గత స్మృతులనేవి నిద్రలో తప్ప నిరంతరం మనల్ని ముంచెత్తుతూనే ఉంటాయి. అప్పుడలా, ఇప్పుడిలా అనుకుంటూ ఉంటాం. వయసు పెరిగే కొద్దీ స్మృతుల రాశులు పెరుగుతుంటాయి.
ఎవరి జీవితం గురించి మాట్లాడినా వారి బాల్యం నుండి మొదలు పెడతాం. ఇంటర్వ్యూ చేసేటప్పుడూ మీ నేపథ్యం ఏమిటీ? అనే అడుగుతాం.
తమ గడిచిన జీవితం గురించి చెప్పేటప్పుడు ప్రతివారూ చాలా లోటుపాట్లు చెబుతారు. ఉదాహరణకి కొందరు నేను బాల్యంలోనే తల్లినీ లేదా తండ్రినీ కోల్పోయాననో తాతగార్లు లేదా మేనమాఁవ దగ్గర పెరిగాననో లేదా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పెరిగాననో ఇలాంటివేవో చెబుతారు. లేదంటే తండ్రి సంసారాన్ని సరిగా నడపకపోవడం వల్ల తల్లి కష్టాలు పడి పెంచిందని చెబుతారు. అవన్నీ నిజమే కావచ్చు. జీవితం పూలపాన్పు కాదు కదా!
రక రకాల ఫ్లాష్‌బ్యాక్‌లు. ఏ ఒక్కరికీ నూరు శాతం సౌకర్యవంతమైన జీవితం దొరకదు. ఎన్నో కష్టనష్టాలుంటాయి. మా ఊర్లో హైస్కూల్ లేక పక్క ఊరికి నడిచి వెళ్లి చదివానని కొంతమందీ, చిన్నపుడు తగిన వసతులు లేక కొంచెమే చదువుకుని తర్వాత పెద్ద చదువులు చదివానని ఇంకొంతమందీ చెబుతారు.
ఆ గత కాలపు సౌధంలో ప్రతి జ్ఞాపకమూ ఒక ఇటుక రాయి. ఆనాటి సంఘటనలూ, పరిణామాలూ ఇసుకా సిమెంట్ లాంటివి. అది ఘనీభవించిన సంపద ఒక గొప్ప సంపద. ఆ సంపదపై ఎవరికీ అధికారం లేదు. ఆ సంపదని సంరక్షించాలి తప్ప తిరస్కరించడానికి లేదు. మార్చడానికి అసలే లేదు.
గతంలోని అతి చిన్న గుర్తు కూడా అచ్చంగా మనదే. దాన్నెవరికీ ఇవ్వలేం. ఇచ్చినా వారు దాని విలువ గుర్తించలేదు. ఆ గుర్తుల అమూల్యత మనకి మాత్రమే తెలుసు. పదిలంగా వాటిని దాచుకునేది అందుకేగా మరి.
మన బాల్యపు ఇంటివాతావరణం, పండుగలు, బంధువులు, ఊరు, మిత్రులు, స్కూల్, లైబ్రరీ, కాలువ గట్టు, చెరువు, గుడి, తోట వీటన్నిటినీ మనం గంపలోకెత్తుకుని ఇష్టంగా మోస్తుంటాం.
అప్పుడప్పుడు ఆ గంపని ఎవరికైనా చూపించి వివరిస్తుంటాం. అందులో ఎంతో మురిపెం, ముచ్చట ఉంటాయి. గతం వేసిన పునాదుల మీదే ప్రస్తుతపు మనిషి అనే మందిరం నిర్మించబడుతుంది. ఆ మందిరంలో కొలువైన వ్యక్తి ఈ ప్రపంచంలో కొందరికైనా చిరస్మరణీయుడవుతాడు. జన్మించిన వ్యక్తిగా గానీ, జన్మనిచ్చిన వ్యక్తిగా గానీ, ఇతర కుటుంబపు/స్నేహపు బంధువుగా గానీ.
అటువంటి సుందరమైన రూపం పొందిన మనిషి యొక్క గతాన్ని మార్చాలని కానీ, మార్చితే బావుండునని గానీ అతను గానీ, అతని తరఫున గానీ మరొకరు గానీ ఊహించడానికీ, కనీసం ఆలోచన చెయ్యడానికీ వీల్లేదు.
నీ గతమంతా కలిపితేనే ఈ నాటి ఒక నువ్వు గతపు నీటిలో తేలే అందమైన పువ్వే నువ్వు ఆ జ్ఞాపకాల భాండాగారం హక్కు భుక్తం నీదే మరపురాని అందాల గతం అంతా నీ ఒక్కడిదే
ఆ నాడలా జరిగింది గనుకనే ఈ నాడు నువ్విలా గతమనే ఖజానా తాళాలు గుండెల్లో, తలపుల్లో దాచుకుని హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి ఈ కాలమ్ చదవగలుగుతున్నావు.
విధి ననుసరించి సాగిన మన గతాన్ని మనం సాదరంగా ఆలింగనం చేసుకోవాలి. అంతే కాదు ప్రేమించాలి. విధి చేసిన ఛాలెంజీలకు పూర్తి అంగీకారం తెలపాలి. అప్పుడు మాత్రమే మనం మానసికంగా ఎదుగుతాం. తోటివారిని దగ్గరకు తీసుకోగలుగుతాం. నీ శక్తీ, సత్తా ఏంటో ప్రపంచం తెలుసుకుంటుంది. నువ్వు ఆత్మ సాక్షిగా లోకాన్ని నీలోకి పొదువుకోగలుగుతావు.
జీవితం ఇచ్చిన ప్రతి చిన్న దుఃఖపు సంతోషాన్నీ, ఆనందపు వేదననీ అనుభవించినపుడే నీ జీవితంలో సంతృప్తీ, పరిపూర్ణతా ఏర్పడతాయి. ఒక విజయ దరహాసం నీ పెదవులపై నెలకొంటుంది.
పరిస్థితుల్ని మనం మార్చలేనప్పుడు వాటికి అనుగుణంగా మారిపోవడం మనల్ని బలవంతుల్ని చేస్తుంది. మన అనుభవాలపై మనకు సానుభూతి ఉన్నప్పుడు మన గాయాలకవి మృదు లేపనమై వాటిని మాన్పి మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తాయి
నీ గతమే నీ బలం! దాన్ని సగర్వంగా తలచుకో! నీ దారిలో ఎన్ని ముళ్ళున్నా, రాళ్లున్నా, వాగులున్నా, వంకలున్నా ఆ దారే కదా నిన్నిక్కడికి చేర్చింది!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™