ఈ ప్రపంచంలో మనిషి ఆచరించే ఎన్నో పద్ధతులు, ఆలోచనలు చాలా సార్లు అర్థం కావు. మన మధ్య ఉన్న ఆలోచనాపరులను, మేధావులను గుర్తించి వారిని గౌరవంగా స్వీకరించడానికి మనిషి ఎంతో హిపోక్రసి ప్రదర్శిస్తాడు. తనకు అర్థంకాని తన మేధకు అందని వారిని ముందు ఎంతో మానసిక సంఘర్షణకు గురి చేస్తాడు. వారిని గౌరవించడు కదా పైగా అవమానకరంగా దూషిస్తాడు. ఆ వ్యక్తి ఎంతో దుఖంతో శోకంతో, సమాజం పెట్టే పరీక్షలకు తట్టుకుని, ఆటుపోట్లను ఎదుర్కుని తాను సమాజానికి ఇవ్వాలనుకున్నది ఇచ్చి మరణిస్తాడు. అతని మరణం తరువాత అతను మనకు అర్థం అవుతాడు. అతని కీర్తి ప్రపంచం అంతా పాకుతుంది. అతని గౌరవిస్తాం, పూజిస్తాం. కాని అతను బ్రతికి ఉన్నప్పుడు అతని మేధను ఒప్పుకోకపోయినా పర్లేదు అతన్ని అవమానిచడం మాత్రం మానం కదా.. మరణించిన తరువాత గుర్తింపు పొందిన మేధావులెందరో. అందుకే ‘ప్యాసా’లో గురుదత్ అన్నట్లు ఈ ప్రపంచం బతికున్నప్పుడు వేపుకు తింటుంది, చచ్చాక జేజేలంటుంది. అలా జేజేలందుకున్న మహానుభావులలో గుర్తించుకోవలసినన్ పేరు చిత్రకారుడు ‘వాన్ గో’ది. వాన్ గో ఆత్మ కథను ఇర్విన్ స్టోన్ 1934లో రాసాడు. దీనికి ‘LUST FOR LIFE’ అనే శిర్షిక అతికినట్టు సరిపోతుంది. ఇది ఒక నవల రూపంలో రాసిన ఈ ఆత్మకథలో ఆ మేధావి జీవితాన్ని మన ముందుకు తీసుకువచ్చే పయత్నం చేసాడు. జీవించినంత కాలం పిచ్చివానిగా ముద్రించబడి, మతి పోగొట్టుకుని పిచ్చాసుపత్రిలో వైద్యం తీసుకూంటూ అక్కడ ఉంటూనే ప్రపంచం ఇప్పుడు అబ్బుర పడే స్టారీ నైట్ లాంటి పెయింటింగ్‌లను సృష్టించిన వాన్ గో బ్రతికి ఉన్నంతవరకు తనను అర్థం చేసుకునే వారు లేక, తనని కనీసం సాధారణ చిత్రకారునిగా కూడా గుర్తించని సమాజంలో ఉంటూ కటిక పేదరికం అనుభవిస్తూ 2100 పైగా చిత్రాలు వేస్తూ వెళ్ళాడు. అతను బ్రతికుండగా అతి కష్టం మీద అమ్ముడుపోయిన చిత్రం కేవలం ఒకటి. కాని అతని మరణానంతరం అతని చిత్రాల ప్రదర్శన జరిపిన తరువాత ప్రపంచం మెచ్చే చిత్రకారుడిగా అతనికి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అతని చిత్రాలు మిలియన్ డాలర్లను వసూలు చేస్తాయి. ఆధునిక చిత్రకళా పితామహుడిగా అతన్ని ప్రపంచం గుర్తించింది అతని ఆత్మహత్య తరువాతే… ఔరా ప్రపంచమా… ఏమీ నీ లీల…
వాన్ గో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబంలో అతని బంధువులు చాలా మంది పెయింటింగులు అమ్మే వ్యాపారంలో ఎంతో డబ్బు సంపాదించినవారు ఉన్నారు. అతని మేనమామ ఒక పెద్ద ఆర్ట్ డీలర్. వాన్ గో కి తన వ్యాపారం అప్పజెప్పాలనుకుంటాడు అతను. వాన్ గో కూడా లండన్ లోని ఒక ఆర్ట్ షాప్ లో పెయింటీంగ్ డీలర్‌గా ఉంటూ ఆ వ్యాపారంలో భాగస్వామ్యం సంపాదించాలనుకుంటాడు. అయితే అక్కడ ఉంటూ అతను ఇంటి యజమానురాలి కూతురితో ప్రేమలో పడతాడు. ఆమె అతన్ని తిరస్కరిస్తుంది దానితో మనసు విరిగి అతను లండన్ వదిలి వేస్తాడు. ఆ అమ్మాయి ప్రేమ కోసం దేబిరించి ఆమె తిరస్కారంతో అతని మనసు చాలా గాయపడుతుంది. తన వ్యాపార జీవితంపై ఆసక్తి చచ్చి అతను తిరిగి ఇంటికి వస్తాడు.
