హరిహరాద్వైత భావన ఈనాటిది కాదు. ఉపనిషత్తులనుండి వచ్చుచున్నది. అష్టాదశ పురాణాల యందును ఈ హరిహరాద్వైత భావన పుష్కలముగానున్నది. ‘ఏకమేవాఽద్వితీయం బ్రహ్మ’ అన్న వేదాంత భావనను స్వీకరించిన భారతీయులు భగవద్భావన సాధనగా ఈశ్వర స్వరూప కల్పనకు సార్థక్యము కల్పించుకొని నానా దేవతోపాసనమును ఒక కొలికికి తెచ్చుటకు ప్రయత్నము చేసిరి. ‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివ స్వ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయంశివః’ అని చెప్పిన ఋషి వాక్కులు ఈ భావనకు పతాకముల వంటివే.
హరిహరోపాసనల యందలి వైయర్థ్యమును పరిహరించుటకు పామర జనోపయోగముగా – భక్తి సాధనముగా హరిహరమూర్తి కల్పన జరిగినది. ఈ దేవుని పేర కర్నాటక దేశమున కొన్ని దేవాలయములు కూడ వెలసినవి. శ్రీ శంకరులవారీ ప్రభావము చేత పంచాయతనము గల దేవాలయముల ప్రతిష్ఠ కూడ సాగినది.
తెలుగుదేశమున నీ సంప్రదాయమునకు చక్కని ప్రతిష్ఠ కలదు. కవి బ్రహ్మ తిక్కన తన మహాభారతమును హరిహరనాథాంకితము చేసెను. ఈ హరిహరుడు తిక్కన కల్పన కాదు. పరంపరగా వచ్చుచున్న ఈ సమన్విత సర్వేశ్వరమూర్తిని అతడు పరబ్రహ్మముగా భావించెను. తిక్కన్న గారి యడుగుజాడల ననుసరించి నాచన సోముడు, కొఱవి గోపరాజు, బైచరాజు వేంకటనాథకవి తమ కావ్యములు కూడ హరిహరాంకితము చేసిరి.
తిక్కనగారు తమ కావ్యమును హరహరాంకితము చేయునప్పుడు అతనిని కేవల దేవతామాత్రునిగా భావన చేయలేదు. తిక్కనగారి మనస్సులో నిలిచిన మూర్తిః హరిమూర్తి కాదు హరమూర్తి కాదు. హరిహరమూర్తియు కాదు. ఆయనది ఈ రెంటి వెనుక నున్న పరబ్రహ్మ భావన మాత్రమే. ఒక వేళ హరిమూర్తి మరొక వేళ హరమూర్తి, ఒక వేళ హరిహరమూర్తి కూడ. అందుకే ‘కిమస్థిమాలాం కిముకౌస్తుభంవా, పరిష్క్రియాయాం బహుమస్య సేత్వం, కిం కాలకూటం కిమువా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే’ అంటాడు. ఆయన హరిహరనాథుడు స్వేచ్ఛా స్వీకృతమూర్తి. అందువలననే ‘కరుణారసము పొంగి తొరగేడు చోడ్పున…’ అన్న పద్యమున హరిహరమూర్తిని వర్ణింపక ఒక సమన్వితమూర్తిని వర్ణించెను. ఆశ్వా సాద్యంతముల యందున్న దాదాపు రెండువందల పద్యములలో నెక్కువ భాగము పర బ్రహ్మాత్మక సంబోధనము చేయునట్టివి.
తిక్కనగారి ఉపాసనలోని పరమార్థమిది; మూర్తిమంతమైన ఉపాసనములో తన్మూర్తి మనస్సులో నిలిచిపోవును. సాధకులకు దానిని మించిన పురోగతియుండదు. తిక్కన ఉపాసించిన మూర్తిలో ఒక మూర్తిని భావించునపుడు వేరొకమూర్తి స్ఫురించు చుండును. ఈ విధముగా ధ్యాన ధార నిరంతరము తన్మూర్తిమత్వ మందలి అయథార్త స్ఫూర్తికి హేతువగుచుండును. అందువలన సాధకుడు మూర్తిమత్వము గల ఈశ్వరునియందు నిరాకారమైన పరబ్రహ్మ భావన చేయుటకు వీలుగా నిత్య జాగ్రత్ స్థితి కలుగుచున్నది.
