ఊహించని సంఘటనలు ఒక్కోసారి మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తాయి. తక్షణం మెదడు మొద్దుబారిపోయి ఏమి చేయాలో తెలీక, ఎదురయ్యే ప్రమాదాన్ని ఊహించలేక సతమతమయ్యే సమయాలు. దానికి తోడు పెద్ద దిక్కు తోడులేని ఒంటరి సంసారిక జీవితాలు, తలుచుకుంటే భయంతో వళ్లు కంపిస్తుంది. మనస్సంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎక్కడి లేని పిరికితనం శరీరంలో ప్రవేశించి వున్న దైర్యం కాస్తా చెట్టెక్కి కూర్చుంటుంది.
బ్రతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ఉద్యోగ రీత్యా సుదూరతీరాలకు పోయి అక్కడ పనిచేయాల్సి వస్తుంది. అయినవాళ్లకి దూరమైపోయి వంటరి జీవితంతో సహవాసం చేయాలి. పెళ్ళైతే కొంచెం ధైర్యం భార్యకూడా ఉంటుంది కనక. తర్వాత ఒక్కళ్ళో ఇద్దరో పిల్లలు… ఇంతకు మించి అయిన వాళ్ళు అంటూ ఎవరూ వుండరు. స్నేహితులు వున్నా కొన్ని పరిమితుల వరకే వారి సహకారాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. పెద్ద దిక్కుకోసం ప్రయత్నించే అవకాశమే రాదు. అంతంత దూరాలు వెళ్లి పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోతే, పెద్దవాళ్ళు అలా తెలియని ప్రదేశాల్లో వంటరిగా గడపడానికి సాహసం చేయరు. అందుకే అలాంటి చోటికి పెద్దవాళ్ళని పిలవడానికి ఇష్టపడరు. పైగా, వాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తే అదనంగా వాళ్లకు సేవ చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఈ రిస్కులు తీసుకోరు.
సాధ్యమైనంత వరకూ సమస్యలను వంటరిగానే ఎదుర్కోడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, ఊహించని సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తట్టుకునే శక్తి సన్నగిల్లి అయోమయ పరిస్థితి ఏర్పడక తప్పదు, తత్పరిణామాలను అనుభవించక తప్పదు. అలాంటివి గ్రామాలలో పెద్దల దృష్టిలో పడకుండా జాగ్రత్త పడక తప్పదు. ఇలా జీవితంలో ఒక్కో వ్యక్తికి, ఒక్కో రకమైన అనుభవం వుండి తీరుతుంది. ఈ నేపథ్యంలో నా భయంకర అనుభవాన్ని మీ ముందు ఉంచడమే, ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.
***
అవి నేను మానుకోట తాలూకా ఆసుపత్రిలో 1982-94, మధ్య కాలంలో దంతవైద్యంలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్నరోజులు. చక్కని ప్రదేశం, మంచి మనసున్న మనుష్యులు, ఇటు పల్లె కాకుండా, అటు పట్నం కాకుండా, బ్రతకడానికి చక్కని అనుకూలమైన ప్రదేశం. తాజా కూరగాయలు, రకరకాల పళ్ళు, నాణ్యమైన బియ్యం, సహృదయులైన మనుష్యులు, ఉద్యోగస్తులకు చక్కని అనుకూలమైన ప్రాంతం అది. ఒకవైపు ఖమ్మం మరో వైపు వరంగల్లు రక్షకభటుల్లా వుండి, వీటి మధ్య ప్రశాంతమైన జీవనానికి పెట్టింది పేరుగా ఉండేది. ఇంచుమించు ముఖ్యమైన రైళ్లు అన్నీ అక్కడ ఆగేవి. అలాంటి ప్రదేశంలో ఉద్యోగం చేస్తూ, పెళ్ళిచేసుకుని ఇద్దరు పిల్లలు కలిగి ఆనందంగా కాలం గడుపుతున్న రోజులు. అప్పటికి నా శ్రీమతికి ఇంకా ఉద్యోగం వచ్చినట్టు లేదు.
అప్పుడు మార్వాడీ వీధిలో రైసుమిల్లు ఎదురుగా తిరుమల రావుగారి ఇంట్లో ఉండేవాళ్ళం. ముందుగది డ్రాయింగ్ రూమ్ కం క్లినిక్‌గా ఉండేది. దానిని ఆనుకునే పడక గది ఉండేది. ఆ రోజు ఆదివారం అనుకుంటాను. మధ్యాహ్నం డ్రాయింగ్ రూంలో కూర్చుని వ్యాసం రాసుకుంటున్నాను. అప్పుడు ప్రాంతీయంగా, మిత్రులు ఉబేద్ సంపాదకుడిగా, ‘వార్తాలహరి’ అనే తెలుగు వార పత్రిక వచ్చేది. దానికోసం పిల్లల దంతసంరక్షణ గురించి సీరియల్‌గా రాస్తూండేవాడిని. అదే తర్వాత కాలంలో ‘చిన్న పిల్లలు దంత సమస్యలు’ అని పుస్తక రూపంలో వచ్చింది.
