Life is a quest… An adventurous journey to find something unknown and to achieve something unique. If you don’t have enthusiasm to quench your thirst and explore, then you are left behind starving…
పాకే పసిపాపాయి కూడా అందని ప్రతీదీ పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలోనే నడక నేర్చుకుంటుంది… పరిగెడుతుంది. కొన్ని సందర్భాల్లో కింద పడి, గాయపడి, నొప్పి నుండి నేర్చుకుని ఆ మార్గంలో ప్రమాదముందని దారి మళ్ళుతుంది.
సుదూరంగా సమాంతర రేఖల్లా సాగిపోతున్న రైలు పట్టాలు చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది నా ఎనిమిదేళ్ళ ప్రాయంలో అకారణంగా ఇంటి నుండి పారిపోవాలనుకున్న నా పోకిరీ ఆలోచన. అసలు ఇల్లు వదిలి పెట్టి వెళ్ళాలన్న ఆలోచన ఆ వయసులో ఎందుకు కలిగిందో అలా వెళ్ళిపోవటంలో సఫలమై వుండి వుంటే కుక్కలు చించిన విస్తరి అయి వుండే బ్రతుకును, బండలయి పోయుండే భవిష్యత్తును ఊహిస్తే ఇప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది.
అయినా నా పిచ్చి కాకపోతే భవిష్యత్తు గురించి పిల్లలెందుకు ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తే వాళ్ళు పిల్లలెందుకు అవుతారు… అది బాల్యం ఎలా అవుతుంది.
నా ఆనాటి విచిత్ర చర్య వెనుక నేపథ్యం నా నున్నటి మెదడు లోతుల్లోని జ్ఞాపకాల పుటలు ఎంత తవ్వినా గుర్తు రావటం లేదిప్పుడు. బహూశా నన్ను నేను తెలుసుకునే యత్నమో, నా నుండి నేను పారిపోయే ప్రయత్నమో, జీవితం నుండి తప్పించుకునే పలాయనమో, తెలియని ప్రపంచాన్ని శోధించాలన్న కుతూహలమో..
ఏమో ఇప్పుడాలోచిస్తుంటే అనిపిస్తుంది అసలు నేను ఎనిమిదేళ్ళ నాటికే చిత్రంగా ఆలోచించిన వైవిధ్య చిత్రాన్నని..! ఆ పసి వయసులోనే నా అన్వేషణకి శ్రీకారం చుట్టానని.
నేను తలమునకలయ్యే ప్రేమలో పడి ప్రియునితో లేచిపోయే వయస్సులో లేను. రాచి రంపాన పెట్టే కుటుంబం నుండి పరారీ కోరుకోలేదు. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయానికి సిద్దమైన సిద్దేశ్వరినీ కాను నేను. మరెందుకు పారిపోవాలనుకున్నానో ఇప్పటికీ అర్థం కాదు.
ఎనిమిదేళ్ళయినా గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమ మాటు నుండి, ముద్దుల మూటలు కట్టే తమ్ముని ఆప్యాయత నుండి విడివడి, చిత్త వైకల్యంలో అవకాశం కోసం పొంచి, నాకేం కావాలో తెలియని స్థితిలో, అసలెక్కడికి వెళ్ళాలో అంతు పట్టని అయోమయంలో, అమ్మ చేతి అల్పాహారం ఆరగించి, కరివేపాకు కొనుక్కు రమ్మని చేతికిచ్చిన పది రూపాయల నోటు పుచ్చుకుని RTC X రోడ్డులో వేచి వున్న ఆరేళ్ళ కజిన్‌ను కలిసాను. రుచులెరుగని జీవన సుధామృతాలేవో గ్రోలాలని, నాణేనికి రెండో ప్రక్క ఎలా వుంటుందో తెలుసుకోవాలని, ఇంకోలా జీవితమెలా వుంటుందో చూద్దామని, జీవితం అంతు తేల్చుకుందామన్న ఉత్సుకతలో వడివడిగా వేగం అందుకున్నాము.
