భక్తి అంటే మనము భగవంతుని వద్దకు వెళ్లడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం అంటారు కొందరు. కానీ ఆ అనుగ్రహం అందరికీ ఉంటుందా? హేతువాదంతో, అసలు భగవంతుని ఉనికినే ప్రశ్నిస్తున్నారు ఈ ఆధునిక యుగంలో! అయినా, భగవంతుని పట్ల నిజమైన ప్రేమ, అంకితభావం ఉంటే, మన జీవితంలోని ప్రతి దశలో ఆయనే స్వయంగా కదిలి వస్తాడని నిరూపించే ఒక పుస్తకం ఈ మధ్యన వచ్చింది. అదే సింగపూర్ కు చెందిన శ్రీ వేంకట వినోద్ పరిమి గారు వ్రాసిన – “దైవంతో నా అనుభవాలు”.
ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఒక కలలో కనిపించిన వినాయకుని గుడితో మొదలైంది. అనుకోకుండా కలలో కనిపించిన ఆ గుడికే ఆయన వెళ్లడం జరిగింది. ఈ అధ్యాయంతో ఈ పుస్తకం మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన జీవితంలో అడుగడుగునా ఎన్నో అద్భుతాలు! ఏ ఆలయానికి వెళ్లినా ఆరడుగుల ఆజానుబాహుని రూపంలోనో లేక నాగబాబాలు, సాధువుల రూపంలోనో దైవం ప్రత్యక్షంగా కనిపించి, అనేక విధాలుగా అనుగ్రహించడాన్ని ఇందులో చదవవచ్చు. ఒకసారి ఘోరప్రమాదం నుంచి ఊహించని విధంగా రక్షింపబడడం, ఒకసారి మెడమీద వచ్చిన కంతి, వైద్య శాస్త్రానికి కూడా అందకుండా తగ్గిపోవడం జరిగింది. ఇవన్నీ చదువుతున్నప్పుడు అప్రయత్నంగా చదువరుల కళ్ల వెంట ఆనంద బాష్పాలు జాలువారతాయి.
స్వతహాగా దైవభక్తి మెండుగా ఉన్న వీరికి జీవితంలో అడుగడుగునా అనుగ్రహం లభించింది. ప్రస్తుతం సింగపూర్ లోని ఒకపెద్ద మల్టినేషనల్ కంపెనీలో ఏసియా పసిఫిక్ రీజనల్ డైరెక్టర్గా ఉన్న వీరు, ఇంతకు మునుపు ప్రతినెలా తిరుమల దర్శించేవారట. కానీ ఈ లాక్డౌన్ కాలంలో ఇబ్బందుల వల్ల స్వామివారిని దర్శించే వీలు లేకపోవడంతో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఈ పుస్తకాన్ని తన మిత్రుడైన రమేష్ గారి సహాయంతో ఇలా మన ముందుకు తీసుకుని వచ్చారు.
తన పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని ఇప్పటికే వీరు టిటిడికి, గోసంరక్షణకు విరాళంగా ఇచ్చారు. అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును కూడా ఇదే విధంగా వీరు వినియోగించ దల్చుకున్నారు. దైవంపట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగిన గ్రంథరాజంగా మిగులుతుంది ఈ 172 పేజీల పుస్తకం. జె.వి.పబ్లికేషన్స్ ద్వారా హై క్వాలిటీతో వచ్చిన దైవంతో వీరి అనుభూతుల సమాహారాన్ని కొని, చదివి మీరూ ఆనందించండి.
పుస్తకం ధర: 200 రూ. (పోస్టల్ చార్జీలు అదనం) కొనుగోలు కోసం సంప్రదించవలసిన నెంబరు: 8558899478 (వాట్స్ఆప్ మాత్రమే).
అక్షరం, స్వరం, దృశ్యం ఈ మూడు రంగాల్లో భావరాజు పద్మిని గారి ప్రస్థానం, దైవానుగ్రహం వల్ల అద్భుతంగా సాగుతోంది. రచయిత్రిగా, అచ్చంగా తెలుగు అన్న పత్రిక సంపాదకురాలిగా, మై ఇండ్ మీడియా ఇంటర్నేషనల్ రేడియో ప్రోగ్రాం డైరెక్టర్గా, డిడి యాదగిరిలో సాహితీ సౌరభాలు కార్యక్రమ వ్యాఖ్యాతగా, పలు సేవా సంస్ధలకు బాసటగా నిలుస్తున్నారు. అన్య పత్రికలకు తొలిసారిగా అందిస్తున్న హాస్య రచనలివి. ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని, ఆశిస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™