నేను సీరియస్‌గా వ్యాసం రాసుకుంటున్న సమయంలో, బెడ్ రూంలో కూర్చుని ఏదో పని చేసుకుంటున్న నా శ్రీమతి మెల్లగా దగ్గుతోంది. దగ్గు, జలుబు ఆమెను తరచుగా పలకరిస్తుండేవి. ఆ దగ్గు అలాంటిదేననుకుని, నా పనిలో నిమగ్నమై వ్యాసం రాసుకుంటున్నాను. దగ్గు క్రమ క్రమంగా ఉధృతం అవుతోంది. ఆమె వంక చూడకుండానే “కాస్త మంచినీళ్లు తాగరాదా..!” అన్నాను.
ఆమె మంచినీళ్లు తాగి వచ్చిన విషయం ఆమె వంక చూడకుండానే గమనించాను. కానీ, దగ్గు తగ్గుముఖం పట్టలేదు సరికదా, ఇంకా ఉధృతమైంది. రాస్తున్న కాగితాలు పక్కన పడేసి ఆమె దగ్గరకు వెళ్లాను. దగ్గుతుంది, ఆయాసపడుతుంది గానీ తన బాధను నాకు చెప్పడం లేదు. కానీ అప్పటికే నా శ్రీమతి ముఖం ఎర్రగా అయిపొయింది. వళ్ళంతా ఎర్రగా కమిలిపోయినట్టు దద్దుర్లు, చాలా భయంకరంగా మారింది పరిస్థితి. నా వాళ్ళు ఝల్లుమంది.
సంఘటన నుండి కొంచెం వెనక్కి వెళితే, ఆమెకు తలనొప్పి వస్తే బ్రూఫెన్ బిళ్ళ ఇచ్చేవాడిని. దానితో ఆమెకు వెంటనే ఉపశమనం లభించేది. అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, ఫిజీషియన్ శాంపిల్స్ పుష్కలంగా ఇచ్చేవాళ్ళు. అందుచేత ఆ రోజు కూడా తలనొప్పి అనగానే బ్రూఫెన్ బిళ్ళ ఒకటి ఇచ్చాను. దాని ఫలితం విపరీతమైన రియాక్షన్. ఇక ఏమీ ఆలోచించకుండా, ఉన్నఫళంగా, ఇంటికి తాళం కూడా వేయకుండా, నా శ్రీమతిని, పిల్లలిని స్కూటర్ మీద ఎక్కించుకుని ఆగమేఘాల మీద డాక్టర్ గారి దగ్గరకు వెళ్లాను.
నా శ్రీమతికి వైద్యం చేసిన డా. టి.లక్ష్మీ రాజం గారు
మహబూబాబాద్ ఆసుపత్రికి మొదటిసారి ఎం.డి. డాక్టర్ వచ్చారు. ఆయన నా సహోద్యోగి. ఆయన పేరు చెప్పకపోతే అది ఇక్కడ నేరం అవుతుంది. ఆయన డా. లక్ష్మీరాజం గారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి పోస్టింగ్ ఆయనకీ. ఆయన ఆసుపత్రికి వచ్చిన తర్వాత బయటికి కేసులు రిఫర్ చేయవలసిన అవసరం బాగా తగ్గిపోయింది. అతికొద్ది సమయం లోనే చాలా మంచి పేరు తెచ్చుకున్న ప్రభుత్వ ప్రజా వైద్యుడాయన.
అదృష్టవశాత్తు, ఆ రోజు ఆయన ఇంట్లోనే వున్నారు. నా వేషమూ, నా కంగారూ చూసి, ఆయన వెంటనే పరీక్ష చేయడం మొదలుపెట్టారు. పరిస్థితి ఆయనకు అర్థం అయింది. ఆయన చికిత్స మొదలు పెట్టారు.
ఆయన నాతో మాట్లాడకుండానే వైద్యం చేస్తున్నారు. నా శ్రీమతి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. కూర్చోలేక పోతున్నది, నిలబడలేకపోతున్నది. పడుకోలేక పోతున్నది. దీనికి తోడు ఏదో గైనిక్ సమస్య కూడా మొదలైంది. తెలిసిన స్త్రీ వైద్య నిపుణుడికి ఫోన్ చేస్తే ఆయన ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తున్నట్టు తెలిసింది. పరిస్థితి అయోమయంగా తయారయింది.
డా. లక్ష్మీరాజంతో రచయిత
డాక్టరు గారి కదలికల్లో మార్పు వచ్చింది. నాకు అనుమానం మొదలై చెప్పలేని వ్యథ ప్రారంభమైంది. అయినా డాక్టర్ గారు నాతో మాట్లాడడం లేదు. నిశ్శబ్దంగా చేయదలచుకున్న వైద్యం చేస్తున్నారు. ఆయన సొమ్ముతోనే, రకరకాల మందులు తెప్పిస్తున్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో పిల్లలను దగ్గర పెట్టుకుని ఓ మూల కూలబడ్డాను. క్షణాలు, నిముషాలు, గంటలు సమయం గడిచిపోతుంది. సాయంత్రానికి ఎలర్జీ తగ్గుముఖం పట్టింది. డాక్టర్ గారి ముఖం వెలిగింది.