నేనూ, నా కజిన్, మా నాలుగు చిట్టి పాదాలతో పయనం సాగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషను చేరాము. అక్కడి నుండి రైలు పట్టాలే దిక్సూచిగా వాటి పక్కమ్మటా గమ్యం తెలియని బాటసారుల్లా అనంతంగా సాగిపోయాం.
సొరంగ మార్గంలా మెలికలు తిరుగుతూ అల్లంత దూరాన ఆకాశపు అంచులు తాకిన రైలు పట్టాల అవతలి కొసలు ఆందోళన కలిగించాయి. వెలుగుచీకట్లలా ఎండా నీడలను మార్చి మార్చి మాపైకి విసురుతున్న తాటి చెట్ల వరుసలు భయబ్రాంతుల్ని చేశాయి. అడుగుల సవ్వడికి చెవులు నిక్కించిన బ్రహ్మ జెముడు పాదులు వెన్నులో దడ పుట్టించాయి. నడి నెత్తిన మిట్ట మధ్యాహ్నపు సూరీడి ఎర్రటి చురకలు కొరడా దెబ్బల్లా వాతలు తేల్చాయి.
కొత్తగా దొరికిన స్వేచ్ఛ… అప్పుడే స్వతంత్రతను ఆపాదించుకున్న పాదాలు.
ఓ మూడు మైళ్ళు నడిచే సరికే ఈ ప్రపంచంకన్నా ఓ మెట్టు ఎదిగిన భావనాహంకారంలో నేను. ఉచ్చమైన భావనా తాదాత్మ్యంలో కఠోర తపస్సుకి సిద్దపడిన మహా ఋషిలా మరింత అచంచల నిశ్చల దీక్షతో సాగిపోయాను.
రైలు పట్టాల పక్కగా ఎడతెరిపి లేని నటరాజ యానం. ఒక్కో అడుగుతో నా ఒక్కో పొరా ఒలుచుకుంటూ మార్మికాన్ని నా లోకి ఒంపుకుంటూ తెలియని తాత్విక పరిమళాన్ని కప్పుకుంటూ సాధారణ జనానికి కనిపించని నా మూడో కంటితో తాత్విక మూలాలన్నీ అన్వేషిస్తూ నేను… నిజానికి అన్వేషిస్తున్నానన్న భ్రమలో నేను.
నేనూ, చెల్లీ, ఆకలి, దప్పిక…
సాగిపోతున్న పాదాలు…. అంతం లేని రైలు పట్టాలు…
“ఎక్కడికి వెళ్తున్నామక్కా” అని చెల్లెలు ఎక్కుపెట్టిన ప్రశ్నతో సాలోచనగా గమ్యం తెలియని అనంతంలోకి యోగేశ్వరిలా దృష్టి సారించాను.
“ఆకలేస్తుందక్కా… దాహంతో గొంతు ఎండిపోయింది” అన్న దాని బేజారైన జాలి మొహం వంక ఆకలి దప్పికలకు అతీతురాలిలా అభావంగా చూసాను.
ఎదురుగా ఏదో రైల్వే స్టేషను సందడి కనిపించింది. చేతిలో వున్న డబ్బుతో వేరుశనక్కాయలు కొనుక్కుని మంచి నీళ్ళు తాగాక ప్రాణం కాస్త కుదుట పడింది.
ఆలోచనలే అసాధారణం తప్ప సామాన్య జీవిని.
మళ్ళీ మొదలయిన ప్రయాణం.