అతని కుటుంబంలో కొందరు మత భోధకులుగా కూడా ఉంటారు. అందుకని వాన్ గో మత ప్రచారకుడిగా మారాలని దానికి సంబంధించిన విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. కాని దాని పట్ల కూడా అతనికి ఆసక్తి ఉండదు. సామాన్య జనంతో కలిసి పని చేయాలని అతని కోరిక. అందుకని మత బోధనలోనే ఎవాంజలిస్ట్గా మారి చదువు రాని పేద బస్తీలలో పని చేయాలనుకుంటాడు. అక్కడా దానికి సంబంధించిన కోర్సులలో థియరీ పరంగా పెద్దగా రాణించలేకపోతాడు. కాని పనిచేయాలనే కోరిక ఉంటుంది. అది గమనించి అతని కుటుంవ స్నేహితుడు బొగ్గు గనుల కార్మికుల ప్రాంతంలో టెంపరరీగా పని చేయమని వాన్ గో ని పంపిస్తాడు.
సామాన్య కార్మికుల జీవితాలు, వారి పై జరుగుతున్న దోపిడి, అనారోగ్య సమస్యలు, మరణాలు వాళ్ళలో గమనించి వారి తనను నమ్మి తనను వారిలో ఒకరిగా స్వీకరించలేకపోతే తాను ఎంత మత బోధ చేసినా అది పనికి రాదు అన్న భావన కలిగి వాన్ గో వారితో పాటు కార్మిక జీవినం గడుపుతూ ఉంటాడు. వారితో పాటు తినడం పని చేయడం వల్ల అతను కూడా ఒక బొగ్గు కార్మికుడిగా మారిపోతాడు. వారిలో ఒకడిగా బ్రతికే అతన్ని చూసాక చర్చ్ ఇది మత ప్రచారకులకు మచ్చ అని అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తుంది. కాని ఈ సామాన్య జీవనం వాన్ గో పై ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళతో ఉండడమే తన జీవితానికి అర్థం అని అతను అనుకుంటాడు. అక్కడే ఉంటూ మొట్టమొదటి సారి ఒక పాత అడ్రస్సు కాగితం పై కార్మికుల చిత్రాన్ని గీస్తాడు. ఆ చిత్రాన్ని గీసేటప్పుడు తాను చిత్రకారుడిగా గడపాలని నిశ్చయించుకుంటాడు. అంతకు ముందు అతను ఎప్పుడు చిత్రాలు గీయలేదు. ఎక్కడా నేర్చుకోలేదు. 26వ సంవత్సరంలో చిత్రకారుడు కావాలనుకుని ఆ దిశగా కృషి చేయడం మొదలెడతాడు వాన్ గో. అయితే సంపాదన లేని అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో కుటుంబానికి అర్థం కాదు. అప్పుడు చిత్రాలు గీయడం నేర్చుకునే దాని పై దృష్టి పెట్టాలనుకునే అతని నిశ్చయాన్ని కుటుంబం మౌనంగా స్వీకరిస్తుంది.
వాన్ గో తమ్ముడు థియోకి అన్న అంటే ఎంతో నమ్మకం. అతను ఆర్ట్ బిజినెస్‌లో ఉంటాడు. తన సంపాదన లోనించి ప్రతి నెల అన్నకు డబ్బు పంపుతానని చెబుతాడు. వాన్ గో మరణించేదాకా ఈ తమ్ముడే ఎన్ని కష్టాలున్నా అతని ఆర్థిక అవసరాలు తీర్చాడు. అతని కుంచెల నుండి రంగుల దాకా ప్రతి దానికి డబ్బు సమకూర్చాడు. వీరి బంధం మాత్రం చాలా గొప్పది. ఈ సమయంలో వాన్ గో తన కజిన్‌ని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె భర్త చనిపోయి కొడుకుతో వీరి ఇంతికి అతిథిలా వస్తుంది. అంత దగ్గరి బంధుత్వం ఉన్న వారి మధ్య వివాహాలు జరగవని అయినా ఏం చూసి అతనికి వివాహం ఆమెతో జరపాలని ఆమె కుటుంబీకులు అడుగుతారు. ఆమె కూడా అతని ప్రతిపాదనను అసహ్యంతో తిరస్కరిస్తుంది. అందరి దృష్టిలో వాన్ గో ఎందుకూ పనికి రాని వ్యక్తి , స్త్రీ లోలుడు, అనాకారి. డబ్బు సంపాదించలేని చవట. ఇన్ని అనర్హతల మధ్య అతనికి ఎక్కడా గౌరవం దొరకదు. మరో సారి అతని హృదయం ముక్కలవుతుంది.
