ఆడపిల్ల అంటే ఆడపిల్ల గా అత్తారింటికి చెందుతుంది కాని, ఈడపిల్లగా పుట్టింట ఉండేది కాదని తెలుగువారు అలవాటుగా బాధ వ్యక్తం చేస్తారు. పున్నామ నరకశిక్ష తప్పించుకోవడానికి కొడుకు తప్పనిసరన్నది వికృత మనస్తత్వ ప్రచారము. అయితే కొడుకులు పుట్టక ఒకవేళ కూతురు పుట్టినా, అత్తారింటికి పంపేసినా నంతానహీనుల కిందే లెక్కని చెప్పుకోవడం మాత్రం జరగలేదు. జరిగి ఉంటే దురదృష్టకరం. అయితే దశరధుడంతటి చారిత్రిక పురుషుడు కౌసల్య గర్భాన జన్మించిన సొంత కూతురు శాంతను ఆడపిల్ల గా భావించి దత్తత ఇచ్చాడా? శాంత కౌసల్యా తనయేనా? అందుచేత స్త్రీ సంతానము లెక్కలోకి రాని మనస్తత్వం రామాయణ కాలంలో ఉండేదా? అనే ప్రశ్నకు దొరికీ దొరకని జవాబుగా ఉత్సుకత ఈ వ్యాసము.
దశరధుడు సంతానము లేకపోవడంతో బాధపడుతున్నాడు. వాల్మీకి రామాయణము కౌసల్యా సుతుడుగా శ్రీ రాముని వలె శాంత రాములవారి కన్న ముందు ఆమె గర్భవాసాన కౌసల్యా తనయగా శాంత అనే పేరుతో సోదరిగా పుట్టి అక్క అయిందని గాని, ఉందని గాని చెప్పలేదు, కాని పెంపుడు కూతురుగా జానపదుల శాంత రామాయణ కథ ప్రచారంలో అక్కగా ప్రచారంలో ఉంది. సీతమ్మవారు ఆడపడుచు లేకుండా ఉండడం జానపదులకు నచ్చలేదు. ఆడపిల్లలు సంతానముగా గౌరవించి ఆడపడుచులుగా ఆదరణ రామాయణ కాలము నాటిదేనని భావిస్తున్నారు! ఎందుకంటే నేటికీ కూతురు సంతానములోని కొడుకు దౌహిత్రుడిగా మగ సంతానము లేనివారికి పెద్ద ఊరట.
శాంతకు దశరథ పుత్రిక అని ప్రామాణికంగా శాంత ప్రస్తావన వాల్మీకి రామాయణంలో రాలేదు. కాని విభాండక మునిపుత్రుడు ఋష్యశృంగుని భార్యగా, లోమపాదుని కుమార్తెగా అయోధ్యకు వచ్చింది. కాని పుత్రకామేష్టి యాగ సందర్భంగా ఋష్యశృంగుడే మునిగా వచ్చినా అల్లుడి గౌరవమందుకుని చేయించాడని పేర్కొని ధశరథుని పుత్రికగా, లోమపాదుని దత్తపుత్రికని కంబరామాయణము, కొన్ని జానపద రామాయణాలు, మరికొన్నిఇతర అవాల్మీక గాథలు శాంతను కౌసల్య తొలిచూలు అన్నాయి.
అంగరాజ్యాన్ని పాలిస్తున్న లోమపాదునికి పుత్రికవుతుందని మాత్రం సంప్రదాయ కవులు అందరూ రాశారు. లోమపాదుని రాజ్యంలో అడుగు పెట్టి కరవు తొలగించి శాంతను వివాహమాడాడని ధశరథుడు ఋష్యశృంగుని అయోధ్యకు రప్పించుకొని శ్రీ రామాది జనన కారణ పుత్రకామేష్టి యాగము చేయించిన గాథ ఫ్రసిధ్ధము. లోమపాదుడుకి దశరథుడు తన ఔరస పుత్రికనే దత్తత యిచ్చి లోమపాదునికి సంతానహీనత విచారము పోగొట్టాడు అనేది వాల్మీకమైనా కాకపోయినా విస్వసనీయతగా ప్రచారామోదయోగ్యమైంది.
