వస్తువును పాఠకుడికి అందించే వాహిక శిల్పం. గమ్యాన్ని చేరడానికి దగ్గరి దారి, దూరపు దారి, పక్షిదారి (పైనుండి ఎగిరి వాలడం లేదా ఒక జంప్ చేసి గమ్యం చేరడం. ఒకరకంగా ఇది లౌక్యపు దారి) ఉన్నట్లే, కథలోని వస్తువును పాఠకుడికి చేర్చడానికి అనేక శిల్పరీతులు ఉన్నవి. అందులో ప్రధానమైనది, ప్రయోజనకరమైనది, అధికులు ఉపయోగించేది వాస్తవిక కథాశిల్పం. వస్తువును గురించి చెప్పే క్రమంలో వస్తు ప్రాధాన్యతను, ఉపయోగితను చెప్పాలి. దాని ద్వారా జీవితావగాహన కలుగుతుంది. ఇది సులభంగా కలగడానికి, కథ ద్వారా అందడానికి ఉపయోగపడేది వాస్తవిక కథాశిల్పం. చాక్లెట్ అనేది తీపి వస్తువు. అందులోని తీపి పదార్థం బాగుండాలి పదార్థం బాగాలేక పేపర్ బాగుంటే దాన్ని స్వీకరించరు. కథలో తీపి పదార్థం లాంటిది విషయం లేక వస్తువు. అందమైన రంగు కాగితం శిల్పం. పదార్థానికి ప్రాధాన్యత ఇచ్చేది వాస్తవిక కథాశిల్పం.
వాస్తవిక కథాశిల్పం కథలో తాను అదృశ్యంగా ఉంటూ వస్తువును బహిర్గతం చేస్తుంది. ఈ పద్ధతి పాఠకుడి చేతికి వస్తువును అందిస్తుంది. జీవితంలోని కార్యకారణ సంబంధాలను అర్థం చేయిస్తుంది. జీవన సంక్లిష్టతలను వస్తువు ద్వారా తేటతెల్లం చేస్తుంది. ఈ కథాశిల్పం వస్తువును మింగి తన విశ్వరూపాన్ని ప్రదర్శించదు. సామాజిక వాస్తవికతను, అది కనిపించకుండా ఉండే ఒక సంక్లిష్ట రూపంలో పెట్టి అందించడం వల్ల సాహిత్య ప్రయోజనం నెరవేరదు. తీసుకున్న వస్తువు మంచిదైనా శిల్పం వల్ల పాఠకుడికి అందకపోతే నీళ్ళలో వేలు పెట్టి చప్పరించినట్లు ఉంటుంది. దానికి భిన్నమైనదే వాస్తవిక కథాశిల్పం.
వాస్తవిక కథాశిల్పానికి భిన్నంగా రూపొందింది చైతన్య స్రవంతి. ఇందులో వస్తువు కంటే శిల్పానికి ప్రాధాన్యం ఎక్కువ. సాహిత్యంలో వస్తువును “సారం” అని కూడా అనవచ్చు. అదే విధంగా శిల్పానికి రూపం అనే పేరు కూడా ఉంది. వాస్తవిక కథా పద్దతి “సారం”కు పట్టం కడితే, చైతన్య స్రవంతి “రూపం”కు పట్టం కట్టింది. ఒక రకంగా ‘సారం’కు ప్రతిద్వంద్విగా “రూపం”ను నిలబెట్టడమే ఇది. దీన్ని రూపవాదం అని పిలుస్తారు. రూపవాదం ఆధునికతకు చెందినది.
ఈ విషయం గురించి రాంభట్ల కృష్ణమూర్తి గారు ఈ విధంగా వివరించారు. “ఫ్రాయిడ్ మతానుసారంగా చేసే రచనలు వాస్తవాతీతంగా ఉండాలన్న నియమం ఉంది. అందుకని ఆదిలో ఇలాంటి రచనలకు అధివాస్తవికత (సర్రియలిజం) అనే పేరుండేది. అవి కళలోని రూపం (ఫార్మ్) విషయం (కంటెంట్) అనే రెండు అంశాలలోను విషయాన్ని తిరస్కరించి రూపానికి ప్రాముఖ్యత ఇవ్వడం. అందుకని వీటికి రూపవాదాలు అని పేరు వచ్చింది. వాస్తవికతకు కళను ప్రతిద్వంద్వి చేయడం మరొక సామాన్య లక్షణం. అంటే జగద్వాస్తవికతను (అబ్జెక్టివ్ రియాలిటీ) తిరస్కరించి, ఆత్మాశ్రయవైఖరిని ఆదరించడం కాలక్రమాన ఇవన్ని కలిసిపోయి అవ్యక్తకళ (అబ్ స్ట్రాక్ట్)గా రూపొందాయి.”