“త్రిభువన శుక దృఢ పంజర విభవ మహితునకు సమస్త విష్టప నిర్మో క భుజంగమపతికిని జగ దభిన్న రూపునకు భావనాతీతునకున్”
మూడు లోకములన్న శుకమునకు దృఢపంజరమువంటి వాడును. మూడులోకము లనెడు కుబుసములూడ్చిన భుజంగమువంటి వాడును. ఈ రెంటికి పరస్పర వైరుధ్యము. మొదటి రూపమున భగవంతుడు – లోకములకు బయటివాడు – రెండవ దానియందు అంతర్యామియైనవాడు. ఈ విధముగా భగవద్భావన నిశితముగా చేయు లక్షణము తిక్కనగారి హరిహరనాథాంకితమైన పద్యముల యందు కానవచ్చుచున్నది.
తిక్కనగారి తరువాత వచ్చిన కవులలో ఈ తాత్విక భావన లేదు. నాచన సోముడు కొంతవరకు చెప్పినను తరువాతి వారు కేవలము హరిహరమూర్తి కల్పననే మురిసిపోయిరి. దానియందలి లోతు వారు గ్రహించలేదు.
ఆధునిక కవుల రచనలలో ఈ భావము మరల ఉద్దీపమై శ్రీ ‘విశ్వనాథ మధ్యాక్కర’లలో గోచరించినది. ఇది భక్తి ప్రధానమైన శతకముల సముచ్ఛయము. దీనిలో హరిహరునుద్దేశించిన రచన యేదియును లేదు. పది శతకములలో నాలుగు హరీ పరములు, ఆరు శివ పరములు. ఈ విధముగా పలు క్షేత్రముల యందధిష్ఠానములైన దేవతలయందు పరబ్రహ్మ భావన చేయుచు నీ శతకములు రచింపబడినవి. ఈ రచన పండిన భావ వైలక్షణ్యము కలది.
మహాకవి ఈ రచనలో ఎన్నియో విషయములు పరిశీలించవలసియుండగా, ఇచట ఆయన ప్రతిపాదించిన హరిహరాద్వైత పద్ధతి యొక్క విలక్షణమైన లీలగా సాగినది. దాని వైలక్షణ్యము పట్టుకొనుట కష్టము. ఎందుకనగా అది ప్రత్యేకముగా హరిహరస్తుతికాదు కనుక.
తిక్కనగారు తొలుత మహేశ్వరాంఘ్రిక మలధ్యానైకశీలుడు. చిత్త నిత్య స్థిత శివుడు. అట్లే ఈ కవి కూడ స్మార్త శైవ సంప్రదాయమువాడే. తండ్రి విశ్వేశ్వర ప్రతిష్ఠాపన చేసినవాడు. అందువలననే తేపకు తేపకున్ మొలక దేరిన బత్తిని మత్పితృ ప్రతిష్ఠాపిత శైవలింగము కడంక భజించెద, నాత్మ వారణాసీ పురనేత”నని తొలి కృతులలో చెప్పుకొనినాడు, ఆ స్వామిని గూర్చి ‘మా స్వామి’ యన్న శతకమును కూర్చినాడు.
కాని పరబ్రహ్మ యధార్థ్య భావము లేనివాడు కాదు. ఆ పరబ్రహ్మ తేజము, హరిహర బ్రహ్మమయమైనదని యెరిగినవాడు. రామునియందు పరబ్రహ్మ భావనచే రామకథ రచించినవాడు.
ఇష్ట దేవతా కల్పనము వైయక్తికమైనది. మానవుని సంస్కారమును బట్టి మూర్తి కల్పన చేసికొనవచ్చును. విశ్వనాథ ఇది వాని వాని జన్మనుబట్టి ఏర్పడునని చెప్పుచు
“నన్ను నీవడిగిన వాని వాని జన్మను బట్టి యేరు కొన్నటి దైవముల్ గాగ జనమేచి కొందురు, నేను చిన్ని క్రొన్నెల తల చీరచుంగైవ శివు నేరుకొంటి” (కులస్వామి-70)
ఈ శివోపాసన సహజమైనది. ఆవేశములో మిగిలిన శివభక్తులతో సమానుడే కాని, పరమార్థమెరిగినవాడు. అందుచేత శివకేశవుల నడుమ అభేదమును గుర్తెరిగినవాడు.
ఇక్కడ వైలక్షణ్యమిది. శివ స్తుతి చేయుచును, విష్ణు స్తుతి చేయుచును వారి వారిని బ్రహ్మముగా భావించును. అంతటితో నాగక ఒకరి యందు వేరొకరి రూపమును ఆవిష్కరించుకొనును. ఈ భావన మిక్కిలి సునిశితమైనది. ఇది కారణముగా ఉపాసకుని మనస్సు మిక్కిలి సునిశితముగా నుండవలయును.