శాంత శ్రీరామునికి సోదరి అన్న భావవ్యక్తీకరణ జానపదుల రామాయణం నుంచీ వచ్చింది. శాంత రామాయణము జానపదం. శాంతగోవిందనామాలు ప్రతిపాదానికి చివరలో చేర్చి పాటగా శ్రీరామ వివాహము వరకు శాంతగోవింద నామాలు పాట జానపదులు పాడుకునేవారు. ఈ పాటలో శాంత ప్రధాన పాత్ర. కాని సొంత పుత్రిక కాదు.
శాంతను దత్తత చేసుకోవాలని దశరథుడు భార్యలతో కలిసి దక్షిణ దిశగా పయనించి ఒక రాజర్షి దంపతులను సేవించి ప్రసన్నము చేసుకున్నాడు. ఆ రాజర్షి దంపతులకు అరువది వేలేండ్లు వేచి చూశాక పుట్టిన పుత్రిక శాంత. అందుకే శాంత తల్లి కోకిలాదేవి ధశరథుని దంపతులుకు ఆహ్వానము పలికినా పెంపుగా ఇమ్మని అడగగానే ముందు మాతృహృదయముతో తల్లడిల్లిపోయింది. కాని ఒప్పుకుంది.
దశరథుడు తెచ్చి పెంచి పెండ్లీడుకు వచ్చాక ఋష్యశృంగుని కిచ్చి వివాహము చేశాడు. శ్రీ రామజనన కారణ పుత్రకామేష్టి మొదలు రామకల్యాణము వరకు శాంత చేసిన ఆడపడుచు పెత్తనం మన పెండ్లి తంతు ఆడపడుచు పెత్తనాన్ని గుర్తు తెస్తుంది. ప్రతి పెండ్లికొడుకు రామయ్యగా, పెండ్లి కూతురు సీతగా కల్యాణ వైభవమును రామాయణ జానపద గీతాలు భద్రపరిచాయి. శాంత, ఋష్యశృంగుని కథలో అన్ని రామగాథలలోనూ శాంత తోబుట్టువుగానే ప్రవర్తిస్తుంది. పుత్రకామేష్టి యాగము మొదలు రామాది జనన విషయం దగ్గర నుంచి సీతారాముల కల్యాణము వరకు వహించిన ప్రాముఖ్యతను ప్రముఖంగానే రచించాయి.
సీతారాముల కల్యాణ సమయమలా ఉంచితే రాములవారి అక్కగా శాంతా కల్యాణవేళ దశరధుడు ఋష్యశృంగునికి జరిపిన మర్యాదలు, తంతు తెలుగుదేశాల ఆడపిల్లల పుట్టింటి సంప్రదాయానుసారంగా జరిగాయి. అల్లుడు హోదాలో ఋష్యశృంగుడు యజ్ఞము జరిపించాడు. రామలక్ష్మణభరతశతృఘ్నులు కడుపులో ఉండగా కౌసల్య మొదలైన తల్లులకు సీమంత వేడుకలో శాంత ఆడపడుచుతనం వదులుకోలేదు. ఆడపడుచుగా ఆడపిల్లలు కాదు. పుట్టింటి గౌరవాలు పొందిన విశేషాలతో శాంతరామాయణము సాగింది.. శాంత రామాయణంలో రామాదులకు ఆడపడుచు.
ఆడపడుచులు లేకపోతే ఆడపడుచులు వరుస వారికి పెళ్ళివేడుకలో మర్యాదలు చేయించడం తెలుగు వారి వివాహ వేడుక ఆచారంగా కూడా ఉంది. అయితే పిండి బొమ్మను చేసి పీటమీద కూర్చోబెడితే ఆడపడుచుతనానికి ఎగరెగిరి పడిందని తెలుగు సామెత చురక ఓ హెచ్చరిక ఆలోచన చేయించాలని ఆడవారిని కోరడం తప్పనిసరి. ఏమయినా రాములవారి అక్క శాంతలా ఆడపడుచులు ఇంట్లో తిరగాలి. ప్రతి పెండ్లికొడుకు రామవైవాహ భోగముగ రాముడిలా ఉండాలి. సీతామ్మవారిని గుర్తు తెచ్చే వధువు ఆడపడుచును భర్త కన్నా పెద్దదో చిన్ళదో రాములవారి సోదరిగా భావించే గౌరవం ఈ శాస్త్రయుగములో కూడా సాగాలన్న సదుద్దేశం ఈ వ్యాసంగం.
డా. జొన్నలగడ్డ మార్కండేయులు కవి, కథా రచయిత. వృత్తి రీత్యా కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు. వీరు వ్రాసిన కథలు అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
I think his name is Romapaada not Lomapaada!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™