తరువాత అతనికి ఒక వేశ్య పరిచయం అవుతుంది. అప్పడు ఆమె గర్భిణి. అంతకు ముందే ఇద్దరు పిల్లలు. చాలా గడ్డుగా రోజులు నెట్టూకొస్తూ ఉంటుంది. తమ్ముడు పంపే డబ్బుతో తినీ తినక తన చిత్ర కళాద్యయనం చేసుకుంటూ వాన్ గో ఆమె బాధ్యత తీసుకుంటాడు. ఆమెను వివాహం చేసుకుని మంచి జీవితం ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. అతని స్నేహితులు అతన్ని గేలి చేస్తారు. కాని ఇవేవి లక్ష్యపెట్టక అతను ఆమె బిడ్డను కనేదాకా ఆర్థికంగా ఆదుకుని ఆమెను ఆ బిడ్డతో పాటు ఇంటికి తీసుకుని వస్తాడు. కాని ఆ పేదరికం తరువాత ఆమె భరించలేకపోతుంది. ఆమె కుటుంబీకులు ఆమెను మళ్ళీ వృత్తి వైపుకి వెళ్ళేలా ప్రేరేపిస్తారు. ఆమె కూడా వాన్ గో ని వదిలి వేస్తుంది. మనసు విరిగి వాన్ గో తిరిగి ఇంటికి చేరుకుంటాడు. కాని ఈ క్రమంలో కూడా చిత్ర కళా అధ్యయనం ఆపడు. పట్టు బట్టి అపట్టి సమకాలీన చిత్రకారుల మధ్య చేరి విద్య అభ్యసిస్తూ పెయిటింగ్ చేస్తూనే వుంటాడు.
అతని తల్లి తండ్రుల ఇంటి వద్ద అతని పొరిగింటి స్త్రీ ఒకామె వాన్ గో ని ప్రేమిసుంది. ఆమె అవివాహిత. కాని ఆమె కుటుంబం ఈ సంబంధానికి వప్పుకోదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది. అక్కడితో వాన్ గో జీవితంలో ప్రేమ అనే అధ్యాయం ముగుస్తుంది. తమ్ముడి ప్రోద్బలంతో పారిస్ వెళ్ళి చిత్ర కళపై మనసు పెట్టాలని నిశ్చయుంచుకుంటాడు.
పారిస్‌లో వాన్ గో ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాలను చూస్తాడు. అధ్యయనం చేస్తాడు. అక్కడే అతనికి పాల్ గాగిన్, జార్జెస్ స్యుఅర్ట్ లాంటి చిత్రకారులు పరిచయం అవుతారు. వారి మధ్య ఉంటూ తన కళను పదును పెట్టుకుంటాడు. వాన్ గో పాల్ గాగిన్ని ఎంతో ప్రేమిస్తాడు. కాని గాగిన్ తన కళకు తప్ప ఏ వ్యక్తికి కట్టుబడని వ్యక్తి. వాన్ గో స్నేహం అతన్ని కట్టీపడేయదు. వాన్ గో పారిస్ లాంటి నగరం లో తానుండలేనని ఒక మారు మూల పల్లెటురికి వెళ్ళినా పాల్ కోసం ఒక ఇల్లు తీసుకుని అతనితో కలిసి తన చిత్రకళ తో జీవించాలనుకుంటాడు. అక్కడ ఒక వేశ్య అతన్ని చెవి కోసి ఇమ్మని సరదాగా అడిగితే ఆమె కోసం తన చెవి కోసి ఇస్తాడు వాగ్ గొ. మొదటి సరి అతని మానసిక స్థితి సరిగ్గా లేదని అర్థం అవుతుంది. అతన్ని వైద్యం కోసం ఆసుపత్రిలో పెడతారు. పాల్ గాగిన్ అన్ని వదిలేసి తన కళ కోసం ఆదిమ జాతి మనుష్యులను వెతుక్కుంటూ దూరాన్ దీవుల మధ్యకు వెళ్ళిపోతాడు. ఆ ఆసుపత్రిలో ఉండగానే వాన్ గో ఎన్నో గొప్ప చిత్రాలను చిత్రించాడు. వీటినన్నిటిని తమ్ముడిని పంపుతాడు. కాని అవి అమ్ముడుపోవు. మొదటి సారి అక్కడ ఉండగానే అతని చిత్రం ఒకటి ఒక చిత్రకారుని చెల్లెలు 400 ప్రాంక్స్ కు కొనుక్కుందని తెలుస్తుంది. ఇది ఎవ్వరూ నమ్మరు. కాని ఇది ఒక్కటే అతని జీవితకాలంలో అమ్మబడిన చిత్రం.