సూర్యచంద్రులు డ్యూటీలు మార్చుకున్నారు. చంద్రునికి రాత్రినప్పగించి సూర్యుడు తప్పుకున్నాడు. నిర్మానుష్యమైన రైలు పట్టాలనావహించిన చీకటి పెనుభూతంలా భయపెట్టింది. అమ్మ చీర కొంగు లుంగచుట్టుకుని వెచ్చగా పడుకోవాలన్న ప్రగాఢ వాంఛ అంతర్లీనంగా రహస్యంగా తొలిచేయటం మొదలెట్టింది. కప్పుకున్న మేకపోతు గాంభీర్యం పొరలు పొరలుగా విడిపోతోంది.. అంతర్లీనంగా వున్న సిసలైన సౌజన్య మూర్తి దయనీయంగా బహిర్గతమవుతోంది.
భగవంతుడు సృష్టిoచిన జీర్ణ వ్యవస్థ నిజంగా అమోఘం. ఆ శిల్పి చెక్కిన మానవాకృతికి అద్భుతమైన మెరుగులు దిద్దే జీర్ణ వ్యవస్థ ప్రాంప్ట్‌గా పని చేయనారంభించింది. మళ్ళీ కడుపులో ఎన్నడెరుగని మెలి పెడుతున్న పేగుల బాధ. చేతిలో తరిగిపోయిన ద్రవ్యం. ఆ బాధను ఆకలి అంటారని ఎప్పుడూ తెలిసే అవకాశం ఇవ్వని అమ్మ గుర్తుకు వచ్చింది.
“ఇంక ఇంటికెళ్ళిపోదామక్కా” చెల్లెలి ఆ మాట కోసమే వేచి వున్నట్టు దాని అభీష్టం మేరకే తిరుగుమొహం పట్టినట్టు అభినయిస్తూ తిరోగమనం పట్టి ఉసూరుమంటూ ఇంటికి చేరిపోయాను.
పొద్దుటనగా కరివేపాకు కోసం వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికి చేరిన నా కోసం కంగారు పడుతున్న అమ్మ నా వంక కోపంగా చూసి, అంతలోనే వడలిపోయిన నా మొహం చూసి అమాంతం నన్ను తన కౌగిట్లోకి తీసుకుంది.
అంత చిన్న ప్రాయంలో ఏదో అన్వేషిస్తూ వెళ్ళి అలిసి తిరిగి వచ్చిన నాకు అమ్మ చేతుల్లో సమస్త జీవితాన్వేషణకు సమాధానం దొరికిపోయింది.
జీవితంలోని పరమార్థం జీవించటంలో గ్రహించాలే కాని అన్వేషించటంలో కాదేమో… దుర్భరమైన దిక్సూచి లేని అన్వేషణ గాడి తప్పి అసలు అస్తిత్వానికే ముప్పు వాటిల్లి వుంటే…
(మళ్ళీ కలుద్దాం)
ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
Good experience. Writer might have enjoyed the thrill of journey in her childhood. A determination in confusion and the end that’s like cleared sky . That night sleep must be a warm and cozy in nest of mother.
Yes brother, only from then understood more of the warmth of mother’s love
అంటే అన్వేషణకు బయలు దేరారా అనుకుంటే అది అన్వేషించే వయసు కాదు మేడమ్ . మీరు ఎందుకు పారిపోవాలనుకున్నారు అన్న విషయం ప్రక్కనపెడితే ఇంటికి రాగానే కోపంతో ఉన్న వడలిపోయిన మీ ముఖంచూసి తల్లడిల్లడం మాతృప్రేమను మరోసారి వర్ణించారు సున్నితంగా. అభినందనలు మేడం
Thank you Sagar garu…
నిజమే ఝాన్సీ గారు అమ్మ మీద ప్రేమ మీకు ఆ పరిస్థితి లో వెనక్కు లాగక పోతే చాలా చాలా అనర్థాలు జరిగేవి.మనిషికి కావలసింది ఆ వయసులో అన్వేషణ కాదని సుస్పష్టం చేస్తూ పాఠకులకు మీదైన కమ్మని శైలితో ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్సుకతగా ప్రత్యేకంగా చదివించారు.మీ కధనం ద్వారా సమాజానికి ఓ మంచి స్ఫూర్తి దొరికింది మీ గొంతు విప్పిన గువ్వ మొదటి రోజే చక్కని పలుకులు పలికింది. హృదయపూర్వక అభినందనలు మీకు💐💐💐💐💐💐💐💐💐💐💐
Thank you వలీషా గారూ, మీ ఆత్మీయస్పందనకు ధన్యవాదాలు
ఝాన్సీ గారు ! చూస్తుంటే చిన్నతనంనుండే మీకు విషయ పరిజ్ఞానం పై మంచి అవగాహన వుంది ! ఆసక్తికరంగా చదివాను !! చాలా బాగుంది !!!👌 అభినందనలు !!!!💐
Thank you Sambasiva Rao garu..