ఇది ఏమి ఉపాసన? ఈ మార్గమున పోయినచో హరి తనను కాదని, హరుడును తనను కాదనియు భావింపవచ్చును కదా? ఈ యనుమానము కవికి వచ్చినది.
“హరుడని నీవును, నీవని హరుండు వ్యర్థపుచ్చకుడు జరిపి నా ప్రార్థన మీరు మీరు వచ్చందాలుపోయి చెరియొక చేయి వేసినను జాలను చేరితి ముక్తి నిరుపమానదయాబ్ది! భద్రగిరి పుణ్య నిలయ శ్రీ రామ (భద్రగిరి-11)
తాను కైలాసమో వైకుంఠమో కోరడు. తన పాపమును తొలగించుటకు అనగా కర్మక్షయమునకు – మనస్సిగ్గికొన సాయము గోరుచున్నాను. వైకుంఠ శైవాది, లోకములు విశిష్టాద్వైతులకు మోక్షస్థానములు కాని అద్వైతులకు కావుకదా !
ఒక దృష్టిలో శివునకు విష్ణువునకు భేదము కలదు. ఒకడు భక్తివశుడు, ఒకడు జ్ఞానవశుడు. అందువలననే విష్ణువునకు దశావతారములు కల్పించి భక్తులు భిన్న భిన్న మూర్తులలో ఉపాసనకు వీలుగా అనంత రూపములు కల్పించిరి. శివునకు ఈ భిన్న భిన్న మూర్తులు లేవు. ఒకటే మూర్తి. భక్తులు విష్ణువు వైపునకు ఆకర్షణ పొందుదురు. ఈ విషయమే తిరుపతి, కాళహస్తి ప్రభువుల నుద్దేశించి కవి యిట్లు చెప్పుచున్నాడు.
“తిరుపతికిం బోయి యొడలి నగలెల్లదీసీ యిచ్చెదరు హర! వచ్చి నినుజూచి యొక నమస్కార మాచరించెదరు వెఱపించుటకు మరపించుటకు గల భేదమిద్ది (కాళహస్తి -3)
కాని యీ ఇద్దరి తత్వ మింతటితో ఆగలేదు. దీనికన్న మించినది దానిని తెలియుట కష్టమైన కార్యము.
“ఆయన యహిరాజు శయ్య నిద్రించే, నాయహిరాజె నీయెడ భూషణంబయ్యెఁగొడుకయ్యె, నీవాని యొకటి యై యున్నతత్వంబె మీర లిద్దరా! అధికమా యేదో యై యున్కి తోచు (శ్రీ కాళహస్తి -4)
ఈ రెండు మూర్తు లొక్కటియే యనుట సామాన్య వాక్కు. ఈ రెంటిని మించినది అన్నది పరమార్థ మెరింగిన వాక్కు. మూర్తి గతమైన భావనచేత నీ మూర్తి లొక్కటియే యని మన మూహింపవచ్చును. కాని వీనికన్న అధిక మైన మూర్తియది హరిహరుడన్నది ఒక అవతారమని యొక పురాణము పేర్కొన్నది. ఆ లెక్క ఆయనకూడ మిగిలిన త్రిమూర్తులతో నొకడయిపోవును. తిక్కనగాని విశ్వనాథ గాని ఈ భావన కలవారు కారు. ఈ హరిహరుల మూర్తి కల్పనము పరమార్థ భావమున ధ్యానము సేయుట కేర్పడినది.
ఈ మార్గమునకు విశ్వనాథ తన శతకముల యందవలంబించిన వైఖరి చిత్రమైనది, ఆయన శివుని వర్ణించుచున్నచో విష్ణులీల నాయన యందారోపించును. అట్లే విష్ణువును వర్ణించుచున్నచో విష్ణునందు శివాకారమును భావన సేయును. ఇది ఒక విచిత్రమైన పద్ధతి. కవి మనస్సులో ప్రతీక యందు నిత్యమైన యథార్థ భావన నెలకొన్న నేగాని యీ స్థితి సాధ్యము కాదు.