మెరుగైన వైద్యం కోసం వాన్ గో ని థియో మరో ఆసుపత్రికి తరలిస్తాడు. అప్పుడు మొదటిసారి వివాహం చెసుకున్న థియో వద్దకు వాన్ గో వెళ్ళినప్పుడు అక్కడ భధ్రపరిచిన తన చిత్రాలు, తను తమ్మునికి రాసిన ఉత్త్రరాలను చూస్తాడు. తనను తన తమ్ముడు ఎంత నమ్మాడో తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. జీవితం పై అతని ఆశ చనిపోతుంది. ఇక తాను చిత్రాలు గీయలేనేమో అని పూర్తిగా పిచ్చి వాడినవుతానేమో నని తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. కాని గుండు తలలో ఉండి అతనికి మరణం త్వరగా సంభవించదు. ఒక 36 గంటలు ఆ స్థితిలో ఉండి తమ్ముడి చేయి పట్టుకుని మెల్లగా మరణాన్నిచేరుతాడు వాన్ గో. అతను మరణీంచిన ఆరు నెలలకే థియో కూడా మరణిస్తాడు. థియో భార్య వాన్ గో పేయింటింగ్లను ప్రదర్శనకు పెట్టి అతన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.
ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనకు వైద్యం చేసిన డాక్టర్ బొమ్మ ఒకటి వాన్ గో వేస్తాడు. దాన్ని అతను ఇంటి గోడ కంతను పూడ్చడానికి ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు అదే చిత్రం 40 మిలియన్ల డాలర్ల ఖరీదు చేస్తుందట. వాన్ గో బ్రతికి ఉన్నప్పుడు దొరకని గుర్తింపు అతని మరణం తరువాత అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. అతని చిత్రాలన్నీ మాస్టర్ పీస్‌లుగా పరిగణించబడుతున్నాయి. చాలా మంది కళాకారుల జీవితాలలో ఈ విషాదం కనిపిస్తుంది. కాని వాన్ గో జీవితం అత్యంత విషాదంతో గడిచింది. తీవ్రమైన వేదన ఒంటరితనం ఓటములతో నిండి ఉన్న అతని జీవితంలోని అత్యంత దీనమైన అతని ఉనికి కొన్ని సందర్భాలలో భయం కలిగిస్తుంది కూడా. సమాజం అతని జీవితకాలంలో అతని పై కాస్తంత ప్రేమ,నమ్మకం చూపినట్లయితే ఈ గొప్ప చిత్రకారుడు కేవలం 37 ఏళ్ళ వయసులో మరణించేవాడు మాత్రం కాదు. ఇలా ఎంత మంది మేధావుల పట్ల ప్రపంచం క్రూరంగా ప్రవర్తించిందో. ఎమిలి డికెన్సన్, ఆస్కర్ వైల్డ్, వెర్మీర్, ప్రాంక్ కాఫ్కా ఆ కోవకే వస్తారు. కాని వీరందరికన్నా హీనంగా గడిచిన జీవితం వాన్ గో ది. ఇలాంటి ఎన్ని సంగతులు విన్నా, చదివినా, మనకు అర్థం కాని వ్యక్తుల పట్ల మన ప్రవర్తనలో పెద్దగా మార్పు రాదు. మనిషిని హింసించి కౄరంగా ప్రవర్తించే మానవ శాడిజం మనలని వదిలి పోదు.
నవలలో కేవలం వాన్ గో జీవితమే కాదు అప్పటి కాంటేంపరరీ చిత్రకారుల చితకళ వారి శైలిని కూడా రచయిత విపులంగా చర్చిస్తారు. చిత్రకళ పై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడే విషయాలు విశ్లేషణలు, రంగుల గురించి, చిత్రం గీసే స్టైల్ గురించి కొంత సమాచారం కనిపిస్తుంది. మనకు తెలియని ప్రెంచ్ చిత్రకారుల పనితీరుని అర్థం చేసుకోగలిగే స్థాయిలో కొన్ని విశ్లేషణలు సహాయపడతాయి. చాలా మంచి బయోగ్రఫీగా దీని మన ఇంట్లో భద్రపరుచుకోవచ్చు. ఒక ఉన్నతమైన రచనగా నేను దీన్ని పరిచయం చేయడానికి వెనుకాడను.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™