తెలిసీ తెలియని వయసులో అలాంటి పనులు మామూలే అయినా ,సింపుల్‌గా తీసుకునేవి కాదు. ఆ..సమయంలో ఆ ..తల్లి ఎంత క్షో భ ను,అనుభవించి వుంటుందో అంచనా వేయ లేము .చిన్నతనం లో ముఖ్యంగా ఆడ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా వుండాలో,ఈ కథనం చెబుతున్నది ఎదిగిన తరువాత ఎన్ని కబుర్లు చెప్పినా వృధానే.మీ జ్నాపకం ఒళ్లు గగుర్పొడిచే భయంకర సంగ టన.ఇతరులకు జ్ఞానో దయం కలిగించి జాగ్రత్త గా పిల్లలను పెంచుకు నే దానికి ఈ వ్యాసం ఎంత గానో ఉపయొగ పడుతుంది.
_____డా.కె.ఎల్.వి.ప్రసాద్ హనంకొండ.
ధన్యవాదాలు డాక్టరుగారూ…
ఒక యోగి ఆత్మకథ లోని ఒక ఘట్టం గుర్తుకు వచ్చింది ఝాన్సీ డియర్..అందులో పరమహంస యోగనంద గారు…గురువు కోసం ఇంటి నుండి తన స్నేహితుడుతో పారిపోతారు. ఇక్కడ పసితనంతో తెలియని తత్వంతో తత్వాన్ని వెదుక్కుంటూ…. వెళ్లారు.చదువుతుంటేనే భయం వేసింది…డియర్…బాగా వ్రాశారు 👌
Thank you మాధవీ డియర్💖💖
నాకు ఇప్పుడు అలా పారిపోవాలని చాలాసార్లు అనిపిస్తోంది. నన్ను నేను అన్వేషించుకోవడానికో.. నీడలాంటి గతం నుంచి తప్పించుకుని మంచి స్మృతులేవైనా ఉంటే తిరగదోడుకోవడానికో… తెలియదు. కానీ ఒకే ఒక్క హౌసింగ్ లోన్ అనబడే బాధ్యత నన్ను ఆపుతోంది
…….Geeta Vellanki
అన్వేషణ లేని జీవితం అన్నీ ఉండీ పస్తులుండటం లాటిదేగా.. my quest is not to excell..it’s to explore because it’s life.. pure life..just mine
…..Ramesh Chennupati
అందుకే మూలాలు ఎప్పుడూ ముడేసి ఉంటాయి….
ఆకలిదప్పికల్లో ఏముంది అనుకుంటాము కానీ ఇలాంటి ఓ ఎరుక ఉంటుంది….
తప్పు దారిన నడిపించేవి అవే… తప్పు దిద్దుకునేలా చాచిపెట్టి కొట్టేవీ అవే…
బాగుంది జీ ఎపిసోడ్
…..Sudha Murali
ఈ ఎపిసోడ్ పేరు అన్వేషణా లేక ఎరుకా? 😊🤔
….Padmaja Daggumati
బావుంది… mam… గువ్వలా… ఎగరాలని ఉంది….
…..సుభాషిణి తోట
బావుంది
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™