పనులు లేక అలమటించిన వారితో సహా ‘గ్రేట్ డిప్రెషన్’ నాటి నిరుద్యోగిత రేటు 25%. కోవిడ్ వాతావరణంలో ఆ రికార్డును బ్రద్ధలు చేసి 33% నిరుద్యోగిత నమోదు కావచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఫిబ్రవరిలో ఉద్యోగాలలో ఉన్నవాళ్ళలో మూడింట ఒకరు రానున్న కాలంలో ఉపాధి కోల్పోతారనీ అంచనాలున్నాయి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో లాక్డౌన్ తీసేస్తే జూన్ నెలఖరు నాటికే 2,33,000 మరణాలు సంభవిస్తాయనీ, లాక్డౌన్ తీయకపోతే నిరుద్యోగం కారణంగానే 17000 వరకు మరణాలు సంభవిస్తాయని అంచనాలు వెలువడ్డాయి. ఆ అంచనాలు సత్యదూరం కావని తరువాతి అనుభవాలు ఋజువు చేశాయి.
***
సృజనాత్మకత, కళాత్మకత కూడిన రంగాలలో ఇటీవల ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఇది వరలో చాలా అరుదైన ఎంపికగా ఉన్న ఎడిటింగ్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, రికార్డింగ్ (వాయిస్) వంటి రంగాలలోనూ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగడంతో యువతలో చాలామంది అటూ ఆకర్షితులౌతున్నారు.
‘AISHE’- ‘ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్’ 2018-19 సంవత్సరానికి సంబంధించి వెలువరించిన నివేదిక ప్రకారం 2015 సంవత్సరం తరువాతి నుండి ఇంజనీరింగ్ వంటి కోర్సులలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది (రమారమి ఆరున్నర లక్షల వరకు). లలిత కళలు, డిజైనింగ్, భాషలు వంటి కోర్సులలో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ కారణంగా తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. గత శతాబ్ది ద్వితీయార్థంలో మౌలిక, తయారీ రంగాలకు సంబంధించి అనేక ప్రభుత్వ/ప్ర్రైవేటు రంగ సంస్థలు ఉద్యోగాలలో హెచ్చు సాంకేతిక నైపుణ్యాలు కలవారిని నియమించుకున్నాయి. ఆ రంగాలలో అనేక ఉద్యోగాలలో ఆటోమేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి.
రానున్న పది సంవత్సరాలలో 80 కోట్లకు మించి యువత నిరుద్యోగంలోకూరుకుపోతారనీ, అందులో భారతీయులే అధికంగా ఉంటారనీ కొన్ని నివేదికలు కొన్ని సంవత్సరాలు క్రిందట వెలువడ్డాయి. ‘కోవిడ్’ సంక్షోభం అదనంగా వచ్చి చేరిన కారణంగా ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాన్ని తేలికగానే ఊహించవచ్చు.
ఏది ఏమైనా కాలానుగుణమైన నైపుణ్యాలను పెంపొందించుకోలేని వారికే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది. ప్రాప్తకాలజ్ఞతతో (ఆలస్యంగా నైనా) మన దేశంలోనూ విద్యార్థి దశ నుండే నైపుణ్యాలను పెంపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమం 2020 నాటికి 40 కోట్ల నిపుణులను లక్షించింది. ప్రధానమంత్రి ‘కౌశల్ వికాస్ యోజన’ పథకంలో 90 లక్షల మంది లబ్ధి పొందగా, 30-35 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. స్కిల్ ఇండియాలో 5 కోట్ల మంది లబ్ధి పొందినట్లు సాక్షాత్తు దేశ ప్రధానే వెల్లడించారు
శ్రామిక శక్తిలో సైతం దక్షిణ కొరియా 96% నిపుణ కార్మికులతో మొట్టమొదటి స్థానంలో ఉంది. జర్మనీలో నిపుణులైన కార్మికులు 75% కాగా, యునైటెడ్ కింగ్డమ్లో 68%. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 52% కాగా, మన దేశం 5%తో అట్టడుగున ఉంది. నిరుద్యోగం తగ్గించే దిశగా ప్రయత్నాలలో భాగంగా శిక్షణ కార్యక్రమాలను వేగవంతం చేసి అందరికీ ఉపాధి లభించేలా చూడడం కోసం ఒరిస్సా, తెలంగాణా రాష్ట్రాలు నిరుద్యోగ యువతకు శిక్షణనీయడానికి వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
అన్ని రంగాలలో వలె ఉద్యోగ రంగంలోనూ డిమాండ్ – సప్లయి సూత్రం వర్తిస్తుంది. కాలానుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోగలితే ఉద్యోగ భద్రతకు ఎటువంటి ముప్పూ ఉండదు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™