ఫ్రాయిడ్ థియరీలో “ఫ్రీ అసోసియేషన్” కు చాలా ప్రాముఖ్యత ఉంది. బయట ప్రపంచం కల్పించిన చిన్న ప్రేరణ, మన మనసు అనే సరస్సులో ఎన్నో అలల్ని సృష్టిస్తుంది. ఈ ప్రేరణ ఒక జ్ఞాపకానికి దారి తీయవచ్చు. ఈ జ్ఞాపకం ఎన్నో దృశ్యాల్ని, ఎందరో వ్యక్తుల్ని, ఎన్నో మాటల్ని మన మనః ఫలకం మీదికి రప్పిస్తాయి. ఇవి మన మనః ఫలకం మీదికి ఎలా వస్తున్నాయో అలాగే వెంటవెంటనే యే దాపరికం లేకుండా బయటకు చెప్పడాన్నే ఫ్రీ అసోసియేషన్ అంటారు. దీనికి రాంభట్ల కృష్ణమూర్తి గారు “ముక్తానుషంగం” అనే పేరు పెట్టినారు. “బాహిర జగత్ సంపర్కం వల్ల మనస్సులో ఏర్పడే ముక్తానుషంగాల ప్రవాహాన్ని సాహిత్య రూపకంగా నమోదు చేసే పద్ధతిని ఇప్పుడు చైతన్య స్రవంతి అని పిలుస్తున్నారు” అని కూడా తెలిపారు.
స్థూలంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ఇది. మనిషి మనసులో సుప్తచేతన, ఉపచేతన, చేతన అనే మూడు అరలుంటాయి. వీటినే ఇడ్, ఈగో, సూపర్ ఈగో అని కూడా అంటారు. ఇడ్ సామాజిక కట్టుబాట్లతో ప్రమేయం లేకుండా ఇంద్రియ సుఖాలను కోరుకుంటుంది. ఈగో సాధ్యాసాధ్యాలను ఆలోచించి సుఖభోగాలను కోరుకుంటుంది. సూపర్ ఈగో సమాజానికి అతీతమైన ఆదర్శవంతమైన స్థానం కోరుకుంటుంది. ఇడ్ మరియు సూపర్ ఈగోలను నియంత్రిస్తూ వాటి మద్య సమన్వయం సాధించడానికి ఇగో ప్రయత్నిస్తుంది. అట్లా సమన్వయం సాధించినవాడే సగటు మనిషిగా బతుకుతాడు. ఈ విశ్లేషణాసూత్రాల ఆధారంగా మనిషి మనస్తత్వాన్ని రచయితలు చిత్రించారు. అందుకు తోడ్పడ్డదే చైతన్య స్రవంతి రచనా విధానం.
మనిషి మనసు చంచలమైనది. అది ఎప్పుడు ఎటు వెళ్తుందో తెలియదు. దానికి కుదురుగా ఉండటం తెలియదు. వర్తమానంలో ఉండి భూత, భవిష్యత్తులను ఆలోచిస్తుంది. భూతకాలంలోకి వెళ్ళి, వర్తమానాన్ని బేరీజు వేస్తుంది. ఈ రెంటి ఆధారంగా భవిష్యత్ కలకంటుంది. భవిష్యతను వర్తమానం లోకి లాక్కొస్తుంది. ఇలా కాలం అనేది కలగాపులగం అయితుంది. ఈ ఆలోచనా ప్రవాహానికి దిశ అనేది కూడా ఉండదు. మనసు ఎల్లప్పుడు వెనక్కి ముందుకు నలుచెరగుల తిరుగుతుంది. గజిబిజిగా సంచరించే “మనస్సంచారాన్ని” చిత్రించడానికే చైతన్యస్రవంతి పద్దతిని రచయితలు ఎన్నుకొన్నారు. హెన్నీజేమ్స్ అనే రచయిత ఈ రచనా విధానానికి ‘Stream of Consciousness’ అనే పేరు పెట్టారు. ఈ మాటనే శ్రీశ్రీ “చైతన్య స్రవంతి”గా తెలుగులోనికి అనువదించాడు.
“క్షణికమైన ఒక అనుభవాన్ని మొత్తం జీవితానుభవంతో ముడెట్టి, ఈ రెంటి తారతమ్యాల్ని విభజన లేకుండా ఉన్నది ఉన్నట్లు చిత్రించడమే చైతన్య స్రవంతి” – బుచ్చిబాబు
ఈ పద్ధతిలో రాసే కథల్లో పాత్రల్నించి, అంటే వాళ్ళ మనసు పొరల్లో యేం జరుగుతున్నదో చూపించడం జరుగుతుంది. రచయిత తన దృష్టిని పాత్రల అంతరంగ ప్రపంచం మీదనే కేంద్రీకరిస్తాడు. “ఇడ్”, “ఈగో” “సూపర్ ఈగో”ల మధ్య జరుగుతున్న సంఘర్షణను చిత్రించే ప్రయత్నం చేస్తాడు.
“మనిషి మనః ప్రపంచంలో చెలరేగే విభిన్నమైన, విరుద్ధమైన భావాలకు సాధ్యమైనంత యధాతథంగా అక్షర రూపం ఇవ్వడమే చైతన్య స్రవంతి రచనా విధానము” – అంపశయ్య నవీన్
ఇలాంటి శిల్పరీతిలో రాసిన కథలు సామాన్య పాఠకుడికి కొరుకుడు పడవు. చేయితిరిగిన రచయితలు, విమర్శకులు అర్థం చేసుకోగలరు. వస్తువు పాఠకుడి వద్దకు వెళ్ళే దారిలో అడ్డంగా ఇవి నిలబడుతాయి. దాటుకొని వెళ్ళే పాఠకుడికి విందు భోజనం లాగా ఉంటాయి. ప్రతి ప్రయోగాన్ని ఆహ్వానించాల్సిందే. పాఠకుల చైతన్య స్థాయిని పెంచే ప్రయోగాల్ని అక్కున చేర్చుకోవాల్సిందే.
(మరోసారి మరో అంశంతో)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.
Abhinandanalu good information
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™