“మున్ను కాళీయఫణి యడుగులందున మోపిన నూఱు చిన్నారి యడుగుల పైన గల మోజు చెడలేదు నీకు వెన్ను వెంబడి చిత్రముగను ద్రొక్కెదు విరిసిపోయెదన (కులస్వామి-28)
సుషుమ్నా నాడీయందు కుండలిని ఊర్ధ్వముగా సంచరించుట ముక్తికి యొక త్రోవ. మూలాధారమునుండి సహస్రార పర్యంత మీనాడి యందు సంచరించుచునే యుండును. ఆ కుండలిని నాగస్వరూపమైనది. దానియందు పరమేశ్వర భావన నిలిచియున్నది. అది అధోముఖముగా నిద్రించునది. ఆ వేళ విరిసి ఊర్ధ్వముగా కదిలినది. ఈ సందర్భమున శ్రీ కృష్ణుని కాళియ దమనము కవి ధ్యానించుచున్నాడు. విశ్వేశ్వరుని కుండలిని ఊర్ధ్వప్రసారము కల్గించుటచే శ్రీకృష్ణుని లీలతో అభేదముగా చెప్పి శివకేశవాభేదము మరొక క్రొత్త పుంతలో వ్యాఖ్యానించినాడు.
“గుండెలో లింగమై నీవు స్వామివై కూర్చుండినావు దండిగా కనుమూయ నెదుట హరివయి తారాడినావు పండి మీతత్త్వము నాకు ఫలియించె (కులస్వామి-100)
ఆత్మ స్థానమైన హృదయమునందున్నవాడు శివుడు. కనులు మూసినప్పుడు ధ్వాన వీధియందు సాక్షాత్కరించినవాడు విష్ణువు, ఇది హరిహరతత్త్వము పండెడు పద్ధతి. అనగా ధ్యానమున – ఆత్మ దర్శన వేళయందు జ్ఞానోపాస్యుడైన శివుడు, ధ్యానాధిసాధన వేళ యందు భక్త్యుపాస్యుడైన విష్ణువును కాననై నారని తాత్పర్యము. గుండెయన్నది అనాహత చక్రస్థానము. ఇక్కడ శివుడు కన్పించెను. కనులుమూసి
ధ్యానించునది ఆజ్ఞాచక్రస్థానము. ఇది హరి దర్శనమిచ్చినచోటు. అనాహతము సూర్య స్థానము, సూర్యమండల మధ్యస్థుడైన హరి యిచ్చట కానరావలెను. అట్లే ఆజ్ఞాచక్రము గురుస్థానము. శివస్థానము. ఇచ్చట శివుడు కానరావలెను. కాని శివుడుండు చోట విష్ణువు, విష్ణువుండుచోట శివుడును కానవచ్చుటచే కవి ఈ అభేదము ధ్యాన వీధియందు సాధించినాడని యర్థము చెప్పవచ్చును.
కాని కించిత్ జ్ఞానముకల లోకము ఈ భేదమును గోరంతలు కొండంతలుగా జేసి చూచుచున్నది. విశ్యనాథ ఒక చోట “శివునకు నీకును నేను భేదంబు సేసితినేని తవులు నా పాపాన నాదు నాయువు తగ్గేనుగాక (శేషగిరి-6) అని చెప్పినాడు. తన హృదయమునందు మాయ కప్పియున్నదనియు దానిని తొలగించుమనియు నిద్దరిని పార్థన చేయుచున్నాడు.
విష్ణుమూర్తులను చూచినప్పుడు ఆయనకు శివ భావన కలుగును.
“సౌద సుదర్శనమది చేత వాసుకి చుట్టుకొన్నట్లే విదితశంఖము వినాయకుని నెమ్మోము విరిసినయట్లు పదనూర్ధ్వ పుండ్రమ్ము లవి త్రిశూలంబు పగిది రెండుగను చెదరక రావయ్య వేంకటేశ్వరా శేషాద్రినిలయ! (శేషగిరి-100)
శ్రీ వేంకటేశ్వరుని చూచు వేళ కవికి శివుడే కానవచ్చినాడు. చక్రము చేత వాసుకి చుట్టుకొన్నట్లున్నదట. శంఖము గజముఖుడైన వినాయకుని విరిసిన ముఖము వలె నున్నదట. ఊర్ధ్వ పుండ్రములు త్రిశూలమ్మువలె నున్నవట. అందువలన భగవంతుడు రెండుగా చెదరక సాక్షాత్కరింపవలెనని కోరుచున్నాడు. హరి హారు లిద్దరును ఒకే వెలుగుయొక్క చెదరిన రెండు మూర్తులన్న మాట. ఈ రెండును ఈ విధముగా చెదరుట కవికి అభిమతము కాదు. రెండును చెదరక ఒకే మూర్తిగా రావలెను. హరిహరమూర్తి కూడ రెండు పార్శ్వములయందు రెండు మూర్తులు కల్పించుకొన్నచో నది తన ఆశయమును సఫలము జేయనేరదు, భావమునందే ఈ ఆభేదము సాధ్యము కావలెను.
