“ఏమండీ, ఈసారి అబ్బాయి పుట్టినరోజుకు ‘బర్త్ డే గిఫ్ట్’గా ఏం ఇద్దామనుకుంటున్నారు?” సురేఖ అడిగింది భర్త మురళిని. “ఓ మంచి ఖరీదైన లేటెస్ట్ మోడల్ డైమండ్ లాకెట్ తీసుకురానా, లేక పదిరోజుల పాటు జాలీగా సింగపూర్ ట్రిప్ వెళదామా?” ప్రశ్నించాడు మురళి. “చిన్నమాట, వాడికెలాగూ ఎనిమిదేళ్లు నిండుతున్నాయి, వాడికి ఏది ఇష్టమో అడిగితే అదే బహుమతిగా ఇద్దాం” సలహా ఇచ్చింది సురేఖ. రాత్రి భోజనాల సమయంలో… “బాబూ, నీకు ఈసారి పుట్టినరోజు బహుమతిగా ఏం కావాలి?” కొడుకు మహతీకృష్ణను అడిగారు తల్లిదండ్రులిద్దరూ. “నేను ఏది అడిగితే అదే ప్రజంటేషన్గా ఇస్తారా?” అడిగాడు మహతి. “తప్పకుండా నాన్నా, మేము కష్టపడేదే నీ కోసం” భరోసా ఇచ్చాడు మురళి. “మాట తప్పరుగా?” మరోసారి అడిగాడు మహతి తండ్రిని. “ప్రామిస్” కొడుకు అరచేతిలో చెయ్యివేశాడు మురళి. “అయితే సిటీకి అవతల వృద్ధాశ్రమంలో ఈ మధ్య మీరు చేర్పించిన నానమ్మను మళ్లీ మన ఇంటికి తీసుకొచ్చేయండి, జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ‘విలువైన గిఫ్ట్’గా గుర్తుంచుకుంటా” చెప్పాడు మహతి.
“దేవుడా, మా ఇంటిల్లిపాదికి వెంటనే బి.పి, షుగర్ లాంటి అన్ని రకాల జబ్బులు వచ్చేలా చెయ్యి స్వామీ” మనఃస్పూర్తిగా ప్రార్థించాడు ఓ భక్తుడు. “తథాస్తు” ఏ కళనున్నాడో గానీ వెంటనే అనుగ్రహించేశాడు దేవుడు. “నా విన్నపాన్ని మన్నించినందుకు వేనవేల కృతజ్ఞతలు స్వామీ” చెప్పాడు భక్తుడు. “భక్తా, చిన్న సందేహం” అడిగాడు భగవంతుడు. “ఏమిటి ప్రభూ?” చేతులు జోడించి అడిగాడు భక్తుడు వినయంగా. “ప్రతి ఒక్కరూ సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కోరుకుంటారు. నువ్వు మాత్రం ఇందుకు భిన్నంగా రోగాలు కోరుకున్నావేంటి ?”ఆశ్చర్యంగా అడిగాడు దేవుడు. “అసలు కారణం వింటే మీరు అవాక్కవుతారేమో భగవాన్”అన్నాడు భక్తుడు. “ఫర్వాలేదు చెప్పు” ఆసక్తి ధ్వనించింది దేవుడి గొంతులో. “రోగాలు వస్తే నానాటికీ ఏమాత్రం అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల్ని తినాల్సిన, కొనాల్సిన బాధ పూర్తిగా తగ్గిపోతుంది” ధైర్యంతో కూడిన ఆనందం కనిపించింది భక్తుడి జవాబులో.
వాళ్లిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. చాలీచాలని జీతం కారణంగా సిటీలో పెట్టిన క్రొత్త కాపురం వాళ్ళని అద్దెలూ, అడ్వాన్సులూ, అవసరానికి మించిన ఖర్చుల రూపంలో కష్టాలుగా చుట్టుముట్టాయి. “రక్తాన్ని గడ్డ కట్టించే చలికాలం, రాత్రుళ్ళు చాలా కష్టంగా ఉంది. మన ఇద్దరికీ ఒకే దుప్పటి సరిపోతుందనుకుంటా, కొనుక్కురానా?” ప్రేమగా అడిగాడు భర్త తన వద్ద తగినంత డబ్బు లేదన్న సంగతి బయటపడనీకుండా. “అది కూడా అవసరమా?” కన్నుగీటి చిన్నగా నవ్వుతూ గోముగా ఎదురు ప్రశ్నించింది భార్య, తన భర్త జేబు బరువుగా లేదన్న సంగతిని తాను గ్రహించిన విషయం ఏ మాత్రం మొహంలో కనబడనీయకుండా.
“సుజాతా, మీ అత్తగారు నీ మీద చాలా కోపంగా ఉన్నట్లున్నారే?” కూరగాయల మార్కెట్లో కనిపించిన స్నేహితురాలిని అడిగింది ప్రక్కవీధిలో ఉంటున్న మాధవి. “అదేం లేదే, అయినా ఎందుకడుగుతున్నావు?” ప్రశ్నించింది సుజాత. “నిన్న మా అత్తగారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తగారు చెప్పారట, చెడిపోయిన టెలివిజన్ రిపేరు కోసం షాపు వాడికి ఇచ్చి మూడు వారాలు దాటినా ఇంకా ఇంటికి తీసుకురాలేదట కదా, మంచానికే పరిమితమైన డెబ్బై ఏళ్ళ ముసలావిడ, ఎలా పొద్దు పుచ్చుకోవాలి?” అడిగింది మాధవి. “పొరుగు దేశానికి, మన దేశానికీ మధ్య యుద్ధ మేఘాలు క్రమ్ముకుంటున్నట్లు వస్తున్న వార్తలు చూస్తే దేశ సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న తన కొడుకును తలచుకుని ఆందోళనతో ఆవిడకు ముద్ద దిగదు, కంటి మీదకు కునుకు ఆనదు” అసలు కారణం వివరించింది సుజాత, మిలటరీలో పనిచేస్తున్న తన భర్తను గుర్తు చేసుకుంటూ.
kathalu baagunnavi. shubhakankshalu.
కథలు మానవతా కోణంలో ఉన్నాయి.. అభినందనలండీ!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™