్ళికి జరిపేటట్లు అన్ని వేడుకలు.. అంటే.. పెళ్ళి కుమారుణ్ణి చెయ్యటం, వెంకటేశ్వర దీపారాధన, గ్రామోత్సవం, అక్కల ముత్తయిదులు వగైరా అన్ని కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారుట. ఈ వేడుకలు మాఘ శుధ్ధ పాడ్యమి నుంచి షష్టి వరకు జరుగుతాయి. షష్టినాడు కళ్యాణం, కట్లమ్మ గ్రామ దేవత రధోత్సవం జరుగుతాయి.
అక్కడనుంచి బయల్దేరి ఆ వీధిలోనే వున్న శ్రీ అగస్తేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా వున్న శ్రీ శంకర మఠాన్ని కూడా దర్శించాము. ఇవి రెండూ కూడా పురాతనమైనవే. శంకర మఠంలో ఆది శంకరులు ఒక వైపు పూజలందుకుంటుంటే, ఆయన ఎదురుగా ప్రత్యేక ఆలయంలో శ్రీ సరస్వతీ దేవి, అద్భుత సౌందర్యరాశి, జ్ఞాన దీపికలతో వెలుగొందుతోంది.
ఈ ఆలయాల సందర్శన అయ్యాక ఉదయం 10-25కి పెదపులివర్రు వైపు పరుగుతీసింది మా శకటం.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™