ఈ రూపభావన మిక్కిలి సుందరమైనది. ఇట్లే మరి యొక చోట కవి విష్ణువు నందు శివభావన చేయుచున్నాడు. ఆయన వేణుగోపాలస్వామి. ఆయన చెరియొక ప్రక్క రుక్మిణీ సత్యభామలు కలరు. ఆ మూర్తిని యిట్లు వర్ణించుచున్నాడు:
“శిరసుననుండి స్వర్గంగ దిగివచ్చి చెంతను నిలువ గిరిరా జదుహిత కోపమున నరమేని కేరింత వదల గరళంపు మేడకాంతి మేన నెల్లడ క్రమ్మగా! శివత విరజిమ్మ వచ్చితో యిటకు, మున్నంగి వేణుగోపాల! (మున్నంగి-40).
శివుని శిరస్సు మీది గంగ సత్యభామవలె దిగివచ్చి ప్రక్క నిల్చనది. పార్వతీ దేవి శరీరార్ధ భాగమునుండి విడివడి ప్రక్క నిలచినదట. మెడలోని గరళ కాంతి నెమేల్ల వ్యాపించినదట. ‘ఓ స్వామీ! శివత విరజిమ్మ వచ్చితివా!’ అని కవి పృచ్ఛ చేయుచున్నాడు. ఇదీ మహాకవి యొక్క ఉజ్జ్వల భావనాశక్తికి మరొక ఉదాహరణము. శివ కేశవాభేద భావమున కింతకన్న వేరొక మార్గము లేదా యన్నంత పరాకాష్టలోనున్న దీ పద్యము. అందువలననే కవి ఎన్నుకొన్నది ‘క్రొన్నెల తలచీర చుంగైన శివునై నను నిజముగా భావించునది హరిహరాఖ్యమౌ సారమైన తేజమునే
“నా జాతకము ప్రజలమౌచున్నది యెవ్వరు? గ్రహ రాజియో హరిహరాఖ్యంబు వెలుగు సారమ్మో ముకుంద!” (నందమూరు – 66)
విశ్వనాథ మధ్యాక్కరలలోని అన్ని శతకములలో రచనా క్రమమున మొదలిది మున్నంగి వేణుగోపాలశతకము. దీని యందే ఈ భావన యింత ప్రబలముగా నున్నది. మరొకచోట కూడ వేణుగోపాలుని శివునిగా భావించుట చూడవచ్చును.
“తలమీది నెమ్మిపించియము సురగంగ తరగల తనుకు కలితమౌ పిల్లనగ్రోవి పేడిన ఖట్వాంగశకలి గళమందు రత్నహారములు ప్రాకెడు గండుసర్పములు విలసిల్ల మేలుకోవయ్య మున్నంగి వేణుగోపాల (మున్నంగి-86).
అందువల్లనే ఈ శతకము చివర శివునకును, నీకును నేను భేదమ్ము సేయన యేని, సవురుగా మీరిద్దరొక్కడే బ్రహ్మచైతన్యమేని” ఆ చైతన్యము తన్ను పొంద వలెనని ప్రార్థించుచున్నాడు, ఇంత విలక్షణమైన భావ పథమున విశ్వనాథ ప్రయాణించినాడు, మూర్తి కల్పనమునందలి అయథార్థమును ఇంతగా భావించిన కవులు లోకమున దరుదుగా కన్పింతురు. సాధనలో శ్రీ రామకృష్ణ పరమహంస ఇట్టి పరమార్థమును సాధించి చూపినాడు.
“నిన్ను భావించుచు విష్ణువనకొందు, నీవనుకొందు వెన్ను నూహించుచు, నిద్దరుంగారు వెసభావమందు నన్ను నేనే విముక్తునిగ తేజస్సనాథగా బిట్టు నెన్నుచు, వేములవాడ రాజరాజేశ్వరా! స్వామి (వేములవాడ 98)
అని తన భావమందలి అద్వైత రహస్యమును వెల్లడించినారు. ఇది తిక్కనగారి భావ స్ఫూర్తి కన్న విలక్షణమైనదే కాక సౌధనకు క్లిష్టమైనది.
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™