అప్పటి వరకూ నాతో ముచ్చటించని ఆయన “నౌ.. వుయ్ ఆర్ సేఫ్ డాక్టర్ సాబ్” అన్నారు.
నా శ్రీమతి తేరుకున్నాక, ఆయన అన్నారు – “నేను చాలా భయపడ్డాను” అని.
అప్పటివరకూ సమస్య తీవ్రత నాకు తెలియ లేదు. అప్పుడు నా వళ్ళంతా చెమటలు పట్టాయి. చాలా భయం వేసింది. ఈ జ్ఞాపకం నిరంతరం నా మనస్సులో మెదులుతూనే ఉంటుంది. మరచిపోయే విషయమా, నా శ్రీమతికి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ గారిని సదా స్మరిస్తూనే వుంటాను.
పెన్సిలిన్, టెస్ట్ డోస్ ఇచ్చినప్పుడు నెగెటివ్ వచ్చినంత మాత్రానా, ఎప్పటికీ నెగెటివ్ వస్తుందనే నియమము, భరోసా ఏ మాత్రమూ లేవు. అలాగే టాబ్లెట్స్ కూడా! అందుకే వైద్యుల సలహా లేకుండా యెంత చిన్నటాబ్లెట్ కూడా వాడకూడదు, అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపు వాళ్ళు మందులు అమ్మకూడదు!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
డాక్టర్ గారు.. చాలా చక్కగా విశదీకరించారు. ఇది తలచుకున్నపుడు ,వ్రాస్తున్నపుడు కూడా మీ వొళ్ళు మరోసారి జలదరించి ఉంటుంది.. ఆ వ్యధ నాకూ తెలుసు.. నేను కూడా చాలా వాటికి allergitic..
ఉపసంహరం లో ముఖ్యమైన విషయం చెప్పారు.. Doctor prescription లేకుండా మందులు వాడద్దు అని.. అన్ని వేళలా అది కుదరక పోయినా, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాము.
ధన్యవాదములు మంచి విషయం చెప్పినందుకు..
నీలిమ గారూ మీ స్పందనకు కృతజ్నతలు
డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు వృత్తి పరంగా వైద్యునిగా ఎన్నో సేవలందించిన వ్యక్తి. వైద్య వృత్తి అంటేనే దీక్ష వుండాలి. వైద్యునిగా మంచి పేరున్న వ్యక్తి. వైద్య వృత్తి లో వుంటూనే….సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన తెలుగు భాషభిమాని… వారి శ్రీమతి గారికి టాబ్లెట్ రియాక్షన్ గురించిన ప్రస్తావన …ఎందరికో … ముందు జాగ్రత్త చర్య గా మనం పరిగణన లోనికి తీసుకోవాలి… నాకు డయాబెటి క్ కి వాడే మెట్ఫార్మిన్…15 సంవత్సరాలు వాడాక ఏలర్జి అయ్యి…చనిపోయే స్థితికి వెళ్ళి… చివరికి తెలుసుకుని….ఆ టాబ్లెట్ మానా క …ఆరోగ్యాన్ని పుంజుకున్నాను.. డాక్టర్ గారు….రచయితగా మరింత ఎత్తుకు ఎదగాలని…మన సాహిత్య సంపదకు మరింత పుష్టిని చేకూర్చు తూ… తెలుగు భాష గరిమను చాటగలరని విశ్వసిస్తున్నాను. Dr. శ్రీదేవి శ్రీకాంత్
డాక్టర్ శ్రీదేవి గారు మీ హృదయ పూర్వక స్పందనకు నమస్సు లు/ధన్యవాదాలు.
Very great memories. Sir Ubed is no more. He was my best friend. I am very happy sir. I am waiting to know many more memories from you sir. With high regards prof. Rameshwaram కాకతీయ విశ్వవిద్యాలయం
ప్రొఫెసర్ గారి కిహృదయ పూర్వక ధన్యవాదాలు.
Dr. లక్మి రాజాం సర్ mhb లో ఉంటాడా సర్. …. మీ అనుభవాన్ని కథ గా రాయటం బాగుంది.
______కె.రమేశ్ ఎయిడ్స్ కౌన్సిలర్ మహబూబాబాద్.
ధన్యవాదాలు రమేశ్.
[16/05, 22:14] Rahul/M: Just read it [16/05, 22:14] Rahul/M: It’s good as a real life incident and ending with message [16/05, 22:15] Rahul/M: But I was interested in why body reacts to certain drugs in a certain way and not same with everyone
___Er.Rahul.Kanety Boston U S A
Rahul, Thank you For your Response.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™